ఏపీలో పాలిటిక్స్ సమ్మర్ హీట్‌ను తలపిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నాయి. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే నిత్యావసర సరుకులు ధరలున్నాయని విమర్శించారు.
ఒకవేళ లేవని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేష్ టీడీపీకి సవాల్ విసిరారు.
టీడీపీ నేతలకు నిజంగా దమ్ము, ధైర్యం వుంటే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. చర్చకు రావాలని ఎన్నోసార్లు పిలిచినా టీడీపీ నేతల నుంచి స్పందనే లేదని దుయ్యబట్టారు. జగన్‌ను గద్దె దించేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునివ్వడం ద్వారా టీడీపీ నిజ స్వరూపం బయట పడిందని విమర్శించారు.
కొత్త పొత్తులకు తెరలేపటం ద్వారా చంద్రబాబు ముసుగు తొలిగిందన్నారు. అందరం కలిసి మూకుమ్మడిగా పోటీ చేస్తే వైసీపీ మీద గెలవలేమని ప్రకటించడం ద్వారా ఓటమిని చంద్రబాబు ఒప్పుకున్నట్లైందని తెలిపారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలే బలమని, ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమన్నారు.
పొత్తుల ప్రకటనతో దివాళా కోరుతనం మరోసారి ప్రజలకు తెలిసిందన్నారు. గతంలో వైసీపీ గెలిచిన సీట్ల కన్నా ఎక్కువ గెలుస్తామని మంత్రి సురేష్ ధీమా వ్యక్తం చేశారు.