సినీ స్నిప్పెట్స్‌- అమితాబ్‌, రాజేశ్‌ ఖన్నా

మెహమూద్‌ 'బాంబే టు గోవా' తీసే రోజుల్లో ఆ సినిమాలో హీరో గురించి వెతుకుతున్నాడు. ఆ సినిమా 'మద్రాసు టు పాండిచ్చేరి' అనే తమిళ సినిమాకు హిందీ వెర్షన్‌. సినిమాలో ముప్పాతిక భాగం బస్సులోనే…

మెహమూద్‌ 'బాంబే టు గోవా' తీసే రోజుల్లో ఆ సినిమాలో హీరో గురించి వెతుకుతున్నాడు. ఆ సినిమా 'మద్రాసు టు పాండిచ్చేరి' అనే తమిళ సినిమాకు హిందీ వెర్షన్‌. సినిమాలో ముప్పాతిక భాగం బస్సులోనే నడుస్తుంది. విలన్‌ల పాలబడిన హీరోయిన్‌ ఆ బస్సులో ఎక్కడం, హీరో రక్షించడం వంటి ఉపకథ వుంది. కానీ ఫోకస్‌ అంతా బస్‌ కండక్టర్‌, డ్రైవర్‌ ల మీదే! ఇతర ముఖ్యపాత్రలు అన్నీ  హాస్యపాత్రలే! బస్‌ కండక్టర్‌గా మెహమూద్‌, డ్రైవర్‌గా అతని తమ్ముడు అన్వర్‌ వేస్తున్నారు. హీరోయిన్‌ అరుణా యిరానీ మెహమూద్‌ ప్రియురాలు. పైగా మెహమూద్‌  స్వంత సినిమా. ఇక యిలాటి సినిమాలో హీరోగా వేయడానికి ఎవరు ముందుకు వస్తారు? అందునా హీరోయిన్‌గా వేరెవరూ గుర్తించని అరుణా యిరానీ పక్కన! పైగా దక్షిణాది లో కంటె బొంబాయి ఫీల్డులో హీరోయిజం మరీ ఎక్కువ కాబట్టి ఓ మాదిరి పేరున్నవాడు ఎవడూ యీ వేషానికి ఒప్పుకోడు. కొత్త నటుణ్నే వెతుక్కోవాలి.

మెహమూద్‌ అన్వేషణ ప్రారంభించాడు. వెతుకుతున్నాడు కానీ ఎవరూ దొరకటం లేదు. ఓ రోజు అతనికి ఓ ఐడియా వచ్చింది. తన బంగ్లా కాంపౌండులో అప్పుడప్పుడు తనకు ఎదురుపడే తన తమ్ముడి ఫ్రెండ్‌నే బుక్‌ చేస్తే ఎలా వుంటుందాని! ఆ పొడుగాటి కుర్రాడు తమ్ముడి ఫ్రెండు. వచ్చి తన యింట్లోనే వుంటూ సినిమా వేషాలకై ప్రయత్నిస్తున్నాడని తెలుసు. మెహమూద్‌ తమ్ముణ్ని పిలిచి 'ఎవర్రా అతను?' అని అడిగాడు. 'అతనా? అలహాబాదువాడు. బాగా చదువుకున్నాడు. వాళ్ల నాన్న పెద్ద కవి కూడాను. ఇతను మల్టీ నేషనల్‌ కంపెనీలో ఉద్యోగం మానేసి సినిమా వేషాలకై తిరుగుతున్నాడు. ఇందిరాగాంధీ వాళ్లకు ఫ్యామిలీ ఫ్రెండు. ఆవిడ సిఫార్సు ఉత్తరం తీసుకుని కె.ఎ. అబ్బాస్‌ దగ్గరకు వెళితే ఆయన 'సాత్‌ హిందూస్తానీ' సినిమాలో ఏడుగురు హీరోల్లో ఒకడిగా ఛాన్సు యిచ్చాడు. ఆ సినిమా ఫ్లాపయింది. ఇతను అవసరమైనదానికంటె పొడుగ్గా వుంటాడు కాబట్టి, కోలమొహం కాబట్టి మన బొంబాయి రంగంలో ఎవరికీ నచ్చటం లేదు. పట్టువదలకుండా తిరుగుతున్నాడు.' అని కథ చెప్పుకొచ్చాడు.

'సరే, నా దగ్గరకి రమ్మనమను. మనకి పనికి వస్తాడేమో చూద్దాం.' అన్నాడు మెహమూద్‌. 

పనికి వచ్చాడు. అతనా సినిమాలో అరుణా యిరానీ పక్కన హీరోగా వేశాడు. 

అతనిపేరు అమితాబ్‌ బచ్చన్‌!

**********************

''జంజీర్‌'' (1974) సినిమా రిలీజయ్యేవరకూ అతనికి హీరో హోదా రాలేదు. సిఫార్సులతో కాపురాలు చక్కబడవన్నట్టు, సిఫార్సులతో హీరోలు కారని, ఆ సిఫార్సు చేసేది సాక్షాత్తూ దేశప్రధాని అయినా ఏమీ ఫర్క్‌ (డిఫరెన్సు) పడదని  అమితాబ్‌కి కూడా తెలిసి వచ్చి వుంటుంది. అమితాబ్‌ తండ్రి హరివంశ్‌ రాయ్‌ బచ్చన్‌ గారి కవిత్వం అంటే నెహ్రూగారికి యిష్టం కాబట్టి, వాళ్లదీ వీళ్లదీ అలహాబాదే కాబట్టి, యిందిరా గాంధీకి వీళ్ల కుటుంబానికి మంచి స్నేహం వుండేది. పైగా రాజీవ్‌, సంజయ్‌గాంధీలు అమితాబ్‌కు ఫ్రెండ్స్‌ కూడా. ఇతను కలకత్తాలో ఓ మల్టీనేషనల్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తమ్ముడు అజితాబ్‌ ప్రోద్బలంతో హిందీ సినిమా రంగానికి వెళదామనుకున్నాడు. ఇందిరా గాంధీని అడిగితే ఆవిడ తమ కుటుంబమంటే అభిమానం వున్న కె.ఎ. అబ్బాస్‌ అనే ఉర్దూ పాత్రికేయుడు, నిర్మాత, దర్శకుడికి రికమెండేషన్‌ లెటర్‌ రాసి యిచ్చింది. ఆయన అప్పుడు ''సాత్‌ హిందూస్తానీ'' (1969) అని ఏడుగురు హీరోలతో సినిమా తీస్తున్నాడు. వాళ్లలో యితనూ ఒకడు. ఏడుగురు రాకుమారులున్న కథలో ఎండని చేపలాగ ఈ చేపా ఎండలేదు. దాని తర్వాత వచ్చిన ''ఆనంద్‌''లో చాలా బాగా గుర్తింపు వచ్చినా యితనిలో హీరో మెటీరియల్‌ వుందని ఎవడూ అనుకోలేదు. ఎందుకంటే దానిలో యితను తన రూపానికి తగ్గట్టే మొహం పొడుగ్గా వేలాడేసుకుని ఎప్పుడు చూసినా విషాదంగా కనబడతాడు. 

ఆ తర్వాత వచ్చిన వేషాల్లో చిన్నా, చితకా వేషాలున్నాయి. ''పర్వానా'' (1972) సినిమాలో విలన్‌గా కూడా వేశాడు. ఆ సినిమా హీరో నవీన్‌ నిశ్చల్‌ ఇతన్ని లక్ష్యపెట్టేవాడు కాడు. ఇతనేదో జూనియర్‌ ఆర్టిస్టు అన్నట్టు పోజు కొట్టేవాడు. తర్వాత అమితాబ్‌ ఎక్కడకు చేరాడో, నవీన్‌ నిశ్చల్‌ ఎక్కడకు జారాడో మీకు తెలుసు. 

ఈ సందర్భంలో రాజేశ్‌ ఖన్నా – అమితాబ్‌ల మధ్య యీక్వేషన్‌ గురించి చెప్పుకుని తీరాలి. ''ఆనంద్‌'' (1970) నాటికి రాజేశ్‌ ఖన్నా హిందీ సీమను ఏలుతున్నాడు. ఆ సినిమాలో అమితాబ్‌కు చాలా ముఖ్యమైన భూమిక వున్నప్పటికీ రాజేశ్‌ ఖన్నా అతన్ని చాలా చులకనగా చూసేవాడు. మూడేళ్ల తర్వాత వచ్చిన ''నమక్‌ హరామ్‌'' నాటికి అమితాబ్‌కు మాస్‌ హీరో యిమేజ్‌ రాలేదు కానీ మంచి నటుడిగా పేరు వచ్చేసింది.  ''అభిమాన్‌'' వంటి సినిమాల్లో అతని ప్రతిభ బయటపడింది. ''నమక్‌ హరామ్‌''లో అమితాబ్‌కి హీరోయిన్‌ లేదు. రాజేశ్‌ ఖన్నాకయితే రేఖ వుంది. అయినా అమితాబ్‌ తన నటనతో రాజేశ్‌ ఖన్నా ఔద్ధత్యాన్ని ఆపగలిగాడు. 

ఆ విషయాన్ని రాజేశ్‌ ఖన్నా కూడా గ్రహించాడు. ఇతనితో కలిసి వేస్తే పరువు దక్కదని గ్రహించాడు. ఆ తర్వాత యిద్దరూ కలిసి వేసిన సినిమాలు లేవు! క్రమంగా రాజేశ్‌ ప్రభ తగ్గింది. అమితాబ్‌ ప్రభ వెలిగింది.  నీతి – ఏ పుట్టలో ఏ పాముండునో తెలియదు, ఏ బక్కతారడు వన్‌-మాన్‌ ఇండస్ట్రీ అవుతాడో తెలియదు. అందువల్ల అందరితోనూ మర్యాదగా వుంటే మేలు! (సశేషం)  (ఫోటోలు-  ''బాంబే టు గోవా'', ''నమక్‌ హరామ్‌'' లో అమితాబ్‌, రాజేశ్‌ ఖన్నా)

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015) 

[email protected]

Click Here For Archvies