భారతరత్న యివ్వబోతున్న వాజపేయి, పండిత మదన్ మోహన్ మాలవ్యా యిద్దరూ గొప్పవారే, పురస్కారానికి తగినవారే. పివికి ఎందుకివ్వలేదు, ఎన్టీయార్‌కి ఎందుకివ్వలేదు అంటే ఎలా యిస్తారు? తెలుగువాళ్లు ప్రతీదానికీ వంతులు వేసుకుంటూ వుంటే! పివి జీవితమంతా కాంగ్రెసులోనే గడిచింది. ఇందిరా గాంధీ కుటుంబానికి అత్యంత ఆప్తుడు. రాజీవ్ హత్యతో క్రుంగిపోయిన కాంగ్రెసుకు సారథ్యం వహించి, దానికి మళ్లీ జీవం పోసినవాడు. ఆయనకు బిజెపి ఎలా యిస్తుంది? సోనియా బలంగా వుండి వుంటే ఆవిణ్ని ఉడికించడానికి యివ్వాలి తప్ప వేరేలా యిచ్చేందుకు అవకాశం లేదు. బిజెపికి ఆప్తుడు కాకపోయినా కాంగ్రెసేతర పక్షాలను ఐక్యతను సాధించిన ఎన్టీయార్‌కు యిచ్చే అవకాశం వుంది. ఎన్టీయార్‌కు యిస్తే తెలంగాణ మండిపడుతుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు డొమెస్టిక్ టెర్మినల్‌కు ఆ పేరు పెట్టడమే కాకుండా యిది కూడానా? అంటుంది. రాష్ట్రం విడిపోకుండా వుంటే యిలాటి గొడవ వచ్చేది కాదు, ఇప్పుడు ఎన్టీయార్‌పై ఆంధ్ర ముద్ర పడిపోయింది.
ఇక మాలవ్యాకు మాత్రమే ఎందుకివ్వాలి, లాలా లజపతి రాయ్‌కు, టిళక్కు, గోఖలేకు ఎందుకివ్వకూడదంటే జవాబు చెప్పలేం. వీళ్లందరూ ఎవరికి వారు దిగ్గజాలే. వారందరికీ ఒక్క నమస్కారం పెట్టి వదిలేసి తర్వాతి తరంలో వాళ్లకు యిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ తరానికి వెళ్లారు. ప్రధాని నియోజకవర్గం వారణాశి కావడం, అదే వూళ్లో మాలవ్యా గారు పెట్టిన బెనారస్ హిందూ యూనివర్శిటీ వుండడం, మాలవ్యా హిందూ జాతీయవాది కావడం ముఖ్యమైన కారణాలు కావచ్చు. బెనారస్ హిందూ యూనివర్శిటీ పెట్టినందుకు మాలవ్యాగారిని సత్కరించి తీరాలంటే అదే చేత్తో ఆలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ పెట్టిన సయ్యద్ అహ్మద్ ఖాన్‌గారిని కూడా సత్కరించాలి. ముస్లిముల వెనకబాటుతనానికి ప్రధాన కారణం నిరక్షరాస్యత. ఆంగ్లవిద్య ప్రాధాన్యాన్ని హిందువులు గుర్తించనంతగా ముస్లిములు గుర్తించలేదు. పైగా అది మతవిరుద్ధం అనుకుని, తమలో తాము ముడుచుకుపోతూ వుంటే వారిలో ఆ మూఢనమ్మకాన్ని పోగొట్టి, విద్యాసక్తి రగిలించి, యూనివర్శిటీ ద్వారా అనేకమంది ముస్లిము మేధావులను తయారు చేసిన సయ్యద్ అభినందనీయుడే కదా. అగ్రశ్రేణిలో వున్నవారికి మెరుగులు పెట్టిన వారికంటె వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించినవారిని ఎక్కువగా ప్రశంసించాలి. భారతరత్న యివ్వడానికి చేతులు రాకపోతే మరో అవార్డయినా యిస్తే సముచితంగా వుంటుంది.
వాజపేయి అజాతశత్రువు. బిజెపి అంటే పడనివారు కూడా ఆయనను విమర్శించడానికి జంకేట్లా చేసిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన ఆరెస్సెస్‌కు ఒక మాస్క్ (ముసుగు)లా పనిచేశాడన్న ఆరోపణ వుంది. వాజపేయి, ఆడ్వాణీ యిద్దరివీ ఒకలాటి భావాలే వున్నా జనాల కోసం ఒకరు ఉదారవాదిగా, మరొకరు తీవ్రవాదిగా వేషాలు వేశారని అంటారు. కావచ్చు. ఎంతైనా వాజపేయిపై భారతప్రజలకు వ్యతిరేకత బలంగా లేదు. అందుకే విమర్శలు అంత బలంగా రాలేదు. రథయాత్ర నడిపిన ఆడ్వాణీకి యిచ్చి వుంటే తప్పక వచ్చేవి. భారతరత్న వరకు బాగానే వుంది కానీ వాజపేయి పుట్టినరోజును 'సుపరిపాలన దినం'గా జరపడం కాస్త వింతగా వుంది. వాజపేయిది అంత సుపరిపాలన అయితే ఐదేళ్లలోనే ప్రజలు గద్దె దింపేశారెందుకు అన్న ప్రశ్న వస్తుంది. యుపిఏ హయాంలో జడలు విరబోసుకున్న స్కాములకు ఎన్డిఏ హయాంలోనే విత్తనాలు పడ్డాయి కదా. వాళ్లు తీసుకున్న వివాదాస్పద విధాన నిర్ణయాల వలననే దేశాన్ని దోచుకోవడానికి వీలుపడింది. భారత్ వెలిగిపోతోంది అని ఎంత డప్పు కొట్టినా నమ్మలేదు జనాలు. ఇప్పుడు వాజపేయిది 'సుపరిపాలన' అంటే వారి వివేకాన్ని శంకించినట్లే!
-ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2014)