బాబుకు బెయిల్ స‌రే.. టీడీపీ భ‌విష్య‌త్ ఏంటి?

స్కిల్ స్కామ్‌లో అరెస్ట‌యిన చంద్ర‌బాబునాయుడికి ఎట్ట‌కేల‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ ద‌క్కింది. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న చంద్ర‌బాబుకు మాన‌వ‌తా దృక్ప‌థంతో న్యాయ‌స్థానం ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. టీడీపీ శ్రేణుల‌కు ఇది ఊర‌ట క‌లిగించేదే. 50 రోజుల‌కు పైగా రాజ‌మండ్రి…

స్కిల్ స్కామ్‌లో అరెస్ట‌యిన చంద్ర‌బాబునాయుడికి ఎట్ట‌కేల‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ ద‌క్కింది. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న చంద్ర‌బాబుకు మాన‌వ‌తా దృక్ప‌థంతో న్యాయ‌స్థానం ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. టీడీపీ శ్రేణుల‌కు ఇది ఊర‌ట క‌లిగించేదే. 50 రోజుల‌కు పైగా రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో వుంటున్న చంద్ర‌బాబునాయుడి రాక కోసం టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎదురు చూస్తూ గ‌డిపారు. అందుకే ఆయ‌న్ను చూడ‌గానే టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో ఆనందం వెల్లువిరిసింది.

బెయిల్‌పై త‌మ నాయ‌కుడు విడుద‌ల కావ‌డంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం క‌నిపిస్తోంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో చంద్ర‌బాబునాయుడు రాక‌పై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వెల్ల‌డ‌వుతూ, టీడీపీ శ్రేణుల్ని భ‌య‌పెట్టేవి. ఎన్నిక‌ల వ‌ర‌కూ ఆయ‌నకు బెయిల్ దొర‌క‌ద‌ని, బాబు అవినీతికి సంబంధించి బ‌ల‌మైన ఆధారాలున్నాయ‌ని, అందువ‌ల్లే న్యాయ‌స్థానాల్లో ఊర‌ట ద‌క్క‌లేద‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే అనూహ్యంగా బాబు అనారోగ్యం తెర‌పైకి రావ‌డం, మ‌ధ్యంత‌ర బెయిల్ ల‌భించ‌డం టీడీపీ శ్రేణులకి చెప్ప‌లేనంత ఆనందాన్ని మిగిల్చింది.

బాబుకు బెయిల్ ల‌భించ‌డం వ‌ర‌కు ఓకే. బాబు అరెస్ట్ టీడీపీకి ఓ హెచ్చ‌రిక‌ను పంపింది. చంద్ర‌బాబు త‌ర్వాత టీడీపీని న‌డిపించే వార‌సుడు ఎవ‌ర‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. సాంకేతికంగా చంద్ర‌బాబు రాజ‌కీయ వార‌సుడు లోకేశ్ అయిన‌ప్ప‌టికీ, పార్టీని న‌డిపించే శ‌క్తిసామ‌ర్థ్యాలు లేవ‌ని రుజువైంది. రెండు రోజుల క్రితం టీటీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వ‌ర్ కూడా లోకేశ్ తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. లోకేశ్‌వి చిన్న‌పిల్ల‌ల చేష్ట‌ల‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

చంద్ర‌బాబు అరెస్ట్ అయి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో వుంటే, లోకేశ్ ఢిల్లీకి వెళ్ల‌డం ఏంట‌ని ఆయ‌న కూడా ప్ర‌శ్నించారు. ఇలా మ‌న‌సులో ప్ర‌శ్నించే గొంతులు టీడీపీలో ఎన్నో ఉన్నాయి. టీడీపీ నాయ‌కుల అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో లోకేశ్‌కు టీడీపీని ముందుకు న‌డిపించేంత సీన్ లేద‌నే అభిప్రాయం బ‌లంగా వుంది. ఈ విష‌యం చంద్ర‌బాబుకు కూడా ఇప్పుడు అర్థ‌మైంద‌నే అభిప్రాయం కూడా లేక‌పోలేదు.

చంద్ర‌బాబునాయుడు అంటే ఒక బ్రాండ్ అని, హైటెక్ సిటీని ఆయ‌నే నిర్మించార‌ని , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అభివృద్ధి అంటే ఆయ‌న త‌ప్ప మ‌రెవ‌రూ గుర్తు రార‌ని అభిమానులు ఇటీవ‌ల హైద‌రాబాద్ కేంద్రంగా ఊద‌ర‌గొట్టారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను చంద్ర‌బాబు పాల‌న‌కు ముందు, ఆ త‌ర్వాత అని చెప్పుకోవాల్సి వుంటుంద‌ని గొప్ప‌లు చెప్పేవారికి టీడీపీ వార‌సుడి విష‌యానికి వ‌చ్చేస‌రికి నోట మాట రావ‌డం లేదు.

ఎన్నో అద్భుతాలు సృష్టించార‌ని కీర్త‌న‌లు అందుకుంటున్న చంద్ర‌బాబు…త‌న త‌ర్వాత టీడీపీని న‌డిపించే స‌మ‌ర్థ‌వంత‌మైన లీడ‌ర్‌ను త‌యారు చేయ‌లేక పోయారెందుకు అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. నిజంగా చంద్ర‌బాబు విజ‌నరీ ఉన్న నాయ‌కుడైతే… సొంత పార్టీ భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకుని, లీడ‌ర్‌ను కూడా త‌యారు చేసుకునే వారు క‌దా? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం కొర‌వ‌డింది.

ప్ర‌తి మ‌నిషికి మ‌ర‌ణం అనివార్య‌మైంది. చంద్ర‌బాబు జైల్లో ఉన్నంత కాలం, ప్ర‌తిరోజూ ఆయ‌న వృద్ధాప్యం గురించి కుటుంబ స‌భ్యులు, టీడీపీ నేత‌లు గుర్తు చేయ‌డం గురించి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల వ‌ర‌కూ చంద్ర‌బాబు యాక్టీవ్‌గా ప‌ని చేస్తార‌ని టీడీపీ నాయ‌కులు ఆశిస్తున్నారు. ఆ త‌ర్వాత టీడీపీ భ‌విష్య‌త్ ఏంటి? నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు వార‌స‌త్వాన్ని బ‌ట్టి రావు. దివంగ‌త ఎన్టీఆర్‌కు ఎంతో మంది పిల్లలున్న సంగ‌తి తెలిసిందే. వాళ్లెవ‌రూ టీడీపీకి వార‌సులు కాలేక‌పోయారు. అందుకే చంద్ర‌బాబుకు టీడీపీని లాక్కోవ‌డం సులువైంది. వార‌సుడంటే అధినాయ‌కుడి క‌డుపున పుట్టినంత మాత్రాన కాలేడు.

పార్టీ శ్రేణుల్ని విజ‌యం వైపు న‌డిపించ‌గ‌లిగే ల‌క్ష‌ణాలుండాలి. అవి లోకేశ్‌లో మ‌చ్చుకైనా లేవ‌ని ఆయ‌నే లోకానికి చాటి చెప్పారు. ఇప్ప‌టికైనా టీడీపీ వార‌సుడిని చంద్ర‌బాబు త‌యారు చేసుకోవాల్సిన అవ‌స‌రం వుంది. శేష జీవితాన్ని అందుకు ఉప‌యోగిస్తే మంచిద‌నే అభిప్రాయం టీడీపీ శ్రేణుల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది. పుత్ర వాత్స‌ల్యంతో లోకేశ్‌ను బ‌ల‌వంతంగా రుద్దితే… టీడీపీకి బాబు తీవ్ర ద్రోహం చేసిన‌ట్టే అని పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల అభిప్రాయం.