ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చాలాకాలం క్రితం వరకూ కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు పెద్ద దిక్కుగా ఉండేవారు, ఆయనను సంప్రదించకుండా ఏ ఒక్క పనీ చేసే సాహసాన్ని నాడు ఢిల్లీ బీజేపీ చేసేది కాదు. కానీ కాలక్రమేణా తెలంగాణాలో వెంకయ్య ఆధిపత్యాన్ని నిలదీసే తరం బయల్దేరింది. విభజన తరువాత పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లోనూ వెంకయ్యనాయుడు తన సత్తా చాటుకుంటూ వస్తున్నారు. అయితే, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. కాలం చెల్లిన పాత నాయకులకు చెక్ చెబుతూనే రెండవ తరానికి ప్రాధాన్యత ఇచ్చేలా పధక రచన చేస్తున్నారు. ఈ క్రమంలో వెంకయ్య ముఖ్య అనుచరుడైన ఏపీ అధ్యక్షుడు హరిబాబుకు ఉద్వాసన పలకబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే పార్టీ సంస్ధాగత ఎన్నికలలో హరిబాబు స్ధానంలో కొత్త అధ్యక్షుడు రానున్నారన్నది టాక్. మరి, ఈ పరిణామాలు ఏపీ బీజేపీకి ఎటువంటి సంకేతాలను అందిస్తాయన్నది చూడాలి మరి.
ఏపీ బీజేపీలో కీలకమైన పరిణామాలు సంభవించబోతున్నాయి. సుదీర్ఘ కాలంగా బీజేపీని అట్టిపెట్టుకుని ఉన్న ఓ బలమైన సంప్రదాయ కులానికి చెక్ చెప్పేందుకు తెర వెనుక ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. అదే క్రమంలో మరో బలమైన సామాజిక వర్గానికి పెద్ద పీట వేయబోతున్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా చేసుకుని నూతన సమీకరణలు సాగుతున్నాయి. మూడేళ్ల క్రితం ఏపీ బీజేపీకి అనూహ్య పరిణామాల నేపధ్యంలో అధ్యక్షునిగా ఎన్నికైన విశాఖ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు ఎన్నికయ్యారు. నాడు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చక్రం తిప్పి మరీ తన ముఖ్య అనుచరున్ని ఈ పదవిలో కూర్చోబెట్టగలిగారు. ఈ మూడేళ్ల కాలంలో ఏపీలో బీజేపీ గెలిచింది రెండు ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లు. ఏపీలో బీజేపీ బలోపేతానికి ఎటువంటి చర్యలూ ఈ మధ్యకాలంలో తీసుకోలేదన్నది జాతీయ పార్టీ భావనగా ఉంది.
ఓ సునామీగా మోడీ గాలి వీచినా కూడా దానిని సద్వినియోగం చేసుకోవడంలేదన్నది విమర్శ. అన్నింటికీ మించి పార్టీ ఇంకా నిస్తేజమైన పరిస్థితులలోనే ఉండడం హైకమాండ్‌ను బాధిస్తున్న అంశం. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా తగిన విధంగా ఉయోగించుకోలేకపోతున్నారని ఆగ్రహం కూడా ఉంది. హరిబాబు ఎంపీగా ఉండడం కూడా పార్టీ విస్తరణకు ఆటంకంగా భావిస్తున్నారు. ఆయన ఎక్కువ సమయం పార్టీకి సమయం వెచ్చించలేకపోతున్నారని అంటున్నారు. పైగా, ఆయన సామాజికవర్గానికి చెందిన టీడీపీ అధికారంలో ఉండడం వల్ల మొహమాటం కొద్దీ బీజేపీ విస్తరణకు అవకాశాలను కావాలనే వదిలేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో, హరిబాబు స్ధానంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలని అమిత్‌షా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన వీర్రాజుకు పార్టీ బాధ్యతలను అప్పగించడం ద్వారా ఆ వర్గం మన్నన పొందాలని కూడా చూస్తున్నారు. 2019 ఎన్నికల నాటికి బీజేపీ విస్తరణకు ఈ వర్గం బాగా ఉపయోగపడుతుందని ఊహిస్తున్నారు. ఇదే కనుక జరిగితే ఏపీ బీజేపీపై వెంకయ్య పట్టు సడలడం ఖాయమని అంటున్నారు. వేరే సామాజికవర్గం చేతులలో బీజేపీ ఉంటే టీడీపీ విధానాలను ప్రశ్నించడమే కాకుండా పార్టీ విస్తృతికి కూడా చర్యలు చేపట్టేందుకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయని భావిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే రానున్న రోజులో బీజేపీలో కీలకమైన మార్పులు సంభవించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆ స్వభావమే మైనస్
బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు సహజంగా మృదు స్వభావి. ఆయన వృత్తి రిత్యా ప్రొఫెసర్. ఏ అంశాన్నైనా కూలంకషంగా వివరించగలరు. ఆయన తరగతి గదులలో మాస్టర్‌గా బాగా రాణిస్తారు కానీ, రాజకీయాలలో మేధావులను మాత్రమే ఆకట్టుకోగలరు. మాస్‌ను ఆకట్టుకునే ప్రసంగాలను చేయలేరు. అదే ఆయనకు మైనస్‌గా ఉంది. అంతే కాదు, ఆయన దూకుడుగా రాజకీయాలు చేయలేరు. చాలా శాంతంగా ఉండడం ఆయన శైలి. ఇపుడు అదే ఇబ్బందికరంగా మారుతోంది. పార్టీలో ఎవరిని గట్టిగా మందలించలేని స్థితి. అలాగే, ఎవరినీ ఆదేశించకుండా తన పని తాను చేసుకుపోయే రకంగా హరిబాబు ఉంటారు. రాజకీయాలలో అవసరమైనపుడు కరకుగానూ ఉండాలి. మరి హరిబాబు విషయంలో అది కుదరడంలేదు. ఇక, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల విషయంలోనూ పెద్దగా సాధించింది కనిపించలేదు. ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ లోక్‌సభ నియోజకవర్గంలోనూ పార్టీని బలోపేతం చేయలేకపోయారన్న అపప్రధ ఉంది..
జీవీఎంసీ ఎన్నికలు రేపో మాపో అన్నట్లుగా ఉన్నాయి. తొలి నగర పాలక సంస్ధ ఎన్నికలలో జెండా పాతిన చరిత్ర బీజేపీది. ఇపుడు విశాఖ ఎంపీ స్ధానంతో పాటు, ఉత్తర నియోజకవర్గాన్ని కూడా ఆ పార్టీ కైవశం చేసుకుంది. ఈ క్రమంలో జీవీఎంసీ పరిథిలో ఉన్న 72 వార్డులలో పార్టీ కనీసం మూడవ వంతు సీట్లు అయినా గెలుచుకోకపోతే పరువు గంగలో కలుస్తుంది. అయినా కూడా పార్టీలో చైతన్యం లేదు. నిస్జేజమే తాండవిస్తోంది. సాక్షాత్తు అధ్యక్షుడే ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ పార్లమెంట్ పరిథిలో ఒక్క నేతను కూడా ఇతర పార్టీల నుంచి ఆకట్టుకోలేకపోయారు. స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలను సవ్యంగా నిర్వహించలేకపోయారు. మోడీ పథకాలను జనంలోకి తీసుకువెళ్లలేకపోయారు. కేడర్ ఉన్నా దిశానిర్దేశం చేసే నాధుడే లేడు. ఎవరికీ కనీసం నామినేటెడ్ పదవులు కూడా లేవు. దాంతో, ఆశ నిరాశలో ఉన్నారు.
వెంకయ్య హవా చెల్లినట్లేనా…
బీజేపీ అంటే వెంకయ్య, వెంకయ్య అంటే బీజేపీ అన్న పరిస్థితి విభజన తరువాత ఏపీలో ఉంది. అసలు వెంకయ్యనాయుడు మూడు దశాబ్దాల క్రితం అంటే 1985లో బీజేపీ అధ్యక్షునిగా ఉన్నప్పటి నుంచే పదమూడు జిల్లాల ఏపీలో పాగా వేశారు. తన సామాజికవర్గానికే పెద్ద పీట వేస్తూ పోయారు. అందులో అతి ముఖ్యుడు హరిబాబు. ఆంధ్రాయూనివర్శిటీలో అధ్యాపకునిగా ఉన్న హరిబాబును ఏరి కోరి పార్టీలో క్రియాశీలకంగా చేసింది వెంకయ్యే. ఎంతోమంది సీనియర్లు ఉన్నా ఆయనను ఏపీ అధ్యక్షున్ని చేశారు. 1999లో విశాఖ వన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించిన తరువాత ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో బీజేపీ పక్ష నాయకునిగా నియమించారు. ఇలా హరిబాబు ఎదుగుదల వెనుక వెంకయ్య కృషి ఎంతో ఉంది. అంతెందుకు గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్బంగా విశాఖ ఎంపీ సీటుకు ఎంతోమంది పోటీ పడినా కూడా హరిబాబుకు టిక్కెట్ ఇప్పించడమే కాదు, గెలుపు కోసం కూడా అహరహం వెంకయ్య శ్రమించారు.
టీడీపీ వెన్నుపోటు పొడవకుండా చంద్రబాబుతో తనకు ఉన్న దోస్తీని పూర్తిగా వినియోగించుకుని హరిబాబును గట్టెక్కించారు. అటువంటి వెంకయ్య మాట ఇపుడు బీజేపీలో చెల్లడంలేదా అనిపిస్తోంది పరిణామాలను చూస్తే. జాతీయ అధ్యక్షుడు అయ్యాక ఏపీలో ఓ పర్యాయం తిరిగిన అమిత్‌షాకు అన్ని విషయాలు బాగానే అవగతమయ్యాయి. అంతే కాదు, కుల సమీకరణలు, సామాజిక వర్గాల ఆధిపత్యం అన్నీ కూడా అవగాహనకు వచ్చాయి. అందుకే మెల్లగా కాంగ్రెస్ నుంచి ఆయనే స్వయంగా చాలామంది పెద్ద నాయకులను బీజేపీలోకి తీసుకున్నారు. అదీ వెంకయ్య, హరిబాబులకు తెలియకుండానే. ఇక్కడే వెంకయ్య హవాకు బ్రేకులు పడుతున్న ఛాయలు కనిపించాయి. వెంకయ్య లేకుండానే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వంటి వారిని నేరుగా ఢిల్లీకి పిలిపించుకుని అమిత్‌షా చేర్చుకున్నారు. ఈ క్రమంలో బలమైన కాపు సామాజికవర్గం అండను బీజేపీ కోరుతున్నట్లుగా స్పష్టమైన సంకేతాలను షా జనంలోకి పంపించారు. అదే సమయంలో పార్టీ విస్తరణ కోసం వెంకయ్య, హరిబాబు ఏమీ చేయలేకపోయారని కూడా స్పష్టం చేయగలిగారు.
గోదావరి జిల్లాలపై పట్టు కోసం..!
గోదావరి జిల్లాలపై పట్టు కోసం బీజేపీ యత్నిస్తోంది. అందుకోసమే పార్టీ కొత్త అధ్యక్షున్ని అక్కడ నుంచే తీసుకురావాలనుకుంటోంది. కాపు సామాజికవర్గానికి చెందిన బలమైన నాయకునిగా ఉన్న సోము వీర్రాజుకు బీజేపి పట్టం కట్టనుందని సమాచారం. ఇటీవలే ఎమ్మెల్సీ అయిన వీర్రాజుకు మాస్‌లో మంచి పట్టుంది. పదునైన విమర్శలు చేయడంలోనూ ఆయన ముందుంటారు. పైగా, పార్టీకి వీర విధేయుడు. టీడీపీతో సంబరధాల విషయంలో ఆయనకు ఎటువంటి మొహమాటాలూ లేవు. చాలా సార్లు ఆయిన ఒంటరిగా పోటీ చేస్తామంటూ ఇటీవల ప్రకటనలు కూడా చేశారు. అటువంటి నేతను ఏరీ కోరీ బీజేపీ అధ్యక్షున్ని చేయడం అంటే రానున్న రోజులలో టీడీపీతో తెంచుకోవడమేనా అన్న మాట కూడా వినిపిస్తోంది. బీజేపీ క్రీయాశీలం కావాలంటే ఏపీలో కులాల సమీకరణలు సరిచూసుకోవాలి. టీడీపీతో ఇప్పటికైతే ఏం లేదు కానీ, అవసరమైనపుడు అమీ తుమీకి సిద్దం కావాలి. వెంకయ్య, హరిబాబు తమ సామాజికవర్గానికి చెందిన టీడీపీపైన, ఆ పార్టీ అధినేత పైన ఇప్పటివరకూ కనీసమాత్రంగా కూడా స్పందించిన దాఖలాలు లేవు. నిజానికి వెంకయ్య బీజేపీ ఎదుగుదలకు అడ్డు అన్నది చాలామంది ఏపీ బీజేపీ నాయకుల భావన. ఆయన నీడలో నుంచి పార్టీని బయటకు తెస్తేనే మనగడ ఉంటుందన్నది కూడా వారి సూచన. ఈ నేపధ్యంలో సోము వీర్రాజును నియమించడం ద్వారా అమిత్ షా చాలా తెలివైన ఆటనే ఆడాలనుకుంటున్నారు. సెప్టెంబర్‌లో జరిగే పార్టీ సంస్ధాగత ఎన్నికల తరువాత బీజేపీకి కొత్త సారధి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అదే కనుక జరిగితే 2016తో రాజ్యసభ సభ్యత్వం ముగియనున్న వెంకయ్య భవతవ్యం కూడా డోలాయమానంలో పడుతుంది. ఇప్పటికే ప్రత్యేక హోదా హామీపై పలు రకాలుగా కుప్పిగెంతులు వేసి జనంలో నవ్వులపాలు అయిన వెంకయ్య ద్వారా ఇమేజ్ కోల్పోవడం కంటే కొత్త నాయకుని ద్వారా జనంలోకి రావాలనుకోవడం బీజేపీ తప్పు కాదు. రాజకీయాలంటే ఇలాగే ఉంటాయి మరి.
పివిఎస్‌ఎస్ ప్రసాద్,
విశాఖపట్నం,