“ముసుగులు వీడుతున్నాయ్” అని సాక్షి ఫస్ట్ పేజీలో టీడీపీ -జనసేనల పొత్తు గురించి వార్త వచ్చింది. దీంట్లో కొత్తగా చెప్పిందేమీ లేదు. వాళ్లిద్దరు కలిసి పోతారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారట! పరిశీలకులు అంటే ఎవరో కాదు. టీ అంగడి దగ్గర ఉచితంగా పేపర్ చదివేవాళ్లు. విలేకరులు తాము రాయదలచుకున్న విషయాన్ని పరిశీలకుల నెత్తిన తోస్తూ వుంటారు.
ఎన్నికలకి ఇంకా రెండేళ్లుంది. జగన్ వ్యతిరేక ఓటు పెరిగిందని టీడీపీ అంచనా. దీంట్లో కొంత నిజం ఉంది కూడా. అయితే ఆయన ప్రభుత్వాన్ని ఓడించి మళ్లీ చంద్రబాబుని తెచ్చుకునేంత వ్యతిరేకత వుందా? అంటే నమ్మడం కష్టం.
ఆంధ్రజ్యోతి చదివితే రేపు ఎన్నికలు జరిగినా జగన్ ఓడిపోయి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమనిపిస్తుంది. ఇదే పత్రిక గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని అంచనా వేయలేక చంద్రబాబు మళ్లీ వచ్చేస్తున్నాడని బిల్డప్ ఇచ్చింది. పత్రికల నినాదం “అనుకూల సత్యమేవ జయతే”
ఉదాహరణకు ఎంపీ రఘురామకు హైకోర్టు చీవాట్లు అని సాక్షిలో వస్తే , అదే వార్త ఆంధ్రజ్యోతి లోపలి పేజీల్లో హైకోర్టు స్పష్టీకరణ అని వచ్చింది. రెండూ వార్తలే, వాస్తవాలే. అనుకూల సత్యం ఫస్ట్ పేజీలో, ప్రతికూల సత్యం లోపలి పేజీల్లో వుంటుంది.
“ముసుగులు వీడుతున్నాయ్” లో సాక్షి విలేకరి ఏం చెప్పారంటే బాబు, పవన్ చాలా వ్యూహాత్మకంగా పొత్తుకి రంగం సిద్ధం చేస్తున్నారట. దీంట్లో వ్యూహం ఏముంది? పవన్‌ని బాబు తిట్టడు, బాబుని పవన్ తిట్టడు. ఇద్దరూ కలిసి జగన్‌ను తిడతారు. వాళ్లిద్దరు కలిసిపోతే ఆశ్చర్యం ఏముంది?
పుష్ప సినిమాలో చెప్పినట్టు “ఈ పార్టీ మాదే, ఆ పార్టీ మాదే. మేమిద్దరం కలిస్తే మీకేంటి?” ఇక బీజేపీ అంటారా? ఏపీలో అది కాంగ్రెస్‌కి ఎక్కువ, జనసేనకి తక్కువ. వాళ్ల దగ్గర ఏ రోడ్ మ్యాప్ లేదు. ఒకవేళ ఉన్నా పవన్‌కి మ్యాప్ పాయింటింగ్ రాదు.
ఒకవేళ నిజంగా పొత్తు వుంటే సీట్ల పంపిణీలో యుద్ధాలు జరక్కుండా ఉంటాయా? ఓట్లు Transfer అవుతాయా? 2024లో జరిగే ఎన్నికలకు ఇవన్నీ ఆలోచించడం Too early.
చంద్రబాబు బలహీనత, జగన్ బలం ఏమంటే పథకాలు. జగన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశాడని చెప్పే బాబు , పథకాలు కొనసాగిస్తాడా? రద్దు చేస్తాడా? చెప్పడు. పత్రికలు, టీవీ చర్చల్లో మాట్లాడే వాళ్లెవరూ ఓటు వేసే వాళ్లు కాదు, వేయించే వాళ్లు కాదు. పథకాల లబ్ధిదారుల మనసులో ఏముందో అదే ముఖ్యం. అదే ఎన్నికలని డిసైడ్ చేస్తుంది.
ఇక వైసీపీ వాళ్ల గురించి చెప్పే ముందు చిన్న ఉదాహరణ.
ఒక కంపెనీ ఎండీ వల్ల అప్పులు పెరిగాయని, నష్టపోతున్నామని షేర్ హోల్డర్స్, బోర్డ్ మెంబర్స్ నిర్ణయించుకుని, అతన్ని దించేసి, కొత్త ఎండీని ఎంచుకున్నారు. అతను కొత్త అప్పులు చేసి పాత ఎండీ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతోందని చెబితే హాస్యాస్పదంగా వుండదా?
బాబుని భరించలేక జగన్‌ను తెచ్చుకున్నారు. మూడేళ్ల తర్వాత కూడా జగన్‌తో పాటు ఆయన కొత్త మంత్రులు ఏం మాట్లాడుతున్నారంటే గత ప్రభుత్వమే అన్ని అనర్థాలకు కారణమంటున్నారు.
మా ఇల్లు మీకు అప్పగించి మూడేళ్లైంది. ఇంకా పాత యజమాని కిటికీ ఊచలు విరిచాడని, పెయింట్ పోగొట్టాడని,తలుపులు భద్రంగా లేవని అంటూ వుంటే ఎన్నాళ్లు వింటారు?
చిన్న విషయాలకు కూడా ఒకటే పాట. ఉదాహరణకి సాక్షి పదో పేజీలో ఒక వార్త చూడండి. దాని హెడ్డింగ్ “మూసివేసిన హాస్టళ్లు తెరిపించేలా కసరత్తు”.
గత ప్రభుత్వం 648 హాస్టళ్లు మూసేసిందట. తెరిపించడానికి సాంఘిక సంక్షేమశాఖ కసరత్తు చేస్తుందట. మూడేళ్ల తర్వాత కసరత్తు మొదలు పెడితే అది పూర్తయ్యే సరికి ఎన్నికలు కూడా వస్తాయి. మంత్రి మేరుగ నాగార్జున ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారట! మరి మూడేళ్ల నుంచి ఏం చేస్తున్నారో?
జీఆర్ మహర్షి