ఎమ్బీయస్‌: తమిళ రాజకీయాలు- 55

ఎవరీ ము.క.ముత్తు అంటే కరుణానిధి కుటుంబం గురించి కాస్త చెప్పవలసి వుంటుంది. ఎందుంటే వారి కథ అతని రాజకీయాలతో ముడిపడి వుంది. వాళ్లూ రాజకీయనాయకులే కూడా. కరుణానిధికి ముగ్గురు భార్యలు. పెద్దావిడ పద్మావతి పోయారు.…

ఎవరీ ము.క.ముత్తు అంటే కరుణానిధి కుటుంబం గురించి కాస్త చెప్పవలసి వుంటుంది. ఎందుంటే వారి కథ అతని రాజకీయాలతో ముడిపడి వుంది. వాళ్లూ రాజకీయనాయకులే కూడా. కరుణానిధికి ముగ్గురు భార్యలు. పెద్దావిడ పద్మావతి పోయారు. ఆవిడ కొడుకే ముత్తు. రెండో ఆవిడ దయాలూ అమ్మాళ్‌. ఆవిడకు ముగ్గురు కొడుకులు. అళగిరి, స్టాలిన్‌, తమిళరసు, కూతురు సెల్వి. మూడో భార్య రాజాత్తి అమ్మాళ్‌కు ఒకే కూతురు ఆమె కనిమొళి. 

1948లో పుట్టిన ముత్తుకు నటన అన్నా, పాటలు పాడడమన్నా యిష్టం. అతన్ని ఎంజీఆర్‌కు వ్యతిరేకంగా నటుడిగా నిలబెట్టడానికి ప్రయత్నించాడు కానీ అతను నిలబడలేదు. చివరకు అతను తండ్రితో విభేదించి ఎమ్జీయార్‌ పార్టీలో చేరాడు. తండ్రి అతన్ని కుటుంబంలోంచి వెలివేశాడు. ఎడిఎంకెలోకి వెళ్లినా అతను రాజకీయాల్లో పైకి రాలేదు. నిరాశానిస్పృహలతో తాగుడుకు, మాదకపదార్థాలకు అలవాటు పడ్డాడు. 20 ఏళ్లపాటు కనుమరుగై పోయి 2008లో బయటకు కనబడ్డాడు. సంగీత దర్శకుడు దేవా సంగీతదర్శకత్వంలో ''మాట్టు తవాణి'' అనే సినిమాలో ఒక పాట పాడాడు. వేషాలిస్తే వేస్తానన్నాడు కానీ ఎవరూ యివ్వలేదు. అతని భార్య తమిళ నేపథ్యగాయకుడు జయరామన్‌ కుమార్తె. కొడుకు అరివునిధి డాక్టరు. కొడుకూ కోడలూ తమను ఆస్తికోసం వేధిస్తున్నారంటూ ముత్తూ, భార్య 2013లో జయలలిత వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాతి ఏడాది తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. అప్పుడు కరుణానిధి వెళ్లి కొడుకుని చూసి వచ్చాడు. 

ఇక రెండో భార్య దయాలూ అమ్మాళ్‌ కరుణానిధికి గోపాలపురంలో వున్న యింట్లో వుంటారు. ఆమె పెద్దకొడుకు అళగిరి 1950లో పుట్టాడు. బియ్యే చదివాడు. రౌడీ లక్షణాలు ఎక్కువ, చెప్పిన మాట వినేరకం కాదు. అతనికీ అతని తమ్ముడు స్టాలిన్‌కు అస్సలు పడేది కాదు. అందువలన కరుణానిధి స్టాలిన్‌ను తన వద్ద వుంచుకుని ఉత్తర తమిళనాడును అతన్ని చూసుకోమని చెప్పి అళగిరిని మధురై పంపి దక్షిణ తమిళనాడు చూసుకోమన్నాడు. అళగిరి తన మోటుతనంతో అక్కడి క్యాడర్‌ను తనవైపు తిప్పుకున్నాడు. మధురై నుండి కింది ప్రాంతమంతా తన సామంతరాజ్యం అనుకుంటాడు. స్టాలిన్‌ పట్ల పక్షపాతం చూపిస్తున్న తండ్రిని ఎదిరిస్తూ వుంటాడు. మళ్లీ విధేయుణ్ని అంటూ వుంటాడు. ఇతని బాధ పడలేక కేంద్రమంత్రిగా చేసి ఢిల్లీ పంపేసినా, అతను అక్కడ నెగ్గుకు రాలేకపోయాడు. కరుణానిధి తదనంతరం రాజకీయవారసత్వంకై స్టాలిన్‌, అళగిరి యిద్దరూ తగాదా పడతారన్నది అందరికీ తెలిసిన విషయమే. అతను పార్టీని ఏ మేరకు చీల్చగలడన్నది వేచి చూడాల్సిందే. అతనికి యిద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి రాజకీయాల్లో ఆసక్తి చూపుతున్నారు.

దయాలూ కూతురు సెల్వికి రాజకీయాల్లో ఆసక్తి లేదు. కరుణానిధి మేనల్లుడు, మురసొలి మారన్‌ సోదరుడు ఐన సెల్వంను పెళ్లాడింది. బెంగుళూరులో వుంటుంది. ఆమెకు ఒక కూతురు. 

స్టాలిన్‌ 1953లో పుట్టాడు. బియ్యే చదివాడు. కరుణానిధికి యిష్టుడు. మద్రాసు మేయరుగా చేశాడు. తన హయాంలో అవసరం లేని చోట కూడా ఫ్లయిఓవర్లు కట్టించి కేసులు ఎదుర్కొన్నాడు. కరుణానిధి అనంతరం అతనే పార్టీని నడుపుతాడని అందరికీ తెలుసు. అళగిరితో పోలిస్తే పాలిష్‌డ్‌గా వుంటాడు. అతనికి ఉదయనిధి అనే కొడుకు సెందామరై అనే కూతురు వున్నారు. ఉదయనిధి సినిమా రంగంలో వున్నాడు. 

చివరి కొడుకైన తమిళరసు రాజకీయాల్లోకి రాలేదు. వ్యాపారాలు చేసుకుంటూ వుంటాడు. 

మూడో భార్య రాజాత్తి అమ్మాళ్‌కు ఒకత్తే కూతురు. కనిమొళి. 1968లో పుట్టింది. ఎమ్మే చదివింది. 2007లో కరుణానిధికి దయానిధి మారన్‌పై కోపం వచ్చాక అతని మంత్రి పదవి వూడపీకించి కనిమొళిని రాజ్యసభకు పంపాడు. ఆమె శివకాశి వ్యాపారస్తుడు అధిపన్‌ బోస్‌ను పెళ్లాడి 1989లో విడాకులు యిచ్చింది. తర్వాత సింగపూరు వాసి అరవిందన్‌ను 1997లో పెళ్లాడింది. వాళ్లకు ఒక కొడుకు. 

కరుణానిధి మేనల్లుడు, అత్యంత ఆప్తుడు అయిన మురసొలి మారన్‌ కేంద్రమంత్రిగా కూడా చేశారు. ఆయన పోయిన తర్వాత ఆయన రెండో కొడుకు దయానిధి (జననం 1966) కేంద్రమంత్రిగా చేశాడు. అన్న కళానిధి మారన్‌తో కలిసి సన్‌టివి గ్రూపు, యితర అనేక వ్యాపార సంస్థలు నిర్వహిస్తాడు. మారన్‌ సోదరులు తన కుటుంబంలో చిచ్చు పెట్టారని కరుణానిధికి కోపం. అప్పుడప్పుడు శాంతిస్తూంటాడు కూడా. డిఎంకె రాజకీయాల్లో ముందుముందు వీరి పేర్లు ఎదురవుతూనే వుంటాయి.

ముక ముత్తు దగ్గరకు వస్తే కరుణానిధి అతన్ని హీరోగా నిలబెట్టడానికి గట్టి ప్రయత్నమే చేశాడు. టాప్‌ డైరక్టర్లు, 20 ఏళ్ల క్రితం డైలాగ్‌ రైటర్‌గా కరుణానిధికి ఎంతో పేరు తెచ్చిన ''పరాశక్తి'' సినిమాకు డైరక్టర్లు అయిన కృష్ణన్‌-పంజు డైరక్షన్‌లోనే, టాప్‌ మ్యూజిక్‌ డైరక్టరు ఎమ్మెస్‌ విశ్వనాథన్‌ మ్యూజిక్‌ డైరక్షన్‌లో 1972-75 మధ్య ''పిళ్లయో పిళ్లయ్‌'' (1972), ''పూక్కారి'' (1973), ''సమయల్‌కారన్‌'' (1974), ''అనయ విళక్కు'' (1975) అనే నాలుగు సినిమాలు తీశాడు. వాటిలో మూడు తమ సొంత బ్యానరయిన అంజుగమ్‌ (కరుణానిధి తల్లి పేరు) పిక్చర్స్‌ కింద తీయగా మరొకటి తమకు ఆప్తులైన మెరీనా మూవీస్‌ పేర తీశాడు. మూడిట్లో కరుణానిధికి సన్నిహితురాలైన వెన్నిరాడై నిర్మల హీరోయిన్‌ కాగా, మరొక సినిమాలో ఎమ్జీయార్‌తో బాటు అనేక సినిమాల్లో నటించిన మంజుల! దీనితో బాటు యిస్తున్న ఫోటోలు చూస్తే ముత్తు ఎమ్జీయార్‌ను ఎంత అనుకరించాడో తెలుస్తుంది. ఎమ్జీయార్‌ పాటలు పాడలేదు, యితను అది కూడా చేసేశాడు. ఏం చేసినా ఒక్క సినిమా కూడా ఆడలేదు. ముఖ్యమంత్రి, అధికారపక్ష నాయకుడు అయిన తన తండ్రి పార్టీ క్యాడర్‌ను ఉపయోగించి మొదటి సినిమా రిలీజైన మర్నాడే రాత్రికి రాత్రి రాష్ట్రమంతటా అభిమాన సంఘాలు నెలకొల్పి హంగు చేసినా, అతను ఎమ్జీయార్‌తో ఏ మాత్రం తూగలేకపోయాడు. ఇటువంటి కొడుకుని పెట్టుకుని కరుణానిధి ఎమ్జీయార్‌ను ఎలా కొడదామనుకున్నాడు? అసలా అవసరం ఎందుకు వచ్చింది?

1969లో ముఖ్యమంత్రి అయిన కరుణానిధి 1971 ఎన్నికల నాటికి బాగా పుంజుకున్నాడు. అప్పటికి కాంగ్రెసు చీలిపోయింది. దేశం మొత్తం మీద ఇందిర ప్రభ బాగా వెలుగుతోంది. తమిళనాడులో వున్న కాంగ్రెసు అగ్రనాయకులందరూ ఇందిరకు వ్యతిరేకంగా వున్న కాంగ్రెసు (ఓ) పార్టీ నాయకులే. వారిలో కామరాజ్‌, సుబ్రహ్మణ్యం, వెంకట్రామన్‌ వంటి హేమాహేమీలున్నా ఆ పార్టీపై ప్రజలు అయిష్టత పెంచుకున్నారు. దానికి తోడు గతంలో కాంగ్రెసును తిట్టి, డిఎంకెకు మద్దతు యిచ్చిన స్వతంత్ర పార్టీ వారితో కలిసి డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ ఏర్పరచింది. వారిని ఎలాగైనా ఓడించాలని ఇందిర అనుయాయులు డిఎంకెకు మద్దతు యిచ్చారు. ఇందిరకు బయట నుండి సపోర్టు యిస్తున్న సిపిఐ కూడా డిఎంకె ఏర్పరచిన ప్రోగ్రెసివ్‌ ఫ్రంట్‌లో చేరింది. దానితో పాటు పియస్‌పి, ఫార్వర్డ్‌ బ్లాక్‌, ముస్లిం లీగు కూడా చేరాయి. ఈ మద్దతు చూసుకుని కరుణానిధి ఏడాది ముందుగానే ఎన్నికలకు వెళ్లాడు. అతని ఫ్రంట్‌ 54% ఓట్లు తెచ్చుకుని 234 సీట్లలో 205 తెచ్చుకున్నారు. డిఎంకెకు 184 సీట్లు వచ్చాయి. కాంగ్రెసు 201 సీట్లలో నిలబడి 15 తెచ్చుకుంది. స్వతంత్ర పార్టీ 6 గెలిచింది. పార్లమెంటు విషయానికి వస్తే 38 సీట్లలో కాంగ్రెసుకు 9 రాగా డిఎంకెకు 23, దాని భాగస్వామ్యపక్షాలకు 6 వచ్చాయి. 

ఇంతటి ఘనవిజయానికి కారణం కరుణానిధి పాలనా? కరుణానిధి పాలనలో కొన్ని విషయాలు కొట్టవచ్చినట్టు కనబడతాయి. అడ్మినిస్ట్రేషన్‌పై పట్టు, అస్మదీయులకు పెద్దపీట, ఎదిరించినవారికి, మాట విననివారికి దండన, సమర్థత, చేసినది కొంతే అయినా అమితమైన ప్రచారం, ఆర్భాటం, అవినీతి, ప్రజల దృష్టిని మరల్చడానికి తమిళతనం గురించి మాట్లాడడం, వివాదాలు లేవనెత్తడం, రాజకీయాల్లో మోటుతనం, ప్రత్యర్థుల పట్ల రౌడీలను, గూండాలను ప్రయోగించడం… – యిన్నేళ్లు వచ్చినా కరుణానిధిలో యీ లక్షణాలు యిప్పటికీ పోలేదని అందరూ గ్రహిస్తారు. రాజకీయ అవసరాల కోసం సందర్భం వున్నా లేకపోయినా హిందూమతం గురించి, బ్రాహ్మణుల గురించి అన్యాయమైన వ్యాఖ్యలు చేసే అలవాటు మాత్రం ఎప్పటికీ పోదు. తాము నాస్తికులమంటూనే డికె, డిఎంకె నాయకులు మైనారిటీలను నెత్తికెత్తుకుని హిందూమతాన్ని తిడుతూ వుంటారు. వాళ్ల దృష్టిలో మతం అంటే హిందూమతం ఒక్కటే, మైనారిటీల చాదస్తాల గురించి, మూఢనమ్మకాల గురించి పన్నెత్తి పలకరు. ఎమ్జీయార్‌ మరణం తర్వాత పదవిలోకి వచ్చాక కరుణానిధి తన వూరి గుడికి రథం బహుమతి యివ్వడాలలాటివి చేసినా, యిప్పటికీ రాముడి గురించో, మరో దేవుడి గురించి ఏదో ఒక వక్రోక్తి పలకక మానరు. 1967 ఎన్నికలలో తమ గెలుపుకు బ్రాహ్మణులు ఎంతో సహాయపడినా, డిఎంకె అప్పటికీ, యిప్పటికీ ఒక్క బ్రాహ్మణుడికైనా ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్టు యివ్వలేదు, మంత్రిని చేయలేదు. కరుణానిధి పదవిలో వుండగా తన సిబ్బందిలో బ్రాహ్మణులు ఎవరూ లేకుండా చూసుకుంటారని అంటారు. డిఎంకె నుంచి వేరుపడి ఎడిఎంకె పెట్టిన ఎమ్జీయార్‌కు యింత వ్యతిరేకత లేదు. పదవిలోకి వచ్చాక బహిరంగంగా దేవాలయాలకు బహుమతులు యిచ్చారు. బ్రాహ్మణుడికి మంత్రిపదవి యిచ్చారు. ఇక జయలలిత విషయానికి వస్తే ఆమె స్వయంగా బ్రాహ్మణి! పూజలూ పునస్కారాలూ బహిరంగంగా చేస్తారు. ఇలా ద్రవిడోద్యమ ఆదర్శాలకు, ఆచరణకు పోలిక లేకుండా పోయింది. (సశేషం) ఫోటో – ము.క.ముత్తు

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2015) 

[email protected]

Click Here For Archives