ఎమ్బీయస్‌: సినీమూలం- శ్రీరంగనీతులు- 2

హీరో నాగేశ్వరరావు, హీరోయిన్‌ శ్రీదేవి కలవడం, హీరో సవతి చెల్లెలు విజయశాంతి తన ప్రియుడు చంద్రమోహన్‌ వద్దకు రావడం వరకు తమిళంలోగానే సాగుతుంది. చంద్రమోహన్‌కు తమిళంలోలా తండ్రి లేడు కానీ తల్లి ఎస్‌.వరలక్ష్మి వుంది.…

హీరో నాగేశ్వరరావు, హీరోయిన్‌ శ్రీదేవి కలవడం, హీరో సవతి చెల్లెలు విజయశాంతి తన ప్రియుడు చంద్రమోహన్‌ వద్దకు రావడం వరకు తమిళంలోగానే సాగుతుంది. చంద్రమోహన్‌కు తమిళంలోలా తండ్రి లేడు కానీ తల్లి ఎస్‌.వరలక్ష్మి వుంది. బుద్ధులు మాత్రం అవే. విజయశాంతి తన వద్దకు రాగానే చంద్రమోహన్‌ ఒరిజినల్‌లో లాగ హోటల్లో పెట్టలేదు. తన స్నేహితుడు జాన్‌, అంటే హీరో బావగారి యింట్లో వుంచాడు. హీరో నాగేశ్వరరావు తన తండ్రికి తెలియకుండా తల్లిని సొంత చెల్లెలింటికి తీసుకుని వస్తూండేవాడు. ఓసారి అలా తీసుకుని వచ్చినపుడు సవతి చెల్లెలు విజయశాంతి తారసిల్లింది. ఆమెను సవతిచెల్లిగా గుర్తించాడు. ఆమె తన స్నేహితుడు చంద్రమోహన్‌ ప్రేయసి అని తెలిశాక చంద్రమోహన్‌ను పక్కకు తీసుకెళ్లి నేనే ఆమె అన్నని అని చెప్పకుండా ''మీ అమ్మగారిని ఒప్పించడానికి నాటకం ఆడతా'' అని చెప్పాడు. హీరో తల్లి కూతుర్ని, సవతి కూతుర్ని చూసి మురిసిపోయి ఆపేక్ష కురిపించింది. ఇద్దరూ ఒకేలా వున్నారంది.  తమిళంలో లాగానే చంద్రమోహన్‌ విజయశాంతిని తన తల్లికి యాక్సిడెంట్‌ విక్టిమ్‌గా పరిచయం చేశాడు. హీరో డాక్టరుగా వచ్చాడు. అతనితో బాటు హీరోయిన్‌ నర్సుగా వచ్చింది. ఇది తెలుగులో అదనపు మార్పు. తమిళంలో లాగానే ప్రేమే పిచ్చికి మందు అని చెప్పడం జరిగింది. డబ్బున్న అమ్మాయి పైగా తన కొడుంటే మోజుపడుతోంది అనుకుని ఎస్‌. వరలక్ష్మి వాళ్ల ప్రేమ సాగనిచ్చింది. చంద్రమోహన్‌, విజయశాంతి ఎస్‌ వరలక్ష్మి ఎదురుగానే డ్యూయట్‌ పాడేశారు. 

తమిళ కథకు వద్దాం – హీరోయిన్‌ను తన యింట్లోనే వుండమని హీరో అడిగాడు కదా. ఆ తర్వాత తన తండ్రిని యిబ్బంది పెట్టాలని అతని ఎదుటే ఆమెతో రొమాన్సు సాగించాడు.  అది చూసి తండ్రి విలవిల్లాడాడు. అతని దృష్టిలో వాళ్లిద్దరూ అన్నాచెల్లెళ్లు. కానీ పైకి చెప్పలేడు – యీమె నీ చెల్లి అని. అప్పుడు తన నిజరూపం బయటపడిపోతుంది. అందువలన నువ్వు ఆమెకు చేరువ కావద్దు అని శాసిస్తూంటాడు. హీరో అతన్ని ఎదిరిస్తూ వుంటాడు. అతనికి తల్లి వత్తాసు వుంది, అమ్మాయి లక్షణంగా వుంది, పైగా డబ్బున్నది అంటూ. ఎటూ చెప్పలేక హీరో తండ్రి గిలగిలలాడతాడు. ఇదే సినిమాలో ప్రేక్షకుడికి వినోదం కల్గించే అంశం. తండ్రి ఎదురుగా నటించడంతో మొదలై కొన్నాళ్లకు వాళ్లు నిజంగానే ప్రేమలో పడ్డారు. పార్కుల్లో వీళ్ల శృంగారం ఊళ్లో వున్న  డాక్టర్‌ నాగేష్‌ కంట పడింది. వచ్చి హీరో తండ్రికి చెప్పాడు. అతను నెత్తి మొత్తుకున్నాడు. 

ఈ లోగా హీరోయిన్‌ తప్పిపోయిందంటూ పేపర్లో యిచ్చిన పాత యాడ్‌ యీ డాక్టర్‌ నాగేష్‌ కంటపడింది. దానిలో ఆఫర్‌ చేసిన పదివేల బహుమతికి ఆశపడి అతను హీరో తండ్రి వద్ద హీరోయిన్‌ కూపీ లాగుదామని ప్రయత్నించాడు. పేపరు కటింగు చూపించి అప్పుడడుగు అని కసురుకున్నాడు హీరో తండ్రి. కానీ నాగేష్‌ వద్ద పేపరు కటింగ్‌ పోయింది. మళ్లీ కష్టపడి సంపాదిస్తే దానిమీద యింకు పడిపోయింది. ఇతని తరహా చూసి తన వ్యవహారాల్లో కలగజేసుకోవద్దని హీరో వచ్చి బెదిరించి వెళ్లాడు. దాంతో డాక్టర్‌ చల్లబడ్డాడు. ఇవన్నీ తెలుగులో  దించారు. దీనితో బాటు హీరో తండ్రి యిరకాటంలో పడే ఘట్టాలు కొన్ని అదనంగా కల్పించారు. 'మా అబ్బాయి మీద పడుతున్నా నువ్వు జాగ్రత్తగా వుండు' అని హీరోయిన్‌ను హెచ్చరిస్తూ వుంటాడు సత్యనారాయణ. ఆమె సరే సరే అంటూనే హీరోతో రొమాన్సు సాగిస్తుంది. ఆమెకు అలా చెప్తూనే యింకోపక్క హీరోతో – 'ఆ అమ్మాయి తండ్రి మంచివాడు కాదు. ఆ అమ్మాయి తల్లిని చేసుకోలేదు' అని చెప్పాడు. 'అలాగా, అయితే యిన్నాళ్లూ ఆమెపై ప్రేమ మాత్రమే వుంది, యిప్పుడు జాలి కూడా..' అంటూ 'ఆ తండ్రి పరమ లుచ్ఛాలా వున్నాడు' అని తిడతాడు హీరో. ఆ తిట్లన్నీ తనకే తగులుతాయి కాబట్టి తండ్రి లబోదిబో మంటాడు.

చివరకు హీరో తన తండ్రిని యీ సంబంధం మీకు ఎందుకు యిష్టం లేదో చెప్పాలని పట్టుబడతాడు. అతను ఏమీ చెప్పలేక నో ఆర్గ్యుమెంట్స్‌ అనేస్తాడు. అంతేకాదు, ఇతనికి పెళ్లి సంబంధాలు తెస్తాడు. హీరో కుంటివాడిలా నటించి, మరోలా చేసి ఆ పెళ్లి సంబంధాలను హీరో చెడగొట్టేస్తూ వుంటాడు. పాపం తల్లికి యీ గొడవలేమీ తెలియవు. తండ్రి తన అక్రమసంబంధాన్ని యిన్‌డైరక్టుగా సమర్థించుకోబోతే ఆమె తీసిపారేసింది – మీలాటి మహనీయులకు అలాటి ఆలోచనలే రాకూడదంటూ!  ఇవన్నీ తెలుగులో కల్పించినవే. 

ఇక తమిళసినిమాలోకి వస్తే – ఓ సందర్భంలో హీరో తనే ఆమె అన్నగారినని సవతి చెల్లెలు విజయలక్ష్మితో చెప్పేశాడు. తను చెప్పినట్టు వింటే ముత్తురామన్‌తో పెళ్లి చేయిస్తానని హామీ యిచ్చాడు. అతని ప్లాను ప్రకారం ఆమె పిచ్చి తగ్గిపోయినట్టు నటించింది. 'మీ అబ్బాయిని పెళ్లి చేసుకుని మా నాన్నవద్దకు వెళతా. ముందే వెళితే అంతస్తులో తేడావలన మా నాన్న ఒప్పుకోడు. మా నాన్న మీ కంటె డబ్బున్నవాడు కదా!' అంది. ముత్తురామన్‌ తండ్రి మురిసిపోయాడు. డాక్టర్‌ వేషంలో వచ్చిన హీరో యిది విని 'ఐడియా మంచిదే కానీ నేను పెళ్లికి రాలేను. మా నాన్న యిష్టానికి వ్యతిరేకంగా అదే రోజు నేను పెళ్లి చేసుకోబోతున్నా' అని చెప్పాడు. 'అలా ఎందుకు? ఇద్దరి పెళ్లిళ్లూ నేనే స్వయంగా జరిపిస్తా' అని ముత్తురామన్‌ తండ్రి హామీ యిచ్చాడు. 

జంట పెళ్లిళ్ల ఆహ్వానం పట్టుకుని ముత్తురామన్‌ హీరో యింటికి వచ్చి అతని తండ్రి బాలయ్య ఆశీర్వాదం కోరాడు. రెండో పెళ్లికొడుకు పేరు తన కొడుకు పేరే కావడం, అతని తండ్రి పేరు కూడా తన పేరుతో కలవడం చూసి ఆశ్చర్యపడుతూనే పెళ్లికి తప్పక వస్తానని మాట యిచ్చాడతడు. తెలుగులో అయితే అతను కాబోయే భార్యతో సహా వచ్చినట్టు చూపించారు. తనే అన్నగారినని హీరో చెప్పే ఘట్టాన్ని తెలుగులో యిక్కడికి షిఫ్ట్‌ చేశారు. హీరో బెదిరించినా డాక్టరు నాగేష్‌ భార్య డబ్బు మీద ఆశతో యాడ్‌లో యిచ్చిన అడ్రసుకి ఉత్తరం రాసి పడేసింది. హీరోయిన్‌ మేనమామ వచ్చి నాగేష్‌ను యిల్లు చూపించమన్నాడు. సరిగ్గా పెళ్లికి వెళ్లే సమయానికి అతను హీరోయిన్‌ను కిడ్నాప్‌ చేశాడు. నాగేష్‌ యిచ్చిన సమాచారంతో హీరో, అతని స్నేహితుడూ వెళ్లి ఫైట్‌ చేసి ఆమెను విడిపించి పెళ్లి పందిరికి తీసుకుని వచ్చారు. 

అయితే పెళ్లి జరగబోతూవుంటే జరిగిన మోసం గ్రహించిన హీరో తండ్రి పెళ్లి కుదరదన్నాడు. ఎందుకెందుకంటూ అందరూ కలిసి నిలదీశారు. ఒప్పుకోక తప్పలేదు. అప్పుడు హీరో 'నీ అసలు కూతురు యీమె కాదు, యిదిగో ఈ విజయలక్ష్మి' అని చెప్పి తండ్రిని వూరడించాడు. తెలుగులో కూడా యిలాగే పెట్టినా చివర్లో పెద్దకూతుర్ని ఆమోదించడం కలిపారు. ఇలా కథ సుఖాంతం అవుతుంది. తెలుగు సినిమాకు డైలాగులు రాసిన డి వి నరసరాజుగారు మూలకథకు మరింత అందాలు చేర్చారు. దర్శకత్వం కోదండరామిరెడ్డి. తమిళ సినిమా పేరు ఊట్టీ వరై ఉరవుకి అర్థం ఊటీవరకు సంబంధం అని. తమాషాగా వుంది కానీ కథతో సంబంధం లేదు. తెలుగులో పేరు చక్కగా కుదిరింది. పైకి నీతులు చెపుతూ ఆచరణలో మరొకటి చేసే వారి గురించి – చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి వేశ్యావాటికలు అంటారు కదా. ఆ సామెతలోంచి శ్రీరంగనీతులు అని పెట్టారు. సినిమాలో సత్యనారాయణ చేసిన పని అదే కదా! తమిళసినిమాలో ఎమ్మెస్‌ విశ్వనాథన్‌ మ్యూజిక్‌ చాలా బాగుంటుంది. ముఖ్యంగా పిబి శ్రీనివాస్‌ యుగళగీతాలు చాలా పాప్యులర్‌ అయ్యాయి. తెలుగులో కూడా పాటలు బాగుంటాయి. అన్నపూర్ణా స్టూడియోస్‌ బ్యానర్‌పై హీరో నాగేశ్వరరావుగారు నిర్మించిన యీ సరదా సినిమా హిట్‌ అయింది. (సమాప్తం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2015)

[email protected]

Click Here For Part-1