‘సాక్షి’లో ఏం జరుగుతోంది?

సాక్షి దినపత్రిక పుట్టుక ఓ సంచలనం. అంతవరకు ఓ దినపత్రిక రాష్ట్రస్థాయిలో తేవాలంటే పదల కోట్లు అవసరం అని తెలుసు కానీ, వందల కోట్లు అన్న ఊహలేదు. అంతటి భారీ పెట్టుబడితో రంగంలో దిగింది.…

సాక్షి దినపత్రిక పుట్టుక ఓ సంచలనం. అంతవరకు ఓ దినపత్రిక రాష్ట్రస్థాయిలో తేవాలంటే పదల కోట్లు అవసరం అని తెలుసు కానీ, వందల కోట్లు అన్న ఊహలేదు. అంతటి భారీ పెట్టుబడితో రంగంలో దిగింది. ఈనాడును గట్టిగానే ఢీకొంది. జర్నలిస్టులకు పండుగ వచ్చింది. మిగిలిన పత్రికలు కూడా అంతో ఇంతో జీతాలు పెంచాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి అండగా నిలిచింది సాక్షి.

కానీ ఉన్నట్లుండి పరిస్థితి ఉల్టా అయింది. ఇప్పుడు సాక్షి వ్యయం తగ్గించుకనే పనిలో పడింది. ఎడా పెడా జనాల్నిఉద్యోగాల నుంచి తీసేస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి. కాస్ట్ కటింగ్ అన్నదే పరమావధిగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తోంది. చిత్రంగా ఉద్యోగాలు ఇచ్చినపుడు ప్రారంభంలో మేనేజ్ మెంట్, టాప్ కేడర్ ఉద్యోగులకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది. దాంతో ఎవరికి తోచిన వారిని వారు తెచ్చుకుని, సంస్థను ఓవర్ స్టాఫ్ తో నింపేసారు. ఎవరికి తోచినట్లు వారు జీతాలు ఫిక్స్ చేసేసారు. 

పైగా ఇందులో చివర్న రెండు అక్షరాలు వుంటే చాలు, అక్షరాలు అంత గొప్పగా రాయకున్నా చాన్స్ ఇచ్సేసారన్న విమర్శలు అప్పట్లో జర్నిలిస్ట్ సర్కిల్ లో వినిపించాయి. రాను రాను భారతీ రెడ్డి పగ్గాలు అందుకున్నాక, కాస్త జాగ్రత్త పడడం ప్రారంభించారు. ఆ తరువాత సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి ఎడిటోరియల్ డైరక్టర్ కావడం, ఇడి కొరడా కారణంగా కొన్ని ఆస్తులు సీజ్ కావడం వంటి పరిణామాలు సంభంవించాయి. ఈ రెండింటి కారణంగా, ఎడిషన్ల కార్యాలయాల కుదింపు, ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది. మంచి పనివారా కాదా అన్నది కూడా చూడకుండా తొలగించడం మరీ విశేషం. 

ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఎడిటోరియల్ కార్యాలయాలను మూడుకు తగ్గించేసారు. ఇంతకు ముందు ప్రతి ఎడిషన్ కు ఓ డెస్క్ అనేది వుండేది. ఇప్పుడు వెస్ట్ గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు రాజమండ్రిలో నే డెస్క్. అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాలకు మంగళగిరి, రాయలసీమ ప్రాంతాలకు తిరుపతిలో డెస్క్ లు కేంద్రీకృతం చేసేసారు. ఎడిషన్ల వారీగా వున్న కార్యాలయాలు ప్రస్తుతం బోసిగా వున్నాయి. వాటిని ఏం చేస్తారు అన్నది ఇంకా తెలియడం లేదు. 

మరోపక్క సాక్షిలో మిగిలిన జనం బిక్కు బిక్కు మంటూ పనిచేస్తున్నారు. ఎవరిపై ఎప్పుడు వేటు పడుతుందో తెలియని పరిస్థితి.  అదే విధంగా చానెల్ కు సంబంధించి కూడా కాస్ట్ కటింగ్ ప్రారంభించారు. ఓబి వ్యాన్లు, స్ట్రింగర్లను తగ్గించినట్లు వార్తలు అందుతున్నాయి.

శ్రీశ్రీ చెప్పినట్లు..నిప్పులు చిమ్ముతూ నింగికి నేనెగిరిపోతే…..నెత్తరు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే….అన్నట్లు వుంది సాక్షి ప్రస్థానం. మేనేజ్ మెంట్ బాగానే వుంటుంది. ఎడిటర్లు బాగానే వుంటారు.. పోయేది.. బలైపోయేది.. జర్నలిస్టులేగా.. ఎప్పుడైనా.