మొన్నామధ్య తమిళనాడులో విజయ్ నటించిన ఓ సినిమాకి వ్యతిరేకంగా నానా గందరగోళం జరిగింది. ఆ సినిమా నిర్మాత, శ్రీలంకతో సంబంధాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో, సినిమాని బ్యాన్ చేయాలంటూ పెద్దయెత్తున ఉద్యమాలు జరిగాయి. ఆ తర్వాత ఎలాగో ఆ వివాదం సద్దుమణిగింది. శ్రీలంక అధ్యక్షుడు, తిరుపతి పర్యటనకు వస్తే.. తమిళనాడు నుంచి పెద్దయెత్తున ఆందోళనకారులు తరలివచ్చి చేసిన యాగీ అంతా ఇంతా కాదు.
అది గతం. ప్రస్తుతంలోకి వస్తే, అమీర్‌ఖాన్ నటించిన ‘పీకే’ సినిమాపై కొత్త వివాదం మొదలైంది. ఈ సినిమాకి పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ నుంచి నిథులు అందాయన్నది బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణ. ‘పీకే’ సినిమా నిర్మాణానికి సంబంధించి విషయాలన్నీ కూపీ లాగితే అసలు విషయం బయటపడ్తుందంటున్నారు సుబ్రహ్మణ్యస్వామి.
సుబ్రహ్మణ్యస్వామిని అంత తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదు. రాజకీయాల్లో ఆయనో వెరైటీ టైపు మనిషి. గతంలో సోనియాగాంధీపైనా అనేక ఆరోపణలు చేశారీయన. అంతెందుకు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తాజాగా మాజీ ఎందుకయ్యారో తెలుసు కదా.. అదీ సుబ్రహ్మణ్యస్వామి చలవే.
టూజీ స్ప్రెక్టమ్ కుంభకోణం విషయంలోనూ, ఇతరత్రా అనేక వివాదాల్లోనూ.. చెప్పుకుంటూ పోతే సుబ్రహ్మణ్యస్వామి వేలు పెట్టని వివాదమే లేదంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి సుబ్రహ్మణ్యస్వామి ‘పీకే’ సినిమాపై చేసిన ఆరోపణలు.. ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో ఏమో.!
అయినా, ఓ సినిమాకి విదేశాల నుంచి.. అందునా భారతదేశాన్ని అనునిత్యం రావణకాష్టంలా రగుల్చుతోన్న ఐఎస్‌ఐ ద్వారా నిధులు సమీకరించుకోవాల్సిన దుస్థితి పట్టిందని అనుకోగలమా.? ఆరోపణలకీ ఓ హద్దుండాలి. ఆ హద్దులు మీరి చేస్తోన్న ఆరోపణల్ని పట్టించుకోవాలో, పట్టించుకోకూడదో అర్థం కాని దుస్థితి నెలకొంది. అసలు మన సినిమాకి ఇదేం ఖర్మ.?