పురంధేశ్వరికి ఉక్కు చిక్కులు ఎన్నో…?

బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి ఇపుడు అసలైన సమస్యలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఆమె జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఈ నెల 27న విశాఖ వస్తున్నారు.…

బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి ఇపుడు అసలైన సమస్యలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఆమె జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఈ నెల 27న విశాఖ వస్తున్నారు. విశాఖలో ఆ రోజు ఉత్తరాంధ్రా జిల్లాల బీజేపీ పదాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.

విశాఖ వస్తున్న పురంధేశ్వరిని కలిసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో తేల్చమని కోరేందుకు ఉక్కు కార్మిక సంఘాలు సిద్ధంగా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే విజయవాడలోని బీజేపీ ఆఫీస్ కి వెళ్లి పురంధేశ్వరికి ఉక్కు ఉద్యమకారులు వినతి పత్రం ఇచ్చారు.

విశాఖ ఉక్కుని సైల్ లో విలీనం చేసి కాపాడమని, ప్రభుత్వ రంగ సంస్థగా ఉంచాలని వారు విన్నవించుకున్నారు. ఇపుడు విశాఖ రానున్న పురంధేశ్వరిని మరోసారి కలసి తమ కష్టాలను చెప్పుకునేందుకు ఉక్కు కార్మిల లోకం సిద్ధం అవుతోంది.

పురంధేశ్వరి రానున్న ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నారని టాక్. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విశాఖ ఉక్కుకి ఉరి వేసిందని దానికి ఊపిరి పోయాల్సిన బాధ్యత ఏపీ బీజేపీ నేతల మీదనే ఉందని ఉక్కు కార్మికులు అంటున్నారు.

విశాఖలో పురంధేశ్వరి విశాఖ ఉక్కు గురించి కూడా మాట్లాడి కచ్చితమైన హామీని ఇవ్వాలని వారు కోరుతున్నారు. విశాఖ ఉక్కు విషయంలో గతంలో మాదిరిగా పార్టీ నాయకురాలిగా ఓదార్పు మాటలు మాట్లాడితే కుదిరే వ్యవహారం కాదు, పురంధేశ్వరి ఏమి చేస్తారు విశాఖలో ఉక్కు చిక్కులు ఎలా తప్పించుకుంటారు, విశాఖ సహా ఏపీలో బీజేపీని ఎలా నిలబెడతారు అన్నది కమలనాధులకే ఆలోచింపచేసేలా ఉంది అని అంటున్నారు.