ఉప్పొంగెలె గోదావరి

పోటెత్తనున్న భక్తులు ఉభయ గోదావరికి పుష్కర శోభ Advertisement పన్నెండేళ్ళకోసారి వచ్చే గోదావరి పుష్కరాలంటే ప్రజలకు ఓ సంబంరం… అంబరాన్నంటే ఈ సంబరంలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమమూలల నుండి వచ్చే ప్రజానీకంతో ఉభయ గోదావరి…

పోటెత్తనున్న భక్తులు
ఉభయ గోదావరికి పుష్కర శోభ

పన్నెండేళ్ళకోసారి వచ్చే గోదావరి పుష్కరాలంటే ప్రజలకు ఓ సంబంరం… అంబరాన్నంటే ఈ సంబరంలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమమూలల నుండి వచ్చే ప్రజానీకంతో ఉభయ గోదావరి జిల్లాలు పోటెత్తనున్నాయి. ఈనెల 14వ తేది నుండి 26వ తేది వరకు జరిగే పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాలు పుష్కర శోభను సంతరించుకున్నాయి. రాజమండ్రి నగరం ప్రథాన వేదికగా సాగే గోదావరి పుష్కరాలు2015ను మహా కంభమేళా తరహాలో నిర్వహించేందుకు రాష్ర్ట ప్రభుత్వం చర్యలు చేట్టింది. 2003లో పుష్కరాల సమయంలో (సమైక్య రాష్ర్టంలో) ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు విజయవంతంగా పుష్కరాలను నిర్వహించారు. ఇప్పుడు కూడా ఆయనే ముఖ్యమంత్రి కావడంతో గత అనుభవాలను దృష్టిలో పుష్కరాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇటీవలి కాలంలో తరచూ రాజమండ్రి నగరాన్ని సందర్శించి అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. కంభమేళా తరహాలో పుష్కరాలను నిర్వహించేందుకు అవసరమైన పటిష్ట కార్యాచరణ ప్రణాళికలను చంద్రబాబే స్వయంగా రూపొందించారు. 

234 స్నానఘట్టాలు……

ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 234 స్నానఘట్టాలను ఏర్పాటుచేశారు. వీటిలో 169 స్నానఘట్టాలను తూర్పుగోదావరి జిల్లాలో సిద్ధం చేశారు. రాజమండ్రి నగరంలోని పుష్కర ఘాట్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇదివరేక ఉన్న ఘాట్లను అభివృద్ధి చేశారు. రాజమండ్రి సహా వివిధ ప్రాంతాల్లో ఘాట్లను ఏర్పాటుచేశారు. గోదావరి కాలువ వెంబడి ఉన్న పట్టణాలు, గ్రామాలను గుర్తించి అనువైన చోట భక్తుల సౌకర్యార్ధం ఘాట్లు ఏర్పాటుచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కూడా రాజమండ్రి తరహాలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పుష్కరఘాట్లను అభివృద్ధి చేశారు. ఉప్పొంగి ప్రవహించే గోదావరి నదీ జలాలు నరసాపురం వద్ద సముద్రంలో కలుస్తాయి. ఇక్కడ పుష్కర స్నానమాచరిస్తే పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ఉభయగోదావరి జిల్లాల్లో స్నానఘట్టాల వద్ద పడవలు, గజ ఈతగాళ్ళను సిద్ధంగా ఉంచుతున్నారు. ఎక్కడికక్కడ స్నానఘట్టాల వద్ద టాయిలెట్లు, డ్రెస్ ఛేంజింగ్ గదులు ఏర్పాటుచేశారు. యాత్రికుల కోసం నగరంలో పలుచోట్ల నమూనా ఆలయాలు నిర్మించారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చే వారి కోసం నగరంలో పుష్కరాలు జరిగే 12 రోజులూ ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. 

35వేల మందితో బందోబస్తు….

పుష్కరాల కోసం సుమారు 35వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. పుష్కరాల ప్రారంభానికి రెండు రోజుల మందే బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. అధిక భాగం పోలీసులను రాజమండ్రి నగరంలో మొహరింపజేస్తున్నారు. రాజమండ్రి నగరం మొత్తం సిసి కెమేరాల కనుసన్నల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సంఘ విద్రోహ శక్తులపై ప్రత్యేక పోలీసు దళాలు డేగకన్ను  వేశారు. పాత నేరస్థులు, జేబు దొంగలు, చైన్ స్నాచింగ్ ముఠాలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. వివిధ జిల్లాల నుండి పుష్కరాలకు దాదాపు 2వేల  ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. దక్షిణ మధ్య రైల్యే అధికారులు స్పెషల్ ట్రైన్‌ను నడుపుతోంది. రాజమండ్రి నగరంలో యాత్రికులు సౌకర్యార్ధం 300 సిటీ బస్సులను త్రిప్పనున్నారు. రోజుకు కనీసం రెండు లక్షల మంది వరకు యాత్రికులు రాజమండ్రిలో విశ్రమించేందుకు వీలుగా వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. పుష్కర స్నానాలు ఆచరించే భక్తులు లక్షల సంఖ్యలో ఉంటారని అంచనా! భక్తుల తాకిడి కారణంగా తొక్కిసలాటకు అవకాశం లేకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. పుష్కరాలలో భాగంగా పన్నెండు రోజులూ వివిధ సాంసృ్కతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 

డైనమిక్ ట్రాఫిక్ ప్రణాళిక….

పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి నగరంలో డైనమిక్ ట్రాఫిక్ ప్రణాళికను అమలుచేస్తున్నారు. మూడు అంచెల్లో ట్రాపిక్ అంక్షలు విధించడంతో పాటు రద్దీని బట్టి ప్రతిపాదనల్లో మార్పులు చేయాలని నిర్ణయించారు. భారీ వాహనాలు, ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ స్థలాలను నగరం బయటే ఏర్పాటుచేశారు. రాజమండ్రి మెయిన్ రైల్వే స్టేషన్, గోదావరి స్టేషన్, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్లకు లక్షల సంఖ్యలో భక్తుల తాకిడి ఉంటుందని అంచనా! రైల్వే స్టేషన్ల నుండి పుష్కర ఘాట్లకు భక్తులను చేరవేసేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నారు. వివిఐపిలు, విఐపిల కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

స్వచ్ఛభారత్ నినాదం….

పుష్కరాల నేపథ్యంలో ప్రథాని మోదీ పిలుపు నిచ్చిన స్వచ్ఛభారత్ నినాదాన్ని భాగా ప్రచారం చేశారు. తీర ప్రాంతాంలో మరుగుదొడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. పుష్కర ఘాట్లు ఏర్పాటుచేసిన చోట స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేశారు. అయితే చాలాచోట్ల జరిగిన పుష్కర పనుల్లో అవినీతి రాజ్యమేలిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా చోట్ల ప్రజా ప్రతినిధులుఅధికారులు మధ్య సమన్వయం కొరవడి పనులు సక్రమంగా జరగలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పుష్కర పనుల్లో అవకతకలపై దర్యాప్తు సంస్థలచే విచారణ జరిపించాల్సిందిగా పలువురు డిమాండ్ చేస్తున్నారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతి రోజు గోదావరి హారతి కార్యక్రమాన్ని నిర్వహించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
 
విశ్వ