ఎమ్బీయస్‌ : తాజా అసెంబ్లీ ఎన్నికలు

ఎన్నికల ఫలితాల విశ్లేషణ చూద్దామని టీవీ పెడితే అన్ని ఛానెళ్లలో ఒకటే చర్చ – మోదీ హవా వుందా? లేదా? అని. బిజెపివారు ఉందంటారు. తక్కినవారు లేదంటారు. ఇవే కాదు, రాబోయే ఎన్నికలకు కూడా…

ఎన్నికల ఫలితాల విశ్లేషణ చూద్దామని టీవీ పెడితే అన్ని ఛానెళ్లలో ఒకటే చర్చ – మోదీ హవా వుందా? లేదా? అని. బిజెపివారు ఉందంటారు. తక్కినవారు లేదంటారు. ఇవే కాదు, రాబోయే ఎన్నికలకు కూడా వర్తించే సూత్రం ఒకటే వుంది – పార్లమెంటు ఎన్నికలలో మోదీకి వచ్చిన ఓట్ల శాతం అసెంబ్లీ ఎన్నికలలో నిలబెట్టుకోవడం అసాధ్యం. కానీ గతంలో కంటె బిజెపి ఓట్ల శాతం పెరుగుతోంది, దానికి కారణం మోదీ-అమిత్‌ షా సారథ్యం, రాజకీయవ్యూహం. అందువలన హవా వుంది కానీ జోరుగా లేదు అనుకోవడం మేలు. పార్లమెంటు ఎన్నికల సమయంలో నెలకొన్నవి అసాధారణ పరిస్థితులు. కాంగ్రెసుకు బుద్ధి చెప్పాలన్న కసి ప్రజల్లో కనబడింది. ఇప్పుడు ఆ కసి తగ్గింది. కాంగ్రెసు నాయకత్వం నీరసించి, నీలిగి వున్న యీ తరుణంలో కూడా స్థానిక పరిస్థితుల కారణంగా అది సజీవంగానే వుంది. 

కశ్మీర్‌ ఎన్నికలలో దానికి నాలుగైదు సీట్ల కంటె ఎక్కువ రావని అందరూ అంచనా వేశారు. అయితే అది 18% ఓట్లతో 17 సీట్లలో 5 మాత్రమే పోగొట్టుకుంది. ప్రభుత్వం నడిపిన నేషనల్‌ కాన్ఫరెన్సు కూడా మరీ అంత చేటుగా దెబ్బ తినలేదు. ఒమర్‌ మాత్రం వ్యక్తిగతంగా ఒక దానిలో ఓటమిపాలు కాగా, మరో దాంట్లో వెయ్యి ఓట్ల ఆధిక్యతతో గట్టెక్కాడు. అతని పార్టీ 21% ఓట్లతో 13 సీట్లు పోగొట్టుకుని 15 తెచ్చుకుంది. కశ్మీర్‌ లోయలో అదరగొట్టేస్తుంది అనుకున్న పిడిపికి గతంలో కంటె 7 మాత్రమే ఎక్కువ వచ్చి 28 దగ్గర ఆగింది. బిజెపి కంటె కాస్త తక్కువగా 22.7% ఓట్లు తెచ్చుకుంది. 87 సీట్లలో 44 సీట్లు లక్ష్యం పెట్టుకుని విపరీతంగా ప్రచారం చేసిన బిజెపికి 25 మాత్రమే (23% ఓట్లు) దక్కాయి. గతంతో పోలిస్తే 14 ఎక్కువ వచ్చాయి కాబట్టి యిది బెస్ట్‌ పెర్‌ఫామెన్స్‌ సో ఫార్‌ అనాలి. బిజెపి 37 సీట్ల జమ్మూను ఊడ్చిపారేస్తుందని, 46 సీట్లున్న కశ్మీర్‌ లోయలో కనీసం 4 సీట్లు, 4 సీట్లున్న లదాఖ్‌లో 2  తెచ్చుకుంటుందని, పరిశీలకులు వేసిన అంచనాలు కూడా తప్పాయి. కశ్మీర్‌ లోయలో 34 సీట్లలో అభ్యర్థులను నిలిపితే ఒక్కరికే డిపాజిట్‌ దక్కింది. కొంతమందికి ఓట్లు వందల్లో పడ్డాయి. లదాఖ్‌లో 3 సీట్లు కాంగ్రెసు పట్టుకుపోయింది. అక్కడ బిజెపీ ఎంపీ వున్నా బిజెపికి ఒక్క అసెంబ్లీ సీటూ దక్కలేదు. 

జమ్మూలో బిజెపి మూడింట రెండు వంతుల సీట్లు గెలవగా తక్కిన 12 సీట్లలో కాంగ్రెసు 5, ఎన్‌సి, పిడిపిలు చెరో 3, ఒక స్వతంత్రుడు నెగ్గారు. 2008 నాటి అమర్‌నాథ్‌ స్థలం వివాదం రోజుల నుంచి బిజెపి జమ్మూలో బలపడుతూ వచ్చింది. కశ్మీర్‌లో పిడిపి, జమ్మూలో బిజెపి బలంగా వున్నాయి. ఇద్దరూ కలిసి ప్రభుత్వం ఏర్పరిస్తే యిరుప్రాంతాల మధ్య సమతూకం సాధించవచ్చు. కానీ బేరాలు కుదరక పిడిపి కాంగ్రెసుతో చేతులు కలిపితే, జమ్మూ వివక్షత పేరుతో అక్కడ బిజెపి గొడవలు సృష్టించక మానదు. కశ్మీర్‌లో యిప్పుడు నాలుగు స్తంభాలాట నడుస్తోంది. ఎవరైనా ఎవరితోనైనా చేతులు కలపవచ్చు. ఎన్నికల సమయంలో ఒకరినొకరు పడతిట్టుకున్నా యిప్పుడు చేతులు కలుపుతారు.  బిజెపి ఎలాగైనా ముఖ్యమంత్రి పదవి చేజిక్కించుకోవాలని చూస్తోంది. పిడిపితో అయితే అది సాధ్యం కాదు. వంతులవారీగా పదవి పంచుకోవాలి. మూడేళ్ల తర్వాత పిడిపి చేయిస్తే చేసేదేమీ లేదు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో అయితే ఒమర్‌ ఏదీ గట్టిగా అడిగే స్థితిలో లేడు. తండ్రి లండన్‌లో జబ్బు పడి వున్నాడు. పార్టీ బలం సగానికి తగ్గిపోయింది. తనకు కేంద్రమంత్రి పదవి, తన అనుచరుడికి ఉపముఖ్యమంత్రి పదవి యిస్తే చాలంటాడు. బిజెపి, ఎన్‌సి చేతులు కలిపినా సీట్లు తక్కువ పడతాయి. స్వతంత్రులు, యితరులు కలిసి 7గురున్నారు. వారు చాలా కీలకం.

81 సీట్ల ఝార్‌ఖండ్‌లో బిజెపి తన భాగస్వామి ఎజెఎస్‌యుతో కలిసి 42 సీట్లు తెచ్చుకుని సుస్థిర ప్రభుత్వం ఏర్పరచబోతోంది. విడిగా చూస్తే 37  (గతం కంటె రెట్టింపు) మాత్రమే వచ్చాయి. పార్లమెంటు ఎన్నికలలో బిజెపి 14 సీట్లలో 12 గెలిచింది. అంటే 86%, యిప్పుడు కూటమికి వచ్చిన సీట్లు 52%. మోదీ హవా ఎక్కడ? హవా అయితే నిలవదు, యిది జాగ్రత్తగా నిలుపుకుంటే నిలిచే బలం. జెఎంఎం బలం 1 పెరిగి 19 తెచ్చుకుంది. గతంలో కంటె 5% ఓట్లు ఎక్కువ తెచ్చుకుని 20% ఓట్లతో బలంగా వుంది. కాంగ్రెసు బలం సగానికి కంటె తక్కువగా పడిపోయి 6 తెచ్చుకుంది కానీ ఓట్ల శాతం గతంలో 16% వుంటే ఇప్పుడు 11% తెచ్చుకుని మూడో స్థానంలో వుంది. మాజీ సిఎం బాబూలాల్‌ మరాండీ నేతృత్వంలోని జెవిఎం (పి) మూడు పోగొట్టుకుని 8 తెచ్చుకున్నా ఓట్ల శాతం 1% పెరిగి 10% అయింది. ఇతరులు 24% ఓట్లు 6 సీట్లు తెచ్చుకున్నారు. జనతా పరివార్‌ సభ్యులైన జెడియు, ఆర్జెడీలు ఖాతా తెరవలేకపోయాయి. మాజీ సిఎంలు అర్జున్‌ ముండా, బాబూలాల్‌ మరాండీ, మధు కోడా ఓడిపోయారు. ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ రెండిట్లో పోటీ చేసి ఒక దానిలో ఓడిపోయారు. బిజెపికి 6% ఓట్లు పెరిగి 31% ఓట్లు మాత్రమే వచ్చాయి. దాని భాగస్వామికి 4% వచ్చాయి. ఇతర పార్టీల వారందరూ కలిసినా బిజెపి సర్కారును ఏమీ చేయలేరు. కానీ చిన్న పార్టీలు పెద్ద పార్టీలను ఆడించడం ఝార్‌ఖండ్‌లో చాలాకాలంగా జరుగుతోంది. బిజెపికి భాగస్వామిగా వున్న ఎజెఎస్‌యు నెత్తి కెక్కవచ్చు. అప్పుడు బిజెపి దాన్ని తోసేసి తమ పాత కామ్రేడ్‌ అయిన మరాండీని చేరదీయవచ్చు. మరాండీ సిఎం పదవి ఆశించవచ్చు. ఇవన్నీ భవిష్యత్తుకు సంబంధించిన ఊహాగానాలు. ప్రస్తుతానికి వస్తే గిరిజనేతరుడు, ఓబిసి వర్గానికి చెందిన తేలీ కులానికి చెందిన రఘువర్‌ దాస్‌కు సిఎంగా ఛాన్సుంది. అతనిది అసలు ఛత్తీస్‌గఢ్‌. 

జంషెడ్‌పూర్‌లోని టాటా స్టీల్‌లో కార్మికుడిగా చేరి, రాజకీయాల్లోకి వచ్చాడు. 1995 నుండి వరుసగా జంషెడ్‌పూర్‌ నుండి గెలుస్తూ వస్తున్నాడు. మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా చేశాడు. 2005లో అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిగా రూ. 200 కోట్ల కాంట్రాక్టును సింగపూరు కంపెనీకి కట్టబెట్టి వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇతను కాకపోతే సరయూ రాయ్‌ వున్నాడు. గిరిజనుడికే యివ్వాలనుకుంటే బిజెపి అగ్ర నాయకుడు అర్జున్‌ ముండా ఓడిపోయాడు కాబట్టి సుదర్శన్‌ భగత్‌కు లేదా శివశంకర్‌ ఓరాన్‌కు ఛాన్సుంది.

ఎన్నికలు చెప్పే సందేశం ఏమిటంటే – కాంగ్రెసు పూర్తిగా చచ్చిపోలేదు. మౌలిక నిర్మాణం గట్టిగానే వుంది. నాయకత్వం లేక తచ్చాడుతోంది. సోనియా కుటుంబ సభ్యుల భజన మానేసి, కమ్యూనిస్టు పార్టీల తరహాలో పాలిట్‌ బ్యూరో మార్గదర్శకత్వంలో నడిస్తే దానికి ఎంతో కొంత భవిష్యత్తు వుంది. బిజెపి క్రమేపీ బలపడుతోంది. పార్లమెంటు ఎన్నికల నాటి చమత్కారాలపై ఆశ పెట్టుకోకుండా ఒక్కో అడుగూ జాగ్రత్తగా వేసుకుంటూ పోతే దేశంలోని అనేక ప్రాంతాల్లో బలంగా వేళ్లూనుకుంటుంది. బిజెపికి ప్రధాన శత్రువు కాంగ్రెసు కాదు, ప్రాంతీయపార్టీలే. వాటితో బ్లో హాట్‌- బ్లో కోల్డ్‌ తరహాలో తెలివిగా వ్యవహరిస్తూ పోతే రాష్ట్రాలలో కూడా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పరచుకుంటూ, దేశమంతా వ్యాపించవచ్చు. దాని కోసం బిజెపి తన విధానాలను అందరికీ ఆమోదయోగ్యంగా చేసుకోవాలి. హార్డ్‌కోర్‌ ఆరెస్సెస్‌ భాష మాట్లాడితే మాత్రం ప్రాంతీయపార్టీలు దూరం పెట్టేస్తాయి. ఒంటరి పోరాటాలు బిజెపిని ఎక్కువ దూరం తీసుకెళ్ల లేవు.   

ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]