సినిమా రివ్యూ: త్రిపుర

రివ్యూ: త్రిపుర రేటింగ్‌: 2.25/5 బ్యానర్‌: శర్వంత్‌ రామ్‌ క్రియేషన్స్‌, క్రేజీ మీడియా తారాగణం: స్వాతి, నవీన్‌ చంద్ర, సప్తగిరి, రావు రమేష్‌, జయప్రకాష్‌ రెడ్డి, షకలక శంకర్‌, ప్రీతి నిగమ్‌, శివన్నారాయణ, ధనరాజ్‌…

రివ్యూ: త్రిపుర
రేటింగ్‌: 2.25/5

బ్యానర్‌: శర్వంత్‌ రామ్‌ క్రియేషన్స్‌, క్రేజీ మీడియా
తారాగణం: స్వాతి, నవీన్‌ చంద్ర, సప్తగిరి, రావు రమేష్‌, జయప్రకాష్‌ రెడ్డి, షకలక శంకర్‌, ప్రీతి నిగమ్‌, శివన్నారాయణ, ధనరాజ్‌ తదితరులు
సంభాషణలు: రాజా
కథనం: కోన వెంకట్‌, వెలిగొండ శ్రీనివాస్‌
సంగీతం: కామ్రాన్‌
కూర్పు: ఉపేంద్ర
ఛాయాగ్రహణం: రవికుమార్‌ సానా
నిర్మాతలు: ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్‌
కథ, దర్శకత్వం: రాజ కిరణ్‌
విడుదల తేదీ: నవంబరు 6, 2015

ప్రస్తుతం హారర్‌ కామెడీ చిత్రాల హవా నడుస్తోంది. లో బడ్జెట్‌లో రూపొందుతోన్న ఈ చిత్రాలు కాసుల వర్షం కురిపిస్తూ 'రిటర్న్‌ ఆన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌' పద్ధతిలో బ్లాక్‌బస్టర్‌ స్టేటస్‌ దక్కించుకుంటున్నాయి. ప్రేమకథా చిత్రమ్‌, కాంచన, గీతాంజలి, గంగ, రాజుగారి గది.. ఇలా ఈ జోనర్‌లో వచ్చిన చిత్రాలన్నీ పెద్ద హిట్‌ అవడంతో ఈ ట్రెండ్‌ని క్యాష్‌ చేసుకునేందుకు చాలా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. 'గీతాంజలి'తో ఘన విజయాన్ని అందుకున్న రాజ కిరణ్‌ తన రెండో ప్రయత్నంలోను హారర్‌ జోనర్‌నే ఎంచుకున్నాడు. హారర్‌ చిత్రాల్లో చాలా వరకు లేడీ ఓరియెంటెడ్‌గా ఉంటాయి కనుక ఇందులో స్వాతిని కథానాయికగా తీసుకుని 'త్రిపుర' అనే టిపికల్‌ టైటిల్‌ పెట్టారు. 

ఒక మర్డర్‌ సీన్‌తో మొదలయ్యే ఈ చిత్రం ఎటుగా పయనిస్తుందనే దానిపై అవగాహన స్టార్టింగ్‌లోనే వచ్చేస్తుంది. అయితే సరాసరి హారర్‌, సస్పెన్స్‌ వగైరా ఎలిమెంట్స్‌ మీదకి వెళ్లకుండా సెటప్‌ విలేజ్‌కి, హీరోయిన్‌ పెళ్లి చూపులపైకి షిఫ్ట్‌ అవుతుంది. కామెడీ పెళ్లి చూపుల తంతు ముగిసాక హీరోయిన్‌ క్యారెక్టర్‌కి ఉన్న ఒక అసాధారణమైన లక్షణం రివీల్‌ అవుతుంది. త్రిపురకి (స్వాతి) వచ్చే కలల్లో ఆమెకి అన్నీ తెలిసిపోతుంటాయి. ఏం జరుగుతుందో, ఏం జరిగిందో ఆమెకి కనిపించేస్తుంటాయి. ఈ సంగతిని ఎంత పేలవమైన సన్నివేశంతో రివీల్‌ చేస్తారంటే… ఆ అసాధారణమైన అంశాన్ని ఏమాత్రం సీరియస్‌గా తీసుకోవడానికి వీల్లేని విధంగా ఆ సీన్‌ కన్సీవ్‌ చేశారు. ఊళ్లోని జనం అంతా గుమికూడి తమ కోళ్లు, కుక్కల గురించి త్రిపుర కలగందేమో తెలుసుకుని వాటి జాడ కనుక్కుంటారు. ఎంతో సీరియస్‌గా తీసుకోవాల్సిన పాయింట్‌ని దర్శకుడు ఇలాంటి పేలవమైన పరిచయంతో చెడగొట్టాడు. పోనీ ఈ కలలు కనడమనే దానికి కథలో వెయిట్‌ లేదా అంటే దాని మీదే చాలా డ్రామా నడుస్తుంటుంది. 

ఒక సన్నివేశానికీ, మరో సన్నివేశానికీ మధ్య పొంతనే లేకుండా కథనం గాలివాటానికి వెళ్లిపోతున్న భావన కలుగుతుంది. త్రిపుర కల ఎప్పుడు కన్నదో, అది నిజమెప్పుడు అయిందో అనే వాటి మధ్య టైమ్‌ ఫ్రేమ్స్‌ని అస్సలు పాటించలేదు. పైగా కల కనక ముందే సదరు వ్యక్తులకి ఏదో జరగబోతుందనే సంగతి తనకి ముందే తెలుసన్నట్టు వారివైపు ఆందోళనగా చూస్తుంటుంది. అసలు ఈ కలల ద్వారానే అసలు కథ ఏంటనేది త్రిపురకి తెలిసిపోవాలి. తన భర్తని (నవీన్‌ చంద్ర) కత్తితో పొడిచేస్తాననే కల వచ్చిన తర్వాత బహుశా త్రిపుర నిద్రపోలేదో ఏమో కానీ ఇక ఆమెకి కొత్త కలలేమీ రావు. 

అలాగే ఆరంభ సన్నివేశాల్లోనే ఫామ్‌ హౌస్‌లో జరిగిన మర్డర్‌ కారణంగా అక్కడో ఆత్మ సంచరిస్తుందని చూపిస్తారు. మొదట్లో హడావిడి చేసిన ఆ దెయ్యం త్రిపుర, ఆమె భర్త కలిసి అక్కడే ఉండడానికి వచ్చినప్పుడు మాత్రం గప్‌చుప్‌ అయిపోతుంది. నవీన్‌పై, అతని బాస్‌పై (రావు రమేష్‌) హత్య చేశారేమో అనే అనుమానం కలిగించడం కాకుండా… వాళ్లే చేసి ఉంటారని నమ్మి తీరాలన్నట్టు అదే పనిగా స్పూన్‌ ఫీడ్‌ చేస్తుంటే అసలు సంగతి ఏంటనేది కాస్త ఆలోచన ఉన్న వారికి ముందే బోధ పడిపోతుంది. క్లయిమాక్స్‌ వరకు దాచి ఉంచిన ఆ ట్విస్టు ఏంటనేది ముందు ఊహించని వారు కూడా అది రివీల్‌ అయినప్పుడు ఏమంత షాక్‌ అవరు. అంతవరకు దాగుడు మూతలు ఆడిన దెయ్యం పతాక సన్నివేశంలో కూడా బయటకి రాదు. భీకరమైన మేకప్‌తో, గ్రాఫిక్స్‌తో భయానకంగా చూపించాలని చూసినా కానీ అది ఏమాత్రం ఎఫెక్టివ్‌గా లేదు. తాను పగబట్టిన వాడిని చంపడానికి ఎక్కడో పల్లెటూళ్లో ఉన్న రేగి చెట్టు కిందకి వెళ్లి మరీ పని కానిచ్చుకొచ్చిన దెయ్యంగారు అసలు విలన్‌ కోసం మాత్రం క్లయిమాక్స్‌లో వచ్చి 'యు ఆర్‌ అండర్‌ అరెస్ట్‌' అనే పోలీస్‌లా ఓపిగ్గా వెయిట్‌ చేస్తారు. 

దర్శకుడు రాజ కిరణ్‌ ఈ చిత్రాన్ని ఏ జోనర్‌లోకి వెయ్యాలనే దానిపై చాలా కన్‌ఫ్యూజ్‌ అయినట్టు కనిపించాడు. మళ్లీ ఒక హారర్‌/కామెడీ తీయడం ఇష్టం లేక హారర్‌/థ్రిల్లర్‌ అనిపించేలా చేద్దామని చూసాడు. అయితే ఈ ట్రెండులో కామెడీ లేకపోతే కష్టమనిపించిందో ఏమో దానిని బలవంతంగా ఇరికించే ప్రయత్నం చేసాడు. పాటలు, లవ్‌స్టోరీ వగైరా లేకపోతే ఎలా అనుకున్నాడో ఏమో అవసరం లేని ఆ పాయింట్స్‌తో కాలయాపన చేసాడు. ఈ తరహా చిత్రాల్లో ఉండాల్సిన వేగం పూర్తిగా మిస్‌ అయి మందకొడి గమనంతో పాటు అస్తవ్యస్తమైన కథనం (కోన, వెలిగొండ) 'త్రిపుర' చిత్రాన్ని అన్‌ఇంటరెస్టింగ్‌గా తయారు చేసింది. ఆసక్తికరమైన అంశాలు లేవనేం కాదు కానీ ఉన్న ఆ ఎలిమెంట్స్‌ ఏవీ కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్‌ చేసి థ్రిల్‌ చేయలేదు. షకలక శంకర్‌, జయప్రకాష్‌రెడ్డి సీన్స్‌ని కామెడీ లేదనే లోటు లేకుండా ఉండడం కోసం లాస్ట్‌ మినిట్‌లో ఇరికించినట్టు అనిపిస్తుంది. 

రెండున్నర గంటల పాటు టీవీ సీరియల్‌ మాదిరిగా సాగే ఈ చిత్రంలో భయపెట్టే మూమెంట్స్‌ నామమాత్రంగా కూడా లేకపోవడం, ఇలాంటి సినిమాలు పాస్‌ అయిపోవడానికి బాగా పనికొస్తున్న కామెడీ కూడా ఎఫెక్టివ్‌ అనిపించకపోవడంతో 'త్రిపుర' బోరింగ్‌ థ్రిల్లర్‌గా మారింది. పైన చెప్పిన అంశాలే 'గీతాంజలి' విజయానికి కారణం కాగా మళ్లీ ఆ విధమైన వినోదాన్ని అందించడంలో రాజ కిరణ్‌ ఫెయిలయ్యాడు. ఆ చిత్రాన్ని ఎంజాయ్‌ చేసిన ప్రేక్షకులు కూడా త్రిపురతో నిరాశ పడే అవకాశాలే ఎక్కువ. స్వాతి తన ఎక్స్‌ప్రెసివ్‌ కళ్లతో త్రిపుర పాత్రకి ప్రాణం పోసింది. ఆమె నటన ఖచ్చితంగా ఈ చిత్రానికి ప్లస్‌ పాయింట్‌. నవీన్‌ చంద్రకి ఉన్న విలన్‌ ఫీచర్స్‌ తను చేసిన పాత్రకి ఉపయోగపడ్డాయి. సప్తగిరికి చాలా లెంగ్తీ క్యారెక్టర్‌ ఇచ్చారు. నవ్వించే సన్నివేశాలు, సంభాషణలు రాసివ్వకపోయినా తన మార్కు హడావిడితో ఏదో మేనేజ్‌ చేసాడు. సాంకేతికంగా చెప్పుకోతగ్గ అంశాలేమీ లేవు. హారర్‌ సినిమాలకి ప్రాణంగా నిలవాల్సిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా పేలవంగానే ఉంది. 

జనం ఇలాంటి సినిమాలని చూసే మూడ్‌లో ఉన్నారు కదా అని త్రిపురలో చాలా అంశాలని టచ్‌ చేసి తిమ్మిని బమ్మి చేయాలని చూసారు. కానీ కథనం కంగాళీగా మారి ఎనభైల నాటి పాత చింతకాయ హారర్‌ సినిమాగా అది షేప్‌ తీసుకుంది. రాజుగారి గదిలాంటి చిత్రాలని ఆదరిస్తున్న వర్గానికి కూడా త్రిపురతో నిరాశే మిగులుతుంది. 

బోటమ్‌ లైన్‌: హారర్‌ కిచిడీ!

– గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri