పవన్ కాదు, నేనే త్యాగరాజుని.. బాబు మాటల గారడీ

ఏపీలో వైసీపీ పాలన అంతం చేసేందుకు ఏ త్యాగానికైనా నేను సిద్ధం అని చంద్రబాబు అనగానే.. ఓ వర్గం మీడియా రెచ్చిపోయింది. బాబు సీఎం సీటుని పవన్ కి త్యాగం చేస్తున్నారంటూ ప్రచారం చేసింది.…

ఏపీలో వైసీపీ పాలన అంతం చేసేందుకు ఏ త్యాగానికైనా నేను సిద్ధం అని చంద్రబాబు అనగానే.. ఓ వర్గం మీడియా రెచ్చిపోయింది. బాబు సీఎం సీటుని పవన్ కి త్యాగం చేస్తున్నారంటూ ప్రచారం చేసింది. అయితే ఇది టీడీపీ అనుకూల మీడియా మాత్రం కాదు. కప్పదాట్ల వ్యవహారంతో ఉండే కొన్ని ఛానెళ్లు.. ఇటీవల పవన్ కల్యాణ్ ని నెత్తిన పెట్టుకుంటున్నాయి. 

టీడీపీ అనే ముద్ర లేకపోవడంతో.. ఏ సమయానికి ఎవరికి అవసరం అయితే వారికి బాకా కొడుతున్నాయి. అయితే విచిత్రంగా ఆ తర్వాత అన్ని ఛానెళ్లూ బాబులో కొత్త త్యాగరాజుని చూస్తున్నాయి. ఇంతకీ బాబు నిజంగానే పవన్ కి సీఎం సీటు త్యాగం చేస్తారా..? జగన్ ని దించాలనే పట్టుదలతో ఉన్న బాబు.. టీడీపీని పూర్తిగా ముంచేస్తారా..?

త్యాగం అంటే ఏంటి..?

చంద్రబాబు నోటి వెంట త్యాగం అనే మాట వినపడిందంటే.. దానికేదో పెద్ద అర్థం ఉందని అనుకుంటూ మీడియా హైలెట్ చేసింది. వైసీపీని గద్దె దించేందుకు అందరం కలసి రావాలి, దానికి టీడీపీ నాయకత్వం వహిస్తుందని అన్నారు చంద్రబాబు. 

ఎంతటి త్యాగానికైనా సిద్ధం అని చంద్రబాబు అన్నారంటే కచ్చితంగా అది సీఎం సీటే అని రాజకీయ విశ్లేషకులు కూడా రంగంలోకి దిగారు. జనసేన పొత్తు కోరుకుంటున్నారు కాబట్టి.. జనసేనానికి సీఎం సీటు ఆఫర్ చేసే అవకాశముందనే విశ్లేషణలు మొదలయ్యాయి. దీంతో జనసేన సోషల్ మీడియా సైనికులు పండగ చేసుకున్నారు. అటు టీడీపీలో కూడా ఆందోళన మొదలైంది.

ఇంత జరుగుతున్నా టీడీపీ నుంచి ఎవరూ స్పందించలేదు. అంటే వారందరికీ చంద్రబాబు తత్వం తెలుసు. బాబు త్యాగం అన్నారంటే.. దాని వెనక నిగూడార్ధం ఉంటుందనేది వాస్తవం. ఎన్నికలకు ముందు త్యాగం చేస్తామని చెప్పినా, ఎన్నికల్లో తాను అనుకున్న ఫలితాలు వస్తే మాత్రం పవన్ ని కరివేపాకులా పక్కనపెడతారు. 

అక్కడ కూడా పవన్ ని ఇరకాటంలో పెట్టాలనుకుంటే ఎమ్మెల్యేలుగా తమ మనుషులకే జనసేన టికెట్లు ఇప్పించి పోటీ చేస్తారు. ఇలాంటి తెలివతేటలన్నీ ఉన్నాయి కాబట్టే.. పవన్ భుజంపై తుపాకీ పెట్టి జగన్ కి దాన్ని గురిపెట్టబోతున్నారు చంద్రబాబు. అందుకే తాను త్యాగం చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు.

నిజంగానే చంద్రబాబు త్యాగం చేసే వారయితే కచ్చితంగా పార్టీని నందమూరి వంశానికి అప్పగించేవారు. పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా మారిందని తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా తన కొడుకు కోసం పార్టీని బలిపెడుతున్నారంటే.. ఆయనకు సొంత పుత్రుడిపై ఉన్న ప్రేమ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ దత్త పుత్రుడి కోసం త్యాగం అంటూ చిన్న మెలిక పెట్టారంతే. 

బాబు మాటల అర్థం సీఎం కుర్చీయే అయితే.. జనసైనికులు మరింత జాగ్రత్త పడాల్సిందే. పవన్ ని బలిచ్చేందుకు ఇప్పటినుంచే బాబు కత్తి నూరుతున్నాడని అర్థం చేసుకోవాల్సిందే. కానీ జనసేనలో మాత్రం దీనికి విరుద్ధంగా నడుస్తోంది వ్యవహారం. ఓటు బ్యాంక్ చీలనివ్వం అంటూ టీడీపీకి మద్దతుగా ప్రకటనలు గుప్పిస్తోంది.