‘బంధం’ తారుమారవుతుందా?

‘అనుబంధం…ఆత్మీయత అంతా ఒక బూటకం’…అన్నారు సినారె ఓ సినిమా పాటలో. ఇది మానవ సంబంధాలేక కాదు, రాజకీయ సంబంధాలకూ వర్తిస్తుంది.  పార్టీల, నాయకుల స్నేహాలు అప్పటికప్పుడున్న రాజకీయ పరిస్థితుల మీద, భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాల…

‘అనుబంధం…ఆత్మీయత అంతా ఒక బూటకం’…అన్నారు సినారె ఓ సినిమా పాటలో. ఇది మానవ సంబంధాలేక కాదు, రాజకీయ సంబంధాలకూ వర్తిస్తుంది.  పార్టీల, నాయకుల స్నేహాలు అప్పటికప్పుడున్న రాజకీయ పరిస్థితుల మీద, భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాల మీద ఆధారపడి ఉంటాయి. అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. పార్టీల మధ్య పొత్తులు ఎప్పుడు చిత్తవుతాయో, ఎప్పుడు కొత్త స్నేహాలు కలుస్తాయో అర్థం కాదు. ద్వేషించుకున్న పార్టీలు ఉన్నట్లుండి ఒక్కటైపోతాయి. పాలు నీళ్లలా కలిసిపోయిన పార్టీలు శుత్రువులవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల నాటికి ఇదే దృశ్యం కనబడుతుందేమోనని కొందరు రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఇప్పటికి అనుమానాలే అయినా రేపు నిజం కూడా కావొచ్చు. వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీబీజేపీ బంధం బద్దలవుతుందని,  తెలంగాణలో టీఆర్‌ఎస్‌బీజేపీ దోస్తీ చేస్తాయని అనుకుంటున్నారు. ఇందుకు అప్పుడప్పుడు సంకేతాలు కనబడుతున్నాయి. కొన్ని పరిణామాలు ఆ దిశగా అనుమనాలు కలిగిస్తున్నాయి. 

ఆంధ్రలో భాజపా కసరత్తు….టీడీపీకి గుబులు

ఆంధ్రప్రదేశ్‌లో భాజపా బలం పెంచుకునే దిశగా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఏ నాయకుడు దొరికితే ఆ నాయకుడిని పార్టీలో చేర్చుకుంటోంది.  వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తున్న భాజపా ఎలాగైనా దక్షిణాదిని ఆక్రమించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కొన్నేళ్ల క్రితం తొలిసారిగా కర్నాటకలో అడుగుపెట్టి ఆ తరువాత భ్రష్టుపట్టిపోయిన కమల దళం  ఇప్పుడు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల మీదనే కన్నేసింది. కేరళ, తమిళనాడులను ఛేదించడం  ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. అందుకే ముందుగా తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని, వీలైతే ఎక్కడో ఓ చోట అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో వరస విజయాలు సాధించకముందు నుంచే అంటే  ఉమ్మడి తెలుగు రాష్ర్టం విడిపోయిన తరువాత కొంతకాలం నుంచే ఆంధ్రలో భాజపా పావులు కదపడం ప్రారంభించింది. అక్కడ పూర్తిగా నిర్వీర్యమైపోయిన కాంగ్రెసు పార్టీ నుంచి నాయకులను ఆకర్షించడం ప్రారంభించింది. ఎన్నికల్లో విజయాలు సాధిస్తున్న క్రమంలో ఆంధ్రలో పార్టీని బలోపేతం చేసే పనిలోనూ వేగం పెంచింది. భాజపా చేస్తున్న ఈ కసరత్తు టీడీపీకి గుబులు పుట్టిస్తోంది. ఆంధ్రలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల తరువాత బలంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు నాందిగా కాంగ్రెసులో సుదీర్ఘ కాలం మనుగడ సాగించిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణను లాగేసింది. కాంగ్రెసు నుంచి కావూరి సాంబశివరావు, పురంధరేశ్వరి అంతకుముందే భాజపా తీర్థం పుచ్చుకున్నారు. 

కాంగ్రెసులో భవిష్యత్తు లేదనుకునే నాయకులంతా భాజపా వైపు చూస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెసులో ఉన్నప్పుడు టీడీపీని బలంగా ఎదుర్కొన్న నాయకులంతా ఇప్పుడు భాజపాలో చేరుతుండటంతో పసుపు నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి రాష్ర్ట పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ,  విభజనను తీవ్రంగా వ్యతిరేకించి కాంగ్రెసును వీడిని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కమల దళంలో చేరతారనే ప్రచారం చాలాకాలం నుంచి జరుగుతోంది. త్వరలో ఈ పని జరిగే అవకాశాలున్నాయి. కాంగ్రెసు నాయకులనే కాకుండా వైఎస్ జగన్ నాయకత్వంలోని వైకాపా నేతలను కూడా గుంజకోవాలని భాజపా నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. వైకాపా నుంచి బయటకు వచ్చిన నాయకులు కమలం వైపే చూస్తున్నారు. భవిష్యత్తులో టీడీపీలోని అసంతృప్త నాయకులు కూడా భాజపాలో చేరినా ఆశ్చర్యం లేదు. 2019 నాటికి ఆంధ్రలో బలమైన శక్తిగా ఎదగాలని భాజపా విశ్వప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీభాజపా పొత్తుకు గండి పడుతుందేమోనని రెండు పార్టీల్లోని నాయకులు అప్పుడప్పుడు బహిరంగంగానే అంటున్నారు. ఈ విషయంలో నోరు జారి మాట్లాడిన ఒకరిద్దరు మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు కూడా. ముఖ్యంగా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అనుకున్న స్థాయిలో సాయం అందకపోవడం కూడా టీడీపీకి అసంతృప్తి కలిగిస్తోంది. ఆంధ్రను అన్ని విధాల ఆదుకుంటామని, ప్రత్యేక  హోదా కల్పిస్తామని, రాజధాని నిర్మాణానికి ఇతోధిక సాయం చేస్తామని హామీల మీద హామీలు ఇచ్చిన భాజపా అధికారంలోకి వచ్చాక స్పందిస్తున్న తీరు రెండు పార్టీల మధ్య ఎడం పెరగడానికి కారణమవుతోంది. 

భాజపాపై చంద్రబాబు అసంతృప్తి…!

భాజపా వ్యవహారశైలిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈమధ్య విజయవాడలో జరిగిన పార్టీ సమావేశంలో రాష్ర్టంలో భాజపా బలపడే ప్రయత్నాలు చేస్తోందని, కాబట్టి టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. టీడీపీకి వ్యతిరేకంగా కాంగ్రెసులో ఉన్న బలమైన నాయకులను ఆ పార్టీ చేర్చుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు. తమకు మాటమాత్రం చెప్పకుండా ఇతర పార్టీల నాయకులను భాజపాలో చేర్చుకుంటున్న వైనంపై బాబు కమలం హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారట…!  దీంతో భాజపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు హరిబాబు తీవ్రంగా ఆగ్రహించి నేతలను పార్టీలో చేర్చుకోవడం తమ అంతర్గత వ్యవహారమని, ఇందుకు బాబు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారట..! రాజధాని కోసం ఎంపిక చేసిన ప్రాంతం మీద కూడా భాజపా అసంతృప్తి వ్యక్తం చేసింది. పైకి ఏమీ వ్యతిరేకించకపోయినా పంట పొలాలు తీసుకోవడం పట్ల భాజపా రాష్ర్ట అధ్యక్షుడు హరిబాబు మీడియా సమావేశంలోనే అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ సభ్యత్యాల విషయంలోనూ రెండు పార్టీల మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ భాజపాకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడే పెద్ద దిక్కు. రాష్ర్ట విభజన సమయంలో పార్లమెంటులో ధాటిగా మాట్లాడిన వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాల ఆదుకుంటామని అన్నారు. కాని ఇప్పటివరకూ ఏమీ లేదు. అయితే ఈమధ్య పారిశ్రామికవేత్తల సమావేశంలో మాట్లాడిన మంత్రి ఆంధ్రకు పోలవరం తీసుకొచ్చానని, ప్రత్యేక ెదా తెచ్చానని చెప్పుకున్నారట…! ఇది టీడీపీ నాయకులకు ఆగ్రహం కలిగిస్తోంది.  ఇలాంటివే మరికొన్ని ఉన్నాయి. 

కమలం గులాబీ దోస్తులవుతాయా?

ఆంధ్రలో భాజపాటీడీపీ మధ్య ఎడం పెరుగుతోందనే అనుమనాలు కలుగుతుండగా, తెలంగాణలో ఎడమొఖం పెడమొఖంగా ఉన్న గులాబీ, కమలం దోస్తు కట్టే పరిస్థితి ఏర్పడుతుందా అనే అనుమనాలు కలుగుతున్నాయి. భాజపా పట్ల మారుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ధోరణిని అందరూ చూస్తూనే ఉన్నారు. ‘ఎవ్వరి మాటా వినని సీతయ్య’ టైపులో వ్యవహరిస్తున్నారు. అధికార పీఠం ఎక్కినప్పటినుంచి ఎవ్వరినీ లెక్కచేసేది లేదనే తీరులో చెలరేగిపోతున్నారు. ప్రధాని మోడీని ఫాసిస్టు అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఖాతరు చేసేది లేదన్నట్లుగా వ్యవహరించారు. అయితే వివిధ ఎన్నికల్లో భాజపా విజయాలను చూశాక, అంతర్జాతీయ స్థాయిలో మోడీ ఇమేజ్ పెరగడం గమనించాక కేంద్రంతో ఘర్షణ పడిదే  ప్రయోజనం లేదని కేసీఆర్ గ్రహిస్తున్నారు. కేంద్ర మంత్రులే మోడీకి ఎదురు చెప్పలేని పరిస్థితి ఉంది. మంత్రివర్గంపై, పాలనపై పూర్తి పట్టు సాధించిన మోడీ అంతర్జాతీయ స్థాయిలోనూ ‘ఆహా…ఓహో అనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంతో ఘర్షణ పడితే అది వ్యక్తిగతంగా మోడీతో వైరం పెట్టుకున్నట్లే. ఏ విషయంలోనైనా, ఏ రకంగానైనా కేంద్రం సాయం లేనిదే తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదు. ఈ సంగతిని ఆలస్యంగా గ్రహించిన కేసీఆర్ రాజకీయంగా భాజపాతో సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఈమధ్య ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం నుంచి కేసీఆర్ వైఖరిలో మార్పు ఎక్కువగా కనబడుతోందని టీఆర్‌ఎస్ నాయకులే చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీని అణగదొక్కాలంటే కమలం సైకిల్ బంధానికి గండి కొట్టాలి. అలా చేయాలంటే ఇప్పటి నుంచే భాజపాతో సఖ్యతగా ఉండటం మంచిదని కేసీఆర్ భావిస్తున్నారు. కేసీఆర్‌లో మార్పును గమనించిన కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన పట్ల సానుకూల వైఖరితోనే ఉండాలనుకుంటోంది. ప్రణాళిక సంఘం వ్యవహారంలో కేసీఆర్ ఇచ్చిన కొన్ని సూచనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుందట…! తెలంగాణలో చెరువుల పునర్నిర్మాణం కోసం ఉద్దేశించిన ‘మిషన్ కాకతీయ’ను డిసెంబరులోనే ప్రారంభిస్తామని కేసీఆర్ చెప్పారు. కాని దాన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చేతుల మీదుగా ప్రారంభింపచేయాలని జనవరి రెండో వారానికి వాయిదా వేశారు. ఇలా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సానుకూల వైఖరితో వ్యవహరించడం మొదలైంది. సహజంగానే ఈ వాతావరణం రెండు పార్టీల మధ్య ఎడం తగ్గించేందుకు దోహదపడుతుంది. రాష్ర్ట విభజన బిల్లులో లోపాలున్నాయని, దీనివల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నందున సవరిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించగానే టీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. కాని ఆ తరువాత వైఖరి మార్చుకొని వెంకయ్యను సమర్థించారు. ఇలాంటి సంఘటనలే మరికొన్ని ఉన్నాయి. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల నాటికి భాజపా-టీడీపీ స్నేహగీతంలో అపశృతి పలికినా ఆశ్చర్యం లేదు. తెలంగాణలో భాజపా-టీఆర్‌ఎస్ దోస్తీ చేసినా  ఆశ్చర్యం లేదు. రాజకీయం ఓ రంగుల రాట్నం. ఇలా తిరుగుతూనే ఉంటుంది. 

ఎం.నాగేందర్