ఎమ్బీయస్‌: అవార్డు వాపసీ

అవార్డులు వెనక్కి యిచ్చేయడంపై కమలహాసన్‌ స్పందన బాగుంది. ఈ మధ్య అనేకమంది రచయితలు, కళాజీవులు తమకు వచ్చిన ఎవార్డులు వెనక్కి యిచ్చేస్తున్నారు. టాప్‌ సైంటిస్టు, మహానుభావులు పిఎం భార్గవగారు 'పద్మభూషణ్‌' కూడా వెనక్కి యిచ్చేశారు.…

అవార్డులు వెనక్కి యిచ్చేయడంపై కమలహాసన్‌ స్పందన బాగుంది. ఈ మధ్య అనేకమంది రచయితలు, కళాజీవులు తమకు వచ్చిన ఎవార్డులు వెనక్కి యిచ్చేస్తున్నారు. టాప్‌ సైంటిస్టు, మహానుభావులు పిఎం భార్గవగారు 'పద్మభూషణ్‌' కూడా వెనక్కి యిచ్చేశారు. ఈ ఉధృతి యిలాగే కొనసాగితే ఎవార్డు వెనక్కి యివ్వనివాళ్లను పాపులుగా చూసే పరిస్థితి వచ్చేస్తుంది. జర్నలిస్టులు చుట్టుముట్టి 'సార్‌, మీ ఎవార్డు యింకా వెనక్కి  ఎందుకివ్వలేదు? అంటే మీరు మతోన్మాదాన్ని, పరమత అసహనాన్ని సమర్థిస్తున్నారా?' అని అడిగినా అడగవచ్చు. అవార్డు వెనక్కి యిచ్చేయడం వలన  అవార్డు యిచ్చిన ప్రభుత్వాన్ని, సంస్థను అవమానిస్తున్నారని కమలహాసన్‌ అభిప్రాయపడ్డాడు. అది నిజం.

ఈ సందర్భంలోనే కమలహాసన్‌ 'పరమత అసహనం 1947 నుంచీ వుంది, యివాళ కొత్తగా వచ్చినది కాదు, అందుకే పాకిస్తాన్‌ విడిపోయింది. రెండు దేశాలూ కలిసి వుంటే ఎన్నో అద్భుతాలు జరిగేవి.' అన్నాడు. నిజమే, పరమతద్వేషం కొంతమంది ప్రజల్లో వుంది. వాళ్లని రెచ్చగొట్టి రాజకీయంగా ఎన్‌క్యాష్‌ చేసుకునే నాయకులూ కొందరున్నారు. కానీ ప్రభుత్వం వైఖరి ఏమిటి అన్నదే ప్రశ్న. స్వాతంత్య్రం వచ్చాక ఎన్నో మతకలహాలు జరిగాయి, కులసంఘర్షణలు జరిగాయి. కానీ కొన్నిటినే మనం గుర్తు చేసుకుని, సంబంధిత రాజకీయపక్షాలను తప్పుపడుతున్నామెందుకు? గొడవలు వచ్చినపుడు ప్రభుత్వం చల్లార్చడానికి చూసిందా, ఎగదోయడానికి చూసిందా, నిర్లిప్తంగా వుందా అన్నదే ముఖ్యం. 1984 సిఖ్కులపై దాడుల సంగతే వుంది. ఇందిరా గాంధీని చంపిన సెక్యూరిటీ గార్డులు శిఖ్కులు. ఆపరేషన్‌ బ్లూస్టార్‌ నిర్వహించినందుకు ప్రతీకారంగా చంపారు. సాధారణ ప్రజలందరికీ కోపం వచ్చింది, బాధ వేసింది. దాన్ని ఇందిర వారసులుగా వచ్చిన కాంగ్రెసు నాయకులు ఎన్‌క్యాష్‌ చేసుకుందామనుకున్నారు. ప్రజలను శిఖ్కులు, శిఖ్కేతరులుగా విడగొట్టడానికి చూశారు. ఢిల్లీలో శిఖ్కులపై దాడులు జరిపించారు. ఆ దాడులకు కొందరు నాయకులు నాయకత్వం వహించారు. అధికారంలో వున్నది కాంగ్రెసు ప్రభుత్వమే కాబట్టి ఆ దాడులు జరుగుతూంటే అటెటో చూసింది తప్ప బాధ్యులను నియంత్రించ లేదు, దండించలేదు. అంతేకాదు, వెంటనే వచ్చిన పార్లమెంటు ఎన్నికలలో వారికి టిక్కెట్లు కూడా యిచ్చింది. అరుణ్‌ నెహ్రూ, సతీశ్‌ శర్మ వంటి వారి ఆధ్వర్యంలో నడిచిన ఎన్నికల ప్రచారంలో విడుదల చేసిన యాడ్స్‌లో శిఖ్కులను అవమానించడమే కాక, విలన్లుగా స్ఫురింపచేస్తూ 'మీ టాక్సీ డ్రైవర్‌ను చూసి మీరెందుకు భయపడాలి? శాంతిభద్రతలు కావాలంటే కాంగ్రెసుకే ఓటేయండి' అని వేశారు. శిఖ్కులకు బుద్ధి చెప్పాల్సిందే అని తక్కినవారికి తోచడంతో బాటు, ఇందిరపై సానుభూతి కలిసి రాజీవ్‌ గాంధీకి కనీవినీ ఎరుగనంతటి మెజారిటీ వచ్చింది. కానీ యిప్పటికీ 1984 నాటి మచ్చ కాంగ్రెసును వీడటం లేదు. ఎందుంటే ప్రభుత్వంలో వుండి అది అల్లర్లను ఆపకపోగా ప్రోత్సహించింది.

అదే విధంగా 2002 గోధ్రా అల్లర్ల సమయంలో ముస్లిములూ నష్టపోయారు, హిందువులూ నష్టపోయారు. మోదీ ప్రభుత్వం అల్లర్లను ఆపడానికి ప్రయత్నించలేదు. చూసీ చూడనట్లుగా వ్యవహరించమని పోలీసులకు ఆదేశాలిచ్చిందని ఆరోపణలున్నాయి. ఆ విధంగా 'ముస్లిములకు బుద్ధి చెప్పడం' ద్వారా హిందూ ఓటుబ్యాంకును పటిష్టం చేసుకుని రాజకీయంగా అనిశ్చితిలో వున్న మోదీ తన పదవిని పదిలం చేసుకున్నారు. అది రాజధర్మానికి విరుద్ధమని అప్పటి ప్రధాని వాజపేయి వ్యాఖ్యానించే పరిస్థితి తెచ్చుకున్నారు. మోదీ ఎన్ని గొప్ప పనులు చేసినా, గోధ్రా నీడ వెంటాడుతూనే వుంటుంది, కాంగ్రెసు ఎన్నేళ్లు పాలించగలిగినా 1984 పాతకం పీడిస్తూనే వుంటుంది. ఇప్పుడు అవార్డులు వెనక్కి యిచ్చేస్తున్న వారందరూ యీ పరమత అసహనాన్ని  ప్రస్తుత ప్రభుత్వమే పెంచి పోషిస్తోందని ఆరోపిస్తున్నారు. దానికి కమలహాసన్‌ సమాధానం చెప్పలేదు. ఇలాటి గొడవలు ప్రతీ ఐదేళ్లకోసారి అప్పుడప్పుడు వచ్చి పోతూ వుంటాయని మామూలుగా తేల్చేశారు. భార్గవగారు తన యింటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు – సైంటిఫిక్‌ సంస్థల సమావేశాల్లో కూడా ఆరెస్సెస్‌ వారు వచ్చి కూర్చుంటున్నారనీ, మొత్తమంతా కాషాయీకరణ అయిపోతోందని వివరాలిచ్చారు. నేనేం తినాలో, ఎవరిని పెళ్లాడాలో చెప్పేందుకు వీరెవరు అని అడిగారు. బీఫ్‌ విషయంలో సిద్ధరామయ్య తల నరికి ఫుట్‌బాల్‌ ఆడతానంటూ బిజెపి నాయకుడు బెదిరించడం అందరం చూశాం. ఇలాటి భాష యిదివరకు వినలేదు. ఈనాడు ఎటువంటి వాతావరణం వుందో చెప్పడానికి అనేక సంస్థల్లో జరుగుతున్న నియామకాల ఉదాహరణలున్నాయి. ఆరెస్సెస్‌ అభిమానులు కూడా దీన్ని కాదనలేని పరిస్థితిలో వున్నారు. అయితే వారు 'ఇన్నాళ్లూ లెఫ్టిస్టులు, సెక్యులరిస్టులు యీ పదవుల్లో వున్నారు. ఇన్నాళ్లకు మా వంతు వచ్చింది. మా కిష్టమైనవారికీ, మా తరహా ఆలోచనాధోరణి వున్నవారికీ అవకాశాలు వచ్చినందుకు సంతోషంగా వుంది.' అంటున్నారు. ప్రతిభ కంటె రాజకీయ, సామాజిక ఆలోచనాధోరణికే ఎక్కువ ప్రాధాన్యత యిస్తున్నారని గజేంద్ర చౌహాన్‌ నియామకాల వంటివి చాటి చెప్తున్నాయి. తమ ఆలోచనతో విభేదించేవారిని మట్టుపెట్టడానికి కూడా వెనుకాడని సందర్భాలు సైతం కనబడుతున్నాయి. 

ఈ ధోరణినే కొందరు మేధావులు నిరసిస్తున్నారు. అన్ని రకాల ఆలోచనలను సహించే, భరించే, యిముడ్చుకునే మన భారతీయసంస్కృతికి  యిది విరుద్ధమని బాధపడుతున్నారు. నిరసన తెలుపుదామనుకున్నారు. దానికి వారికి కనబడిన మార్గం – ఎవార్డులు తిరిగి యివ్వడం. పేరుమోసిన సాహితీమూర్తులు కాబట్టి వారి చర్యలకు ఎంతో ప్రాముఖ్యత వస్తోంది. అది ఆరెస్సెస్‌, బిజెపి నాయకులకు కంటగింపుగా వుంది. 'అవార్డులు వెనక్కి యిస్తున్నారు తప్ప డబ్బు వెనక్కి యివ్వటం లేదేం?' '1984 అల్లర్లప్పుడు వెనక్కి యివ్వలేదేం?' వంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. 1984 అల్లర్లు కొన్ని రోజులు జరిగిన ఘటన, అలాగే గోధ్రా అల్లర్లు. ప్రజాగ్రహాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి రాజకీయ నాయకులు అర్జంటుగా వేసిన ప్లాను. కానీ యిప్పుడు జరుగుతున్నది కొన్ని నెలలపాటు ఒక ప్రణాళిక ప్రకారం సాగుతున్న పథకం. భారత సామాజిక వ్యవస్థ స్వరూపస్వభావాలను మార్చడానికి చేస్తున్న ప్రయత్నం. దీనికీ 1984కి, 2002కి పోలిక లేదు. ప్రస్తుతం జరుగుతున్న మార్పు హర్షించలేనివారికి నిరసన తెలిపే హక్కు వుంది – వారు దేశపౌరులు కాబట్టి, ప్రస్తుతం వున్నది ప్రజాస్వామ్యం కాబట్టి. అయితే దానికి గాను అవార్డులు తిరిగివ్వడం సబబా? అన్నదే ప్రశ్న.

మొదట చూడాల్సింది – నీకు అవార్డు యిచ్చినది ఎందుకు? 'దేశంలో మతసహనం కాపాడుతున్నావు, శభాష్‌' అనా? అలా ఎవరికైనా ఎవార్డు వస్తే 'సారీ, నేను కాపాడలేకపోయాను, యిప్పుడు విషవాతావరణం ప్రబలుతోంది, సిగ్గుపడి వెనక్కి యిచ్చేస్తున్నాను' అనవచ్చు. కానీ నీకిచ్చిన అవార్డు నీ సాహితీపటిమకు, నటనాకౌశలానికి, దర్శకత్వప్రతిభకు, శాస్త్రపరిశోధనకు… లేదా మరోదానికి. నీ పనిని ప్రజలు మెచ్చారు, సమాజానికి మేలుకలిగింది అనుకుని ప్రజల తరఫున ఆనాటి ప్రభుత్వమో, ప్రభుత్వాధ్వర్యంలో వున్న సంస్థో యిచ్చింది. ఈనాటి ప్రభుత్వం ఆ విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు కదా, నువ్వు రాసిన సాహిత్యం పనికిరాదని అనలేదు కదా, పోనీ మారుతున్న ధోరణుల వలన ప్రజలు లేదా పాఠకులు నీ వద్దకు వచ్చి నీ ఆలోచనలు మమ్మల్ని యిన్నాళ్లూ తప్పుదారిన నడిపించాయి, అసలు నీకు అవార్డు యివ్వడం దండగ అని యీసడించలేదు కదా. మరెందుకు వెనక్కి యివ్వడం? ఇప్పటి ప్రభుత్వం రాజకీయ ఆలోచనాధోరణి నీకు పడదనా? నిజం చెప్పాలంటే ప్రభుత్వానికి ఏ పక్షపాతమూ వుండకూడదు. ఆ సమయానికి దాన్ని నడిపే పార్టీకి వుండవచ్చు. ఆ పార్టీ యివాళ పాలకపక్షంగా వుండవచ్చు, రేపు ప్రతిపక్షంగా వుండవచ్చు. దాని విధానాలు నీకు నచ్చకపోతే ఓటేయకు, వ్యతిరేకంగా ప్రచారం చేయి, ఆందోళనలు చేపట్టు, తప్పులు పట్టి ఆధారాలతో సహా కోర్టులో కేసులు పెట్టు, అంతేగానీ ప్రజల ఆమోదంతో నీకిచ్చిన అవార్డు వెనక్కి యివ్వడమేమిటి? 

అవార్డులు వెనక్కి యివ్వకుండా ఏం చేయాలి? ఏదో ఒకటి చేయవచ్చు. కమలహాసన్‌ చెప్పినట్లు వాళ్ల చేతిలో కళ వుంది, వ్యాసాలు రాసి, నాటకాలు వేసి, సినిమాలు తీసి ప్రజలను యీ అపాయం గురించి అప్రమత్తం చేయవచ్చు. దేశం ఫాసిజం వైపుకి వెళ్లకుండా నిరోధించడానికి తమ వంతు ప్రయత్నం తాము చేయవచ్చు. 'అలా జాగృతం చేయబోయిన వారిని కిరాయి హంతకులచేత చంపించి, మళ్లీ ఆ కిరాయి హంతకులు నోరు తెరవకుండా వాళ్లను కూడా మట్టుపెట్టేస్తున్నారే.., ఇప్పుడైతే అవార్డు తిరిగి యిచ్చినందుకు తిట్టి వదిలేస్తారు, ఉద్యమం నడిపితే ఉసురు తీస్తారు..' అంటే ఆ లాజిక్కూ నిజమే, ఆ ప్రమాదమైతే లేకపోలేదు. చేసేదేదో సంఘటితంగా చేస్తే ఆ ప్రమాదం స్థాయి కొంత తగ్గుతుంది. ప్రభుత్వం కూడా మరీ దూకుడుగా వెళ్లకుండా కాస్త నిదానిస్తుంది. ఉద్యమానికి ప్రజామోదం లభిస్తే వెనకడుగు కూడా వేయవచ్చేమో!

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2015)

[email protected]