ఎమ్బీయస్‌: అమరావతి కథలు – 1

ఆంధ్రుల రాజధానిగా అమరావతి ఆవిర్భవిస్తోంది. అక్కడి ప్రజల అలవాట్లేమిటి, స్వభావాలేమిటి, చరిత్ర ఏమిటి తెలుసుకోవాలనే కుతూహలం అందరిలో వుంటుంది. ఏ జాతి లక్షణమైనా ప్రతిబింబించేది సాహిత్యంలోనే. అందువల్ల తెలుగుజాతి గుణగణాలను తెలుసుకోవాలంటే సాహిత్యాన్ని, ముఖ్యంగా…

ఆంధ్రుల రాజధానిగా అమరావతి ఆవిర్భవిస్తోంది. అక్కడి ప్రజల అలవాట్లేమిటి, స్వభావాలేమిటి, చరిత్ర ఏమిటి తెలుసుకోవాలనే కుతూహలం అందరిలో వుంటుంది. ఏ జాతి లక్షణమైనా ప్రతిబింబించేది సాహిత్యంలోనే. అందువల్ల తెలుగుజాతి గుణగణాలను తెలుసుకోవాలంటే సాహిత్యాన్ని, ముఖ్యంగా ప్రసిద్ధ కథానికలను పరిశీలించాలి. ముఖ్యంగా 'క్షేత్ర కథానికలు'.! ఏదో ఒక ఊరును ఆలంబనగా చేసుకుని కల్పించిన కథలన్నమాట. దానివల్ల ఆ ఊరి గురించి, అక్కడి ప్రజల ఆచార వ్యవహారాల గురించి, ఆలోచనా సరళి గురించి, జీవన విధానం గురించి ఒక ఐడియా వస్తుంది. వాటితో బాటు అక్కడి మాండలికమూ పరిచయ మవుతుంది. శంకరమంచి సత్యంగారు రాసిన ''అమరావతి కథలు'' నేను యీ కాలమ్‌లో ఐదేళ్ల క్రితం పరిచయం చేశాను. ఇప్పుడు అమరావతి అందరి నాలుకలపై ఆడుతోంది కాబట్టి మళ్లీ వాటిని గుర్తు చేయమని కొందరు పాఠకులు కోరుతున్నారు. ఐదేళ్లలో కొత్తగా చేరిన పాఠకులు కూడా వుంటారు కదాని మళ్లీ అందిస్తున్నాను. 

'అమరావతి గుంటూరు జిల్లాలో ఓ వూరు యిది. అక్కడ అమరేశ్వరుడు వెలసి వున్నాడు. క్షేత్రపాలకుడైనా వేణుగోపాలస్వామి గుడి వుంది. పైగా బౌద్ధం విలసిల్లిన చోటు కూడాను. వాసిరెడ్డి నాయుడు రాజ్యం చేసిన చోటు. ఇంత ఇంపార్టెన్సు వుంది కాబట్టే అమరావతిని కేంద్రంగా చేసుకుని శంకరమంచి సత్యంగారు నూరు కథలు రాశారు. అవి ఎంత పాప్యులర్‌ అయ్యాయంటే శ్యామ్‌ బెనగల్‌ వాటిని బేస్‌ చేసుకుని 'అమరావతీ కీ కహానియాఁ' పేరుతో హిందీలో టీవీ సీరియల్‌గా తీశారు. దూర్‌దర్శన్‌లో దేశమంతటా ప్రసారం అయ్యాయి. ఆ కథల్లో రకరకాలైన థీమ్స్‌ వున్నాయి. ఇవి 100 కథలు. ఆంధ్రజ్యోతి వార పత్రికలో సీరియల్‌గా వచ్చాయి. తర్వాత 1978లో బాపుగారి బొమ్మలతో, ముళ్లపూడి వెంకటరమణగారి పీఠికతో పుస్తకరూపంలో వచ్చాయి. ఈ కథలకు 1979 రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. తర్వాత హిందీలో  

అమరావతి కథలు రాసిన సత్యం గారు నాలుగు నవలలు, ఓ నాటకం రాశారు. మూడు శీర్షికలు నడిపారు. ఆయన 1964, 65 ప్రాంతంలో జయపూర్‌లో ఆకాశవాణిలో పని చేసేటప్పుడు 'అమరావతి కథలు' పేర రాద్దామనుకుని కొంత నోట్సు ప్రిపేర్‌ చేసుకున్నారు. తర్వాత పన్నెండేళ్ల తర్వాత విజయవాడలో ఆంధ్రజ్యోతి వీక్లీ నడిచేరోజుల్లో ఎడిటర్‌గా వున్న పురాణం వారు  'మీరు అమరావతి కథలు అని ఎందుకు రాయకూడదు?' అన్నారు ఉన్నట్టుండి. ఈయన అవాక్కయిపోయాడు. పురాణానికి దివ్యదృష్టి ఏమీ లేదు కదాని. తర్వాత తేరుకుని నాలుగు కథలు ఆశువుగా చెప్పారు. పురాణంవారు కాలమ్‌ మొదలెట్టేసారు. ఈయన పడుతూ, లేస్తూనే  వంద కథలు పూర్తి చేశారు. చదివిన జనాలు పిచ్చెక్కిపోయారు. కథల్లో వుండే సింప్లిసిటీ పాఠకుల హృదయాలకు హత్తుకుపోయింది. ఆయన  ఆ వూరిలోని ప్రతి రాయీ, రప్పను కథావస్తువులుగా మలచుకున్నాడు.  గతకాలపు రాజుల నుండి, మధ్యతరగతి మారాజులు, దొరలు, దొంగలు, ముష్టివాళ్లు, జట్కా బళ్లవాళ్లు, గడ్డి అమ్మేవాళ్లు, తిండిపోతులు, వీళ్లందరూ కథలకు హీరోలే! మనుష్యులేనా, కార్తీకదీపాలు, వాన చినుకులు, దుమ్ములో రేణువులు  – వీటి మీద కూడా ఆయన అక్షర శిల్పాలు చెక్కారు. కథల్లో పూజారులు కనబడతారు, ప్రేమ పూజారులు కనబడతారు, భగ్న ప్రేమికులు కనబడతారు అంటూ  ఊదరగొట్టేబదులు కొన్ని కథలు మీకు పరిచయం చేస్తాను. వాటిలో గొప్పతనం మీకే అర్థమవుతుంది. 

అమరావతి కథలు చెప్పేముందు అమరావతి ఎక్కడుందో చెప్పాలిగా, ఎలా వెళ్లాలో చెప్పాలిగా. అదీ సత్యంగారే చెప్పారు  'అదుగో అల్లదుగో' అనే కథలో – గుంటూరులో బస్సెక్కాలి. ఎక్కారా? తోసుకోటం, గుద్దుకోటం, ముందెక్కుతున్నవాళ్లని వెనక్కి లాగేయటం, వెనకున్నవాళ్లని మోచేతుల్తో కుమ్మేయటం అన్నీ అయ్యాయా –

'ఏందయ్యా, ఆడంగుల్ని ముందెక్కనీ' – 'అమ్మో నా కాలు తొక్కేశారు, దేవుడోయ్‌'

'చెవులవీ చేతులవీ జాగర్తేవ్‌' – 'సామాన్లు కిటికీలోంచి లోపలకి తోసేయ్‌'… లాటి కేకలు వినబడ్డాయా? 

బస్సు బరువెక్కింది. కిక్కిరిసిన జనాలు, శనక్కాయ మూటలు, ధనియాల బస్తాలు, కూరగాయల బుట్టలు, రేకు పెట్టెలు, పలుపుతాళ్లు, పారలు, ఉక్క. బస్తా కుదించి మూతి కుట్టేసినట్టుంది. ఇక లోపలున్న జనాలు ఊరుకుంటారా?

'ఏందమ్మా! అంత సోటుంటే మీది మీదికి పడ్తావూ..?'

'సుట్ట తీసేవోయ్‌ సోగ్గాడ…అప్పుడే ముట్టించాడు..దొర చుట్ట'  అంటూ చిన్న చిన్న తగాదాలు. 

కండక్టరు కారా కిళ్లీ నముల్తూ వచ్చాడు. 'ఎవరివీ బస్తాలూ..? ఈ బుట్టల్దీసెయ్‌!.. ఎడ్లబండనుకున్నారా?..గోరంట్లకి మూడు టిక్కెట్లా? సిటీబస్‌లో పోలేవూ? దిగుదిగు.' ఇలా అంటూ టిక్కెట్లు కోస్తూండగానే డ్రైవర్‌, క్లీనరూ వచ్చేశారు. క్లీనర్‌ 'సొంత యిల్లంటయ్యా పరుపుల మీద కూకున్నట్టు కూకోడానికి. పదిమంది కూకునే చీటు. సర్దుగోండి' అంటూ హంగు చేస్తూ 

జూనియర్‌ డ్రైవర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్‌ 'గురూ! రైటుక్కొయ్‌ ఎడంకి లాగుతోంది జాగర్త… ఎనక లారీవోడొస్తున్నాడు సైడియ్‌..ముందు మేకపిల్లుంది సూస్కో.. చింతకాయలు కొట్టుకునే ఆ పిల్లనేం జూస్తావ్‌..ముందు రోడ్డు చూడు బే!' అంటూ పార్థసారథియై బస్సును, కథ నడిపిస్తాడు. 

గోరంట్ల, లాం, నిడుముక్కల వచ్చాయి వెళ్లాయి. మోతడక పొలిమేరల్లో డ్రైవరుగారు బస్‌ ఆపేసి 'ఇంజను హీటెక్కింది. నీళ్లు పొయ్యి' అని అక్కడున్న గుడిసెలోకి వెళ్లిపోయేడు. కాస్సేపు పోయాక  వచ్చాడు… బస్సు పధ్నాలుగో మైలు వచ్చింది. అక్కడ కాఫీలు తాగమని పర్మిషన్‌ యిచ్చారు. మరో పావుగంట తర్వాత యండ్రాయి వచ్చింది. ఆ తర్వాత నరుకుళ్లపాడు. ఓ మైలు పోతే కృష్ణగాలి వచ్చింది. మరో మైలు రాగానే వైకుంఠపురం కొండ కన్పించింది. మరో అరమైలు ఉందనగా దేవాలయ గోపురం,..అదిగో శిఖరం.. దీపాలదిన్నె.. అమరావతి వచ్చేశాం. 

'ఓల్డన్‌' అన్నాడు క్లీనర్‌.  (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]