గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిన చందంగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలున్నాయి. కేసీఆర్, టీఆర్ఎస్ లేకపోతే, తెలంగాణ రాకపోతే అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలకు పదవులు తమ భిక్షేనని కేటీఆర్ పరోక్షంగా అన్నారు. తెలంగాణలో కాకతీయ మెగా టైక్స్‌టైల్ పార్కులో ఏర్పాటు చేస్తున్న కిటెక్స్ టెక్స్‌టైల్ పరిశ్రమకు భూమిపూజ చేసిన సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. ఈ సమావేశంలో కేటీఆర్ ఏమన్నారంటే…
“కేసీఆర్ అనే ఒకే ఒక్కడు లేకపోతే, టీఆర్ఎస్ అనే పార్టీ లేకపోతే ఈ రోజు మాట్లాడే నాయకులకు పదవులు వుండేవా? దయచేసి ఆలోచించాలి. అలాగే టీపీసీసీ, టీబీజేపీ అనేవి ఎక్కడి నుంచి పుట్టాయి. టీఆర్ఎస్, కేసీఆర్ లేకపోతే, తెలంగాణ రాకపోతే వీళ్లకు పదవులు వచ్చేవా? వీళ్ల మొరగడం వినే బాధ వుండేదా? అందుకే కాంగ్రెస్, బీజేపీల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ కంటే ఎంతో ముందుగానే మర్రి చెన్నారెడ్డి లాంటి వాళ్లు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించారు. వందలాది మంది ప్రాణాలు విడిచారు. కానీ నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ నేతృత్వంలో ఉద్యమం సాగిందనేది నిజం.
ఇదే సందర్భంలో తెలంగాణ ప్రజానీకం ఆకాంక్షలను గౌరవించిన సోనియా గాంధీ …తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేందుకు అంగీకరించారు. ఇందుకు పార్లమెంట్‌లో బీజేపీ సహకరించింది. కాంగ్రెస్, బీజేపీ సానుకూలంగా లేకపోతే ఎప్పటికీ తెలంగాణ వచ్చి వుండేది కాదు.
కానీ ఈ వాస్తవాల్ని మరిచిన కేటీఆర్, తమ పార్టీ, కేసీఆర్ లేకపోతో తెలంగాణ ఎక్కడిదని పరోక్షంగా ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేటీఆర్ అహంకారపూరిత వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.