ఎంత పెద్ద హిట్ సినిమా అయినా పది పదిహేను రోజుల తరువాత చల్లబడుతుంది. అమీర్ ఖాన్ పికె సినిమా ఇందుకు అతీతమేమీ కాదు. కానీ ఇప్పుడు సోషల్ నెట్ వర్క్, హిందూ వాదుల పుణ్యమా అని ఆ సినిమా మళ్లీ మరో పదిరోజుల పాటు కలెక్షన్లు దున్నేసేలా వుంది. సినిమా విడుదలైన వెంటనే ఆహా..ఓహో..అన్నమాటలు తప్ప వేరు వినపడలేదు.
మెలమెల్లగా సోషల్ నెట్ వర్క్ లో కొందరు హిందు మత అభిమానులు తమ తమ అసంతృప్తి వక్తం చేయడం మెలమెల్లగా ప్రారంభమైంది. అప్పుడు కూడా పెద్దగా గొంతులువినిపించలేదు. కానీ ఇప్పుడు కలెక్షన్లు దున్నేసుకుని, సీన్ చల్లబడిన సమయంలో గొంతులు లేవడం చిత్రంగా వుంది.
ఈ గొంతులు ఇప్పుడు సినిమాను బ్యాన్ చేయాలనే స్థాయికి వెళ్లాయి. నిజానికి ఇలాంటి స్వామీజీలు, సెటైర్లు మన సినిమాల్లో సర్వ సాధారణం. జనాలు కూడా పెద్దగా పట్టించుకోవడం మానేసారు. కానీ ఎటొచ్చీ అమీర్ ఖాన్ సినిమా కావడం, ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లలలో సంచలనాలు నమోదు చేయడం వల్ల అందరి దృష్టి దానిపై పడింది.
నిజానికి నిరసన తెలిపేవారు ఆదిలోనే తెలిపితే వేరుగావుండేదేమో. ఇప్పుడు గొంతు విప్పడంవల్ల సినిమాకు పరోక్షంగా లాభమే కానీ నష్టం కాదు. తగ్గుతున్న కలెక్షన్లు పుంజుకుని, సినిమా మరిన్ని రికార్డులు సాధిస్తుంది. చూడని వారుకూడా చూసి, హిందూ మత వ్యతిరేకం అనేది ఏదయినా సినిమాలో కనుక వుంటే, మరింత ప్రాచుర్యంపొందుతుంది. అవసరమా ఇదంతా?