అదిరిందయ్యా చంద్రం.. ప్రపంచ పోటుగాడి దీనగాధ

“అందరూ నాతో కలిసిరావాలి. జగన్ ను గద్దె దించాలి.” చంద్రబాబు తాజా స్టేట్ మెంట్ ఇది. దీనికి కొనసాగింపుగా త్యాగాలకు కూడా సిద్ధం అంటున్నారాయన. కానీ ఆ వెంటనే తనను సీఏం చేయాలనే అర్థం…

“అందరూ నాతో కలిసిరావాలి. జగన్ ను గద్దె దించాలి.” చంద్రబాబు తాజా స్టేట్ మెంట్ ఇది. దీనికి కొనసాగింపుగా త్యాగాలకు కూడా సిద్ధం అంటున్నారాయన. కానీ ఆ వెంటనే తనను సీఏం చేయాలనే అర్థం వచ్చేలా మరో స్టేట్ మెంట్.

అదిరిందయ్యా చంద్రం..

ఓవైపు అంతా కలిసిరావాలని పిలుపునిస్తారు చంద్రబాబు. మరోవైపు మాత్రం తన పార్టీ మనుషుల్నే ఇతర పార్టీలోకి పంపిస్తారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్లంతా ఎవరు? టీడీపీ మనుషులు కారా? ప్రస్తుతం వాళ్లు ఏ పార్టీలో ఉన్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడ్నే కేసీఆర్ దగ్గరకు పంపిన ఘనుడు మన చంద్రబాబు. ఓటుకు నోటు కేసులో డబ్బు సంచులు మోసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు కాదా?

పోనీ తెలంగాణ సంగతి వదిలేద్దాం.. ఏపీకే పరిమితం అవుదాం. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో చంద్రబాబు చేసిందేంటి? ఆదికి ముందు తన అభ్యర్థిని నిలబెట్టి బీజేపీకి తెరవెనక సపోర్ట్ చేసింది నిజం కాదా? బద్వేల్ ఉప ఎన్నికల్లో చంద్రబాబు తెరవెనక చేసిన బాగోతం అందరికీ తెలిసిందే.

ఇంకాస్త వెనక్కు వెళ్తే.. తెలంగాణలో మహాకూటమి పేరిట చంద్రబాబు చేసిన రాజకీయ వ్యభిచారం సంగతేంటి? ఆజన్మశత్రువు కాంగ్రెస్ తో చేతులు కలిపి, రాహుల్ తో ఫొటోలు దిగిన సంగతి మరిచిపోయారా? ఆ తర్వాత కాంగ్రెస్ పరిస్థితేమైంది? అంతెందుకు.. 2014 ఎన్నికల తర్వాత బీజేపీని చంద్రబాబు ఎలా వాడుకున్నారో తెలియదా? ఏ నేతను కదిపినా కథలు కథలుగా చెబుతారు కదా.

ఇక కమ్యూనిస్టుల విషయానికొద్దాం.. అవకాశం ఉన్న ప్రతిసారి కమ్యూనిస్టుల్ని వాడుకుంటూనే ఉన్నారు బాబు. అవసరం తీరిన తర్వాత కూరలో కరివేపాకులా తీసి అవతల పడేస్తున్నారు. ఇలాంటి 'ఘనమైన' ట్రాక్ రికార్డ్ ఉన్న చంద్రబాబుతో ఎవరు కలిసొస్తారు? ఎందుకు మద్దతిస్తారు? ఈ మొత్తం వ్యవహారంలో జనసేన పార్టీకి మాత్రం బుద్ధిరాలేదు. ఓసారి మోసపోయినా ఆ పార్టీ అధినేత మనసులో ఇంకా చంద్రబాబు నామస్మరణే వినిపిస్తోంది.

ముందుగానే ఓటమి అంగీకరించారా..?

అసలు చంద్రబాబు స్టేట్ మెంట్ లోనే ఆయన ఓటమి కనిపిస్తోంది. దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీ అంటారు. స్వయంగా తనను 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకుంటారు. సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా గప్పాలు కొట్టుకుంటారు. మరి ఇలాంటి వ్యక్తికి ఇతర పార్టీల మద్దతు అవసరమా..? ఆయన గొప్పల ప్రకారమే చూసుకుంటే.. సోలోగానే జగన్ కు ఎదురెళ్లొచ్చు కదా.

కానీ బాబు మాత్రం బీద అరుపులు అరుస్తున్నారు. అంతా తనతో కలిసిరావాలని వేడుకుంటున్నారు. తన ఒక్కడి వల్ల చేతకాదని పరోక్షంగా ఒప్పుకుంటున్నారు. ప్రపంచం మెచ్చిన పోటుగాడుగా పచ్చతమ్ముళ్లు వేనోళ్లా కొనియాడే బాబు దీనస్థితి ఇది.