చోరీ చేసిన మేలు

గోస్వామి తులసీదాసు పాండు లిపిలో క్రీ.శ. 164లో రాసిన అసలైన ‘‘రామచరిత మానస్’’ (తులసీ రామాయణం అని కూడా అంటారు) ప్రతి 2011 డిసెంబరు 22 న చోరీకి గురైంది. దాంతో బాటు తులసీదాసుకు…

గోస్వామి తులసీదాసు పాండు లిపిలో క్రీ.శ. 164లో రాసిన అసలైన ‘‘రామచరిత మానస్’’ (తులసీ రామాయణం అని కూడా అంటారు) ప్రతి 2011 డిసెంబరు 22 న చోరీకి గురైంది. దాంతో బాటు తులసీదాసుకు చెందిన కొన్ని పూజా సామగ్రి కూడా. అవి వారణాశిలోని తులసీ ఘాట్‌లో వున్న తులసీదాస్ అఖాడాలోని హనుమాన్ దేవాలయంలో వుండేవి. ఆ గుడికి మహంత్ (ప్రధాన పూజారి)గా వుండే వీరభద్ర మిశ్రా సంరక్షణలో అవి వుండేవి. ఆయనకు అది తరతరాలుగా వంశపారంపర్యంగా వచ్చింది. ఆయన బెనారస్ హిందూ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. ఈ అరుదైన వస్తువులు పోవడంతో చాలా అలజడి చెలరేగింది. మిశ్రా కుటుంబమే దాన్ని మాయం చేసి వుంటుందన్న పుకార్లు కూడా వినిపించాయి. చివరకు వారణాశి పోలీసులు, సిబిఐవారి నామమాత్ర సహాయంతో ఏడు నెలలపాటు వెతికివెతికి వాటిని సాధించారు. మిశ్రా కుటుంబం హమ్మయ్య అని వూపిరి పీల్చుకుంటూండగా ‘ఇప్పటికైనా మీరు వీటిని ప్రభుత్వానికి అప్పగించేయండి, వీటిని కాపాడడం మీ తరం కాదు’ అని పై నుంచి ఒత్తిళ్లు రాసాగాయి. ఇన్ని తరాల వారసత్వాన్ని వదులుకోవడానికి ఇష్టపడని మిశ్రా కుటుంబం మూడు క్వింటాళ్ల బరువున్న ఒక ఫైర్, బుల్లెట్ ప్రూఫ్ సేఫ్ కొని దానిలో వీటిని పెట్టారు. ఇదివరకు అందరూ సందర్శించడానికి వీలుగా పెట్టేవారు. ఇప్పుడు సేఫ్‌లో పెట్టి తాళం వేసి ఏడాదికి ఓ సారి తులసీ జయంతి నాడు బయటకు తీసి ప్రదర్శిస్తున్నారు. 

ఈ వస్తువులు ఇలా పోవడంతో మిశ్రా గారు అర్చకత్వాన్ని తన పెద్దకొడుకు ప్రొఫెసర్ విఎన్ మిశ్రాకు అప్పగించారు. ఆయన రెండో కొడుకు న్యూరాజలిస్టు అయిన డా॥ విజయనాథ్ మిశ్రా తులసీదాసు ఇతర రచనలు, వాటి నకళ్లకై అన్వేషణ సాగించాడు. ఈనాటి వరకు ఆయన సేకరించినవి 173 అరుదైన చేతివ్రాత ప్రతులు! వాటిలో ఆయన రాసిన ఇతర రచనలతో పాటు, ఫార్సీలో, అవధిలో రాసిన రామచరితమానస్ ప్రతులు దొరికాయి. అంతేకాదు 90 ఏళ్ల క్రితం అనేక చిత్రపటాలతో లాహోర్‌లో ముద్రించిన ఉర్దూ రామచరితమానస్ కూడా దొరికింది. ఉన్నంతకాలం వాటి విలువ తెలియదు. పోయింది అనుకునేసరికి టెన్షన్ పడి తిరగడంతో ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి. ప్రతీ కీడులోను ఒక మేలు వుంటుందంటారు. ఇదేనేమో!

-ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]