పైరసీ సరే..యూనిఫారమ్ రేటు మాటేమిటి?

పైరసీ మీద గగ్గోలు పెడుతున్నారు టాలీవుడ్ నిర్మాతలు. వీరిలో చాలా మంది బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా. చాలా అన్యాయం జరిగిపోతోందని, వందల కోట్ల నష్టం వాటిల్లుతోందని అంటున్నారు. కానీ వీళ్లెవరు, తాము ప్రేక్షకులకు…

పైరసీ మీద గగ్గోలు పెడుతున్నారు టాలీవుడ్ నిర్మాతలు. వీరిలో చాలా మంది బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా. చాలా అన్యాయం జరిగిపోతోందని, వందల కోట్ల నష్టం వాటిల్లుతోందని అంటున్నారు. కానీ వీళ్లెవరు, తాము ప్రేక్షకులకు చేస్తున్న అన్యాయం గురించి మాట్లాడడంలేదు. పెద్ద సినిమాలకు, కొత్త సినిమాలకు చాలా జిల్లాల్లో యూనిఫారమ్ రేటు అమలు జరుగుతోంది. దీనికి రెవెన్యూ, పోలీస్ శాఖలు సహరిస్తున్నాయన్నది జగద్విదితం.

విశాఖ జిల్లాలో వంద రూపాయిలు, ఈస్ట్ లో రెండు వందల రూపాయిలు యూనిఫారమ్ రేటునడుస్తోంది. అది సినిమాను బట్టి వారమా, రెండు వారాలా అన్నది వుంటుంది. మరి ఇలా దోపిడి చేస్తుంటే, ప్రేక్షకుడు పైరసీని ఆశ్రయించడా? ప్రేక్షకుడికి తామే వినోదం చవకగా అందించిన నాడు పైరసీ జోలికి ఎందుకు వెళ్తాడు? కానీ భారీగా లాభాలు ఆర్జించాలని, సినిమాకు హైప్ తీసుకువచ్చి, భారీరేట్లకుఅమ్ముతున్నారు. దాంతో ఆ మొత్తం రికవరీ కోసం యూనిఫారమ్ రేట్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రేక్షకులు పైరసీ సీడీ ఎక్కడ దొరుకుతుందా అని వెదుకుతున్నారు.

దీంతో పైరసీ సీడీలకు డిమాండ్ వస్తోంది. ఆ మేరకు చెన్నయ్, బెంగుళూరు నుంచి సీడీలు దిగుమతి అయిపోతున్నాయి. అదే కనుక 50 రూపాయిల్లోనే టికెట్ వుంటే జనం పైరసీని ఆశ్రయించడం చాలా వరకు తగ్గుతుంది. వ్యాధి ఒకటైతే, మందు ఒకటి అన్నట్లువుంది టాలీవుడ్ నిర్మాతల వ్యవహారం.