ఎమ్బీయస్‌: యూరోప్‌ గాథలు టేల్‌ ఆఫ్‌ టు సిటీస్‌ – 2

డిఫార్జ్‌, అతని భార్య కలిసి బాస్టిలీ కోటపై దాడికి నాయకత్వం వహించారు. డిఫార్జ్‌ కోటలోకి ప్రవేశిస్తూ గతంలో మేనెట్‌ను బంధించి వుంచిన గది (105, నార్త్‌ టవర్‌)కు వెళ్లి దాన్ని పూర్తిగా శోధించాడు. అక్కడ…

డిఫార్జ్‌, అతని భార్య కలిసి బాస్టిలీ కోటపై దాడికి నాయకత్వం వహించారు. డిఫార్జ్‌ కోటలోకి ప్రవేశిస్తూ గతంలో మేనెట్‌ను బంధించి వుంచిన గది (105, నార్త్‌ టవర్‌)కు వెళ్లి దాన్ని పూర్తిగా శోధించాడు. అక్కడ కనబడిన కాగితాలు తన దగ్గర దాచుకున్నాడు. ధనికకుటుంబాలపై దాడి చేసి, వారి కుటుంబసభ్యులను బయటకు లాగి ప్రజల మధ్య పడవేసి చంపివేశారు. ఎవర్‌మాండ్‌ సౌధానికి వెళ్లి దాన్ని తగలబెట్టేశారు. విప్లవం జరిగిన మూడేళ్లకు 1792లో నవల ప్రారంభంలో పరిచయమైన బ్యాంకు ఉద్యోగి లారీ అల్లకల్లోలంగా వున్న పారిస్‌కు వెళ్లవలసి వచ్చింది. అతని బ్యాంకు పారిస్‌ బ్రాంచిలో కొన్ని ముఖ్యమైన దస్తావేజులున్నాయి. ప్రజల బారిన పడకుండా వాటిని లండన్‌కు సురక్షితంగా చేర్చాలి. పై అధికారుల ఆదేశాల మేరకు అతను బయలుదేరాడు. డార్నే కూడా పారిస్‌కు రావలసిన పరిస్థితి వచ్చింది. అతని ఎస్టేటులో పనిచేసే ఒక పనివాణ్ని విప్లవకారులు జైల్లో పడేశారు. జమీందారు వద్ద పని చేయడమే అతని అపరాధం. మీరు వచ్చి నన్ను విడిపించండి అతను దీనంగా రాసిన లేఖ విని, మనసు కరిగి డార్నే భార్యాపిల్లలకు చెప్పకుండా రహస్యంగా పారిస్‌కు బయలుదేరాడు. అక్కడ అతనికి విషమపరిస్థితి ఏర్పడింది. 

డార్నే పారిస్‌కు రాగానే పారిపోయి విదేశాలలో తలదాచుకుని విప్లవానికి వ్యతిరేకంగా పరాయిసేనలకు సాయపడే దుర్మార్గుడైన జమీందారుగా ముద్ర పడింది. అతని చిన్నాన్న చనిపోవడంతో ఎవర్‌మాండ్‌ జమీకి యితనే వారసుడయ్యాడు. అతన్ని లా ఫోర్స్‌ జైల్లో పెట్టారు. ఈ కబురు చేరగానే లండన్‌ నుంచి మేనెట్‌, లూసీ, పాప, గవర్నెస్‌ మిస్‌ ప్రాస్‌ పారిస్‌ వచ్చి లారీని కలిసి డార్నేను విడిపించే ప్రయత్నాలు చేయమని కోరారు. అతను ప్రయత్నాలు చేసినా ఏమీ ఫలించటం లేదు. విప్లవకారులు తమలో తాము కలహించుకుంటున్నారు తప్ప ఎవరూ ఎవరి మాటా వినటం లేదు. 15 నెలలు గడిచిపోయాయి. చివరకు డార్నే విచారణ ప్రారంభమైంది. అతను స్వయంగా చేసిన అత్యాచారాలంటూ ఏమీ లేవు. విప్లవకారులు ఎంతో గౌరవించే మేనెట్‌ డార్నే తరఫున ప్రజాన్యాయస్థానానికి హాజరై అతని సత్ప్రవర్తన గురించి తెలియచెప్పాడు. దాంతో అతన్ని విడిచిపెట్టేశారు. కానీ ఆ రోజు సాయంత్రమే మళ్లీ అరెస్టు చేసి మర్నాడు విచారణ మొదలుపెట్టారు.

ఈ సారి అతనిమీద ఆరోపణలు చేసినవారిలో రెండు పేర్లున్నాయి. ఒకటి మద్యశాల యజమాని, విప్లవనాయకుడు డిఫార్జ్‌ది కాగా రెండో పేరు మేనెట్‌ది! జరిగినదేమిటంటే మేనెట్‌ తనను అష్టకష్టాలపాలు చేసిన జమీందారు సోదరుల కథను జైల్లో వుండగా కాగితాలపై రాశాడు. వారినీ, వారి వారసులను నాశనమై పోవాలని శపించాడు. ఆ కాగితాలను బాస్టిల్‌పై చేసిన దాడిలో డిఫార్జ్‌ చేజిక్కించుకున్నాడు. మేనెట్‌ శపించిన ఆ జమీందారు సోదరులు వేరెవరో కాదు, డార్నే తండ్రి, చిన్నాన్న! మేనెట్‌ రక్షించబోయిన రైతు కుటుంబంలో తప్పించుకుని పారిపోయిన చిన్న కూతురే పెరిగి పెద్దదై డిఫార్జ్‌ని పెళ్లాడింది. ఆమె ఎవర్‌మాండ్‌ కుటుంబంపై పగబూనింది. విప్లవాన్ని అడ్డుపెట్టుకుని ఆ కుటుంబంలోని వారసులెవర్నీ మిగల్చకూడదని నిశ్చయించుకుంది. డార్నేనే కాదు, అతని పెళ్లాడిన పాపానికి లూసీని, ఆమె కూతురును కూడా చంపేయాలని ఆమె ప్లాను. ఆమె భర్త చేతులు కలిపాడు. మేనెట్‌ రాసిన కాగితాలే ఆధారంగా చూపి డార్నే బతికి వుండడానికి అర్హత లేదని అభియోగం మోపారు. అతన్ని చంపిన తర్వాత అతని భార్యాబిడ్డలను రహస్యంగా చంపాలని ప్లాను.

డార్నే కుటుంబం యిలా చిక్కుల్లో పడిందని తెలిసి వారికి సాయం చేయడానికి పారిస్‌ వచ్చిన సిడ్నీ కార్టన్‌ యీ సమాచారం సేకరించాడు. విప్లవకారుల శిబిరంలో చొరబడడానికి అతనికి ఒక సందు దొరికింది. మిస్‌ ప్రాస్‌ సోదరుడు సోలమన్‌ అనేవాడు చిన్నప్పుడే తప్పిపోయాడు. అతన్ని ఒక రోజు పారిస్‌ వీధుల్లో ఆమె గుర్తుపట్టింది. కానీ అతను నువ్వెవరో నాకు తెలియదు పొమ్మన్నాడు. ఎందుంటే అతను ప్రస్తుతం విప్లవవాదులతో కలిసి తిరుగుతున్నాడు. ప్రాస్‌, అతను కలిసి మాట్లాడుతూండగా కార్టన్‌ చూసి అతన్ని వెంటనే గుర్తుపట్టాడు. పదేళ్ల క్రితం డార్నేపై ఫ్రెంచి గూఢచారిగా అభియోగం మోపిన కేసులో బ్రిటిషు ప్రభుత్వం తరఫున గూఢచారులమంటూ సాక్ష్యం యిచ్చిన యిద్దరిలో యితను ఒకడు. అప్పుడు బర్సాడ్‌ అనే పేరుతో చలామణీ అవుతున్నాడు. అప్పట్లో ఫ్రాన్సులో తను చనిపోయినట్లు దొంగ సర్టిఫికెట్టు పుట్టించి, ఇంగ్లండుకి పారిపోయి, అక్కడ మారుపేరుతో జీవనం సాగించినట్లు కార్టన్‌ కూపీ లాగాడు. అతన్ని కలిసి 'నువ్వు బ్రిటన్‌ గూఢచారివని మారుపేరుతో యిక్కడ వుంటున్నావని విప్లవకారులకు చెప్పేస్తాను. వాళ్లు నీ పీక ఉత్తరించేస్తారు' అని భయపెట్టాడు. అతను భయపడి 'డార్నే వంశమూలాల గురించి డిఫార్జ్‌కు చెప్పినది నేనే, యిప్పుడు అతన్ని రక్షించడానికి నువ్వేం చేయమంటే అది చేస్తాను, నా రహస్యం కాపాడు' అన్నాడు. 

డార్నే విచారణ ముందుకు సాగింది. డిఫార్జ్‌ అతన్ని ఎవర్‌మాండ్‌ వంశజుడిగా గుర్తించాడు. ఆ తర్వాత మేనెట్‌ కాగితాలను సాక్ష్యంగా చూపించి ఎవర్‌మాండ్‌ కుటుంబానికి చెందినవారెవరూ బతకడానికి వీల్లేదన్నాడు. మేనెట్‌ ఉలిక్కిపడ్డాడు. 'అప్పటి కోపంలో రాసిన రాతలవి. నేను వెనక్కి తీసుకుంటున్నాను' అన్నాడు. కానీ ప్రజా కోర్టువారు అనుమతించలేదు. నిన్నింత కష్టపెట్టిన కుటుంబానికి చెందిన వ్యక్తిని గిల్లెటిన్‌కు పంపాల్సిందే అన్నారు. మర్నాడే శిక్ష అన్నారు. మేనెట్‌కు పిచ్చెక్కిపోయింది. తనకు తెలిసినవారందరినీ అల్లుణ్ని రక్షించమని బతిమాల సాగాడు. కానీ పని జరగలేదు. 

కార్టన్‌ డిఫార్జ్‌ మద్యశాలకు వెళ్లి కూర్చున్నాడు. లూసీని, పాపను చంపడానికి వాళ్లు వేసే ప్లాన్లను చాటుగా విన్నాడు. లారీని పిలిచి లూసీని, పాపను, మేనెట్‌ను తీసుకుని పారిస్‌ విడిచి వెళ్లిపోయే ఏర్పాట్లు చేయమని చెప్పాడు. బగ్గీ తీసుకుని వూరి బయట రెడీగా వుండమని తను రాగానే బయలుదేరాలనీ చెప్పాడు. ఆ తర్వాత సోలమన్‌ వద్దకు వెళ్లి డార్నే స్థానంలో తనను జైల్లో ప్రవేశపెట్టమని చెప్పాడు. సోలమన్‌ ఆ ఏర్పాట్లు చేశాడు. కార్టన్‌ జైల్లో వున్న డార్నేను కలిసి అతనికి మత్తుమందు యిచ్చాడు. అతను స్పృహ తప్పగానే అతని బట్టలు తను వేసుకున్నాడు. అతన్ని సోలమన్‌ ద్వారా బయటకు పంపించివేశాడు. ఇద్దరికీ ఒకే పోలికలు కావడంతో డార్నే స్థానంలో కార్టన్‌ వున్నాడన్న విషయం జైలు అధికారులు కనుగొనలేకపోయారు. సాలమన్‌ డార్నేను తీసుకుని వూరి బయట లారీ తదితరులు వున్న బగ్గీలోకి చేర్చాడు. కార్టన్‌ పేరు మీద వున్న ప్రయాణ అనుమతి పత్రాలను అతని జేబులో కుక్కారు. బండి లండన్‌వైపు బయలుదేరింది. 

ఈ లోగా డిఫార్జ్‌ భార్య లూసీని, కూతుర్ని బంధించి వారిని కూడా గిల్లెటిన్‌ వద్దకు తెద్దామని కత్తి, పిస్తోలు చేతబట్టి మేనెట్‌ యింటికి వెళ్లింది. అక్కడ వాళ్లెవరూ లేరు కానీ మిస్‌ ప్రాస్‌ మాత్రం వుంది. ఆమె డిఫార్జ్‌ భార్యతో కలబడింది. తుపాకీ పేలింది. డిఫార్జ్‌ భార్య చనిపోగా, మిస్‌ ప్రాస్‌ శాశ్వతంగా చెవిటిదై పోయింది. డార్నే కుటుంబం ఫ్రాన్సు సరిహద్దులు దాటిపోయింది. ఇక్కడ గిల్లెటిన్‌ వద్ద శిక్షితులందరినీ వరసగా నిల్చోబెట్టారు. ఆ వరసలో జమీందార్లకు దుస్తులు కుట్టే ఆమె కూడా వుంది. ఆమె డార్నేతో బాటు గతంలో జైల్లో వుంది. అతనే అనుకుని కార్టన్‌ను పలకరించింది. కార్టన్‌ ఆమెతో నిజం చెప్పకతప్పలేదు. కార్టన్‌ నిస్వార్థత్యాగం విని ఆమె నివ్వెరపోయి 'నీవంటి ఉత్తముడి పక్కన నిలబడవచ్చా?' అని అడిగింది. కార్టన్‌ ఆమెను దగ్గరగా తీసుకుని మృత్యువుకు అతి సమీపంలో వున్నపుడు భయపడవలసినది ఏమీ లేదని, ఈనాటి విలయం ఎక్కువకాలం సాగదని, యీ ప్రతీకారజ్వాలలు త్వరలోనే చల్లారి శాంతిసౌభాగ్యాలు వెలసిల్లుతాయని, యీ నగరం సుందరనగరంగా మళ్లీ మారుతుందని ఓదార్చాడు. కొద్ది సేపటికే వారిద్దరి తలలు తెగిపడ్డాయి. ఇదీ ''టేల్‌ ఆఫ్‌ టూ సిటీస్‌'' నవల కథ..(సమాప్తం)

ఫోటోలు – మేరీ ఆంటోనెట్‌ను గిల్లెటిన్‌పై ఎక్కిస్తున్న చిత్రం

 – ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015) 

[email protected]

Click Here For Archives