దగ్గుబాటి హవా నడుస్తోందట

విజయవాడ లో మహా మహా పెద్దలు కలిసి ఓ మల్టీ ఫ్లెక్స్ ప్రారంభించారు. దాన్ని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రారంభించారు. టోటల్ మాల్ బడా నిర్మాత కేఎల్ నారాయణ ది. ఇందులో మల్టీ…

విజయవాడ లో మహా మహా పెద్దలు కలిసి ఓ మల్టీ ఫ్లెక్స్ ప్రారంభించారు. దాన్ని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రారంభించారు. టోటల్ మాల్ బడా నిర్మాత కేఎల్ నారాయణ ది. ఇందులో మల్టీ ఫ్లెక్స్ లీజు తీసుకున్నది సురేష్ మూవీస్ సురేష్, ఐమాక్స్ రమేష్ ప్రసాద్, ఫైనాన్షియలర్ అలంకార్ ప్రసాద్. మరింతమంది హేమా హేమీలు కలిసినపుడు వ్యవహారం ఎలా వుంటుంది? 

అందుకే నిబంధనల కన్నా వేగంగా, ఆఘమేఘాల మీద అనుమతులు వచ్చేసాయి మల్టీ ఫ్లెక్స్ కు అని టాలీవుడ్ లో గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. అంతే కాదు, టికెట్ రేట్ల ఫిక్సేషన్ విషయంలో కూడా నిబంధనలు పక్కన పెట్టేసారని వార్తలు వినవస్తున్నాయి. ముందు కొన్ని రోజులు ఒక ధర, తరువాత మరో ధర వుండాలట..కానీ నేరుగా అప్ రేటు ఫిక్సేషన్ చేసేసారట.

విశాఖలో కూడా

సాధారణంగా థియేటర్ లైసెన్స్ దారుడు చనిపోతే, పేరు ట్రాన్స్ ఫర్ చేయడానికి చాలా కాలం పడుతోందట. విశాఖలో ఇలాంటి అప్లికేషన్లు చాలా పెండింగ్ లో వున్నాయట ఏళ్ల తరబడి. యలమంచిలిలో ఓ థియేటర్ , విశాఖలో ఓ థియేటర్ అలా..కానీ అదే రామానాయుడు పేరిట వున్న విశాఖ జ్యోతి థియేటర్ లైసెన్స్ మాత్రం సురేష్ బాబు ఇలా దరఖాస్తు చేయగానే అలా ట్రాన్స్ ఫర్ అయిపోయిందట నాలుగే నాలుగు రోజుల్లో.

సురేష్ బాబుకు కాకినాడలో కూడా ఇప్పుడు లేని థియేటర్ పైన లైసెన్స్ వుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రుక్మిణి అన్న థియేటరే లేదట. దాని పేరిట లైసెన్స్ వుండడమే కాదు, ఆ క్వాలిఫికేషన్ తోనే, ఎగ్జిబిటర్ల విభాగం నుంచి మొన్న చాంబర్ అధ్యక్షుడయ్యాడు సురేష్ అని కూడా కొందరు చెబుతున్నారు. మొత్తానికి ఏదైతేనేం, ఇటు కేటిఆర్ తో సాన్నిహిత్యంతో తెలంగాణలో, అటు బాబుతో నేస్తంతో ఆంధ్రలో దగ్గుబాటి సురేష్ కు ఎదురే లేదు.