ఆ బోటు.. తీరం చేరి వుంటే…

26/11.. ఈ పేరు చెబితే ఇండియా ఒక్కసారిగా ఓ కుదుపుకు గురవుతుంది. అత్యంత దురదృష్టకరమైన ఘటన అది. చాలా బీభత్సమైన టెర్రర్‌ ఎటాక్‌ అది. పెను విధ్వంసాన్ని భద్రతా దళాలు కొంతమేర నివారించగలిగినా, జరిగిన…

26/11.. ఈ పేరు చెబితే ఇండియా ఒక్కసారిగా ఓ కుదుపుకు గురవుతుంది. అత్యంత దురదృష్టకరమైన ఘటన అది. చాలా బీభత్సమైన టెర్రర్‌ ఎటాక్‌ అది. పెను విధ్వంసాన్ని భద్రతా దళాలు కొంతమేర నివారించగలిగినా, జరిగిన నష్టం చిన్నదేమీ కాదు. హేమంత్‌ కర్కరేలాంటి నిజాయితీపరులైన అధికారులు ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఎన్‌ఎస్‌జీ కమెండోలూ ప్రాణాలు పణంగా పెట్టాల్సి వచ్చింది 260 మందికి పైగా పౌరులు తీవ్రవాదుల తూటాలకు బలైపోయిన తీవ్రవాద ఘాతుకం అది.

అచ్చం అలాంటిదే ఇంకో ఎటాక్‌కి తీవ్రవాదులు ప్లాన్‌ చేశారు. గతంలో తీవ్రవాదులు అనుకున్నట్టుగానే తీరం చేరారు. ఈసారి కుదరలేదు. గతంలో జరిగిన పొరపాట్లకు ఈసారి తావివ్వకుండా తీరగస్తీ దళం చురుగ్గా వ్యవహరించింది. సముద్రంలోనే తీవ్రవాదులు ప్రయాణిస్తోన్న బోట్‌ని నిలువరించగలిగారు. తీర గస్తీ దళానికి దొరికేలోపు, తీవ్రవాదులు తమను తాము పేల్చేసుకున్నారు.

పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచమంతా పండగ చేసుకుంటోన్న వేళ, తీవ్రవాదులు ఎంచక్కా బోటు షికారు చేస్తూ, భారతదేవంలోకి ప్రవేశించాలనుకున్నారుగానీ.. వారి పాపం పండిపోయింది. డిసెంబర్‌ 31 అర్థరాత్రి జరిగిందీ ఘటన. కాస్త లేటుగా విషయం వెలుగులోకి వచ్చేసరికి, వెంటనే కంగారుపడినా, తీరగస్తీ దళానికి కృతజ్ఞతలు తెలిపింది భారతావని అంతా.

తీరగస్తీ దళం తీవ్రవాదులు ప్రయాణించిన బోటును గుర్తించకపోయి వుంటే.. తీవ్రవాదులు తీరం చేరుకుని వుంటే, ఆ తర్వాత జరిగే పరిణామాల్ని ఊహించుకోవడమే కష్టం. ఎలాగైతేనేం.. పెను ప్రమాదం తప్పింది. మళ్ళీ మళ్ళీ తీవ్రవాదులు ఈ తరహాలోనో, కొత్త తరహాలోనో భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూనే వుంటారు.. అనుక్షణం అప్రమత్తంగా వుండటమొక్కటే తీవ్రవాదాన్ని నివారించడానికి వున్న ఏకైక మార్గం.