ధోనీ ఎందుకిలా చేశాడు?

మహేంద్రసింగ్ ధోనీ.. వస్తూనే క్రికెట్‌లో సంచలనాలకు తెరలేపాడీ జార్ఖండ్ డైనమైట్. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా టీమిండియాకి దక్కిన అరుదైన ఆయుధం మహేంద్రసింగ్ ధోనీ అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. గతంలో టీమిండియా తరపున వికెట్…

మహేంద్రసింగ్ ధోనీ.. వస్తూనే క్రికెట్‌లో సంచలనాలకు తెరలేపాడీ జార్ఖండ్ డైనమైట్. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా టీమిండియాకి దక్కిన అరుదైన ఆయుధం మహేంద్రసింగ్ ధోనీ అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. గతంలో టీమిండియా తరపున వికెట్ కీపింగ్ చేసినవారిలో బ్యాట్‌తో దుమ్మురేపింది మాత్రం ధోనీ ఒక్కడే అనడం అతిశయోక్తి కాదేమో. కానీ, ఇకపై టెస్టుల్లో టీమిండియా తరఫున బ్యాట్ ఝుళిపించే వికెట్ కీపర్ కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. సాహా రూపంలో వికెట్ కీపర్ టీమిండియాకి అందుబాటులో వున్నా, ఇప్పటికిప్పుడు అతన్ని స్టార్ బ్యాట్స్‌మన్ అనలేని పరిస్థితి.

గవాస్కర్, కపిల్‌దేవ్, సచిన్ టెండూల్కర్, గంగూలీ, ద్రావిడ్, లక్ష్మణ్, అనిల్ కుంబ్లే.. ఇలా లిస్ట్ రాసుకుంటూ పోతే, క్రికెట్‌లో టీమిండియాకి వన్నెతెచ్చిన మేటి క్రీడాకారులెంతోమంది వుంటారు.. వీళ్ళంతా ఒకప్పుడు టీమిండియాని విజయాలబాటలో పరుగులు తీయించినవారే. క్రికెట్‌లో ఫిట్‌నెస్ కీలకం. అందుకే ముప్ఫయ్ దాటిందంటే క్రికెట్‌లో వయసు మీద పడ్తున్నట్లే. ముప్ఫయ్ ఐదేళ్ళు దాటితే నేడో రేపో రిటైర్ అవ్వాల్సిందేనన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఏ క్రికెటర్ అయినాసరే. సచిన్ టెండూల్కర్ కూడా ఇందుకు మినహాయింపు కాలేకపోయాడు. ధోనీ అయినా అంతే. విమర్శల్ని తట్టుకుని నిలబడగలిగేవాడే నిజమైన నాయకుడు. కానీ, ధోనీ ఎందుకో విమర్శల్ని తట్టుకోలేకపోయాడు, టెస్ట్ క్రికెట్‌కి ‘వైఫల్యాల సమయంలో’ గుడ్ బై చెప్పేశాడు.

సచిన్ రిటైర్ అయ్యే టైమ్‌కి జట్టులో కొత్త ఆటగాళ్ళు సత్తా చాటుకునేందుకు రెడీ అయ్యారు. గంగూలీ అయినా, ద్రవిడ్ అయినా, ఇంకొకరైనా. కొంతమందికి మాత్రం రీప్లేస్‌మెంట్ చాలా కష్టం. కుంబ్లే టీమిండియాకి గుడ్ బై చెప్పాక, అలాంటి స్పిన్నర్ ఇప్పటిదాకా దొరకలేదు. కపిల్‌దేవ్ లాంటి ఆల్ రౌండర్ (ఫాస్ట్ బౌలింగ్ ప్లస్ బ్యాటింగ్) టీమిండియాకి ఇప్పటిదాకా దొరకలేదు. సచిన్‌లా కన్సిస్టెంట్‌గా పరుగులు చేసే క్రికెటర్‌గానీ, ద్రావిడ్‌లా మిడిల్ ఆర్డర్‌ని బలోపేతం చేసే ఆటగాడుగానీ, లక్ష్మణ్‌లా క్లిష్ట సమయాల్లో ప్రత్యర్థికి కొరకరాని కొయ్యిగా తయారయ్యే ‘స్పెషలిస్ట్’గానీ టీమిండియాకి దొరకడం కష్టమేనేమో. ఇలా ఏ ఆటగాడి స్పెషాలిటీ ఆ ఆటగాడిదే. అయినా వారి రిటైర్మెంట్ అనంతరం టీమిండియా సంచలన విజయాల్నే నమోదు చేసింది యంగ్ స్టర్స్‌తో. రేప్పొద్దున్న ధోనీ లేకపోయినా, టీమిండియా టెస్టుల్లో సంచలనాల్ని నమోదు చేస్తుంది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలూ అవసరం లేదు.

అయితే ధోనీ రిటైర్మెంట్ తీసుకున్న టైమ్ పలు అనుమానాలకు అవకాశమిచ్చింది. ధోనీ కారణంగా దినేష్ కార్తీక్ టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోయాడు. వాస్తవానికి కార్తీక్ సూపర్బ్ వికెట్ కీపర్. ధోనీ రూపంలో టీమిండియాకి వికెట్ కీపర్ వుండటం, పైగా ధోనీ కెప్టెన్ కావడంతో కేవలం బ్యాట్స్‌మన్‌గానే కార్తీక్ టీమిండియా తరఫున ఆడాల్సి వచ్చేది. వికెట్ కీపింగ్ అనేది తన డ్రీమ్ అయినా, దాన్ని పక్కన పెట్టి.. పూర్తిస్థాయి బ్యాట్స్‌మెన్‌గానే మారిపోవాలనుకున్నాడు కార్తీక్. కానీ, అలా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు ధోనీ రిటైర్మెంట్ అనంతరం సెలక్టర్లు దినేష్ కార్తీక్‌పై దృష్టి సారిస్తారేమో. కానీ, వికెట్ కీపింగ్‌లో మునుపటి వేగం, ఆటగాడిగా కాన్ఫిడెన్స్.. దినేష్ కార్తీక్ ప్రదర్శిస్తాడా.? అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే.

క్రికెట్‌లో బ్యాట్స్‌మన్, బౌలర్ ఎంత కీలకమో.. వికెట్ కీపర్ కూడా అంతే. అలాంటి వికెట్ కీపర్ చాలా కాన్ఫిడెంట్‌గా వుండాలి. చాలా ఫిట్‌నెస్‌తో వుండాలి. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కూడా అయితే జట్టుకు మరింత లాభం. మరి, అలాంటి వికెట్ కీపర్ తన తర్వాత టీమిండియాకి ఎవరు? అనే ఆలోచన లేకుండా ధోనీ ఎందుకు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్టు.? ఇదే ఇప్పుడు ఎవరికీ అర్థం కావడంలేదు. బీసీసీఐ వికెట్ కీపింగ్ విషయమై ఇప్పటిదాకా ఆప్షన్ చూసుకోకపోవడమూ విమర్శలకు తావిస్తోంది. 

ఆస్ట్రేలియా సిరీస్‌లో చివరి మ్యాచ్‌కి సాహా వికెట్ కీపింగ్ చేయొచ్చుగానీ, భవిష్యత్తులో టీమిండియాకి మాత్రం ఫుల్ టైమ్ వికెట్ కీపర్.. అదీ బ్యాట్‌తో పరుగులు రాబట్టగలిగేవాడు ఖచ్చితంగా కావాలి. ఆ దిశగా బీసీసీఐ ‘శోధన’ షురూ చెయ్యాల్సి వుంది. వన్డే, టీ20ల వరకూ ధోనీ అందుబాటులో వుంటాడుగానీ, వాటికి కూడా ‘వికెట్ కీపింగ్’ ఆప్షన్‌ని బీసీసీఐ ప్రిపేర్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే, టెస్ట్‌లకు ఆల్ ఆఫ్ సడెన్ రిటైర్మెంట్ డెసిషన్ తీసుకున్న ధోనీ, రేప్పొద్దున్న ఇంకెలాంటి సంచలన నిర్ణయాలైనా తీసుకోవచ్చు. ఈలోగా ఆప్షన్ చూసుకోని పక్షంలో, టీమిండియాకి వికెట్ కీపింగ్ అతి పెద్ద మైనస్‌గా మారిపోయే ప్రమాదముంది. 

ఇక్కడ రిటైర్మెంట్ విషయంలో ధోనీని పూర్తిగా తపపట్టలేం. అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. ఎంత కాలం క్రికెట్ ఆడాలి.? అనేది ఆయా ఆటగాళ్ళకు సంబంధించిన విషయం. ఫిట్‌నెస్‌తో ఇబ్బందులు, ఫామ్ కోల్పోవడం గట్రా ఆటగాళ్ళను రిటైర్మెంట్ వైపు పరుగులు పెట్టిస్తుంటాయి. క్రికెట్ కేవలం ఫిజికల్ గేమ్ కాదు. మైండ్ గేమ్ కూడా. అన్ని వేళలా ఒకేలా మనసు, శరీరం ఫిట్‌గా వుంచుకోలేరు కదా. అయితే, రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనను బీసీసీఐకి కనీసం ఆర్నెళ్ళ ముందయినా ధోనీ తెలియజేసి వుంటే, ధోనీ తర్వాత వికెట్ కీపింగ్ ఎవరు? అనే ఆలోచన బీసీసీఐ చేసి వుండేది. టీమిండియాని ఇన్నేళ్ళపాటు సంచలన విజయాల బాట నడిపించిన కెప్టెన్, తన తర్వాత ఎవరు.. అన్న ఆలోచనను బీసీసీఐ దృష్టికి తీసుకురాకపోవడమూ ఆక్షేపణీయం కాకుండా ఎలా వుంటుంది.?

-వెంకట్ ఆరికట్ల