నిలబడినవి తక్కువ.. నిరాశలే ఎక్కువ!
ఈ యేడాది కూడా తెలుగు సినీ పరిశ్రమకి అతి తక్కువ విజయాలు… అనేక పరాజయాలని ఇచ్చి నిరాశపరిచింది. గత రెండేళ్లతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలోను సక్సెస్ రేట్ ఇంచుమించు అదే ఉన్నా కానీ సక్సెస్ అయిన సినిమాల్లో చిన్న చిత్రాలు, మీడియం రేంజ్ చిత్రాలే ఎక్కువ. భారీ చిత్రాల్లో ఎక్కువ శాతం ఫెయిలవడంతో 2014 బాగా డిజప్పాయింట్ చేసింది. ఈ యేడాదిలో వచ్చిన విజయవంతమైన చిత్రాలు… ఫ్లాప్ అయిన చెప్పుకోతగ్గ చిత్రాల జాబితా చూద్దాం.
బ్లాక్‌బస్టర్ ఆఫ్ ది ఇయర్!
ఏప్రిల్‌లో విడుదలైన ‘రేసుగుర్రం’ సాధించిన వసూళ్లని ఆ తర్వాత ఎనిమిది నెలల్లో వచ్చిన ఏ చిత్రం దాటలేకపోయింది. 2012లో బిగ్గెస్ట్ హిట్ అయిన గబ్బర్‌సింగ్ అరవై కోట్ల పైచిలుకు వసూళ్లు సాధిస్తే, 2013లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ దాదాపు డెబ్బయ్ అయిదు కోట్ల షేర్ సాధించింది. కానీ ట్రేడ్ వర్గాల రిపోర్ట్‌ల ప్రకారం ఈ ఏడాదికి బిగ్గెస్ట్ హిట్ అయిన ‘రేసుగుర్రం’ యాభై ఎనిమిది కోట్ల షేర్‌తోనే టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఈ సినిమాని దాటతాయని ఆశించిన ఏ చిత్రం కూడా విజయవంతం కాకపోవడంతో, ఏప్రిల్ తర్వాత వచ్చిన భారీ అంచనాలున్న సినిమాలన్నీ నిరాశ పరచడంతో ‘రేసుగుర్రం’ ఈ ఏడాదికి బ్లాక్‌బస్టర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. స్టార్‌గా అల్లు అర్జున్ రేంజ్ పెంచిన ఈ చిత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఉన్న వేల్యూ ఏంటో ఇంకోసారి చూపించింది. కథలో కొత్తదనం లేకపోయినా నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటే బాక్సాఫీస్‌ని ఏలేయవచ్చునని ఈ చిత్రం మళ్లీ నిరూపించింది. కాకపోతే ఈ స్థాయి ఎంటర్‌టైనర్స్ ఏవీ రాకపోవడంతో ఈ ఏడాదిలో యాభై కోట్ల షేర్ దాటిన ఏకైక చిత్రంగా ఇదొక్కటే నిలిచింది.
మూవీ ఆఫ్ ది ఇయర్!
ఈ ఏడాదికి ఉత్తమ చిత్రం మాత్రం ‘మనం’ అనేది వాదించనవసరం లేని వాస్తవం. ఎంటర్‌టైనర్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి కానీ ఇలాంటి చిత్రాలు ఎప్పుడో దశాబ్ధానికి ఓసారే వస్తాయి. ‘ఇది మన తెలుగు సినిమా’ అని సగర్వంగా చెప్పుకునేలా ‘మనం’ రూపొందింది. అక్కినేని హీరోల కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ముప్పయ్ ఎనిమిది కోట్ల షేర్ రాబట్టుకుందని అంచనా. ప్రశంసలు అందుకున్న ఉత్తమ చిత్రాలు చాలా అరుదుగా ఘన విజయాల్ని కూడా దక్కించుకుంటాయి. మనం అటు ఆర్థికంగా ఘన విజయం సాధించడంతో పాటు ఇటు అందరి మనసులు గెలుచుకుని 2014కి ‘మూవీ ఆఫ్ ది ఇయర్’గా నిలిచింది.
బయ్యర్ల దిల్ ఖుష్!
తక్కువ బడ్జెట్‌తో రూపొంది… బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బయ్యర్లు, ప్రొడ్యూసర్ల దిల్ ఖుష్ చేసిన చిత్రాల్లో ‘లౌక్యం’ టాప్‌లో ఉంటుంది. రెండు భారీ చిత్రాల మధ్య విడుదలైన ఈ చిత్రంపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. గోపీచంద్‌కి చాలా కాలంగా హిట్స్ లేకపోవడంతో లౌక్యం నిలబడడం కష్టమే అనుకున్నారు. ఆగడు, గోవిందుడు మధ్య వచ్చిన ఈ చిత్రం ఆ రెండూ సాధించలేని విజయాన్ని సాధించి దసరాకి పండగ చేసుకుంది. బాక్సాఫీస్‌ని గెలవడానికి కామెడీకి మించిన ఆయుధం లేదని ఇది చూపించింది.
వెంకటేష్‌తో ప్రయోగాత్మకంగా తీసిన ‘దృశ్యం’ కూడా పెట్టిన పెట్టుబడిపై రెండింతలు లాభాన్ని చవిచూసింది. మలయాళంలో విజయవంతమైన ఈ థ్రిల్లర్ విమర్శకుల ప్రశంసలు అందుకుని, కథాబలమున్న చిత్రాలకి ప్రేక్షకాదరణ తప్పక లభిస్తుందనే సంగతి స్పష్టం చేసింది. కమర్షియల్‌గా మరో సక్సెస్‌ఫుల్ ఫార్ములా అయిన హారర్-కామెడీ ‘గీతాంజలి’ అందర్నీ విస్మయపరిచింది. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం అదిరిపోయే విజయాన్ని అందుకుని చిన్న సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
పాస్ అయిపోయాయి!
‘రేసుగుర్రం’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘ఎవడు’ నిలిచింది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్‌లో మరో హిట్ రిజిష్టర్ చేసింది. విభిన్నమైన కథాంశాన్ని తీసుకుని రొటీన్ ఫార్ములాతో తెరకెక్కించిన ఈ చిత్రానికి సంక్రాంతి రిలీజ్ కలిసి వచ్చింది. బాలకృష్ణతో నాలుగేళ్ల క్రితం ‘సింహా’ తీసిన బోయపాటి శ్రీను మరోసారి ఆయనతో హిట్ ఇచ్చి… నటసింహాన్ని ప్రేక్షకజనరంజకంగా చూపించే నైపుణ్యం ఇప్పుడున్న దర్శకుల్లో తనకి మాత్రమే ఉందని లెజెండ్‌తో నిరూపించాడు. రవితేజ ‘పవర్’ బయ్యర్స్ సేఫ్ కాగలిగారు. ‘అల్లుడు శీను’కి కూడా వినాయక్ తన సినిమా బయ్యర్లని గట్టున పడేసాడు. కాకపోతే ఈ చిత్రాలకి ఖర్చు ఎక్కువ కావడంతో నిర్మాతలు లాభ పడలేదు.
సోలో హీరోగా సక్సెస్ కాలేకపోతున్న శర్వానంద్ సుడి తిరిగింది. ‘రన్ రాజా రన్’ అతడికి మచ్ నీడెడ్ హిట్ అందించింది. కొత్త దర్శకుడు సుజిత్ సరికొత్త వినోదంతో ప్రేక్షకుల్ని అలరించాడు. ‘రన్ రాజా రన్’కి ఏ సెంటర్స్ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ బాగా వచ్చింది. రొటీన్ సినిమాలు పక్కనపెట్టి కొత్త రకం చిత్రాలు చేయడానికి మొగ్గు చూపుతోన్న నిఖిల్ ‘కార్తికేయ’తో మళ్లీ ఇంప్రెస్ చేసాడు. డెబ్యూ డైరెక్టర్ చందు ఆసక్తికరమైన కథ, కథనాలతో కట్టి పడేసి బాక్సాఫీస్‌ని గెలిచేసాడు. ఊహలు గుసగుసలాడే, భీమవరం బుల్లోడు, కొత్తజంట, లవర్స్, హృదయ కాలేయం బాక్సాఫీస్‌ని సేఫ్‌గా దాటేసాయి.
మిస్ అయినవి!
కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించుకున్నా కానీ సేఫ్ కాలేక యావరేజ్ ఫలితాలతో సరిపెట్టుకున్న సినిమాలూ చాలానే ఉన్నాయి. నలభై కోట్లకి పైగా వసూళ్లు సాధించి.. ఈ ఏడాది వచ్చిన బిగ్గెస్ట్ గ్రాసర్స్‌లో మూడో స్థానంలో నిలిచినా కానీ ‘గోవిందుడు అందరివాడేలే’ బయ్యర్లకి స్వల్ప నష్టాలు మిగిల్చింది. దసరా సెలవులు కలిసి వచ్చినా కానీ ఈ చిత్రం యావరేజ్ రిజల్ట్‌తోనే సరిపెట్టుకుంది. దసరా తర్వాత వచ్చిన ‘ఒక లైలా కోసం’కి మంచి రివ్యూస్ వచ్చినా యావరేజ్ మార్క్‌ని దాటలేకపోయింది. నితిన్, పూరి జగన్నాథ్‌ల ‘హార్ట్ ఎటాక్’ ఏ సెంటర్స్‌లో పెద్దగా ఫేర్ చేయలేదు కానీ బి, సి సెంటర్స్‌లో ఫర్వాలేదనిపించుకుంది. పూరి ఈమధ్య తీసిన సినిమాల్లో మెరుగ్గా ఉందనే టాక్ దీనికి హిట్ స్టేటస్ తీసుకురాలేకపోయింది.
మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా వచ్చిన సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ రిలీజ్ ‘పిల్లా నువ్వులేని జీవితం’ నిర్మాతలకి సేఫ్ వెంఛర్ అయినా బయ్యర్లని పూర్తిగా గట్టెక్కించలేకపోయింది. బ్యాడ్ సీజన్‌లో రిలీజ్ చేయడం కూడా దీనికో కారణమని చెప్పాలి. మంచు హీరోలంతా కలిసి నటించిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ కమర్షియల్‌గా ఫర్వాలేదనిపించుకుంది. అలా ఎలా, ది ఎండ్‌లాంటి చిన్న చిత్రాలు కూడా ఒక వర్గం ప్రేక్షకులని ఆకట్టుకుని తమ ఉనికిని చాటుకున్నాయి.
అంచనాలు పటాపంచలు!
సంక్రాంతికి విడుదలైన ‘1 నేనొక్కడినే’పై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. కానీ అనూహ్యంగా ఈ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. సుకుమార్ ప్రయోగాత్మకంగా తీసిన ఈ చిత్రం ‘కల్ట్ స్టేటస్’ అయితే దక్కించుకుంది కానీ మెజారిటీ ఆడియన్స్ నుంచి తిరస్కరణకి గురయి ఈ ఏడాదిలో వచ్చిన బిగ్గెస్ట్ ఫ్లాప్స్‌లో ఒకటిగా మిగిలింది. మహేష్ నటించిన మరో చిత్రం ‘ఆగడు’దీ అదే పరిస్థితి. ఎన్టీఆర్ నటించిన ‘రభస’ చిత్రంపై విడుదలకి ముందు ఎందుకో అంత బజ్ లేదు. విడుదలయ్యాక కూడా రభస సౌండ్ చేయకుండా డిజప్పియర్ అయిపోయింది. ఫ్లాపులు చాలా ఉన్నా కానీ స్ట్రెయిట్ ఫిలింస్‌లో మేజర్ డిజప్పాయింట్‌మెంట్స్ ఈ మూడే.
మిగిలిన వాటిలో చెప్పుకోతగ్గ ఫ్లాపులంటే.. పైసా, ఆహా కళ్యాణం, జంప్ జిలాని, రౌడీ, బసంతి, లడ్డుబాబు, అనామిక, ఉలవచారు బిర్యానీ, ఆటోనగర్ సూర్య, మాయ, గాలిపటం, నీ జతగా నేనుండాలి, అనుక్షణం, రోమియో, కరెంట్ తీగ, ఎర్రబస్సు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, జోరు, రౌడీఫెలో, రఫ్, యమలీల 2, చక్కిలిగింత, లక్ష్మి రావే మా ఇంటికి.. ఇలా లిస్టు చాలా పెద్దదే ఉంది.
సూపర్ షాక్‌లు!
స్ట్రెయిట్ సినిమాల్తో పడుతోన్న తిప్పలు చాలవన్నట్టు డబ్బింగ్ చిత్రాలు కూడా బయ్యర్ల నడ్డి విరిచాయి. అంచనాలున్న ‘సికిందర్’లాంటి డిజాస్టర్స్ కోలుకోలేని దెబ్బతీసాయి. రజనీకాంత్ కూడా రెండు సార్లు నిరాశ పరచడంతో ఈ ఏడాది తన అభిమానులకి పీడకలగా మారింది. విక్రమసింహా చిత్రం యానిమేషన్ మూవీ అని సాకు చెప్పుకున్నా.. లింగ పరాజయానికి సాకులు వెతకడం కష్టం. డబ్బింగ్ సినిమాల్లో విశాల్ నటించిన పూజ మాత్రం సక్సెస్ అయింది. తక్కువ రేట్లకి అమ్మడం ఈ చిత్రానికి ప్లస్ అయితే మిగతా వాటికి అధిక ధరలే కొంప ముంచాయి.
ఈ ఏడాదిలో చివరిగా వచ్చిన ‘ముకుంద’, ‘చిన్నదాన నీకోసం’ టాక్ అంత బాలేకున్నా ఓపెనింగ్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. వీటి ఫలితం ఏమిటనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాలి. ఏదేమైనా 2014 టాలీవుడ్‌కి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. వచ్చే సంవత్సరంలో అయినా ఈ పరిస్థితి మారి భారీ చిత్రాలు భారీ లాభాల్ని తెచ్చి పెడతాయని, చిన్న సినిమాలు పెద్ద సంఖ్యలో విజయం సాధించి బాక్సాఫీస్‌ని బిజీగా ఉంచుతాయని కోరుకుందాం.
గణేష్ రావూరి