గీతగోవిందం సినిమా కథను ముందుగా విన్నది అల్లు అర్జున్. ఆ సినిమా కథను నేరుగా తీసుకెళ్లి బన్నీకి వినిపించాడు పరశురామ్. కచ్చితంగా హిట్ అవుతుందని బన్నీ చెప్పాడట. ఆ టైమ్ లో సర్కారువారి పాట కథ రాసుకున్నాడు పరశురామ్. ఈ స్టోరీని కూడా బన్నీకి వినిపించాడని, ఒక దశలో గీతాఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ హీరోగా ఈ సినిమా చేయడానికి ప్రయత్నించాడని అప్పట్లో వార్తలొచ్చాయి.
ఈ కథనాలపై దర్శకుడు స్పందించాడు. సర్కారువారి పాట కథను బన్నీకి చెప్పలేదంటున్నాడు. మహేష్ కోసమే ఈ కథ పుట్టిందని, అతడ్ని దృష్టిలో పెట్టుకొని మాత్రం ఈ కథ రాశానని తెలిపాడు. దేవుడి దయ వల్ల ఈ కథను మహేష్ ఓకే చేశారని, అలా మహేష్ తో సినిమా చేయాలనే తన కోరిక తీరిందని చెప్పుకొచ్చాడు.
ఇదే సినిమాకు సంబంధించి మరో పుకారుపై కూడా క్లారిటీ ఇచ్చాడు పరశురామ్. ఈ దర్శకుడిది, సంగీత దర్శకుడు గోపీసుందర్ ది సూపర్ హిట్ కాంబో. గీతగోవిందం సినిమాకు గోపీసుందర్ అందించిన మ్యూజిక్ సూపర్ హిట్. అలాంటి మ్యూజిక్ డైరక్టర్ ను సర్కారువారి పాట కోసం పక్కనపెట్టారంటూ పుకార్లు వినిపించాయి. వీటిని పరశురామ్ ఖండిస్తున్నాడు.
“పక్కన పెట్టడం కాదండీ. సర్కారువారి పాట కి వర్క్ చేయాలనుకున్నప్పుడు గోపీసుందర్ చాలా బిజీగా వున్నారు. దాదాపు 8 ప్రాజెక్టులు అతని చేతిలో వున్నాయి. సమయం కుదరక చేయలేదు కానీ పక్కన పెట్టడం మాత్రం కాదు. నా మనసులో గోపీసుందర్ కి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది.”
ఇక “నేను విన్నాను, నేను ఉన్నాను” అనే డైలాగ్ పై స్పందిస్తూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే తనకు చాలా అభిమానమని, ఆయన్ని చూస్తే ఒక హీరో ఫీలింగ్ కలుగుతుందని చెప్పుకొచ్చాడు పరశురామ్. చాలా గొప్ప మాటని వైఎస్ఆర్ సింపుల్ గా చెప్పేశారని… సర్కారువారి పాటలో సందర్భం కలిసిరావడంతో మహేష్ తో ఆ డైలాగ్ చెప్పించానని అన్నాడు.