ఎమ్బీయస్‌: అమరావతి కథలు- 2

ఇప్పుడు ఒక్కో టాపిక్‌ మీద వున్న కథలు కొన్ని ముచ్చటిస్తాను. 'వరద' అని మొదటి కథ. కృష్ణానదికి వరద వస్తుంది. అందరూ పరుగులు తీస్తారు. అంతా కలిసి ఊరి మధ్యనున్న మాలక్ష్మ వారి చెట్టు…

ఇప్పుడు ఒక్కో టాపిక్‌ మీద వున్న కథలు కొన్ని ముచ్చటిస్తాను. 'వరద' అని మొదటి కథ. కృష్ణానదికి వరద వస్తుంది. అందరూ పరుగులు తీస్తారు. అంతా కలిసి ఊరి మధ్యనున్న మాలక్ష్మ వారి చెట్టు దగ్గరకు చేరారు. అన్ని జాతులవాళ్లూ, అన్ని కులాల వాళ్లూ. జనాలకు తిండీ తిప్పలూ చూడాలిగా. కుర్రాళ్లు గడ్డపారలు తీసుకుని గాడిపొయ్యి తవ్వేశారు. యింటింటికీ వెళ్లి బియ్యం వసూలు చేశారు. అవధాన్లగారి భార్య, కోమటి సూరమ్మ, తెలగ వెంకమ్మ, గొల్ల సుబ్బమ్మ కత్తిపీటలు ముందేసుకుని చకచక కూరలు తరిగేశారు. వంట పూర్తయ్యాక బారులుగా విస్తళ్లు వేశారు. శాస్త్రిగారు అవుపోసన పట్టి నెయ్యికోసం చెయ్యి జాస్తే వడ్డించడానికి  వచ్చిన నేతి జారీ చెంగున వెనక్కి వెళ్లింది. వడ్డిస్తున్న మాల సంగడు భయంతో పారిపోయేడు. శాస్త్రిగారు వాణ్ని పిలిచి 'ఒరే నీకూ ఆకలేస్తుంది, నాకూ ఆకలేస్తుంది. ఇంకొకళ్లు వేస్తే నెయ్యి, నువ్వు వేస్తే నెయ్యి కాకపోదురా.. వెయ్యరా' అన్నారు. సంగడు ఆనందంగా వడ్డించాడు.

హేపీటైమ్స్‌లో ఈ సుహృద్భావం యిలాగే వుంటుందంటారా? ఆ ముక్క సత్యంగారూ అనరు. కథ చివర్లో – 'వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసిందనుకుందామా? అబ్బే! నాకు నమ్మకం లేదు! స్నానం చేసిన వొంటికి తెల్లారేటప్పటికి మళ్లీ మట్టి పట్టినట్టు మనసుల్లో మళ్లీ మలినం పేరుకుంటోంది. ఎన్ని వరదలొచ్చినా మనిషి మనసు కడగలేకపోతోంది. ' అంటూ ముగిస్తారు. 

 మారుతున్న సామాజిక పరిస్థితులు ఎలాటి మార్పులు తెస్తాయో చూపించిన ఓ కథ – 'అద్గదో బస్సు'

అమరావతికి ఫస్టుటైము బస్సు వస్తోంది. అంతా కోలాహలం. ఇంజను బస్సు, ఇంజను బస్సు అంటూ. 'డై””వోరు చక్రం తిప్పితే పట్నం నుంచి ఇక్కడికొచ్చి వాలిపోతది' అని ఒకడంటే 'అంటే గాలిలో ఎగురుకుంటా వస్తదా?' అని ఇంకోడి సందేహం. 'నేలమీదే పరుగెత్తుతాది కాని గాలిలో ఎగిరి నట్టుంటది.'అని క్లారిఫికేషన్‌. బస్సు వచ్చినరోజున చాకలాళ్లు రేవు కట్టేశారు. సాలెపేటలో మగ్గాలాగిపోయాయి. పిల్లలు బళ్లు ఎగ్గొట్టేశారు. ఆబాలగోపాలం ఎదురుచూస్తూండగా ఎట్టకేలకు బస్సు వచ్చింది. యుద్ధంలో వచ్చిన అర్జునుడిలా ఠీవిగా డ్రైవరు దిగితే అతన్ని అందరూ ఆరాధనాభావంతో చూశారు. ఆడవాళ్లు, పిల్లలు బస్సు తాకి చూస్తూంటే క్లీనరు, కండక్టరు వాళ్లని అదిలించారు.

అయితే ఈ ఆనందోత్సవంలో పాలు పంచుకోనివాడు ఒక్కడే! అతను జట్కా సాయిబు. నేచురల్లీ, బస్సు రావడంతో అతని బేరాలు పోయాయి, అతని భోగం పోయాయి. అతను బస్సు పక్కన్నుంచి వెళ్లిపోతూ 'ఛల్‌రే బేటా ఛల్‌' అని చండ్రకోలతో బస్సుమీద ఒక్క పీకు పీకుతాడు. 

అలాగే పల్లకీ సంగడి గురించి మరో కథ. అతను పెళ్లి పల్లకి  అద్దెకిచ్చి మోస్తాడు. కానీ ఊరేగింపుకి కార్లు వచ్చేశాక అతని పల్లకి ఎవరికి కావాలి? పదేళ్లగా బేరాలు లేవు. ఊళ్లో జరిగే ప్రతి పెళ్లికి వెళ్లడం పల్లకీ కట్టించుకోమని బతిమాలడం, వాళ్లు వద్దు పొమ్మనడం. చివరకి వాళ్లావిడ గంజి కాయడానికి ఆ పల్లకీ బొంగు విరిచి మంట బెడుతుంది. 

ఊరన్నాక కిల్లాడీలు వుంటారు. కనబడే దొంగలు కొందరు, వెనకనుండి వాళ్లను ఆడించే ఘరానాదొంగలు కొందరు. 'బంగారు దొంగ' కథలో ధ్వజస్తంభం రేకుకున్న బంగారుపూతను మెరుగుకాయితంతో రుద్దుతూ ఓ దొంగ పట్టుబడతాడు. ఎవళ్లో చూస్తారు. చావగొడతారు. ఊరిపెద్ద భూషయ్య వాణ్ని తన పెరట్లో కట్టేయించి అందరినీ పంపేస్తాడు. అందరూ వెళ్లిపోయాక 'తెలివితేటలుండక్కర్లా' అని తిట్టి కట్లు యిప్పేసి చేతిలో ఐదు రూపాయలు పెట్టి పంపేస్తాడు. అంటే వాడు వట్టి కిరాయిదొంగ. అసలు దొంగ ఊరిపెద్దే!

అలాగే ఎండాకాలం వచ్చేసరికి కృష్ణ ఎండిపోయి సుడిగుండం బయటపడుతుంది. అక్కడ వడ్డెవాడు ఒకడు బాచి అని పేరు ఓ జల్లెడ తీసుకుని రతనాలు దొరుకుతాయేమోనని జల్లిస్తూంటాడు. అది చూసిన ఓ మోతుబరి 'మా యింట్లోవాళ్ల ముక్కుపుడక అందులో పడిపోయింది. నువ్వు తీసుకుని పోయుంటావు. ఇచ్చేస్తావా లేక..' అని బెదిరిస్తాడు. భయపడిపోయిన బాచిగాడు తెల్లార్లూ వెతికి ఆ ముక్కుపుడక సంపాదిస్తాడు. పట్టుకెళ్లి మోతుబరికి యిచ్చి వస్తాడు. మళ్లీ వేట ప్రారంభం!

రంగడు అని ఇంకోడు వుంటాడు. అమరయ్యగారి పొలంలో గొర్రె పెంట వేస్తూంటే ఊళ్లోకి దోపిడీ దొంగలు వస్తారు. వాళ్లు అమరయ్య పురమాయించినవాళ్లే. అది తెలియక ఈ రంగడు అమరయ్యకే చెప్తాడు – యిలా దొంగలొచ్చారండీ అని. 'దొంగలొస్తే నీకెందుకురా? పోయి పనిచూసుకో' అంటూ అతన్ని తరిమేస్తాడు. మర్నాడు చూస్తే ఆ దొంగలు ఊళ్లో కొన్ని యిళ్లలో దోస్తారు. అమరయ్య ఆ దొంగలకూ, రంగడికీ లింకు కడతాడు. పెద్దలచేత శిక్ష వేయించి రంగడి గొర్రెల్లో సగం లాక్కుంటారు. దొంగలు మళ్లీ వస్తారు. రంగడు వాళ్ల వద్దనే మొత్తుకుంటాడు. వాళ్లు వెళ్లి అమరయ్య  పాడి ఆవు, దూడ పట్టుకొచ్చి రంగడికి యిచ్చేస్తారు. రంగడికి ఏం చేయాలో తెలియలేదు. ఎవరాదుకుంటున్నారో, ఎవరన్యాయం చేస్తున్నారో తెలియక తబ్బిబ్బయ్యాడు. ఆ ఆవూ, దూడ, మిగిలిన గొర్రెలు తోలుకుని ఆరూళ్ల అవతలికి పారిపోయాడు. 

ఇద్దరు మిత్రులు అని ఇంకో కథ. రాహుకేతువుల్లాటి వాళ్లు. ఊళ్లో కనబడ్డ మట్టిని తీస్తున్నవాళ్లను దబాయించి ఆ భూమి నాదేనంటాడు ఒకడు. శ్మశానాన్ని తాకటు ్టపెట్టి డబ్బు గడించేవాడొకడు. ఇద్దరూ ఓ సారి అనుకోకుండా ఎలక్షనులో పోటాపోటీగా నిలబడబోయి, తప్పుకుని ఇతరులను రంగంలోకి దింపుతారు. ఆ ఇద్దరూ కాంప్రమైజ్‌ అయ్యి ఎన్నిక మానేస్తారు కానీ ఈ లోపునే వీళ్ల జేబులు నిండుతాయి. 

ఇంకోడుంటాడు, చలమయ్య అని. తలలు మార్చే రకం. ఒకతను వచ్చి 'ఆ గోడపక్క స్థలం ఎవరిది?' అని అడుగుతాడు. 'నిలబడగలవా?' అని  అంటాడీతను. 'నిలబడమంటే నిలబడతాను' అంటాడు అవతలివాడు. అయితే యింటికెళ్లి వంద పట్రా అంటాడు. గుంటూరెళ్లిపోయి, ప్రస్తుతం పోరంబోకుగా వున్న ఆ స్థలం మూడు తరాల క్రితం ఇతని వంశానికి చెందినట్టు కాగితం సృష్టించి, నోటీసు లిప్పించి పత్రికలో ప్రకటనలు వేయించి, వూళ్లో టముకు కొట్టించి, దావా ఎవరూ ప్రతిఘటించకపోవడంతో తను మరో ఐదొందలు జేబులో వేసుకుని ఆ స్థలాన్ని ఆర్నెల్లలో అతని చేతిలో పెట్టాడు. ఇలా వ్యవహారాలు నడిపించిన చలమయ్యకు ఆఖరిదశలో పక్షవాతం వచ్చింది. ఆ అదను చూసుకుని ఉన్న మూడెకరాలకూ వారసులు దావా వేశారు. తను నిలబడలేడు. మాటకూడా పోయింది.  అందర్నీ నిలబెట్టిన తను ఆ దశలో నిలబడలేకపోతినే అని వాపోయాడు. అదీ కథ!

'తంపులమారి సోమలింగం' అని మరో కథ! ఎలాగోలాగ గొడవలు పెట్టడం, కోర్టుకు ఈడ్పించడం, వాళ్లు తన్నుకుంటూంటే చూసి ఆనందించడం అదీ అతని హాబీ. ఎవరైనా ఇల్లాలు మెడనిండా నగలతో కనిపిస్తే సోమలింగానికి కంపరమెత్తేది. ఎవడైనా నవ్వుతూ కనిపిస్తే వెన్నులో పోటొచ్చేది. అతని చూపుకి ఊరంతా భయపడేది. అందరూ అతన్ని తప్పించుకు తిరిగేవారు. ఇలా వుండగా అతనికి అవసానదశ సమీపించింది. వూరందర్నీ పిలిపించాడు. 'నేను పాపాత్ముణ్ని. నన్ను దహనం చేయకండి. నాకంత అర్హత లేదు. క్షమించండి. నన్ను గోరీల దొడ్డిలో పాతిపెట్టండి, చాలు' అని బతిమాలాడు. వీళ్లు పోన్లే అలాగే చేద్దామనుకున్నారు. అతని శవాన్ని గోరీల దొడ్డికి మోసుకెళ్లారు. సాయిబులు వచ్చి హిందువుని అక్కడ పాతిపెడ్తే కుదరదన్నారు. ఎక్కువ తక్కువల ప్రశ్న వచ్చింది. కర్రలు లేచాయి. దొమ్మీ జరిగింది. అప్పుడో ముసలమ్మ వచ్చింది. 'వాడు చచ్చిం తర్వాత కూడా పోట్లాట పెట్టడానికి వేసిన ఎత్తురా యిది' అని బుద్ధి చెప్పింది. అప్పుడు హిందువులూ ముస్లింలూ కలిసి మోసుకెళ్లి కృష్ణ ఒడ్డున ఆ శవాన్ని బూడిద చేశారు. (సశేషం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]

Click Here For Archives