నిజమే. దేశంలో బీజేపీ అప్రతిహతంగా దూసుకు పోతోంది. మోడీ ‘రేటింగ్స్’ నానాటికీ పెరిగిపోతున్నాయి. నేడు మోడీకి సరిసమానమైన నేత ఏ ఇతర పార్టీలోనూ లేరు; కడకు బీజేపీలోనే లేరు. ఆయన ప్రధాని పీఠం ఎక్కి, ఆరునెలలుగా గడిచినా ఎక్కడా ‘వన్నె’ తగ్గలేదు. విజయం తర్వాత విజయం వరిస్తూనే వుంది. దేశంలో కాషాయ శ్రేణులు సంబరాలు జరుపుకోవటానికి, కనీసం నెలకో కారణం కనిపిస్తోంది. రాష్ర్టం తర్వాత రాష్ర్టం ఎన్నికలు జరగటమూ, ఆ ఎన్నికలలో బీజేపీ విజయ ఢంకా మోగించటమూ సర్వసాధారణమయి పోయింది. ఒక రకంగా చెప్పాలంటే మోడీ నాయకత్వంలోని బీజేపీకి గత ఆరు నెలలుగా గెలుపు అనేది అలవాటుగా మారిపోయింది.
సార్వత్రిక (2014) ఎన్నికల తర్వాత బీజేపీ మూడు దఫాలుగా ఎన్నికల సమరంలోకి దూకింది. ఒకటి: ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, కర్ణాటకలలో ప్రధానంగా అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలు రెండు: హర్యానా, మహరాష్ర్టలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు. మూడు: ఇప్పుడు జరిగిన జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు.
ఈ మూడు పరీక్షల్లోనూ, మొదటి పరీక్షలో పరాజయం చవిచూసింది. ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ, బీహార్‌లో నితిష్ కుమార్ సారధ్యంలోని జనతా దళ్ (యు), లాలూప్రసాద్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్లు అనూహ్యంగా కోలుకున్నాయి. ఇందుకు కారణాలు లేక పోలేదు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి మార్గదర్శకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ ఈ ఉపఎన్నికలలో పోటీ చేయక పోవటం వల్ల, ములాయం కున్న మైనారిటీ, పాక్షికంగా బీసీల వోట్లతో పాటు, ఎస్సీల వోట్లు పడ్డాయి. అలాగే బీహార్‌లో లాలూ, నితిష్‌లు కలవటం వల్ల బీసీల వోట్లు చీలి పోలేదు. దీనికి తోడు బీజేపీ వ్యూహ కర్త అమిత్‌షా కానీ, ప్రధాని మోడీ కానీ, ఈ ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదన్న వాదన కూడా ఒకటి లేక పోలేదు.
ఇక రెండవ పరీక్షలో, దేశం మొత్తం మీద బీజేపీతో భావసారూప్యం వున్న ఏకైక పార్టీ శివసేన. కానీ, ఆ పార్టీతోనే ఎన్నికల ముందు పొత్తు పొసగలేదు. అయినా బీజేపీ ఆధిక్యం వున్న ఏకైక పక్షంగా వచ్చింది కానీ, స్పష్టమైన మెజారిటీకి ఇంకా కొన్ని సీట్లు తక్కువయ్యాయి. అప్పుడు ఐఛ్ఛికంగా, అంత వరకూ బీజేపీని తిట్టిపోసిన శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పరోక్ష సహకారాన్ని అందించింది. దాంతో శివసేన బెట్టు వీడి, అంచెలంచెలుగా కాళ్ళ బేరానికి వచ్చింది. ఇక హర్యానాలో బీజేపీ ఏకపక్షంగా విజయేకతనాన్ని ఎగుర వేసింది.
మూడవ పరీక్ష ఫలితం కూడా, రెండవ పరీక్షకు నకలులాగానే వుంది. జార్ఖండులో స్పష్టమైన మెజారిటీ సాధించింది కానీ, జమ్మూ కాశ్మీర్లో రెండవ స్థానంలో నిలిచింది. అయినా కీలకమయిన పార్టీగా అవతరించింది. ఇప్పుడు అటు మహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీపుల్స్ డెమాక్రటిక్ ఫ్రంట్ (పిడిపి) తో కానీ, ఒమర్ అబ్దుల్లా సారధ్యంలోని నేషనల్ కాన్ఫరెన్స్‌తో కానీ, దోస్తీ కట్టటానికి బీజేపీ తయారయ్యింది.
అంటే మొత్తానికి నాలుగు రాష్ట్రాలలోని ఎన్నికల ఫలితాలు బీజేపీ అనుకూలంగా వచ్చాయని బీజేపీ శ్రేణులు సంబరాలు ఎప్పటికప్పుడు జరపుకుంటూ వచ్చినా, బీజేపీ నాయకత్వానికి మాత్రం రెండు రాష్ట్రాలలోని ఫలితాలు కొంత నిరాశను మిగిల్చాయి. సార్వత్రిక (2014) ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను దృష్టిలో వుంచుకొని, దేశవ్యాపితంగా ‘సంకీర్ణ’ యుగానికి చరమ గీతం పాడెయ్య వచ్చన బీజేపీ భావించింది. కానీ ‘సంకీర్ణ’ అవసరం మరో మారు మహారాష్ర్ట, జమ్మూ కాశ్మీర్లలో ఏర్పడింది.
ఈ ఒక్క బెంగే బీజేపీకి మింగుడు పడకుండా వుంది. సార్వత్రిక ఎన్నికలలో ప్రధాన ప్రత్యర్థిగా భావించిన కాంగ్రెస్‌ను దాదాపు తుడిచెయ్యటంతో బీజేపీకి అమిత విశ్వాసం వచ్చింది. కానీ బీజేపీ ‘తప్పు’లో కాలేసిన అంశం ఒకటి వుంది. దేశంలో వోటు బ్యాంకులన్నీ, అయితే కాంగ్రెస్‌కో, లేక బీజేపీకో రాసిపెట్టిలేవు. కొన్ని ప్రాంతీయ పార్టీలకీ, కొన్ని మండల్ పార్టీలకీ ఆ వోటు బ్యాంకుల మీద పట్టు వున్నది. అందుకే ఇంతవరకూ గెలిచన ప్రతీ చోటా ఎక్కడా పోలయిన మొత్తం వోట్లలో 30 శాతం దాటి బీజేపీకి రాలేదు.
అంటే మిగిలిన వోట్లలో 6.5 శాతం వోట్లన్నీ వివిధ పార్టీలకు పోతున్నట్లు లెక్క. (1.5 శాతం వోట్లు ‘నోటా’ కు పడుతున్నాయన్న లెక్క ఒకటి వుంది.) వీటి మధ్య ఐక్యత ఇప్పట్లో రాక పోవచ్చు. కానీ క్రమేపీ, వాటిలో బలమైన పక్షాలు ఈ వోట్ల శాతాన్ని సాధించుకునే అవకాశం లేక పోలేదు. కాబట్టి బీజేపీకి మోడీ నాయకత్వంలో కూడా సంకీర్ణ రాజకీయాలు ఎంతో కొంత తప్పవని ఈ ఫలితాలు తేలుస్తున్నాయి.
-సతీష్ చందర్