ఎమ్బీయస్‌ : పనిలో పనిగా జాగ్రఫీ

చంద్రబాబు, కెసియార్‌ వాగ్దానాల పుణ్యమాని మన పిల్లలకు ప్రపంచ నగరాలన్నీ పరిచయమవుతున్నాయి. సింగపూరు పాట యిద్దరూ పాడారు. సింగపూరు చరిత్ర పుస్తకాన్ని కెసియార్‌ తెలుగులోకి అనువదిస్తామన్నారు. అంతలోనే ఇస్తాంబుల్‌ గుర్తుకు వచ్చిందాయనకు. ఆ పేరు…

చంద్రబాబు, కెసియార్‌ వాగ్దానాల పుణ్యమాని మన పిల్లలకు ప్రపంచ నగరాలన్నీ పరిచయమవుతున్నాయి. సింగపూరు పాట యిద్దరూ పాడారు. సింగపూరు చరిత్ర పుస్తకాన్ని కెసియార్‌ తెలుగులోకి అనువదిస్తామన్నారు. అంతలోనే ఇస్తాంబుల్‌ గుర్తుకు వచ్చిందాయనకు. ఆ పేరు చెపితే ముస్లింలు మురిసిపోతారనుకున్నారో ఏమో. ఈలోగా బాబు జపాన్‌ గురించి చెప్పసాగారు. ఆంధ్రలో జపనీస్‌ భాషలో తర్ఫీదు యిచ్చే కోర్సులు పెడుతున్నారు. అటు స్మృతి ఇరానీ గారు జర్మన్‌ భాష ఎందుకు, సంస్కృతం నేర్చుకోండి అంటోంది.

పరలోక భాష కంటె పరదేశ భాషకు యిలలో ఎక్కువ ప్రయోజనం వుందని బాబు సరిగ్గానే గుర్తించారు. ఇప్పుడు కెసియార్‌ ఇస్తాంబుల్‌లో మాట్లాడే టర్కిష్‌ భాషో మరోటో నేర్పిస్తారేమోనని ఎదురు చూస్తూండగా యివాళ హైదరాబాదును డల్లాస్‌లా చేస్తానంటూ ప్రకటన చేశారు. ఇదెందుకు మధ్యలో అంటే అక్కడ మల్టీ లేయర్‌ ఫ్లైఓవర్లు వున్నాయట. చిన్నపుడు 'ఐసరబజ్జా' అనే కథ విన్నాను. ఒకడు అత్తారింట్లో తిన్న ఒక తినుబండారం పేరు గుర్తు పెట్టుకుని యింటికి వెళ్లి భార్యకు చెప్పి చేయించుకోవడానికి దారిలో ఆ పేరు వల్లించుకుంటూ వెళుతూంటాడు. ప్రయాణంలో ఏ శబ్దం విన్నా పాత పేరు వదిలేసి కొత్తదాన్ని మననం చేస్తూంటాడు. అలాగ 'బొహోం బొహోం', 'హైలెస్సా, హైలెస్సా' అని మార్చుకుంటూ వచ్చి చివర్లో ఎవరో ఓ స్థూలకాయుడు మెట్లెక్కుతూ 'ఐసరబజ్జా' అని నిట్టూరిస్తే ఆ శబ్దం పట్టుకుని యింటికెళ్లి భార్యతో 'ఐసరబజ్జా వండు' అని చంపుకు తింటాడు. అలాగ కెసియార్‌, బాబు కార్లో ఓ అట్లాసు పట్టుకుని అవేళ ఏ పేజీ కనబడితే దాని పేరు చెప్తూంటారేమో, లేకపోతే పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ఎన్నారైలు వాళ్ల వూరి విశేషాలు చెప్పగానే ఎక్సయిటై పోయి మన వూరిని వాళ్ల వూరిగా మార్చేస్తామని ప్రకటనలు చేస్తారేమో!