కొత్త ఏడాదిలో కలసిమెలసి ముందుకు…

2013లో సరిగ్గా ఈ టైమ్‌కి 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ వుండగా, పాత పేరుతో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్, 10 జిల్లాలతో తెలంగాణ రాష్ర్టం ఇపడు కొత్తగా ఉనికిలోకి వచ్చాయి. 2014 తెలంగాణ సాధన సంవత్సరం.…

2013లో సరిగ్గా ఈ టైమ్‌కి 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ వుండగా, పాత పేరుతో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్, 10 జిల్లాలతో తెలంగాణ రాష్ర్టం ఇపడు కొత్తగా ఉనికిలోకి వచ్చాయి. 2014 తెలంగాణ సాధన సంవత్సరం. ఆ రకంగా, తెలంగాణ ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేరి, ఆనందోత్సాహాలతో ఈ ఏడాది ముగింపు వేడుకల్ని జరుపుకోనున్నారు. ఆరు దశాబ్దాల కల నెరవేరింది.. ఈ ఆరు దశాబ్దాల్లో అనేకమార్లు ప్రత్యేక రాష్ర్ట కాంక్ష ప్రజల్లో గట్టిగా రగిలింది.. ఉద్యమం ఎలాగైతేనేం లక్ష్యాన్ని ముద్దాడింది.. 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఆవిర్భవించింది. తమ ఆకాంక్షల్ని నెరవేర్చిన తెలంగాణ రాష్ర్ట సమితికి తెలంగాణ ప్రజలు పట్టంకట్టారు. ఉద్యమ నినాదంతో పార్టీ పెట్టిన తెలంగాణ రాష్ర్ట సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి పీఠమెక్కారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లుగా సెంటిమెంట్‌ని వీడకుండా కేసీఆర్ పరిపాలన చేపడ్తున్నారు.

ఇక, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి మద్రాస్ రాష్ర్టం నుంచి విడిపోయేటపడు ఎలాగైతే రాజధాని లేకుండా కట్టుగుడ్డలతో మిగిలిపోయారో, ఇపడూ దాదాపు అదే పరిస్థితి. రాజధాని లేక, లోటుబడ్జెట్‌తో ఏర్పడింది కొత్త రాష్ర్టం పాత పేరుతో.. అదే ఆంధ్రప్రదేశ్. తాము కోరుకోని విభజనను బలవంతంగా తమ మీద రుద్దించుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డంతో కొంత ఆవేదన చెందినా, ఆ ఆవేదనను అదిమిపట్టి, అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలన్న సత్సంకల్పం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో కన్పిస్తోంది. విభజన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ కూడా భాగమే అయినప్పటికీ, ‘అనుభవం’ కోణంలో, ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అధికారం అప్పగించారు. తొమ్మిదేళ్ళ తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవకాశం దక్కించుకున్నారు. అయితే 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి ఒకపడు చంద్రబాబు ముఖ్యమైతే, ఇపడాయన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి. ప్రజల అంచనాలకు తగ్గట్టుగా చంద్రబాబు పరిపాలన సాగుతోందా.? అంటే ఔనని చెప్పలేని పరిస్థితి. లోటు బడ్జెట్ కారణంగా నెలకొన్న ఆర్థిక సమస్యలు ఓ కారణం, రాజధాని లేకపోవడం ఇంకో కారణం.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడి ఆరు నెలల కాలం దాటింది. రాజకీయ వివాదాలు ఇంకా అలానే వున్నాయి రెండు రాష్ట్రాల మధ్యా. అయితే, అదృష్టవశాత్తూ తెలుగు ప్రజల ఐకమత్యం అలానే కొనసాగుతోంది. దురదృష్టవశాత్తూ వీలు చిక్కినపడల్లా విద్యుత్ విషయంలోనో, నీటి విషయంలోనో, ఇంకో విషయంలోనో ఇరు రాష్ట్రాల మధ్యా రాజకీయ వివాదాలు తెరపైకి వస్తూనే వున్నాయి. విభజన క్రమంలో ఇరు రాష్ట్రాలకూ అప్పటి కేంద్ర ప్రభుత్వం (మన్మోహన్ సర్కార్) అనేక హామీలు గుప్పించింది. గడచిన ఆర్నెళ్ళల్లో ఆ హామీల్లో ఒకటీ అరా తప్పితే, సగం హామీలు కూడా నెరవేరని పరిస్థితి. నెరవేరిన హామీలు (పోలవరం ముంపు మండలాల బదలాయింపు లాంటివి) ఇంకా వివాదాస్పదమవుతూ, ఇరు రాష్ట్రాల మధ్యా రాజకీయ వాతావరణాన్ని గందరగోళంలో పడేస్తుండడం బాధాకరం.

గత ఏడాది ఒకే రాష్ర్టంలో ఏడాది ముగింపు వేడుకలు.. కొత్త ఏడాదికి స్వాగతం పలికే వేడుకలు కలిసి జరుపుకున్న తెలుగు ప్రజలు, రెండు రాష్ట్రాల్లో ఈసారి ఆ వేడుకల్ని జరుపుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ‘రాష్ట్రాలుగా విడిపోయినా మేమంతా కలిసే వున్నాం..’ అని తెలుగు ప్రజలు పలు సందర్భాల్లో నిరూపించారు. ఆంధ్రప్రదేశ్‌లో తుపాను వస్తే, బాధితుల్ని ఆదుకునేందుకు తెలంగాణ ప్రజానీకం ముందుకొచ్చారు. తెలంగాణలో రైలు ప్రమాదం జరిగి, చిన్నారులు బలైపోతే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరూ తల్లడిల్లిపోయారు. ప్రజల మధ్య ఎలాంటి వైషమ్యాలూ లేవుగానీ, రాజకీయాలు ఊరకనే వుండవు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదులు చేయడం ద్వారా చిన్న చిన్న సమస్యల్ని జఠిలం చేసుకుంటున్నాయి. ఇరువురు ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని, చర్చించుకుంటే పరిష్కారమయ్యే సమస్యలు, బేషజాల కారణంగా పెరిగిపోతుండడం అత్యంత దురదృష్టకరమైన విషయం.

గత ఏడాది చేదు ఘటనల్ని మర్చిపోయి, కొత్త ఏడాదిలోకి కొత్త ఉత్సాహంగా అడుగులు వేయనున్న తెలుగు రాష్ట్రాలు, కొత్త ఏడాదిలో అయినా, బేషజాల్ని పక్కన పెడితే, ఇరు రాష్ట్రాలకూ మేలు జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పాలకులు, ఎంపీలు ‘మేం తెలుగువారం.. మేమంతా ఒక్కటే’ అన్న నినాదంతో కలిసిమెలిసి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురాగలిగితే, విభజన చట్టంలో ప్రస్తావించబడిన అన్ని అంశాలకూ మార్గం సుగమం అవుతుంది. ప్రత్యేక హోదా, ప్యాకేజీలు, రాయితీలు వంటి అంశాల్లో.. తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగాలంటే, తెలుగువారంతా ఒక్కటిగా జాతీయ స్థాయిలో తమ వాణిని వినిపించాల్సి వుంది. కొత్త ఏడాది కొత్త బడ్జెట్‌లో ఆయా రాష్ట్రాలకు జరగాల్సిన కేటాయింపులైనా, రైల్వే ప్రాజెక్టులూ, ఇతరత్రా అంశాలైనా.. అన్నిట్లోనూ ‘కలిసికట్టుగా’ ఓ అవగాహనకు ఇరు రాష్ట్రాలూ రావాల్సి వుంది. ‘విడిపోయి కలిసే వుందాం.. రాష్ట్రాలుగా విడిపోయి, అన్నదమ్ముల్లా కలిసి వుందాం..’ అనే నినాదాలు విభజన ఉద్యమంలో విన్పించిన దరిమిలా, ఆ దిశగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి ముందడుగు వేస్తే, మొత్తంగా తెలుగు జాతి, అభివృద్ధి పథాన దూసుకుపోతుంది.

విడిపోయి బలహీనపడ్డాం.. అనే పరిస్థితికి తెలుగుజాతికి రాకుండా వుండాలంటే, అది ఇరు రాష్ట్రాల్లోని పాలకుల చేతిలోనే వుంది. బేషజాలు నష్టాన్ని తెస్తాయి తప్ప, ప్రయోజనం లేదన్న విషయాన్ని ఇరు రాష్ట్రాలూ గుర్తిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాలకూ, భవిష్యత్ అద్బుతంగా వుంటుంది. ఆ దిశగా 2015లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ‘మైత్రి’ చిగురిస్తుందని ఆశిద్దాం.. ఆకాంక్షిద్దాం.!

-వెంకట్ ఆరికట్ల