‘మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్నవాడు..’ అంటూ ఓ పాట చాలా ఆవేదనా భరితంగా వుంటుంది. మనిషి నైతిక విలువలకు తిలోదకాలిచ్చేస్తుండడం ఇటీవలి కాలంలో విరివిగా కన్పిస్తోంది. ఓ వానరం.. మరో వానరం ప్రాణాపాయంలో వుంటే, నానా కష్టాలూ పడి దాన్ని రక్షించిందన్న వార్త ఒకటి వెలుగు చూస్తే, వానరాలే నయ్యం.. అనుకున్నారంతా.
మనిషి పరిస్థితి మాత్రం రోజురోజుకీ దిగజారిపోతోంది. మొన్నామధ్య హైద్రాబాద్లో ఓ తండ్రి, తన ఇద్దరు పిల్లల్ని కిరాతకంగా చంపేశాడు.. భార్యమీద కోపంతో. ఆ ఘటన అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది. తాజాగా గుంటూరు జిల్లాలో ఏడాది వయసు కూడా లేని ఓ చిన్నారి కృష్ణా నదిలో శవమై తేలింది. మతిస్థిమితం లేని బాబాయ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు తొలుత పోలీసులు.
అయితే, తన బిడ్డ చావు వెనుక పెద్ద మిస్టరీ వుందనీ, బిడ్డ కారణంగా తనకు ప్రాణ గండం పొంచి వుందని బిడ్డ తండ్రి, తన భర్త ఎప్పుడూ ఆవేదన చెందుతుండేవారనీ, తన బిడ్డ మోక్షజ్ఞ చావుకు తన భర్త కారణమయి వుండొచ్చని మోక్షజ్ఞ తల్లి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడానికీ ఆమె సిద్ధమవుతున్నారు.
ఇలాంటి వార్తలు వెలుగు చూస్తున్న ప్రతి సందర్భంలోనూ సమాజంలో విలువలు ఏ స్థాయికి పతనమవుతున్నాయోనన్న ఆవేదన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. కన్న పిల్లల్ని కాటేస్తోన్న పిశాచులు ఎక్కువైపోయారు.. బంధువులే రాబంధులుగా మారిపోతున్నారు. మూఢ నమ్మకాలో, ఆస్తి తగాదాలో.. ఇంకోటో.. కారణం ఏదైతేనేం.. అభం శుభం ఎరుగని చిన్నారులు బలైపోతుండడం అత్యంత బాధాకరమైన విషయం.