కాప్షన్ చూడగానే యిదేదో వ్యాపమ్ గురించి వ్యాసం అనుకుంటారు కాబోలు, యిది ఆశారామ్ బాపు కేసులో ప్రాసిక్యూషన్ సాక్షుల గురించి కథనం. ఈ కథనాలే ఆశారాం బాపుకి, అతని కొడుక్కి 2013 సెప్టెంబరు నుండి బెయిలు రాకుండా చేస్తున్నాయి. రామ్ జెఠ్మలానీ, సుబ్రహ్మణ్యంస్వామి వంటి లాయర్లను పెట్టుకున్నా కోర్టు బెయిలు యివ్వటం లేదు. ఆరోసారి పెట్టుకున్న బెయిలు పిటిషన్‌ను జూన్ 20 న తిరస్కరించడం జరిగింది. ఆశారామ్ జైల్లో వున్నా అతని అనుచరులు బయటే వున్నారు. అతని మీద పెట్టిన కేసులో వ్యతిరేక సాక్ష్యాలు తుడిపివేసే, సాక్షులను చంపివేసే, భయపెట్టే చర్యలు చేపట్టారు. దానికి అనేక ఉపాయాలు పన్నుతున్నారు. ఉదాహరణకి – కర్ణాటకలోని బిజాపూర్‌కు చెందిన బసవరాజ్ బాసు అనే భక్తుడు, అతని భార్య సెజాల్ యిప్పటికీ ఆశారాం భక్తులు. అయితే ఆశారాం వ్యతిరేకులుగా నాటకం మొదలుపెట్టారు. తాము కూడా ఆశారాం బాధితులమని, ఆశ్రమంలో అవమానాలకు గురయ్యామని, వాటిని టీవీ యింటర్వ్యూలలో బయటపెట్టడం చేత ఆశారాం ఆశ్రమవాసులు తమపై పగబట్టారని చెప్పుకోసాగారు. అలా చెప్పుకుని, ప్రాసిక్యూషన్ తరఫున సాక్షులుగా మారిన ఆశారం మాజీ అనుచరుల నమ్మకాన్ని చూరగొన్నారు. వాళ్లతో స్నేహం సంపాదించి, వాళ్ల ఆనుపానులు తెలుసుకుని, వాళ్లను ఎలా ఎప్పుడు చంపాలో ప్లాను వేసుకున్నారు. గుజరాత్‌లోని 6గురు సాక్షులను మట్టుపెట్టడానికి కిశోర్ బోడ్కే అనే హంతకుణ్ని నియోగించారు. అతను ఆశారామ్ మోటేరా ఆశ్రమంలో పనివాడిగా పనిచేశాడు. అతనికి తోడుగా బసవరాజు తన సోదరుడు చంద్రశేఖర్‌ను పంపాడు.
వాళ్లిద్దరూ కలిసి 2014 మార్చి 16న దినేష్ భాగ్‌చందాని అనే ఒక ముఖ్యమైన ప్రాసిక్యూషన్ సాక్షి మొహం మీద యాసిడ్ పోశారు. అతను కేకలు పెట్టడంతో జనం పోగడి కిశోర్‌ను పట్టుకోగా, చంద్రశేఖర్ పారిపోయాడు. పోలీసులకు కిశోర్ జేబులో వాళ్లు చంపవలసిన ఆరుగురి జాబితా దొరికింది. ఇప్పటికి ముగ్గురి పైనే దాడి చేయగలిగాం అని కిశోర్ చెప్పాడు. దాడి జరిగినవారిలో విమలేశ్ ఠక్కర్ ఒకడు. అతని భార్య జహంగీర్‌పురా ఆశ్రమంలో ఆశారాం తనను బలాత్కరించాడని కేసు పెట్టింది. ఇతను సాక్షి. అందువలన ఠక్కర్‌పై 2014 ఫిబ్రవరిలో కత్తులతో దాడి జరిగింది. ఆశారాం వద్ద వీడియో గ్రాఫర్‌గా పనిచేసిన రాహుల్ పటేల్ మూడో అతను. దినేష్ ద్వారా బసవరాజు ప్లాన్ల గురించి పోలీసులకు తెలిసినా మరో రెండు నెలలకు రాజకోటలో అమృత్ ప్రజాపతి తుపాకీ కాల్పులకు గురయ్యాడు. అతను ఆశారాంకు 2005 వరకు వ్యక్తిగత ఆయుర్వేద వైద్యుడిగా పనిచేసి అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. తుపాకీ గాయాలతో 17 రోజుల తర్వాత అమృత్ చచ్చిపోయాడు. నాపై దాడి చేసినవారు ఫలానా అని అతను నలుగురి పేర్లు చెప్పినా, వారు గట్టి ఎలిబయ్‌లు (వేరే చోట వున్నామనే సాక్ష్యాలు) చూపడం వలన వదిలేశారు. అమృత్ భార్య సరోజ్ ఆశారామే నా భర్తను చంపించాడు అని ప్రకటించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. మోటేరా ఆశ్రమంలో తాంత్రిక విధుల గురించి, అక్కడ 2008లో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన యిద్దరు పిల్లల గురించి డికె త్రివేది కమిషన్ ముందు సాక్ష్యం చెప్పిన రాజూ చండక్ అనే ఆశ్రమ మేనేజర్‌పై 2009లో హత్యాప్రయత్నం జరిగింది. అతను ఆశారామ్ పై మోపిన రేప్ కేస్‌లో సాక్షి. అతని పేరు, నార్సింగ్ వట్వానీ అనే అతని పేరు చంపవలసిన వాళ్ల లిస్టులో వున్నాయి. వారు భయపడుతున్నారు.
ఈ దాడులు గుజరాత్‌కే పరిమితం కాలేదు. ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో అఖిల్ గుప్తా అనే అతన్ని 2015 జనవరిలో ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిలుపై వచ్చి పాయింటు బ్లాంక్ రేంజిలో తుపాకీతో కాల్చి చంపారు. అతను ఆశారాం వద్ద వంటవాడిగా పనిచేసేవాడు. అక్కడ పని మానేసి స్వగ్రామం వచ్చి పాలవ్యాపారం చేస్తున్నాడు. ఆశారాం పై మోపిన రేప్ కేసులో అతను ప్రత్యక్షసాక్షి. లఖనవ్ వాసి రాహుల్ సచాన్ జోధ్‌పూర్ ఆశ్రమం రేప్ కేసులో సాక్షి. సాక్ష్యం చెప్పడానికి ఫిబ్రవరి 13 నాటి హియరింగ్‌కై జోధ్‌పూర్ కోర్టుకి వెళితే అక్కడ కోర్టు ఆవరణలోనే సత్యనారాయణ్ గ్వాలా అనే అతను కత్తితో పలుమార్లు పొడిచాడు. రాహుల్ బతికాడు కానీ అనారోగ్యం పాలయ్యాడు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అతనికి ఒకే ఒక్క సెక్యూరిటీ గార్డును, అదీ రోజులో 8 గంటల పాటు యిచ్చింది. ఎవరైనా దాడి చేస్తే ఆ 8 గంటల్లోనే చేస్తారని ఎలా వూహించారో!? దాడి చేసిన సత్యనారాయణ్ ఆశారాం భక్తుడని తెలిసినా రాజస్థాన్ పోలీసులు దీని వెనక్కాల కుట్ర ఏమీ లేదని అంటున్నారు.
ఆశారాం కొడుకు నారాయణ సాయి వద్ద 2005 జులై వరకు సహాయకుడిగా పని చేసి, మూడు కేసుల్లో సాక్షి అయిన మహేందర్ చావ్లాకు యివన్నీ విని భయం పట్టుకుంది. అతను హరియాణాలోని పానిపట్‌లో వుంటాడు. వెళ్లి రక్షణ కల్పించమని మొత్తుకున్నా హరియాణా పోలీసు వినలేదు. కానీ సూరత్, అహ్మదాబాద్‌లలో జరుగుతున్న దాడుల క్రమాన్ని గమనించిన గుజరాత్ పోలీసువారు హెచ్చరించాక ఒక పోలీసుని కాపలాగా పెట్టారు. మే 13న మహేందర్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు ఆ కానిస్టేబుల్ మాయం. ఉదయం 9 గంటలకు ఎవరో తలుపు తడితే మహేందర్ తీశాడు. ఇద్దరు యువకులు తుపాకీతో ప్రత్యక్షమయ్యారు. ''నారాయణ సాయికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావురా?'' అంటూ కాల్చబోయాడు తుపాకీ పట్టుకున్నవాడు. మహేందర్ తుపాకీ గొట్టం పట్టుకుని గోడవైపు తిప్పేశాడు. అది గురి తప్పగానే యింటి గోడమీద నుంచి బయటకు గెంతాడు. ఇంతలోనే తేరుకున్న ఆగంతకుడు మళ్లీ కాల్చాడు. గుండు యితని భుజంలోంచి దూసుకుపోయి, రక్తం కారి, స్పృహ తప్పాడు. అతను చచ్చిపోయాడనుకుని వాళ్లు వెళ్లిపోయారు. ప్రాణం దక్కింది కానీ చెయ్యి చచ్చుపడిపోయింది. దాడి చేసిన వారు దొరకలేదు. ఇప్పుడు హరియాణా ప్రభుత్వం అతని యింటి దగ్గర ముగ్గురు పోలీసులను పెట్టింది కానీ అనుమానితులు ఫలానా అని మహేందర్ చెప్పినా దర్యాప్తు చేయడం లేదు.
ఇన్ని రాష్ట్రాలలో దాడులు జరుగుతున్నాయి కాబట్టి జాతీయ స్థాయిలో పనిచేసే సిబిఐ మాత్రమే సాక్షులను కాపాడే బాధ్యత స్వీకరించాలని, హత్యలను లోతుగా పరిశోధించాలని అఖిల్ గుప్తా తండ్రి కోరుతున్నాడు. ఆయన మోదీకి, రాజ్‌నాథ్ సింగ్‌కు, గుజరాత్ ముఖ్యమంత్రి, యుపి ముఖ్యమంత్రికి పిటిషన్లు పంపుకున్నా ఎక్కణ్నుంచి ఎలాటి స్పందనా రాలేదుట. పత్రికల వాళ్లు నిజాలు వెలికి తీసి కుట్ర కోణం బయటపెడదామన్నా సాక్షులు సహకరించటం లేదు. ''మీ పత్రికలో కథనం కోసం మా ప్రాణాలను పణంగా పెట్టాలా? మేం నోరు విప్పం.'' అంటున్నారు. అసలు చాలామంది ఎవరికీ దొరక్కుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆశారాం జైల్లో వుంటేనే పరిస్థితి యింత ఘోరంగా వుంటే, బయటకు వదిలితే యింకెన్ని ఘోరాలు జరుగుతాయోనని జడ్జి భావించినట్టున్నారు. అందుకే ఆరోసారి బెయిల్ తిరస్కరించారు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2015)