టీమిండియా బ్యాటింగ్ స్ట్రెంగ్త్ పెంచిన ఆటగాళ్ళలో వీరేందర్ సెహ్వాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రత్యర్థి బౌలర్ ఎంత స్ట్రాంగ్ అయినా అతనికి అనవసరం. 'బంతి బౌలర్ చేత్లోంచి బయటకు రాగానే, దాన్ని స్టాండ్‌లోకి పంపాల్సిందే..' అన్నది సెహ్వాగ్ క్రికెట్ ఆడినంతకాలం ఫాలో అయిన థీమ్.
వీలైనంత త్వరగా బౌలర్ల ఏకాగ్రతను దెబ్బ తీస్తే, ఆ తర్వాత మ్యాచ్ పూర్తిగా తన జట్టు చేతుల్లోకి వచ్చేస్తుందని సెహ్వాగ్ భావించేవాడు. 40 పరుగులు కొట్టాం కదా, ఎలాగైనా 50 దాటెయ్యాలి.. అనుకునే రకం కాదు. 90ల్లో వున్నాం కదా, సెంచరీ కొట్టేద్దాం.. అనుకునేరకం అస్సలే కాదు. 99 పరుగుల దగ్గర వున్నా సిక్సర్ కొట్టాలన్న కసి బహుశా ప్రపంచ క్రికెట్లో సెహ్వాగ్‌కి తప్ప ఇంకెవరికీ వుండదేమో.
'40 పరుగులు చేసి, అర్థ సెంచరీ చేయడం చేతకాలేదు.. 90 పరుగులు చేసినా సెంచరీని తన ఖాతాలో వేసుకోలేకపోయాడు..' ఇలా ఎన్నెన్నో విమర్శలు సెహ్వాగ్ చుట్టూ విన్పించినా, టీమిండియాకి సెహ్వాగ్ అందించిన పరుగులు, తద్వారా టీమిండియా సాధించిన అనూహ్య విజయాలూ భారత క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
అలాంటి మేటి క్రికెటర్, 'ఓ మ్యాచ్ ఆడి, రిటైర్మెంట్ తీసుకోవాలి..' అనుకోవడం తప్పెలా అవుతుంది.? కెరీర్లో ఎప్పుడూ అర్థ సెంచరీ కోసంగానీ, సెంచరీ కోసం గానీ తహతహలాడకుండా జట్టు ప్రయోజనాలే ముఖ్యమనుకుని, మైదానంలో దుమ్మురేపిన డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్, క్రికెట్ కెరీర్‌ని దయనీయంగా ముగించాడు. 'చివరి మ్యాచ్‌కి అనుమతించి వుండాల్సింది..' అని సెహ్వాగ్ ఆవేదన వ్యక్తం చేశాడంటేనే, అతనెంత బాధపడ్డాడో అర్థమవుతుంది.
అయితే, సెహ్వాగ్ ఆవేదనను బీసీసీఐ ఇంకోలా అర్థం చేసుకుంది. 'ఫామ్‌లో వుంటేనే ఛాన్స్ దొరుకుతుంది.. నిలకడగా రాణించి వుంటే, సెహ్వాగ్‌కి చివరి మ్యాచ్ ఆడే అవకాశం దక్కేది..' అని సెలవిస్తున్నారు బీసీసీఐ పెద్దలు. ఒకప్పుడు కుంబ్లే నెత్తికి గాయమై రక్తం కారుతోంటే, ఫిట్నెస్ వుందని.. అతన్ని ఆడించారా.? అప్పుడు అది అవసరం. వరుసగా ఫెయిలవుతున్న క్రికెటర్లకు ఏ ప్రాతిపదికన ఇంకా అవకాశాలు కల్పిస్తున్నారు.? ఇది బీసీసీఐ మోనార్కిజంకి నిదర్శనం.
ఒక్క మ్యాచ్ గెలుపోటములతో టీమిండియాకి వచ్చే నష్టమేమీ వుండదు. అయినా సెహ్వాగ్ చివరి మ్యాచ్‌ని ఘనంగానే ముగించాలనుకుంటాడు.. అతని కెరీర్‌ని చూస్తే ఆ విషయం ఎవరైనా చెబుతారు. పోనీ, సెహ్వాగ్ ఫెయిలయితేనో.. అతని చివరి మ్యాచ్‌ని ఎలాగైనా గెలవాలని మిగతా ఆటగాళ్ళు కసితో ఆడరా.? కుంటి సాకులు వెతకడం తప్ప, బీసీసీఐకి అన్నీ తెలుసు. సెహ్వాగ్ ఏంటో, సెహ్వాగ్ ఎంత విలువైన ఆటగాడో బీసీసీఐకన్నా బాగా ఇంకెవరికి తెలుసు.!