మన రాజ్యాంగం మత గ్రంథం కాదు!

వీలు చిక్కటం లేదు కానీ, రాజ్యాంగాన్ని నిలువునా మార్చెయ్యాలన్న కోరిక దేశంలో కొద్ది మందికి వుంది. కానీ నేడు ఆ ‘కొద్ది మందే’ గద్దె మీద వున్నారు.  Advertisement వారికీ ఏదీ నచ్చదు. ఆలోచన…

వీలు చిక్కటం లేదు కానీ, రాజ్యాంగాన్ని నిలువునా మార్చెయ్యాలన్న కోరిక దేశంలో కొద్ది మందికి వుంది. కానీ నేడు ఆ ‘కొద్ది మందే’ గద్దె మీద వున్నారు. 

వారికీ ఏదీ నచ్చదు. ఆలోచన నచ్చదు; హేతువు నచ్చదు; సమ స్థాయి నచ్చదు. వారి దృష్టిలో సెక్యులరిజం ఒక బూతు మాట. జరిగింది చరిత్ర అంటే వారికి అస్సలు నచ్చదు. జరిగినట్లు నమ్మింది చరిత్ర అనాలన్నది కోరిక. అలాంటి చరిత్ర కూడా తమకు వీలయిన చోట నుంచే మొదలు కావాలి. ‘ఆర్యులు’ రాక ముందు దేశం వుండేదంటే కోపం. ఈ దేశంలో ‘బౌధ్ధం’ పుట్టిందన్న విషయం గుర్తుకు రాదు. భిన్న సంసృ్కతులకు ఆలవాలం ఈ దేశమంటే నచ్చదు. 

ప్రేమ అన్న మాట కూడా పడదు. ప్రేమికుల దినోత్సవాలను జరుపుకోకూడదు. ప్రేమించిన వారు దోషులతో సమానం. వారు బహిరంగ ప్రదేశాల్లో సంచరించకూడదు. అలా సంచరిస్తే, వారికి నిర్బంధ వివాహాలు జరపాలి. అంత సరదాగా వుంటే, పెళ్ళయ్యాక ప్రేమించుకోవాలి కానీ, పెళ్ళి కాక ముందు  ప్రేమించుకో కూడదు. 

ఇంకా స్వేఛ్చ అంటే నచ్చదు. ఒక వేళ వున్నా ఇష్టం వచ్చిన మతాన్ని  స్వీకరించే స్వేఛ్చ అసలు వుండకూడదు. పుట్టిన కులంలోనే చావాలి; పుట్టిన మతంలోనే చావాలి. స్త్రీలు గౌరవంగా వుండవచ్చు. కానీ స్వేఛ్చ జోలికి పోకూడదు. ఎక్కడ ఏమి ధరించాలో, వారిష్టం కాదు.

ఇక భావప్రకటన అన్నది స్వేఛ్చకు సంబంధించింది కాదు. పరిమితికి సంబంధించింది. మతం పేరుతో ఏ బాబాలు ఏమి చేసినా ప్రశ్నించకూడదు. వారు అత్యాచారాల కేసుల్లో, భూ ఆక్రమణల కేసుల్లో ఎన్నింటిలోనయినా నిందితులు కావచ్చు. కానీ వారు ఎలా నిందితులవుతున్నారన్నది బహిరంగంగా చర్చించ కూడదు. అనగా ప్రసార మాధ్యమాల్లో వినిపించ కూడదు; చూపించ కూడదు. 

ఇప్పుడు రాజ్‌కుమార్ హీరానీ తీసిన ‘పీకే’ సినిమా మీద, వీరు అలాగే విరుచుకు పడుతున్నారు. ఇందులో మతాల మీద కాకుండా, మతాలను స్వార్థపరులను ఉపయోగించే తీరు మీద ఎక్కువ విమర్శ వుంది. ఏదో ఒక మతవిశ్వాసాన్ని టార్గెట్ చెయ్యలేదు కూడా. అయినా కూడా విశ్వ హిందూ పరిషత్  సంస్థల వారు కొందరు, ఒక్క హిందూ మతాన్నే ఎక్కువ విమర్శ చేసినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 

ఈ విషయంలో ఇలాంటి సంస్థల వారు గ్రహించాల్సిన అంశాలు రెండు వున్నాయి. ఒకటి: దేశంలో హిందువులుగా పిలవబడుతున్న అని వర్గాల వారికీ, అన్ని వర్ణాల వారికీ తామే ప్రతినిథులమని వారు భావించటం సరికాదు. ఎందుకంటే, వీరు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీ (బీజేపీ) సైతం మొత్తం హిందువులంతా పూర్తి సమ్మతి తెలుప లేదు. అలా జరిగి వుంటే, 2014 ఎన్నికలలో మొత్తం పోలయిన వోట్లలో కేవలం 30 శాతం మాత్రమే వచ్చేవి కావు. రెండు: ఇప్పుడు ‘పీకే’ చిత్రాన్ని చూసి ఆదరిస్తున్న వాళ్ళలో, అధిక శాతం హిందువులే వుంటున్నారు. కాబట్టి వీరి  అభిప్రాయాన్నే మెజారిటీ అభిప్రాయంగా భావించాల్సిన అవసరం లేదు.

మన రాజ్యాంగంలో వున్న  ‘సెక్యులరిజాన్ని’ తలవటానికే వీరికి ఇష్టం వుండక పోవచ్చు. కానీ దేశాన్ని తాము పాలించినా ఈ రాజ్యాంగం ప్రకారమే పాలించాలి.  ప్రతీ వ్యక్తికీ తనకి ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించి, ఆరాధించి, ప్రచారం చేసుకునే హక్కును రాజ్యాంగం( సెక్షన్ 25) కల్పించింది.  అలాగే ఏ మతాన్ని విశ్వసించనవసరం లేదని భావించే వారు కూడా హేతువాద దృష్టితో స్వేఛ్చను కూడా ఇదే రాజ్యాంగం ప్రసాదిస్తోంది.  అంతేకాదు శాస్త్రీయ దృష్టి(సైంటిఫిక్ టెంపర్‌మెంట్) ను ప్రజల్లో పెంపొందిచాల్సిన బాధ్యత కూడా రాజ్యాంగ పరిరక్షకులకు వుంటుంది. 

కానీ దురదృష్టమేమింటే, సైన్సునీ, నమ్మకాన్నీ,  చరిత్రనీ పురాణాన్నీ కలిపేద్దామనుకుంటున్నారు. వారికి బాగా చికాకు గా వుండేది భావ ప్రకటనా స్వేఛ్చ. 

ప్రపంచంలో అభివృద్ధి  చెందిన దేశాల్లో , ప్రజాస్వామ్య దేశాల్లో, ఈ స్వేఛ్చకు భంగం కలగకుండా  చూస్తున్నారు. డావిన్సీ కోడ్ చిత్రం వెలువడినప్పుడు క్రైస్తవులు ఎక్కుగా వున్న దేశాల్లో  ఈచిత్రం విరివిగానే ఆడింది. క్రైస్తవ మత విశ్వాసాల మీద దాడి చేసిన చిత్రమైన పలుచోట్ల ప్రదర్శనలు కూడా చేశారు. ఆ మాట కొస్తే, ‘డావన్సీ కోడ్’ నవల రూపంలో వచ్చినప్పుడు బెస్ట్ సెల్లర్ గా వచ్చింది. 

మన దేశం కూడా ప్రజాస్వామ్య దేశమని భావిస్తే,  పరిపాలించే పార్టీకీ, దాని అనుబంధ సంస్థలకీ ఎలాంటి మత విశ్వాసాలున్నా, భావప్రకటనస్వేఛ్చ మీదా, మత స్వేఛ్చ మీదా దాడులు చేయటం తక్షణం మానుకోవాలి. 

సతీష్ చందర్