ఎమ్బీయస్‌ : బాలచందర్‌ ఫార్ములా – 2

సాధారణంగా బాలచందర్‌ కామెడీ సినిమాలన్నిటిలో డ్రామా వుంటుంది. ఆయనదంతా నాటకరంగ నేపథ్యం కదా. అప్పట్లో ఆర్‌.ఎస్‌. మనోహర్‌ ''లంకేశ్వరన్‌'' వంటి భారీ సెట్ల పౌరాణిక నాటకాలతో తమిళ నాటకరంగాన్ని ఏలుతూండేవాడు. మరో పక్క శివాజీ…

సాధారణంగా బాలచందర్‌ కామెడీ సినిమాలన్నిటిలో డ్రామా వుంటుంది. ఆయనదంతా నాటకరంగ నేపథ్యం కదా. అప్పట్లో ఆర్‌.ఎస్‌. మనోహర్‌ ''లంకేశ్వరన్‌'' వంటి భారీ సెట్ల పౌరాణిక నాటకాలతో తమిళ నాటకరంగాన్ని ఏలుతూండేవాడు. మరో పక్క శివాజీ గణేషన్‌ హెవీ డైలాగులతో ''తంగపతకం'' వంటి నాటకాలు ఆడుతూండేవి. మద్రాసులో ఎ.జి.ఆఫీసులో పనిచేస్తూన్న బాలచందర్‌కు చిన్నప్పణ్నుంచి నాటకాలంటే మోజు కాబట్టి రాగిణి రిక్రియేషన్‌ ట్రూప్‌ అని పెట్టుకుని ''మేజర్‌ చంద్రకాంత్‌'' అనే నాటకాన్ని ఇంగ్లీషులో రాశాడు. తన చెల్లెల్ని మోసం చేసి ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిన దుర్మార్గుణ్ని చంపి పారిపోతున్న యువకుడు ఒక యింట్లో చొరబడతాడు. ఆ యింట్లో ఒకే ఒక అంధవృద్ధుడున్నాడు. అతను మిలటరీ నుండి రిటైరైన మేజర్‌. హతుడి తండ్రి మాత్రమే కాదు, తనను వెంటాడే పోలీసు అధికారి తండ్రి కూడా. ఈ యిద్దరి మధ్య జరిగే డ్రామాయే కథాంశం. తమిళంలో అయితే యింకా పేరు వస్తుందని ట్రూపు సభ్యులు అనడంతో దాన్ని తమిళంలో తిరగరాశాడు. ఆ నాటకంలో బాలచందర్‌ సహోద్యోగి సుందర్‌ రాజన్‌ మేజర్‌గా ఎంత బాగా నటించాడంటే అతని పేరుకు ముందు 'మేజర్‌' అనే బిరుదు వచ్చి చేరింది. 

తమిళ నాటక రంగానికి యిది కొత్త చూపు నిచ్చింది. హాస్యం, విషాదం, మెలోడ్రామా కలగలిపి బాలచందర్‌ స్క్రిప్టులు తయారు చేస్తే వాటిలో నాగేష్‌, శ్రీకాంత్‌ వంటి సినిమా నటులు వేసేవారు. అప్పటిదాకా నాటకరంగానికి దూరంగా వున్న షావుకారు జానకి కూడా బాలచందర్‌ స్త్రీ పాత్రలను బలంగా రూపొందించడం చూసి ముచ్చట పడి ఆయన నాటకాల్లో నటించారు. ''సర్వర్‌ సుందరం'', ''నీర్‌ కుమళి'' (నీటి బుడగ), ''మెళుగువర్తి'' (కొవ్వొత్తి), ''ఎదిరి నీచ్చల్‌'' (ఎదురీత) ''నానల్‌'' (గడ్డి), ''నవగ్రహం'' వంటి అనేక నాటకాలు తయారయ్యాయి. ఈ నాటకాలు చూసిన సినిమా ప్రముఖులు బాలచందర్‌ను సినిమాల్లోకి ఆహ్వానించారు. ఎమ్‌జిఆర్‌ తన ''దైవత్తాయ్‌'' (1964) సినిమాకు సంభాషణలు రాయమంటే, ఎవిఎమ్‌ సంస్థ ''సర్వర్‌ సుందరం'' (1964) స్క్రిప్ట్‌ను కృష్ణన్‌ పంజు దర్శకత్వంలో సినిమాగా తీయడానికి ముందుకు వచ్చింది. చిత్రకళ అనే మద్రాసు సంస్థ అతని ''మేజర్‌ చంద్రకాంత్‌''ను హిందీలో ''ఊంచే లోగ్‌'' ను ఫణి మజుందార్‌ దర్శకత్వంలో అశోక్‌ కుమార్‌, రాజ్‌ కుమార్‌, ఫిరోజ్‌ ఖాన్‌, తరుణ్‌ బోస్‌ వంటి మేటి నటులతో నిర్మించి ఎవార్డు తెచ్చుకుంది. హీరోయిన్‌గా కె. ఆర్‌. విజయ వేసింది. తర్వాతి ఏడాది తమిళంలో తీసినపుడు ఆ పాత్ర జయలలిత వేసింది. 1968లో ''సుఖదుఃఖాలు''గా తెలుగులో తీసినపుడు వాణిశ్రీ వేసింది. బాలచందర్‌ ప్రతిభ గమనించిన జెమినీ సంస్థ ''భామావిజయం'' (1967) సినిమా రచనే కాక, దర్శకత్వం కూడా అప్పగించింది.  తెలుగు, హిందీ వెర్షన్ల దర్శకత్వం కూడా అతనికే యిచ్చింది. ''కలక్టర్‌ జానకి''కి మూలచిత్రం ''ఇరు కొడుగళ్‌'' (రెండు గీతలు-1969) అతని చేతనే చేయించింది. కెబి తన నాటకాల్లో, సినిమాల్లో యింగ్లీషు భాషను, ఆ సామెతలను విస్తారంగా వాడి మధ్యతరగతి మేధావులను ఆకట్టుకున్నారు. ''కలక్టర్‌ జానకి''లో లైఫ్‌, ఫైల్‌ అనే పదాలతో ఆడుకుంటూ ఓ సీనుంది, చూడండి.

''సర్వర్‌ సుందరం'' అనాకారి, విద్యాహీనుడు, అమాయకుడు అయిన హోటల్‌ సర్వర్‌ తన హోటల్‌ ప్రొప్రయిటర్‌ కూతురు తనను వలచిందని భ్రమపడి, ఆమె కోసం కష్టపడి పైకి వస్తాడు. ఆమెను ప్రేమించి, ఆమె ప్రేమను పొందిన అతని స్నేహితుడు యితని హితం కోరి అతన్ని భ్రమల్లోనే వుంచి, సినిమా నటుడయ్యేందుకు దోహదం చేస్తాడు. పెద్ద సినిమా నటుడయ్యాక నిజం తెలిసినా దాన్ని తట్టుకోగలిగే స్థయిర్యాన్ని హీరో ఆ పాటికి తెచ్చుకుంటాడు. సినిమా అక్కడితో ముగిసిపోదు. సినిమా షూటింగు కారణంగా తల్లి అవసాన థలో అతను దగ్గర లేకపోవడం, దానితో అపరాధభావనతో అతను సినిమాలు మానేయడం అనే ట్విస్టుతో సినిమా ముగుస్తుంది. ''భామావిజయం'' సినిమా మధ్యతరగతి మహిళల గురించి. పక్కింట్లో చేరిన సినిమాతారను మెప్పించాలనే యావతో ముగ్గురు తోడికోడళ్లు ఆశలకు, ఆడంబరాలకు పోయి జీవితాలను ఎలా దుఃఖభాజనం చేసుకున్నారో చెప్పే కామెడీ. ''ఇరు కొడుగళ్‌''లో ఒకతను తనకంటె తక్కువ స్థాయిలో వున్నామెను  ప్రేమించి, గర్భవతిని చేసి మోసగించి, యింకో ఆమెను పెళ్లాడతాడు. మోసగింపబడిన యువతి పట్టుదలతో ఐయేయస్‌ పాసయి కలక్టరు అవుతుంది. అనుకోకుండా భర్తకు పై అధికారిణి అవుతుంది. ఇతను అప్పటికే యింకో ఆమెను పెళ్లాడి మధ్యతరగతి జీవితం గడుపుతూ వుంటాడు. ఇక యిద్దరు స్త్రీలు, మధ్య హీరో నలగడం. చివరకు కలక్టర్‌ ప్రమాదంలో చనిపోయి, అతని భార్యకు నేత్రదానం చేయడంతో కథ ముగుస్తుంది. 

ఈ నాటకాలు, సినిమాలకు స్టార్లు అక్కరలేదు. కారెక్టరు నటులు, హాస్యనటులు చాలు. ఇదే కెబి సక్సెస్‌ ఫార్ములా అయింది. ఎమ్‌జీయార్‌, శివాజీ ఏలుతున్న స్టార్‌ సిస్టమ్‌ను తోసిరాజని, చిన్న నటులతో లో బజెట్‌ సినిమాలు తీసి కథకు పట్టం కట్టి, డైరక్టరే స్టార్‌ అని నిరూపించారు. ఆ విషయం చాటి చెప్పడానికి వాల్‌ పోస్టరుపై మబ్బుల్లో తన పేరు వేసుకున్నారు. అది చూసి యిన్‌స్పయిరైన దాసరి కూడా అలాగే వేసుకునేవారు. కెబి సినిమాల్లో హీరోగా శివకుమార్‌, ముత్తురామన్‌, శ్రీకాంత్‌, నాగేశ్‌ యిలాటివాళ్లే వుండేవారు. చాప్లిన్‌ స్టయిల్లో నాగేశ్‌ పాత్రలు రూపొందించి హిట్లు కొట్టారు. డైరక్టరుగా అవకాశం వచ్చినపుడు తన నాటకం ''నీర్‌ కుమళి''నే సినిమాగా మలిచారు. ఆసుపత్రిలో మృత్యుముఖంలో వున్న రోగిగా వుంటూ అందర్నీ అల్లరి పట్టిస్తూ, వుత్తుత్తినే అడలగొడుతూ వున్న నాగేశ్‌కు చివరి క్షణాల్లో నిజంగా అవసరం పడినపుడు 'నాన్నా, పులి' కథలోలా జరిగి వైద్యసహాయం అందక చనిపోతాడు. దాన్ని నటీమణి సావిత్రి తెలుగులో ''చిరంజీవి'' పేర తన డైరక్షన్‌లో చలంతో తీస్తే సినిమా ఫ్లాపయింది. మనవాళ్లు అంత ట్రాజడీ తట్టుకోలేక పోయారు లాగుంది. కెబి స్రిప్టుతో చలం నటించిన రీమేక్స్‌ ''సత్తెకాలపు సత్తెయ్య'', ''సంబరాల రాంబాబు'' బాగా ఆడాయి – అమాయకుడైన కథానాయకుడికి చివర్లో విజయం సమకూరుతుంది కాబట్టి! వీటి కాన్వాస్‌ చిన్నదే. స్టేజీ నాటకాన్ని తెరకెక్కించినట్లే కనబడతాయి. ఈ నాటకీయత, పదునైన, దీర్ఘమైన సంభాషణలపై వ్యామోహం కెబిని ఎప్పటికీ వదలలేదు. ''అంతులేని కథ'' సినిమాలో హీరోయిన్‌పై అలవికాని కుటుంబబాధ్యత వుంటుంది. పెళ్లి వాయిదా వేస్తూ వుంటుంది. ఎన్నాళ్లయినా సరే ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్న బాయ్‌ ఫ్రెండ్‌ ఆమెను తల్లికి పరిచయం చేయాలని యింటికి తీసుకెళతాడు. ఆమెకు యీమె నచ్చదు. ఈమె వెళ్లిపోతూ వుంటే 'గర్వం ఎక్కువగా వుందే' అని కామెంట్‌ చేస్తుంది. 'పెళ్లికాని అమ్మాయికి గర్వం వున్నా ఫర్వాలేదు కానీ గర్భం వుండకూడదు' అని హీరోయిన్‌ సమాధానం చెప్తుంది. ఇలాటి వర్డ్‌ప్లే వలన థియేటర్‌లో చప్పట్లు పడతాయి కానీ పాత్ర ఔచిత్యం దెబ్బ తింటుంది. కానీ కెబి అలా అనుకోలేదు. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2014)

[email protected]

Click here For Part-1