తెలుగులో కూడా బోటులోంచి రేవతీ, పిల్లలూ పడే దృశ్యం వుంది. దానికి కారణం రేవతే అనుకున్న నాగేశ్వరరావు ఆమెను తిట్టి యింట్లోంచి పొమ్మన్నాడు. మర్నాడు పిల్లలు వచ్చి ఆమెదేం తప్పులేదని అన్నాక పశ్చాత్తాప పడి ఆమెను వెళ్లవద్దని కోరాడు. నా మాట పట్టించుకోవద్దు వుండిపో అన్నాడు. అప్పుడు రేవతి నాగేశ్వరరావుచేత తాగుడు మాన్పిద్దామని చూసింది. నలుగురికి వుపయోగపడవలసిన మీరు యిలా తయారయితే ఎలా అని నచ్చచెప్పబోయింది కానీ విఫలమైంది. కానీ ఓ రోజు కొడుకు తాగిరావడంతో నాగేశ్వరరావులో మార్పు వచ్చింది. తాగుడు మానేసి, తన ప్రాక్టీసు మళ్లీ మొదలు పెట్టడమే కాక, పిల్లలతో కలిసి ఇంగ్లీషు సినిమాలో హీరోయిన్ పిల్లలతో కలిసి సైకిళ్ల మీద పిక్నిక్‌కి వెళ్లినట్టే తనూ వెళ్లాడు. పిల్లలకు మళ్లీ చేరువయ్యాడు. నాగేశ్వరరావు కొడుకు సంస్కరింపబడ్డాడు కదా, కూతురు కూడా బాగుపడడానికి ఓ సీను పెట్టారు. ఆమెను హీరో నాగార్జున పేరుతో ఎవరో మోసగించబోతే నాగార్జునే స్వయంగా వచ్చి కాపాడి రేవతికి అప్పగించాడు.
ఇంగ్లీషు సినిమాలో చర్చికి వెళ్లిపోయిన హీరోయిన్ అక్కడ వుండలేకపోయింది. మాటిమాటికీ పిల్లల్ని గుర్తు చేసుకుంది. అయినా మనసు గట్టి చేసుకోవాలని వాళ్లు తనను కలవడానికి వచ్చినా కలవలేదు. చర్చిలో మదర్‌తో తన గోడు చెప్పుకుంటే 'ఈ సన్యాసిని జీవితం నీకు నప్పదు, అక్కడికే వెళ్లు అంది' ఆవిడ. ఇక్కడ ఎస్టేటులో జమీందారిణి పిల్లలను మచ్చిక చేసుకోలేక ఛస్తోంది. హీరో తన పిల్లలతో 'ఈమే మీ కొత్త అమ్మ' అని ఎనౌన్సు చేసి 'ఒకొకరి తర్వాత మరొకరు వచ్చి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకోండి' అని ఆజ్ఞాపించాడు. పిల్లలు ముద్దు పెట్టుకోవడానికి వస్తూంటే యీమె హడిలి చచ్చింది, ఏ అల్లరి పిల్లవాడైనా బుగ్గ కొరికేస్తాడేమో అని. ఈ పరిస్థితిలో హీరోయిన్ తిరిగి వచ్చేసింది. పిల్లలకు ఆనందమే ఆనందం.
ఓ రోజున హీరోయిన్ ఒంటరిగా చెరువు ఒడ్డున వుంటే బాల్కనీనుండి హీరో, జమీందారిణి చూస్తున్నారు. హఠాత్తుగా హీరో తను హీరోయిన్‌ను ప్రేమిస్తున్నానని గుర్తించాడు. సందేహిస్తూనే ఆ ముక్క జమీందారిణితో అంటే ఆ విషయం నాకెప్పుడో తెలుసందామె. ఎస్టేటు విడిచి వెళ్లిపోయింది. హీరో హీరోయిన్ వద్దకు వచ్చాడు. తిరిగి వచ్చింది కేవలం పిల్లల కోసమేనా అన్నాడు. ఏమో అంటూనే ఆమె అతనికి చేరువైంది. త్వరలోనే వాళ్లిద్దరికీ పెళ్లి జరిగిపోయింది. హనీమూన్‌కి వెళ్లారు.
కథ యిక్కడితో అయిపోవచ్చు. కానీ దీనికి ఓ రాజకీయమైన కోణం కూడా కలిపారు. ఇది ఆస్ట్రియాదేశంలో 1938లో జరిగిన కథ. రెండవ ప్రపంచ యుద్ధానికి నాందిగా జర్మనీలో హిట్లర్ తన నాజీసైన్యంతో ఆస్ట్రియాను ఆక్రమించే రోజులు. ఆస్ట్రియాలో రాజకీయప్రముఖులందరూ క్రమంగా నాజీలవైపుకు మొగ్గుతున్నారు. కానీ దేశభక్తుడైన హీరో నాజీలను ఆసహ్యించుకుంటాడు. తన యింట్లో జరిగిన పార్టీలో రాజకీయాలు చర్చించిన వారికి గట్టిగా చెప్తాడు. ఆస్ట్రియా పరాక్రాంతం కావడం తను సహించనని. అయితే అతను హనీమూన్ వెళ్లి వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. నాజీలు ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నారు. జర్మన్ సైన్యానికి బాసటగా వచ్చి సైన్యంలో చేరమని కబురు పంపారు. అతనిపై నిఘా పెరిగింది.
సామాన్యులు కూడా నాజీలుగా చేరి అధికారం చలాయించడం మొదలెట్టారు. వారిలో హీరో పెద్దకూతుర్ని ప్రేమించిన పోస్ట్‌మన్ కూడా ఒకడు. వాడు గతంలో హీరో చేతిలో పరాభవం పొంది అవమానంతో రగులుతున్నాడు. ఇప్పుడు అదను చూసుకుని నాజీ సైనికుడిగా మారాడు. హీరో కుటుంబంతో వూరు వదిలి పారిపోతూ వుంటే పోలీసులు పట్టుకున్నారు. ఊరు విడిచి పోరాదని, సైన్యంలో చేరక తప్పదని హుకుం జారీ చేశారు. ఈ ఆస్ట్రియాకు పొరుగునే వున్న స్విజర్లండ్ తటస్థ దేశం. ఎలాగోలా అక్కడకు పారిపోగలిగితే గండం గడిచినట్టే! కాస్త దూరం కారులో వెళ్లి కాలినడకన పర్వతాలు దాటేస్తే స్విజర్లండ్ చేరవచ్చు. కానీ ఎలా?
ఇప్పుడు సంగీతం అక్కరకు వచ్చింది. వాళ్ల వూరిలో సంగీతపు పోటీ జరుగుతోంది. దానిలో కుటుంబమంతా పాల్గొనాలని వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండు ఎప్పుడో సూచిస్తే హీరో కొట్టి పారేశాడు. తమవంటి కులీనులు బహిరంగంగా పాడడమేమిటని. కానీ యిప్పుడు ఆ వుపాయాన్నే ఆశ్రయించాడు. పాడుతూన్నట్టే పాడి, అలా చీకట్లో కలిసిపోయి కారు ఎక్కేశారు. నాజీలకు అనుమానం వచ్చి వెంటాడారు. హీరోయిన్ ట్రెయినింగ్ పొందిన చర్చి రక్షించింది. సిస్టర్స్ కాపాడారు. చర్చి వెనక్కాల గేటునుండి పారిపోవడానికి సన్నాహాలు చేసుకున్నారు. కానీ అక్కడో అపాయం పొంచివుంది. అక్కడ నాజీగా మారిన కూతురి ప్రియుడు అడ్డుపడ్డాడు. అతన్ని మాటలతో హడలగొట్టి హీరో నిర్వీర్యం చేశాడు. అతను మేలుకుని అందర్నీ పిలిచేలోగా కారులో పారిపోయారు. నాజీల కారు నడవకుండా సిస్టర్స్ వాళ్ల వంతు సహాయం వాళ్లు చేశారు. కారు బ్యాటరీలు తీసి దాచేశారు. హీరో కుటుంబం కొండలెక్కి స్విజర్లండ్ వైపుకి సాగిపోవడంతో సినిమా ముగుస్తుంది.
ఆ దేశానికిి ఆ కాలానికి పరిమితమైన ఈ ఘట్టాన్ని తెలుగులోకి తీసుకురావడం కష్టమని మనందరికీ తెలుసు. అందువలన మనవాళ్లు క్రైసిస్‌ను మరో రూపంలో ప్రవేశపెట్టారు. ఆ వూళ్లో ఓ విలన్ వుంటాడు. నూతన్ ప్రసాద్. డబ్బులు పుచ్చుకుని నేరాలు చేస్తూ వుంటాడు. కానీ రుజువులు దొరకవు. ఎలాగైనా రుజువులు సంపాదించి కోర్టులో శిక్ష పడేట్లా చేయాలని ఇన్‌స్పెక్టరైన మురళీమోహన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు ప్రయత్నిస్తూ వుంటారు. చివరకి అతని అనుచరుడు ఒకడు దొరుకుతాడు. విలన్ తన సోదరుణ్ని చంపేయడంతో అప్రూవర్‌గా మారతానంటాడు. ఈ పరిస్థితిలో నాగేశ్వరరావు తాగుడుకు బానిసై ప్రాక్టీసు నిర్లక్ష్యం చేశాడు. రేవతి కారణంగా అతను మామూలు మనిషై పుంజుకోవడంతో విలన్ కంగారు పడతాడు. పనులు త్వరగా చక్కబెడదామనుకుంటాడు. నిజాయితీ గల ఓ ప్రభుత్వాధికారిని చంపిస్తాడు. దాన్ని విలన్ అనుచరుడు వీడియో తీశాడు. విలన్ అనుచరులు వెంటాడారు. అతను వీళ్ల చేతికి చిక్కేలోపున ఆ వీడియో కాసెట్‌ను హీరో కాంపౌండ్‌లో విసిరేశాడు. ఆ విషయం తెలిసి విలన్ తన అనుచరుడు బ్రహ్మానందాన్ని వెతకమన్నాడు. అతను మారువేషాలతో వెతుకుతున్నాడు.
ఈలోగా పిల్లలకు తమకు బాగా మచ్చికై పోయిన రేవతిని మా యింట్లోనే ఎప్పటికీ వుండిపో అన్నారు. 'తప్పు, ఆమె పెళ్లి కావలసిన పిల్ల' అన్నాడు నాగేశ్వరరావు. ఆమె పెళ్లి చేసుకుని వెళ్లి పోతుందంటే దిగాలు పడిన పిల్లలు ఆమె వద్దుకు వచ్చి 'మా నాన్ననే చేసుకుని యిక్కడే వుండిపోవచ్చు కదా' అని ఆమెకు చెప్పారు. ఆమె తల వూపింది కానీ పిల్లలు వెళ్లి తండ్రితో ఆ మాట అంటే ఆమెకు తనకు మధ్య వయసులో వున్న తేడాను దృష్టిలో పెట్టుకుని, 'ఛీ, తప్పు' అన్నాడు. రేవతి అది విని నిరాశపడి వేరే వుద్యోగానికి వెళ్లిపోదామనుకుంది. తన స్టేటస్‌కు తగను కాబట్టి అలా అనుకుంటున్నా డనుకుంది. మురళీమోహన్ వద్దకు వెళ్లి 'నేను ఎవర్నీ పెళ్లి చేసుకోను, నాకు యింకో ఉద్యోగం చూడండి' అంది.
ఇవతల బ్రహ్మానందం యింకో వేషంలో వచ్చి పనివాళ్లతో పెనుగులాడుతూంటే మధ్యలో నాగేశ్వరరావు విలన్‌కు వ్యతిరేకంగా వున్న వీడియో చూడడం అతని కంటబడింది. ఆ వీడియో కాసెట్ తోటలో కనబడితే తోటమాలి జాగ్రత్త పెట్టి యజమానికి యిచ్చాడు. ఆ విషయం తెలియగానే వీడియోకోసం విలన్ హీరో పిల్లల్ని కిడ్నాప్ చేశాడు. వీడియో యిమ్మనమని, లేకపోతే చంపేస్తామనీ బెదిరించాడు. పిల్లలు తెలివిగా వ్యవహరించి పోలీసులకు చెప్పారు, తప్పించుకున్నారు. పిల్లల్ని రక్షించాక మురళీమోహన్ నాగేశ్వరరావుకు రేవతి మనసులో మాట చెప్పి అతన్ని కన్విన్స్ చేశాడు. అందరూ వెళ్లి రైలెక్కబోతున్న రేవతిని ఆపారు. నాగేశ్వరరావు, రేవతి పెళ్లాడారు.
ఈ విధంగా సౌండ్ ఆఫ్ మ్యూజిక్‌లో మనకు నప్పే కొంత భాగాన్ని తీసుకుని పూర్వభాగం పెంచి రావుగారిల్లు కథను అల్లుకున్నారు. అది సంగీతం కేంద్రంగా సాగిన గొప్ప చిత్రం. ఇది సెంటిమెంట్ ప్రధానంగా సాగే కుటుంబచిత్రం. సౌండ్ ఆఫ్ మ్యూజిక్ రికార్డులు సృష్టించింది. దానిలో ప్రతీ పాటా ఆణిముత్యం. వసివాడని కుసుమం. ఇప్పటిదాకా చూడకపోతే తప్పక చూడండి. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2015)