దేశంలోని అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ చుట్టూ అనేక వివాదాలున్నాయి. ‘ఏం దళితులు భారతరత్న పురస్కారానికి అర్హులు కారా.?’ అని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఇటీవలే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. స్వర్గీయ ఎన్టీఆర్‌కి భారతరత్న ప్రకటించాలనే డిమాండ్ ఈనాటిది కాదు. తమిళనాట ఎమ్జీఆర్‌తో పోల్చితే, తెలుగునాట స్వర్గీయ ఎన్టీఆర్ పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇన్నీ కావు. రాజకీయాల్లోనూ ఎంజీఆర్‌తో పోల్చితే, ఎన్టీఆర్ పేరు పెద్దది. అయినా స్వర్గీయ ఎన్టీఆర్‌ని ఇంకా వరించని భారతరత్న, గతంలోనే ఎంజీఆర్‌ని వరించింది.
ఇక, భారతరత్న చుట్టూ రాజకీయాలపై ఎప్పటికప్పుడు విమర్శలు వస్తూనే వున్నాయి. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తమవైపుకు వచ్చాకే ఆయనకు భారతరత్నను ప్రకటించింది కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ పార్టీ ఆయన్ను రాజ్యసభకు పంపిన విషయం విదితమే. అప్పట్లో ఇది పెద్ద వివాదమే అయ్యింది. భారతరత్న చుట్టూనే ఇన్ని వివాదాలుంటే, భారతరత్న తర్వాతి ప్లేస్‌లో నిలిచే పద్మ పురస్కారాల చుట్టూ ఇంకెన్ని వివాదాలుండాలి.?
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, తనకు పద్మ పురస్కారం రాకపోవడం పట్ల ఇటీవలే ఆవేదన వ్యక్తం చేశారు. సైనా నెహ్వాల్ ఆవేదనను దేశవ్యాప్తంగా మీడియా హైలైట్ చేసింది. అంతే, కేంద్రం దిగొచ్చింది. పద్మభూషణ్ పురస్కారానికిగాను సైనా నెహ్వాల్ పేరుని పరిశీలనకు పంపింది కేంద్ర క్రీడా శాఖ. అడిగితేగానీ పురస్కారాలు ఇవ్వరా.? అన్న ప్రశ్న తలెత్తుతోందిప్పుడు. సినీ రంగంలోనూ అంతే. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, తనను పద్మ పురస్కారం వరించకపోవడంపై ఇటీవలే ఆవేదన వ్యక్తం చేసిన విషయం విదితమే.
అసలు అత్యున్నత పౌర పురస్కారాలు ఎందుకు వివాదాస్పదమవుతున్నాయి.? వీటిపై రాజకీయాలు ఎందుకు ప్రభావం చూపుతున్నాయి.? పురస్కారాలు ఆయా వ్యక్తులు ఆయా రంగాల్లో సాధించిన విజయాలకు గుర్తుగా వరిస్తుంటాయి. దురదృష్టవశాత్తూ అవి రాజకీయ కోణంలో వెళుతుండడం ఆయా పురస్కారాల గొప్పతనమూ తగ్గిపోతుంది. పాలకులు ఇకనైనా అత్యున్నత పౌర పురస్కారాల విషయంలో రాజకీయ మకిలి అంటకుండా చూస్తారని ఆశిద్దాం.