ఎమ్బీయస్‌ కథలు: ఏ గూటి చిలక…

'ఏ గూటి చిలక ఆ పలుకే పలుకుతుందంటారు… రేదర్‌… పలకాలి కాబోసు' అనుకొంది హేమ. 'ఒక్కొక్క జాతి రూపవిలాసాల గురించి, వేషభాషల గురించి సాధారణంగా అందరూ ఎలా అనుకొంటూంటారో అలా ఉంటేనే జీవితం సజావుగా…

'ఏ గూటి చిలక ఆ పలుకే పలుకుతుందంటారు… రేదర్‌… పలకాలి కాబోసు' అనుకొంది హేమ. 'ఒక్కొక్క జాతి రూపవిలాసాల గురించి, వేషభాషల గురించి సాధారణంగా అందరూ ఎలా అనుకొంటూంటారో అలా ఉంటేనే జీవితం సజావుగా సాగిపోతుంది' అనుకొందామె.

'ఒకసారి ఏదో ఇంటర్వ్యూ కోసం బొంబాయి వెళ్లింది తను. ఓ ఢిల్లీవాలా మద్రాసీలనందర్నీ పట్టుకు తిట్టిపోసాడు తనదగ్గిర. భరించినంత సేపు భరించి చివరకు తను తెలుగుదాన్నని చెప్పింది. తెల్లబోయాడు. ''నీ ఒంటి తెలుపూ, నీ హిందీ ఉచ్ఛారణా చూస్తే నార్త్‌ ఇండియన్లా ఉన్నావ్‌!'' అన్నాడు. ''నా పద్ధతే అంత. దేన్నైనా త్వరగా అనుకరించగలను. హిందీ, ఇంగ్లీషు అనేకాదు, మా రాష్ట్రంలో ఏ జిల్లా వాళ్లతో వాళ్లలాగే మాట్లాడగలను'' అంది తను గొప్పగా. ఆయన సంతోషించలేదు. 'ఈ టీవీలొచ్చి ప్రతివాళ్లకీ హిందీ వచ్చేసింది. ఎవరెవరో తెలుసుకోలేకపోతున్నాం' అని విసుక్కున్నాడు.

తనాఫీసులో రెడ్డీ అంతే. అయోధ్య గొడవల్లో ఓసారి వచ్చి విరాళం ఇమ్మన్నాడు. 'ఈ మైనారిటీలకందరికీ బుద్ధివచ్చేట్లా చెయ్యాలంటే కొన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిందే. ఖర్చు చాలానే అవుతుంది. వాలంటీర్ల భోజనాలకీ వాటికీ…'' అన్నాడు.

తను నవ్వుతూనే ''మైనారిటీల దగ్గరే మైనారిటీలను తిడుతూ చందా లడుగుతారేమిటండీ బాబూ'' అంది.

''భలేవారండోయ్‌, ఆడవాళ్లు ఆఫీసులోనే మైనారిటీ, బయట ప్రపంచంలో…''

''ఆడదాన్నని కాదు. మేం క్రిస్టియన్స్‌ గదా…''

అతను కోప్పడబోయేడు. ''మన హిందూస్‌కేనండీ, ఈ సెక్యులర్‌ భావాలు. నాది విశ్వమతం, గాడిదగుడ్డూ అంటూ! మిగతావాళ్లని చూడండి…''

''రెడ్డిగారూ, కాస్త వినిపించుకోండి. మన హిందూస్‌ అని కలుపుకోకండి, నేను క్రిస్టియన్ని''

అతను ఆగి, ''నిజంగానా? మరి క్రాసూ అదీ వేసుకోరేం? బొట్టు కూడా పెట్టుకుంటారు'' అన్నాడు ముఖం చిట్లించి ''జోక్‌ చేయటం లేదు కదా'' అన్నాడు కూడా సందేహిస్తూనే.

''క్రాసూ, బొట్టూ… అవన్నీ నా యిష్టం. హిందువుల్లో మాత్రం ఎంతమంది విబూది పెట్టుకుంటున్నారు?'' అంది తను నవ్వు చెదరనీయకుండా.

అతను ముఖం గంటు పెట్టుకుని వెళ్లిపోయాడు. తనకు జాలివేసింది. నిజానికి రెడ్డి చాలా మంచివాడు. ఉపకారస్తుడు. తనెవరు, ఏమిటి అని ఎప్పుడూ అడక్కుండానే అనేకసార్లు సాయం చేసాడు. అనుకోకుండా ఇవాళ అతని మైనారిటీ వ్యతిరేక భావం బయటపడేసరికి సిగ్గుపడ్డాడు లాగుంది. లంచ్‌టైములో ప్రత్యేకంగా వచ్చి కూచున్నాడు.

''భలే షాకిచ్చారండీ హేమగారూ, నిజానికి మైనారిటీలంటే నా ఉద్దేశ్యం ముస్లిమ్స్‌ అనే. అదీ ఇప్పటివాళ్ల గురించి కాదు. గజనీ మహమ్మదు లాటి వాళ్ల విూద ఒళ్లు మంట. వాళ్లు చేసిన తప్పులు సరిచేయడానికే అయోధ్యలో గుడి కట్టాలనడం. విూరేవిూ అఫెండ్‌ కాలేదు కదా'' అన్నాడు.

''దానిదేముంది లెండి? ఎవరి అభిప్రాయాలు వారివి. వారి పాత ఘాతుకాల విూద విూకు మంట, అగ్రవర్ణాల వారు గతంలో చలాయించిన దాష్టీకం అంటే దళితులకు మంట. దళితులంటే బీసీలకు మంట… నాకే మంటలు లేవు సుమండి. నా బతుకేదో నేను బతుకుతాను.''

''అదీ మంచిదేలెండి. అవునూ, విూ నాన్నగారు కన్వర్ట్‌ అయ్యారా? విూరు… అసలు… ఒరిజినల్‌గా…'' మాటలు నానుస్తున్నాడు రెడ్డి.

తను చిరునవ్వు నవ్వింది. ''విూరడగాలనుకొంటున్నది నాకు తెలుసు. నేను రిజర్వ్‌డ్‌ కాండిడేట్‌ని'' అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది.

అతను నమ్మలేనట్టు చూసాడు. ''నిజమా? యూ విూన్‌… విూరు… హరిజన్‌… అదే… దళిత్‌… బహుజన్‌…'' మర్యాదగా ఎలా అనాలో తెలీక మాటలు వెతుక్కుంటున్నాడు.

తన స్థిమితం చెదరనివ్వలేదు. ''విూరు మాల, మాదిగ అన్నా ఫర్వాలేదు. నా గౌరవం నాకుంది'' అంది అతనికి సహాయ పడుతూ.

''అబ్బే దాని గురించి కాదు. మిమ్మల్ని చూస్తే అలా అనిపించదు. మాట కూడా రిఫైన్డ్‌… పని కూడా బాగా చేస్తారు… గవర్నమెంటువారి దత్తపుత్రుల్లా ఎప్పుడూ బిహేవ్‌ చేయరు…'' అంటూ గొణుక్కుంటున్నాడు రెడ్డి.

''అందుచేత ఇప్పటికైనా జనరలైజ్‌ చేయడం మానేస్తే మంచిదేమో. జాబ్‌ సెక్యూరిటీ అందరికీ ఉంది, కాస్త ఎక్కువ, తక్కువగా… పనిచేసేవాళ్లూ, చేయనివాళ్లూ అందర్లోనో ఉన్నారు. అవునా?'' అంది తను.

రెడ్డి ఆశ్చర్యంలోంచి బయటకు రావటం లేదు. ''స్టిల్‌… విూరు… విూరు…'' అంటున్నాడు తల విదిలిస్తూ.

ఈ 'స్టిల్‌'..లూ, 'ఈవెన్‌దో'లూ తను చిన్నప్పటి నుంచి వింటూనే ఉంది. స్కూల్లో కాలేజీలో తనతో స్నేహం కట్టిన అగ్రవర్ణాల పిల్లలందరూ వాడే మాటలే ఇది. తన గురించి ఏ పొగడ్తయినా సరే, 'దో షీ యీజ్‌…' తో మొదలయేది. తను చూడముచ్చటగా శుభ్రంగా నాగరికంగా ఉండటం వల్ల తనతో మసలుతూ వాళ్లకు సంకుచిత భావాలు లేవని వాళ్లకు వాళ్లే నచ్చచెప్పుకుంటూండేవారు. కానీ మంగి అత్తయ్య కూతురు కూడా తన క్లాసే అయినా తమలో కలుపుకొనేవారు కాదు. ఎందుకంటే అది 'స్వజాతి పక్షి'లాగే ఉండేది కాబట్టి'!

దాని కారణంగా వాళ్లన్నయ్యకు తన విూద అక్కసు. ''ఆ కమ్మోరి పిల్లలతో కలిసి తిరిగినంత మాత్రాన నువ్వు గొప్పదానివైపోవు. వాళ్లు నిన్ను తమలో కలుపుకోరు తెలుసుకో'' అనేవాడు.

''కలుపుకుంటానన్నా నే వద్దంటాను. నాకేం తక్కువని?'' అంది తను.

''మరింకేం? మనవాళ్లతోనే తిరగొచ్చుగా''

''నాకంటికెవరు నచ్చితే వాళ్లతో తిరుగుతాను, నీకెందుకు బాధ?''

''ఎవరితో తిరిగినా పెళ్లికాడి కొచ్చేసరికి మన గూటికే చేరతావు కాబట్టి ముందుజాగ్రత్తగా చెబుతున్నా''

*************

అవును స్నేహం వేరు, పెళ్లిళ్ల విషయం వేరు. శాస్త్రి అనుభవంతో అది తనకు తెలిసివచ్చింది. ఈ ఊరికి ట్రాన్స్‌ఫర్‌ అయి వచ్చాక అతనితో పరిచయం అయింది. సీనియర్‌ కొలీగ్‌గా పని బాగా నేర్పించాడు. ఆత్మీయంగా మసిలేవాడు. తన కష్టం, సుఖం చెప్పుకొనేవాడు. ''మా చెల్లెలి పెళ్లి చేసేయగానే నేనూ పెళ్లి చేసుకొంటానండీ'' అంటూండేవాడు హుషారుగా. 'ఆ టైము వచ్చినప్పుడు ప్రపోజ్‌ చేస్తాడా' అని ఊహించడం తమాషాగా ఉండేది.

ఒకరోజు ఏదో మాట్లాడుతూ 'భలే నియోగికం ప్రదర్శించారే! కొంపదీసి మీరు నియోగులా?' అన్నాడు. తన కర్థం కాలేదు. అతను ఆశ్చర్యంగా చూసి, ''విూరు…'' అని ఆర్ధోక్తిలో ఆగిపోయేడు. తను సంగతి గ్రహించింది. చెప్పాల్సిన సమయం వచ్చిందనిపించింది – ''మేము నాన్‌ బ్రాహ్మన్సండి'' అంది. ఎందుకోగానీ రెడ్డికి చెప్పిన వివరాలు చెప్పాలనిపించలేదు. శాస్త్రి దూరమయిపోతాడన్న భయమా?

అసలతనికి తనపై ఏదైనా అభిప్రాయం ఉందో లేదో? తను వాళ్ల కులం కాదని తెలియగానే అతను పడిన నిరాశ అలాటి అభిప్రాయం ఉందనే నిరూపించింది. రెండు రోజుల వరకూ సరిగ్గా మాట్లాడ లేకపోయాడు.

అతనెప్పుడూ తన వివరాలు స్పష్టంగా అడగలేదు. తన తీరు చూసి ఆశలు పెట్టుకున్నాడు లాగుంది. జాలివేసింది. తన ఆటంకాలను అధిగమించే ధైర్యం అతనికి వుంటే బాగుండుననిపించింది. శాఖాంతరం కూడా చేసుకోలేని పిరికితనాన్ని అర్థం చేసుకోగలిగింది. తమలో మాత్రం ఎక్కువ, తక్కువలు లేవూ? తను మాత్రం తల్లిదండ్రుల అభీష్టాన్ని తోసిరాజనగలదా?'

శాస్త్రి మూడు రోజుల్లో సర్దుకున్నాడు. ఎప్పటిలాగానే ఉన్నాడు. హేమకూడా 'హమ్మయ్య' అనుకొంది స్నేహం చెడనందుకు. కానీ ఆమెకు తెలీదు – అతను కాకపోయినా ఆఫీసులో తక్కిన వారందరూ త్వరలోనే శత్రువులు కాబోతున్నారని.

ప్రమోషన్‌ పరీక్షకు ఎలిజిబిలిటీ ఉన్నవారి జాబితాలో ఆమె పేరుండడంతో వచ్చింది గొడవ. తక్కిన వారందరికీ పదేళ్ల సర్వీసుంటేనే గాని రాని ఛాన్సు ఆమెకు నాలుగేళ్లకే రావడంతో ఆమె రిజర్వ్‌డ్‌ కాండిడేట్‌ అన్న సంగతి అందరికీ తెలిసింది. ఆఫీసులో ఆమెలాటివారు తక్కిన ముగ్గురి విషయంలో అందరూ సిద్ధపడే వున్నారు. కానీ వాళ్ల ఊహకందని విధంగా తనూ అలాటి కాండిడేట్‌ అని హఠాత్తుగా తెలియడంతో వాళ్లంతా ఖంగుతిన్నారు. ఆమె కావాలని వారిని నమ్మకద్రోహం చేసినట్టు ఫీలయ్యేరు.

ఆరోజు మధ్యాహ్నం కాంటీనులో సుశీల కోటాల విూద ధ్వజం ఎత్తింది తనెదురుగానే. అవన్నీ పోవాలంది.

''ఎంపీ కోటాలో ఫోన్లు, ఎమ్మెల్యే కోటాలో గ్యాసు కనెక్షన్లూ, అదర్‌స్టేట్స్‌ కోటాలో పిల్లలకు మెడిసిన్‌ సీట్లు, డిఫెన్స్‌ కోటాలో ఫ్రిజ్‌లు అడిగేవారు కూడా కోటాలు పోవాలంటే ఎలాగండీ?'' అంది హేమ.

సుశీల పళ్లు నూరుకుంది. ఆ అమ్మాయి ఎప్పుడూ అంతే. నోటికి ఎంత పడితే అంత అనేస్తుంది. ఓ సారి లక్ష్మి అనే అమ్మాయిని పట్టుకుని 'విూకు డబ్బు లేదంటావు, నీ పేరు చూస్తే లక్ష్మి!' అని ఎద్దేవా చేసింది. ఆ అమ్మాయికి కళ్లనీళ్ల పర్యంతం అయింది. అప్పుడు హేమ అక్కడే ఉంది.

 ''ఎవరికేది లేకపోతే ఆ పేరు పెట్టుకొంటారండీ, సుశీలగారూ'' అంది, 'శీల' నొక్కుతూ. అలాటి మొట్టికాయలు పడినా సుశీల స్వభావం మారలేదు.

సుశీలకు సమాధానం చెప్పినా ఆ రాత్రి హేమ బాధపడింది – 'నిజానికి తనకు ప్రమోషన్‌ అక్కర్లేదు. తనకొచ్చిన ఛాన్సు ఉపయోగించబోవటమూ లేదు. అయినా మిగిలినవాళ్లందరూ 'యూ టూ బ్రూటస్‌' అని చూడడం భరించశక్యంగా లేదు. తన తప్పేమైనా ఉందా దీనిలో? తననెవరూ పనిగట్టుకుని అడగలేదు, తనూ చెప్పలేదు. తన కులం గురించి వాళ్లిష్టం వచ్చినట్లు ఊహించుకుని, ఇప్పుడు తనే ద్రోహం చేసినట్టు చూడడం అన్యాయం. అయినా ఒక కులం వారందరూ ఒకలాగే ఉండాలా? ఉంటారా?'

కొలీగ్స్‌ విూద కొన్నాళ్లు మనస్సులోనే కోప్పడింది హేమ, తర్వాత జాలిపడింది. ఇంకొక్క వారం పోతే మర్చిపోయేదేమో కూడా – సుశీల మళ్లీ అక్కసు ప్రదర్శించి ఉండకపోతే…

****************

సుశీల అవేళ లంచ్‌టైములో హేమను పట్టించింది – ''విూదే ఊరు? అమ్మా నాన్నా ఏం చేస్తారు?'' అంటూ. మనసులో శంకిస్తూనే హేమ జవాబులు చెప్తోంది. కాస్సేపటికి సుశీల అమాయకంగా మొహం పెట్టి ''అవునూ, విూ వాళ్లలో సాధారణంగా ఇంత తెల్లగా ఉండరు కదా, విూ అమ్మగారు మా వాళ్లు  ఎవరింట్లోనైనా పనిచేసేవారా?'' అని అడిగింది.

అందరూ తెల్లబోయేరు. సుశీలకేసి, హేమకేసి ముఖాలు మార్చి, మార్చి చూశారు. హేమకు కళ్లు తిరగబోయేయి. తమాయించుకుని, ''అది సరే సుశీలగారూ, విూవాళ్లు సాధారణంగా తెల్లగా ఉంటారుకదా విూ రంగేమిటి, ఇలా ఉంది? మా మగాళ్లెవరైనా విూ ఇంట్లో పాలేరుగా పనిచేసారా?'' అంది.

అందరూ గొల్లుమన్నారు. కొంతమంది బల్లలు చరిచారు. సుశీల ఛట్టున లేచి వెళ్లిపోయింది. హేమ సమయస్ఫూర్తికి అందరూ వచ్చి ఆమెను అభినందించారు. దళిత్‌ యూనియన్‌ పెడుతున్నాం నువ్వు లీడరు కాకూడదూ అన్నారు కొందరు. సుశీల లాటివాళ్లకు బుద్ధి చెప్పాలంటే దళిత ఉద్యమంలో చేరాల్సిందే అనుకొంది హేమ – ఆ రాత్రి శుభ స్త్రీవాదం గురించి ప్రస్తావించే వరకూ…

శుభ ఆమె హాస్టలు రూమ్మేటు. ఆ రాత్రి హాస్టల్‌ రూములో సుశీల ఉదంతం తను చెప్తూంటే ఆమె క్యూరియస్‌గా వింది. రాధా, పద్మా మాత్రం పడిపడి నవ్వేరు. ''నీకు అంత అప్రయత్నంగా భలే అయిడియా వచ్చిందే!'' అని మెచ్చుకున్నారు. 

''ఇలాటిదే ఓ జోకు చదివేనులే. ఛట్టున అది గుర్తొచ్చింది. దెబ్బకి సుశీల నోరు మూసింది' అంది హేమ మురిసిపోతూ.

కానీ శుభ మాత్రం ముఖం చిట్లించింది. ''నువ్వు సుశీల విూద గెలిచినా, సుశీల నీ మీద గెలిచినా, ఇద్దరూ కలిసి ఆడవాళ్ల గురించి హీనంగా మాట్లాడారు'' అంది.

''అదేమిటి?'' అంది హేమ.

''అవును మరి. విూ ఇద్దరి మాటల్లోనూ తొంగిచూసేది ఒక్కటే అర్థం. ఆడది చెడిపోతే కుటుంబానికి అప్రతిష్ట. అదే ఇంటి మగవాడు పక్కింటి ఆడదాన్ని చెడగొడితే గర్వించదగిన విషయం…''

''నా ఉద్దేశం…''

''…చిన్నప్పుడు చూసేదాన్ని – నీళ్ల పంపు దగ్గిర ఆడాళ్లు కొట్టుకొనేవాళ్లు. 'నిన్ను నా మొగుడి పక్కలో పడుక్కోబెడతానే' అంటూ అరుచుకునేవారు. అవతలి ఆడదాని విూద కసే కానీ తనకు జరిగే నష్టం ఆలోచించని అవివేకులు వాళ్లు. ఇంత చదివినా విూరు అదే చేస్తున్నారు. అదే నా బాధ. కాలేజీల్లో, ఆఫీసుల్లో రిజర్వేషన్ల వల్ల దళితుల స్థితి ఎప్పటికో అప్పటికి మెరుగుపడవచ్చు. ఇక సాంఘిక గౌరవం అంటావా, వెనక్కాల ఏం తిట్టుకున్నా, ముఖం మీద మాత్రం గౌరవం ప్రదర్శిస్తారు.

''కానీ ఆడవాళ్ల స్థితి మాత్రం మెరుగుపడడం కష్టం. ఆడవాళ్ల సామర్థ్యం గురించి తక్కిన ఆడవాళ్లకే చిన్నచూపు ఉండడం సరే, భాష కూడా చూడు. సామెతల్లో, జోక్స్‌లో, తిట్లలో… అన్నీ ఆడదానికి వ్యతిరేకమైన భావాలే. అవే మన ఆడవాళ్లం కూడా వాడుతున్నాం, ఎంజాయ్‌ చేస్తున్నామంటే, అంతకంటే దురదృష్టకరమైన విషయం ఏముంది చెప్పు?''

హేమ తలవంచుకుంది. ఆ రోజునుండే ఆమె ప్రతీ విషయాన్ని ఫెమినిజం కోణం నుండి చూడడం అలవాటు చేసుకుంది. (రచన 1999 లో ప్రచురితం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]