జిల్లా హైకమాండ్ వ్యవస్ధ

వైసీపీ నూతన ప్రయోగం పార్టీ బలోపేతానికి కొత్త వ్యూహం విశాఖ జిల్లా నుంచే శ్రీకారం Advertisement వికేంద్రీకరణ దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఎక్కడో అధినాయకత్వం కూర్చుని రాష్ట్రవ్యాప్తంగా తీసుకున్న ఒకే అంశంపై అన్ని…

వైసీపీ నూతన ప్రయోగం
పార్టీ బలోపేతానికి కొత్త వ్యూహం
విశాఖ జిల్లా నుంచే శ్రీకారం

వికేంద్రీకరణ దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఎక్కడో అధినాయకత్వం కూర్చుని రాష్ట్రవ్యాప్తంగా తీసుకున్న ఒకే అంశంపై అన్ని జిల్లాలకు పనిచేయదన్న సత్యాన్ని కూడా గుర్తించింది. ఏ జిల్లా సమస్యలు ఆ జిల్లాలోనే చర్చించాలని,  ఆందోళనలు చేపట్టాలని కూడా తలపోస్తోంది. దీంతో, జిల్లా స్ధాయిలలో హైకమాండ్ అన్న కొత్త వ్యవస్ధను ఏర్పాటు చేస్తోంది.   జిల్లా హైకమాండ్‌ల ద్వారానే రానున్న రోజులలో ఆయా జిల్లాలలో పార్టీని బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. విభజన ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద జిల్లాగా ఉన్న విశాఖపట్నం నుంచే ఈ ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నారు.  విశాఖ జిల్లాలో వైసీపీని పటిష్టపరచేందుకు అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. కొత్త సంవత్సరంలో జీవీఎంసీ ఎన్నికలు ఉండడంతో పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలను చేపడుతున్నారు. విశాఖ నగరంలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా వైసీపీ కైవశం చేసుకోలేకపోయింది. దానికి తోడు వలసలు కూడా  పెరిగాయి. ఈ నేపథ్యంలో ఉన్న నాయకులను, కేడర్‌ను ఉత్సాహపరచడమే కాకుండా, వలసలను అరికట్టాలని వైసీపీ భావిస్తోంది. అలాగే జిల్లాలోని నాయకత్వానికి దిశా నిర్దేశం కూడా చేయడం ద్వారా అధినాయకత్వం ఆదేశాలను ఎప్పటికపుడు పాటించేలా చూడాలని కూడా చూస్తోంది.  

అధినాయకత్వానికి, జిల్లా కమిటీకి మధ్యన ఉన్న అంతరాన్ని బాగా తగ్గించడంతో పాటు, సమన్వయాన్ని సాధించాలని కూడా చూస్తోంది. ఇదిలా ఉండగా, వైసీపీ విషయానికి వస్తే, సమర్ధులైన నాయకులు ఉన్నప్పటికీ వారంతా స్తబ్దుగా ఉంటున్నారు, వైసీపీకి భవిష్యత్తు లేదని ఆలోచనే వారిని కలవరపరుస్తోంది. అయినా సరే పార్టీలో ఎందుకు ఉంటున్నారూ అంటే ప్రత్యర్ధి పార్టీలలో వారికి పోటీగా నాయకత్వం ఉండడం వల్లనే. ఈ ఒక్క కారణం వల్లనే వైసీపీలో నాయకులు కనిపిస్తున్నారు తప్ప, వారంతా మనస్పూర్తిగా కొనసాగడంలేదు. అ సంగతి అధినేత వైఎస్ జగన్‌కు కూడా తెలుసు. రాజకీయ సమీకరణలు మారితే ఇందులో చాలామంది జంప్ జిలానీలు అవుతారని కూడా నాయకత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో వారిలో ఆశలను నింపడం, పార్టీని వీడకుండా చూడడంపైనే వైసీపీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ క్రమంలోనే జిల్లా స్ధాయిలలో అధినాయకత్వం కమిటీలను ఏర్పాటుచేయాలన్న ఆలోచన చేస్తోంది. ఈ కమిటీలో అధినేత నిర్ణయించిన ముగ్గురు నాయకులు సభ్యులుగా ఉంటారు. వీరంతా నేరుగా అధినేతకు నిరంతరం సన్నిహితంగా ఉంటారు. అధినేత ఆలోచనలను, పార్టీ నిర్ణయించిన కార్యక్రమాలను జిల్లా స్ధాయిలో అమలుచేసేందుకు వీరు  కృషి చేస్తారు. 

అదే సమయంలో జిల్లా నాయకత్వానికి అవసరమైన సలహా, సూచనలు అందచేస్తారు. సరైన దిశలో నడిపించేందుకు యత్నిస్తారు. ఇంకోవైపు పార్టీలో నాయకులను క్రియాశీలం చేసేందుకు కూడా తగినచర్యలు తీసుకుంటారు.  పార్టీలో అసంతృప్తి స్వరాలు వినిపిస్తే వారికి నచ్చచెప్పి బుజ్జగించే పనిని కూడా వీరే చూస్తారు. అంతే కాదు, పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పార్టీకి పనికి వస్తారు అన్న కోణంలో నుంచి కూడా చూస్తారు. ఆలాంటి వారిని గుర్తించి తగిన బాధ్యతలను కూడా అప్పచెబుతారు. ఇంతే కాకుండా, ప్రత్యర్ధి పార్టీల పరిస్థితిని కూడా నిరంతరం వాకబు చేస్తూంటారు. వారి వ్యూహాలను  ఎప్పటికపుడు పసిగట్టి తదనుగుణంగా సమర్ధవంతమైన ప్రతి వ్యూహాలను రూపొందించుకోవడానికి కూడా ఈ కమిటీ ప్రయత్నిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే వైసీపీని పటిష్టం చేయడం ఒక్కటే కాకుండా, అధికార తెలుగుదేశంలోకి పోకుండా  వలసలను  నిరోధించడం, మంచి నాయకత్వాన్ని తయారుచేయడం, రానున్న రోజులలో పార్టీని దిగువ స్ధాయి నుంచి కూడా బలోపేతం చేయడం వంటి కీలకమైన బాధ్యతలతో ఈ కమిటీ రంగంలోకి దిగబోతోంది. ఈ మేరకు అధినాయకత్వం నుంచి జిల్లా నాయకత్వానికి  జిల్లా హైకమాండ్‌కు సంబంధించిన రూపు రేఖలపై సంకేతాలు అందినట్లుగా సమాచారం.

పార్టీకి ఆదరణ ఉంది కానీ…

నిజానికి వైసీపీకీ నగరంలో ఆదరణ బాగానే ఉంది, ఈ సత్యం ఈ నెల 5న వైఎస్ జగన్ కలెక్టరేట్ వద్ద నిర్వహించిన భారీ ధర్నాలో తేటతెల్లమైంది. నగరంలో ఉన్న మత్స్యకారులు, బడుగు, బలహీన వర్గాల ప్రజానీకం వైసీపీ వైపు చూస్తున్నారు. టీడీపీ సర్కార్ ఆరు నెలలలో చేసిన పనితీరు, నిలబెట్టుకోలేని హామీల పట్ల కూడా జనంలో నిరసన వ్యక్తమవుతోంది. అయితే, వారిని సర్కార్‌కు వ్యతిరేకంగా నడిపించే నాయకత్వమే వైసీపీలో కొరవడింది. పార్టీలో ఉన్న నాయకులు తమేకం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వీరంతా పార్ట్‌టైమ్ పాలిటిక్స్ కూడా చేయడం లేదు. ఫుల్‌టైమ్ వ్యాపారాలు చేసుకుంటున్నారు. అధినేత జగన్ వస్తే ఆ ఒక్క రోజు మాత్రం ఆయన కనుసన్నలలో ఉంటూ మిగిలిన రోజులన్నీ తమ సొంతానికే అన్నట్లుగా పనిచేసుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీని ముందుకు నడిపించే నాధుడు లేకనే వైసీపీ ప్రజానీకానికి దూరమవుతోంది. ఈ విషయాన్ని సరిగ్గానే అధినాయకత్వం గుర్తించింది. దానికి పరిష్కారంగానే జిల్లాలో హై కమాండ్ పేరుతో కమిటీలను వేయడానికి నిర్ణయించింది. ఈ ప్రయోగం ఎంత మేరకు విజయవంతమవుతుందన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది

జీవీఎంసీ ఎన్నికలకు వ్యూహం

జిల్లా హైకమాండ్ వ్యూహం కనుక ఫలితాలను ఇస్తే రానున్న జీవీఎంసీ ఎన్నికలలో వైసీపీకి విజయాలు దేక్క అవకాశాలు ఉంటాయి. ఎందుచేతనంటే వైసీపీకి ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వం బాగానే ఉంది. వారంతా కూడా కార్పొరేటర్ టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్నారు. వీరిని ఇప్పటి నుంచే రంగంలోకి దించడం, వార్డు సమస్యలపై జనానికి చేరువ కావడం వంటివి చేయడం ద్వారానే ఎన్నికలలో ఓట్లు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఆ పనిని ఇంతవరకూ వైసీపీ జిల్లా నాయకత్వం పెద్దగా చేసింది లేదు. సభ్యత్వ నమోదు కూడా తూతూ మంత్రంగానే సాగింది, ఇక, వార్డు కమిటీలు కూడా మొత్తం జీవీఎంసీ పరిథిలో పూర్తి కాలేదు. దీనికి ఆయా నియోజకవర్గాల నాయకుల ఉదాశీన వైఖరి కూడా ఓ కారణంగా చెప్పుకోవాలి. మొత్తం మీద చూసుకుంటే జీవీఎంసీ ఎన్నికలపై అధినేత జగన్ ఎంతగా దృష్టి పెట్టినా జిల్లా నాయకత్వం, నగర నాయకులు కదిలితే తప్ప ఆశించిన ఫలితాలు రావన్నది వాస్తవం. ఇపుడు జిల్లా హైకమాండ్‌ల ద్వారా ఆ పనిని పూర్తి చేయాలని జగన్ అనుకుంటున్నారు. ఓ విధంగా వారధిగా ఈ కమిటీ పనిచేస్తుందని చెబుతున్నారు. ఇప్పటికైతే జీవీఎంసీ పరిథిలో టీడీపీ, బీజేపీ కాంబినేషన్ పట్ల పెద్దగా వ్యతిరేకత లేదు, సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల కూడా జనం అనివార్యతగా ఈ కూటమి పట్ల ఉంటున్నారన్న దాంట్లోనూ నిజం ఉంది. వైసీపీ బలమైన ప్రత్యామ్నాయంగా బరిలో ఉంటే రాజకీయ సమీకరణలు పెద్ద ఎత్తున మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా సరైన సమయంలో సరైన నిర్ణయంగా ఈ జిల్లా హైకమాండ్‌లను పార్టీలోని మెజారిటీ నాయకులు భావిస్తున్నారు.

పివిఎస్‌ఎస్ ప్రసాద్,
విశాఖపట్నం,