సీరియ‌ల్స్‌లో యాక్ష‌న్ త‌క్కువ -రియాక్ష‌న్ ఎక్కువ‌

చేతికి వాచీ లేక‌పోయినా నా టైం బాగ‌లేదు. టీవీ ఆన్ చేశా. సీరియ‌ల్ వ‌స్తోంది. ఒక కుర్రాడు తండ్రితో క‌లిసి అత్తగారింటికి వ‌చ్చాడు. పుట్టింట్లో ఉన్న భార్య‌ని తీసుకెళ్ల‌డానికి. అత్తామామ‌లు వాళ్ల‌ని గుమ్మం ద‌గ్గ‌రే…

చేతికి వాచీ లేక‌పోయినా నా టైం బాగ‌లేదు. టీవీ ఆన్ చేశా. సీరియ‌ల్ వ‌స్తోంది. ఒక కుర్రాడు తండ్రితో క‌లిసి అత్తగారింటికి వ‌చ్చాడు. పుట్టింట్లో ఉన్న భార్య‌ని తీసుకెళ్ల‌డానికి. అత్తామామ‌లు వాళ్ల‌ని గుమ్మం ద‌గ్గ‌రే ఆపేశారు. కూతురిని పంప‌మంటున్నారు. ఇంతే విష‌యం. 15 నిమిషాలు పైగా ఒక‌టే బిల్డ‌ప్‌. 

ఆ కుర్రాడు అమ్మాయితో “నేనంటే ఇష్టం లేదా?” అంటాడు. వాడి నాన్న , అత్తామామ‌, అమ్మాయి, ఇంకా మ‌రికొంద‌రి క్లోజ్ రియాక్ష‌న్స్‌. ద‌డ‌ద‌డ‌లాడే బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌.

నేను ఇప్పుడు గుర్తొచ్చానా – అమ్మాయి డైలాగ్‌

అంద‌రి క్లోజ్ రియాక్ష‌న్స్‌

అలా అడుగు బుద్ధొస్తుంది – అత్త డైలాగ్‌

అడ‌గ‌డం కాదు అలివేలూ, క‌డ‌గాలి – మామ డైలాగ్‌

వ‌రుస‌గా ఏదో కొంప మునిగిన‌ట్టు అంద‌రి ఎక్స్‌ప్రెష‌న్స్‌

మ‌ధ్య‌లో యాడ్స్‌

ఆ పిల్ల వెళ్ల‌లేదు, వాడు తీసుకెళ్ల‌లేదు.

ఇంటి ముంద‌ర అంద‌రూ పిచ్చి చూపులు చూసుకుంటూ వుండ‌గా ఎపిసోడ్ అయిపోయింది. ఇట్లా తీస్తే ఒక్కో సీరియ‌ల్ ఏళ్ల‌కు ఏళ్లు రాకుండా ఉంటుందా?

టీవీ సీరియ‌ల్స్‌ వ‌చ్చి మ‌హిళా చిత్రాల్ని, న‌వ‌ల‌ల్ని, వార‌ప‌త్రిక‌ల్ని చంపేశాయి. పూర్వం అప్పుడ‌ప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వ‌చ్చేవి. కొన్ని హిట్ అయ్యేవి కూడా. వార‌ప‌త్రిక‌లు ప్రేమ సీరియ‌ల్స్‌తో బ‌తికేసేవి. త‌ర్వాత అవి న‌వ‌ల‌లుగా వ‌చ్చి రెంటెడ్ బుక్‌స్టాల్స్‌లో ద‌ర్శ‌న‌మిచ్చేవి. ఎపుడైతే సీరియ‌ల్స్ టీవీల్లో స్టార్ట్ అయ్యాయో అన్నీ బంద్‌.

సినిమాల్లో మ‌గ‌వాళ్ల డామినేష‌న్ అయితే, సీరియ‌ల్స్‌లో ఆడ‌వాళ్లు. సినిమాల్లో మ‌గ‌వాళ్లు విల‌న్లు, సీరియ‌ల్స్‌లో ఆడ‌వాళ్లే హీరోలు, విల‌న్లు. సినిమాల్లో హీరోయిన్ క్యారెక్ట‌ర్‌కి పెద్ద ఇంపార్టెన్స్ వుండ‌దు. సీరియ‌ల్స్‌లో మ‌గ‌వాళ్లు వుంటారు కానీ ప్రాధాన్య‌త వుండ‌దు. సినిమాల్లో అత్తాకోడ‌ళ్ల గొడ‌వ‌లు మాయ‌మై, సీరియ‌ల్స్‌ని బ‌తికిస్తున్నాయి.

సినిమాకి లేనిది (థియేట‌ర్‌లో) సీరియ‌ల్‌కి ఉన్న సౌల‌భ్యం ఏమంటే ఆఫ్ చేసుకునే స‌దుపాయం. ఒక‌ప్పుడు ప‌ల్లెల్లో సాయంత్రం పూట ఆడ‌వాళ్లు ఒక‌చోట చేరి క‌బుర్లు చెప్పుకునే వాళ్లు. ఇప్పుడు ఎవ‌రి సీరియ‌ల్ వాళ్లు చూసుకుంటున్నారు.

జీఆర్ మ‌హ‌ర్షి