ఆవేళ పొద్దున్న అనంతం నిద్రలేచేటప్పటికీ రాంపండు సిద్ధం.
తమ వంశమర్యాదల గురించి అనంతానికి చాలా గర్వం. ఏ వేళ వచ్చినా అతిథిని కష్టపెట్టకూడదని అతని పెద్దలు చెప్పారుట. కానీ వాటిక్కూడా వేళా, పాళా వున్నాయనీ, అవి చెప్పడం పెద్దలు మరిచారనీ అనంత్ నమ్మకం. లంచ్‌టైముకి వచ్చి బుర్రతింటే ఓ దారి. డిన్నర్ టైముకి మరోదారి. కానీ పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ వేళకే దిగడి దుఃఖగాథలు వినిపించడం అతిథులు చేయవలసిన పనికాదని అనంత్ సిద్ధాంతం.
''చూడు తండ్రీ, నీ హృదయం బద్దలు కావడమో, ముక్కలు కావడమో, బద్దలయి ముక్కలు కావడమో, ముక్కలయి బద్దలు కావడమో జరిగింది. ఒప్పుకున్నా! అంతమాత్రం చేత ఇలా తెల్లారకుండా…''
రాంపండుకి అహం పొడుచుకు వచ్చింది. ''సులోచన వ్యవహారం గురించి మాట్లాడడానికి రాలేదు నేను.''
''హమ్మయ్య'' అంటూ అనంత్ ఇడ్లీ ప్లేటు ముందుకు లాక్కున్నాడు.
''గతం మర్చిపోవాలి. అదే మనిషి చేయగలిగేది''. రాంపండు ఫిలాసఫించాడు.
''రైట్, రైట్''. ఇడ్లీ నోట్లో కుక్కుకుంటూ తలవూపాడు అనంత్.
''నా గుండె హృదయాంతరాల దాకా గాయపడింది. అయినా పట్టించుకోకు''.
''…కోను''. ఇప్పుడు సాంబారు స్టేజి సాగుతోంది.
''మరిచిపో. మనసులోరచి తుడిచేయ్''.
ఆ పాటికి అనంత్ మూతి తుడుచుకోవడం అయిపోయింది. ''ఒరే నువ్వా సొద ఆపి, వేరేది మొదలెడతావా? నన్ను మళ్ళీ నిద్ర కుపక్రమించ మంటావా?''
రాంపండుకి భయం వేసింది. అనంత్ నిద్రపోతే అంతే సంగతులని. అసలే అతని పేరు అనంతశయనం! గబగబా తన ప్లాను చెప్పేశాడు.
********
రాంపండు కున్న వ్యసనాలు రెండే రెండు. ఒకటి ప్రేమలో పడడం, రెండోది జూదం. జూదం రకరకాలుగా ఉంటుంది. గుర్రప్పందెం, కవిత్వప్పందెం… ఈసారి స్కూలు ఆటల పోటీల పందెం. వేంపూడిలో ఉన్న హైస్కూలు వార్షికోత్సవం సందర్భంగా ఆటలపోటీలు జరుగుతున్నాయి. ఊళ్ళో చీమ చిటుక్కుమనే ముందుకూడా ఎన్నిసార్లు చిటుక్కుమంటుందో చెప్పాలని పందాలు కట్టాలని సిద్ధంగా ఉన్న గుంపొకటి ఉంది. వాళ్ళను పెట్టుకుని నాలుగు డబ్బులు సంపాదిద్దామని రాంపండు అయిడియా. పెట్టుబడి కావాలంటే అనంతం దగ్గరకి రావలసినదే!
కానీ ఈసారి అనంత్ ఓ పట్టాన మెత్తబడలేదు. అచలపతి నడిగి చెప్తానన్నాడు. అతన్ని పిలిచాడు. విషయం చెప్పగానే అతను గడగడా అప్పచెప్పేశాడు.
''సర్, ఈ స్కూలు ఫంక్షన్ ఆటల పోటీల మీద పందాలు కాయడం అనాదిగా సాగుతున్నట్లు నాకు తెలియవచ్చింది. అందువల్ల గణాంకాల వివరాలు తేలికగానే లభ్యమవుతున్నాయి. 15 రకాల ఈవెంట్స్‌లో సాధారణంగా ఫేవరేట్స్‌యే ఎప్పుడూ గెలుస్తూ వస్తున్నారు. అందువల్ల వాళ్ల మీద పందెం కట్టించుకుని మనం సాధించబోయేది పెద్దగా ఏదీ లేదు. ఎవరూ ఊహించని విధంగా కొత్త క్యాండిడేట్‌ను, అంటే గుర్రప్పందాల భాషలో డార్క్‌హార్స్‌ను పోటీలో ప్రవేశపెట్టినపుడే మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంది సర్''.
రాంపండు ఎగిరి గంతేశాడు. ''అలాటి కాండిడేట్ నాకు ఒకళ్ళు తెలుసు. 'మదర్స్ సాక్ రేస్' అని స్కూలు పిల్లల తల్లులు గోనుసంచులు తొడుక్కుని పరిగెడతారు చూడు – ప్రతీ ఏడాదీ దాంట్లో ప్రౖౖెజు కొట్టేసేది సుశీలమ్మే. అందరూ ఆవిడ మీదే పందెం కడతారు. కానీ నాకో ఆవిడ తెలుసు. విశాలాక్షి! ఈసారి గెలుపు ఆవిడదే. ఎవరూ ఊహించని డార్క్‌హార్స్!''
''ఆవిడ నీకెలా తెలుసు?'' అడిగాడు అనంతం, రాంపండు తన ప్రేమ పరిధిని వివాహితలకు కూడా విస్తరిస్తున్నాడా అన్న అనుమానంతో.
''మొన్న కవిత్వప్పందాల కేసులో డబ్బు పోయిందిగా! ఇంకో కుర్రాడెవరైనా దొరికితే ప్రెవేటు చెబుదామని బుజ్జిని అడిగి చూశా. తన క్లాసుమేటే ఓ కుర్రాడున్నాడంటే వాడికీ చెప్పనారంభించా. వాళ్ల అమ్మగారే విశాలాక్షి…''
''మొత్తానికి ప్రెవేటు మాష్టరుగా స్థిరపడిపోతున్నావన్నమాట..''
''అధిక ప్రసంగం ఆపు. ఈవిడ విషయం విను. ఈ విశాలాక్షి రోజూ కాఫీ ఇవ్వడానికి వచ్చి తెగ కబుర్లు చెబుతుందిలే. ఈ ఊరికి కొత్తగా వచ్చారట. ఇంతకుముందున్న ఊళ్లో స్కూలు వార్షికోత్సవాలలో పేరెంట్స్ పాల్గొనే ఆటల పోటీల్లో ప్రైజులన్నీ ఈవిడవేనట. ముఖ్యంగా ఈ గోనుసంచుల పోటీలో ఫస్టు ప్రైజు ఎప్పుడూ ఈవిడదేనట…''
''ఈ అనంత్‌కు ఇంతకంటె ఎక్కువ చెప్పనక్కరలేదు. తక్కినవాళ్లెవరైనా అయితే అర్థం చేసుకోలేరేమో కానీ అనంత్ సూక్ష్మగ్రాహి. నువ్వు చెప్పేదేమిటంటే విశాలాక్షి సామర్థ్యం గురించి ఊళ్లో వాళ్లకి అవగాహన లేదు కాబట్టి షీ ఈజ్ యే డార్క్ హార్స్..''
''మీరు పరిస్థితిని సరిగ్గా అంచనా వేశారు సర్. అలాగే ప్రజలు ఎరగని ఒక అజ్ఞాత హీరో పరుగుపందాలలో గెలిచే శక్తియుక్తులు ఉన్నవాడు నాకు తెలుసు సర్.'' అన్నాడు అచలపతి.
''ప్రతీ ఏడాది ప్రకాశ్ అనే కుర్రాడేగా హాట్ ఫేవరేట్.. ''అని అడ్డు వచ్చాడు రాంపండు.
''అవునుసర్. కానీ అతని కంటె వేగంగా పరిగెట్టగలడు ఈ ఇంట్లో పనిచేసే సుబ్బు అనే కుర్రవాడు.'' అన్నాడు అచలపతి.
''అచలపతీ, నువ్వు ఈ ఇంట్లోకి వస్తూనే చాలా సమాచారం సేకరించావు ఒప్పుకున్నా కానీ. ఆ సుబ్బుగాడు నాకు ఇంతప్పటినుండీ తెలుసు. వాడి ఒళ్లే వాడు మోసుకోలేడు. పైగా ఇది స్కూలు పిల్లలకి… వాడికీ చదువుకీ ఆమడ దూరం.''అన్నాడు అనంత్ సాధికారంగా.
''..కానీ సుబ్బు ఇటీవలే నైట్‌స్కూల్లో చదువుతున్న సంగతి మీదాకా వచ్చి వుండదు సర్. ఒళ్లు విషయంలో మీతో నేను ఏకీభవిస్తున్నా అవసరం వచ్చినప్పుడు అతను చూపే లాఘవం మీరు ఊహించను కూడా ఊహించలేరని చెప్తున్నా.'' అన్నాడు అచలపతి, హితోపదేశం చేసే స్టయిల్లో.
''కానీ ఆ అవసరం ఎప్పుడు ఏర్పడుతుంది? మనకు అతని కళ చూసే అవకాశం ఎలా కలుగుతుంది? కళ్లతో చూడందే ఆ లడ్డూగాడి మీద పైస కూడా పెట్టుబడి పెట్టడానికి నేను సిద్ధంగా లేను.'' అని తేల్చి చెప్పాడు అనంత్.
''ఆ అవకాశం, అవసరం ఇప్పుడే కలిగించవచ్చు సర్. మీరొక రూపాయి ఇస్తే సుబ్బుకి లంచం పెట్టి వంటాయన మెల్లకన్ను మీద కామెంటు చేయమంటాను. వంటాయన తన మెల్లకన్ను గురించి కాస్త సెన్సిటివ్‌గా ఫీలవుతాడు. ఒక్క మాట అని చూస్తే చాలు, తరిమి, తరిమి తంతాడు. అప్పుడు ప్రాణరక్షణ కోసం సుబ్బు పెట్టే పరుగులు, ఇదిగో మీరీ కిటికీలోంచి చూడవచ్చు…''
పదినిమిషాలలోనే అనంత్ కోసం ఆ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయడం, అంత భారీ శరీరాన్ని వేసుకుని సుబ్బు పరుగులు పెట్టడం చూడడం సంభవించింది. ''నా దగ్గర ఉన్న ఆఖరి చిల్లిగవ్వ కూడా ఈ సుబ్బుగాడి మీద పెట్టుబడి పెట్టడానికి సంశయించను.'' అని అనంత్ గంభీరంగా ప్రకటించడం కూడా జరిగింది.
*******
ఆ తరువాత వారం రోజుల్లో చాలా సంఘటనలు జరిగేయి. సుబ్బు ఆటలపోటీల్లో పేరు ఇవ్వడం, దానిమీద చాలామంది జోకులు వేసుకోవడం జరిగింది. ఎప్పుడైనా ఆవేశంలో వాడి అసలు ప్రజ్ఞ గురించి గొప్పలు చెప్పవద్దని రాంపండుకి వార్నింగు ఇవ్వడం జరిగింది. రాంపండు కూడా ఇది తన జీవన్మరణ సమస్య కాబట్టి సుబ్బు గాడిని చాలా జాగ్రత్తగా, అంటే అవీ, ఇవీ తిని ఆరోగ్యం పాడుచేసుకోకుండా, మరీ తిని ఇంకా లావెక్కకుండా, వాడి పరుగుపెట్టే దృశ్యం ఎవరి కంటా పడకుండా చూసుకుంటున్నాడు. ఎవరికంట బడినా ఫరవాలేదు కానీ భూషణం కంటబడకుండా ఉండాలని రాంపండు ప్రార్థిస్తుండగానే ఆ అనర్థం జరిగింది.
భూషణం అనే అతను అనంత్, రాంపండు గ్రూపుకి పోటీ సిండికేటు నడుపుతున్నాడు. ప్రతీసారీ గెలిచే ప్రకాశ్‌ను, తక్కినవాళ్లను నమ్ముకునే అతను పందాలు ఒప్పుకుంటున్నాడు.
సుబ్బు పరిగెడుతున్న దృశ్యం అతని కంటపడినట్లు కల వచ్చినప్పుడల్లా రాంపండు ఉలిక్కిపడి లేచి అనంత్ దగ్గరకి పరుగులు పెడుతున్నాడు. అనంత్ రక్షరేకు కట్టించి ఇచ్చినా రాంపండు కల నిజమయి కూచుంది.
అవేళ రాంపండు సుబ్బును దొంగతనంగా ఊరు బయటకు తీసుకెళ్లి రన్నింగు ప్రాక్టీసు చేయించి వస్తూ ఉంటే సినిమాహాలు దగ్గర భూషణం కనబడ్డాడు. మర్యాదకి అతన్ని హాలు క్యాంటీనుకి పిలిచి టీ ఇప్పిస్తూంటే తుంటరితనానికి మారుపేరైన సుబ్బు భూషణం మోటరు సైకిలు ఎక్కి స్టార్టు చేయడం, రయ్యిన ముందుకు తీసుకెళ్ళి కింద పడేయడం జరిగింది. భూషణం కంగారుగా బయటకు వచ్చి చూసి సుబ్బుకి రెండు తగిలించబోయేడు. దాంతో సుబ్బు ఆపత్సమయాల్లో ఆదుకునే పరుగు కళను ఆశ్రయించాడు.
సుబ్బును పరుగుపెడుతూండగా చూసిన భూషణం నోరు అలాగే తెరిచి ఉంచేశాడు. మోటరు సైకిలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోలేదు. వీడిని తక్కువ అంచనా వేసి తను చేసిన పొరబాటు ఏమిటో తెలిసివచ్చింది. సుబ్బు మీద పెట్టుబడి పెట్టిన అనంత్ గ్రూపు తాలూకు ఇస్తోకు ముక్క ఎవరో తెలిసిపోయింది.
దాని ఫలితమే మర్నాడు స్కూలు అసెంబ్లీలో అతను చేసిన కుట్ర. ఈ లోగా రాంపండు సుబ్బు పరుగును చూసిన భూషణం హావభావాలను యాక్షన్‌తో సహా వర్ణించి చెప్పడంతో శతృవు అలర్ట్ అయిపోయిన విషయం అనంత్ గ్రూపుకి తెలిసిపోయింది. ఇంకో డార్క్ హార్స్ లేకపోతే సిండికేట్ మునిగిపోవడం ఖాయం అనుకుంటూండగానే అచలపతి తను దాచుకున్న ఇంకో పేకముక్క బయటకు తీసాడు.
''సర్, చిన్నపిల్లల లెమన్ అండ్ స్పూన్ పందెం గురించి మీకు తెలుసుగా..నోట్లో చెంచా పెట్టుకుని దాంట్లో నిమ్మకాయ పెట్టుకుని ఎవరు వేగంగా నడిస్తే వాళ్లకి ప్రైజు ఇస్తారూ..దాంట్లో..''
''తెలుసులేవయ్యా, ప్రతీసారీ ఆ పిలకజడ సుమతికేగా ప్రైజు. దాంట్లో మనకేమీ ఛాన్సు లేదు. ఆ స్టాటిస్టిక్స్ అన్నీ ముందే స్డడీ చేసి పడేశాను'' అన్నాడు అనంత్ విసుగ్గా.
''సర్, మీరు కాస్త ఓపిగ్గా వినాలి. మన తోటమాలి కూతురు వెంకటలక్ష్మి కూడా దాంట్లో పాల్గొంటోంది. ఆమెకు ఛాన్సు ఉందని నా ఉద్దేశం.'' అన్నాడు అచలపతి తొణక్కుండా.
''ఎలా, ఎలా..?'' అన్నాడు రాంపండు ఆతృతగా. అతనికి ఇది రోటీ, కపడా ప్రశ్న. ఈ పందాలలో ఓడిపోతే జీవితాంతం అల్లరి కుర్రాళ్లకు ట్యూషన్లు చెప్పుకు బతకవలసి వస్తుందని అతని భయం.
''నాకు తోటమాలి స్వయంగా చెప్పాడు సర్. రోజూ సాయంత్రం గిన్నె నిండా అంబలి వెంకటలక్ష్మే పట్టుకొస్తుందట. ఒక్క చుక్క కూడా ఒలకదట. అంత స్టడీహేండు ఉన్న పిల్ల ఈ పందెంలో ఈజీగా గెలుస్తుంది.'' అచలపతి ధీమాగా చెప్పాడు.
''రైఠో, అయితే వెంకటలక్ష్మి మీద పందాలు ఒప్పుకో'' అని ఆర్డరేశాడు అనంతం. కానీ రాంపండుకి ధైర్యం చిక్కలేదు. ''ఒద్దురా, ఇంకా పెట్టుబడి అంటే భయం వేస్తోంది'' అంటూ లబలబలాడేడు…
స్కూలు ఫంక్షన్ రెండురోజులుందనగా భూషణం వేసిన ట్రిక్ ఫలించింది. అవేళ స్కూలు అసెంబ్లీలో ప్రార్థన జరుగుతూండగా ఉన్నట్టుండి సుబ్బు కెవ్వున అరిచాడు. పిల్లలంతా ముందు ఉలిక్కిపడి, తర్వాత పకపక నవ్వారు. హెడ్‌మాష్టారు పరంధామయ్య గారికి ఒళ్లు మండిపోయింది. ఇలాటి చిలిపిచేష్టలు సుబ్బు ఇంతకు ముందు చాలా చేశాడు కానీ ఇదే అన్నిటికీ హైలైట్. చరచర వాడి దగ్గరికి నడిచేడు బెత్తం పట్టుకుని.
''ఏరా, తోకతిప్పిన పందిలా ఏమిట్రా ఆ అరుపు? నిలువునా చీరేస్తాను జాగ్రత్త!''
సుబ్బు పాపం ఎప్పట్లా కొంటెగా నవ్వడం లేదు. భయంతో వణుకుతున్నాడు, చొక్కా విదిలించుకుని చూసుకుంటున్నాడు.
''ఏం జరిగిందిరా అంట్ల వెధవా! ఏమిటా నాటకాలు?'' పరంధామయ్య గారు గావుకేక పెట్టాడు.
''పు..పురుగండి. ఎవరో నా చొక్కాలో పడేశారండి. నాకు పురుగులంటే భయమని మీకూ తెలుసుకదండి..''అంటూ ఏడుపుమొహం పెట్టాడు సుబ్బు.
పరంధామయ్య కరగలేదు. ''వెధవ్వేషాలు ఆపు. ఎన్నిసార్లు చెప్పినా నీ అల్లరి తగ్గలేదు. నీ పని ఇలా కాదు. నువ్వు ఆటలపోటీల్లో పేరిచ్చావు కదూ, నిన్ను తీసేశాను ఫో. దిక్కున్నచోట చెప్పుకో. హన్నా! తుంటరితనం మరీ పెరిగిపోయింది. ఒక్కసారి ఇలా చేస్తే తప్ప నీకు బుద్ధి రాదు. లేకపోతే నిన్ను చూసి మిగతావాళ్లు తగలడతారు.''
పరుగుపందెంలోంచి తీసేసినందుకు సుబ్బు బాధపడ్డాడో లేదో తెలియదు కానీ వాణ్ని అనుక్షణం కనిపెట్టుకు తిరుగుతున్న రాంపండు మాత్రం గొల్లుమన్నాడు. పైగా సుబ్బు పక్కన నిలబడ్డ మోహన్‌కి అసెంబ్లీ అయిపోయిన తర్వాత భూషణం ఐస్‌క్రీము ఇప్పిస్తూ కనబడడంతో కుట్ర మొత్తం అర్థమయి రాంపండు మరింత కుళ్లుకున్నాడు. వెంటనే వచ్చి సిండికేట్ దగ్గర మొత్తుకున్నాడు.
''ఒరేయ్, అనంతూ, ఆ భూషణం గాడు మోహన్ అనే కుర్రాడికి లంచం పెట్టి సుబ్బుగాడిని పోటీలోంచి తప్పించేసాడురా. అయినా ఆ సుబ్బు గాడిలాటి రాలుగాయి కుర్రాడికి పురుగులంటే అంత భయమేమిట్రా? అందరూ కళ్లు మూసుకుని ప్రార్థిస్తూ ఉంటూ ఈ మోహన్ గాడు సుబ్బుగాడి చొక్కాలో ఓ పురుగు పడేయడం, వీడు కెవ్వుమని గుండెలవిసేలా అరవడం.. అంతా మన ఖర్మానికి వచ్చిందనుకో..''
అనంత్ ఓదార్చాడు. ''అచలపతి ఉన్నాడుగా ఏదో ఒకటి చూస్తాడులే. ఎవిరిథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నారు. ఇలాటి మోసాలు ఉంటాయనే వెంకటలక్ష్మిని రంగంలోకి దించాం. నువ్వు చెప్పిన విశాలాక్షి ఎలాగూ వుంది. ఊరికే కంగారు పడకు.''
''ఏమోరా, నీకయితే ఇది వినోదం కానీ, నాకు లైఫ్ అండ్ డెత్ కొశ్చన్. ఒక్కోసారి విసుగేసి ఆ భూషణం గాడితో చేతులు కలిపేద్దామా అనిపిస్తోంది. మొన్న ఆఫర్ ఇచ్చాడు కూడా..''
''అలాటి పిచ్చిపని చేయకు. అఫ్‌కోర్స్, నీకు కావాలంటే సిండికేట్ లోంచి బయటకు వెళ్లిపోతానంటే నేను అభ్యంతరపెట్టను. కానీ అచలపతి ఉన్నాడుగా..పెట్టుబడి కూడా పెట్టాడు..ఏదోలా చక్రం అడ్డువేస్తాడులే..''
********
రాంపండు అప్పటికి శాంతించాడు కానీ ఫంక్షన్ రోజున వెంకటలక్ష్మిని చూడగానే నీరుకారిపోయాడు. ఆ రోజు కాస్సేపటిలో పోటీలు ప్రారంభమవుతాయనగా ఓ పదేళ్ల పిల్ల అనంత్, రాంపండుల దగ్గరకి వచ్చింది. వస్తూనే రాంపండుని చిరకాలంగా ఎరుగున్నట్టు లాటరీలో తనకు బహుమతిగా వచ్చిన బొమ్మ గురించి మాట్టాడ్డం మొదలుపెట్టింది.
''మరేమో, నా బొమ్మ లేదూ, దానికి బంగారూ అని పేరు పెట్టానులే. దాన్ని రోజూ రాత్రి నా పక్కలో పడుక్కోబెట్టుకుని… అస్సలు ఏడవదులే. చాలా మంచిది. మరేమో, పొద్దున్నే లేపి, స్తానం చేయించి..''
అసలే చికాగ్గా ఉన్నాడేమో రాంపండు ''చాల్లే, సొద'' అని విసుక్కున్నాడు కానీ వంశమర్యాద కాపాడడానికి కంకణం కట్టుకున్న అనంత్ మాత్రం ''పాపా, నువ్వు కాస్సేపు మాట్టాడ్డం ఆపితే మేం ఈ ఆటల పోటీలు చూస్తాంగా. ఇప్పుడు స్కూలు పిల్లల తల్లులందరూ గోనుసంచులు తొడుక్కుని పరిగెడతారన్న మాట. నువ్వూ, మీ బంగారూ కూడా చూడండి.'' అని ఊరుకోబెట్టబోయాడు.
''నేనూ పోటీల్లో పాల్గొంటాగా..'' అంది ఆ పాప కళ్లు మహా తిప్పుతూ.
''ఏదీ వాగుడుపోటీల్లోనా…?'' అడిగాడు రాంపండు కసిగా.
''కాదు, లెమన్ అండ్ స్పూన్. మరేమో నిమ్మకాయ ఒక చెంచాలో పెట్టుకుని…'' అంటూ పాప చెప్పబోతుండగానే ఆత్రం పట్టలేని రాంపండు ''నీ పేరు సుమతా?'' అని అడిగేశాడు.
ఆ పిల్లకు కోపం వచ్చేసింది.
''కాదు, సుమతి అంటే అది. ఆ ఎర్ర పరికిణీ లేదూ, ఆ పిల్ల. నా పేరు వెంకటలక్ష్మి. సుబ్బు మా క్లాసే. వాడిని పోటీల్లోంచి తీసేశారుగా. మా బాగా అయింది. మొన్న నా జడ పట్టుకుని లాగి….'' అంటూ మళ్లీ మొదలెట్టింది.
కానీ రాంపండు అవేవీ వినేస్థితిలో లేడు. తన ఎదురుగా ఉన్న నల్లటి, పొట్టి, గుమ్మటం లాంటి స్వరూపమే వెంకటలక్ష్మి అని తెలియగానే అతనికి భయం వేసింది. ''ఒరే అనంతూ, అచలపతిని నమ్ముకుని పొరపాటు చేసాంరా. ఈ అమ్మాయి వణక్కుండా, బెణక్కుండా గిన్నె నిండా అంబలి తేవచ్చు కానీ, స్పీడ్ సంగతి ఆలోచించి చూడు. ఆ సుమతిని చూడు. చలాకీగా, సలాకలా ఉంది. ఈ వెంకటలక్ష్మి కదిలేసరికి ఆ సుమతి ఆరడుగులు ముందుంటుంది. ఒరే, అచలపతి హామీ చూసుకుని ఈ వెంకటలక్ష్మి మీద చాలా పెట్టుబడి పెట్టేసానురా. కొంప మునిగినట్టుంది''. అంటూండగానే అచలపతి వాళ్ళ దగ్గరకి వచ్చాడు.
''సర్, ఈ భూషణానికి చాలా మంది గూఢచారులు ఉండి ఉంటారు. మన విశాలాక్షి మంచి కాండిడేట్ అని అతనికి తెలిసిపోయి నట్టుంది. తన కాండిడేట్‌కి గట్టిపోటీ ఇస్తుందని గ్రహించేసేడు లాగుంది. ఇందాకటి నుండి చూస్తున్నాను. వెళ్లి అవీ, ఇవీ కబుర్లు చెప్పి మూడుసార్లు స్కూలు క్యాంటీనుకి తీసుకెళ్లి బోల్డంత మెక్కబెట్టాడు. ఇప్పుడావిడ ఒ మూల కూర్చుని ఆపసోపాలు పడుతోంది. పోటీలో ప్రైజు రాకపోయినా ఫర్వాలేదు. దాన్లో వచ్చేదాని కంటె ఎక్కువ ఖరీదైన ఐస్‌క్రీములు పెట్టించాడు ఈ పెద్దమనిషి అంటోంది పక్కావిడతో'' అని వార్త మోసుకొచ్చాడు.
విషయం వింటూండగానే వెంటనే రియాక్టయింది రాంపండే! ''ఒరే, అనంతూ, క్షమించరా, నేను పార్టీ ఫిరాయించేసాను. భూషణం గాడితో చేతులు కలిపేస్తున్నాను. ఈ లెమన్ అండ్ స్పూన్ రేసు మీద చాలానే రిస్కు తీసుకున్నాను. పోతే తట్టుకోలేను'' అంటూ భూషణం కోసం పరుగు పెట్టాడు.
రాంపండు అనుకున్నదే అయింది. గోనెసంచుల పోటీలో విశాలాక్షికి మూడో స్థానం. నిమ్మకాయల పోటీలో వెంకటలక్ష్మికి ఆరోస్థానం వచ్చాయి. కానీ ప్రైజులు ఎనౌన్స్ చేయడానికి కాస్త ఆలస్యమయింది. దానికి కారణం హెడ్‌మాష్టారు పరంధామయ్య తన ప్రసంగంలో వివరించారు.
''….ఈ ఆటల పోటీలు పిల్లలలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడానికి ఉద్దేశించబడ్డాయని అందరికీ తెలుసు. కానీ ఉళ్లో కొందరు సోమరులు, జూదరులు ఈ పిల్ల్లలను గుర్రాల కింద జమకట్టి వాళ్ల మీద పందాలు కట్టి డబ్బు చేసుకుంటున్నారని తెలిసి చాలా బాధపడుతున్నాను. కానీ సాక్ష్యాలు దొరక్క ఏమీ చేయలేక పోతున్నాను. మూడేళ్ల క్రితం ఇటువంటి సంఘటన నా దృష్టికి వచ్చింది. అదృష్టవశాత్తూ సాక్ష్యం కూడా లభించింది. అప్పుడు పోటీలన్నీ కాన్సిల్ చేసి వేశాను. ఈ ఏడాది కూడా ఇటువంటి పందాలు జరిగాయని నాకు సాక్ష్యం దొరికింది….''
ఎఫెక్ట్ కోసం పరంధామయ్య ఆగినప్పుడు అనంత్ అచలపతి కేసి చూడబోయి ఎక్కడున్నాడాని కళ్లతో వెతికాడు. పరంధామయ్యకు కాస్త దూరంగా తలవంచుకుని నిలబడ్డ అచలపతిని చూసి అయోమయంలో పడిపోయేడు. ఇంతలోనే పరంధామయ్య తన ప్రసంగాన్ని కొనసాగించేడు.
''…..పని పాటాలేని ఓ కుర్రజమీందారు తన వద్ద పనిచేసే అతని ద్వారా లెమన్ అండ్ స్పూన్ పందెంలో పాల్గొనే కొంతమంది పిల్లలకు లంచం పెట్టి ఆటల ఫలితాలను తన స్వార్థం కోసం ప్రభావితం చేశాడు. యజమాని ఆజ్ఞ మేరకు అతని ఆదేశాన్ని శిరసావహించినా, ఆ పనివాడి అంతరాత్మ మాత్రం ఊరుకోలేక పోయింది. తను చేసిన తప్పు ఒప్పుకోమని చెప్పింది. అంతరాత్మ ప్రబోధాన్ని విని అతను జరిగిన సంగతి యావత్తు నాకు వివరించి క్షమాపణ కోరాడు…'' ఇక్కడ పరంధామయ్య ఆగి, అచలపతి కేసి ఒక్కసారి చూసి, తిరిగి ప్రసంగం కొనసాగించడం అనంత్ దృష్టిని దాటిపోలేదు.
''నేరాన్ని ఒప్పుకున్న వ్యక్తి కోరిక మేరకు అతని పేరును, అతని యజమాని పేరును నేను బయట పెట్టడం లేదు. కానీ లంచం పుచ్చుకుని ఆటలాడిన పిల్లలను మాత్రం పోటీనుండి తొలగిస్తున్నాను. లెమన్ అండ్ స్పూన్ పోటీలో మొదటగా వచ్చిన ఐదుగురు పిల్లలను అనర్హులుగా ప్రకటిస్తూ ఆరవ స్థానంలో వచ్చిన వెంకటలక్ష్మిని విజేతగా ప్రకటిస్తున్నాను. అమ్మాయ్, వెంకటలక్ష్మీ… ఇలా రా. లంచం ఇవ్వజూపినా పుచ్చుకోని నీ నిజాయితీని అభినందిస్తూ ఈ బహుమతిని నీకు అందజేస్తున్నాను…''
ఈ ప్రకటన వింటూ రాంపండు చేసిన ఆర్తనాదం ప్రజల హర్షధ్వానాల మధ్య వినబడలేదు.
(పి జి ఉడ్‌హౌస్ రాసిన 'ద ప్యూరిటీ ఆఫ్ ద టర్ఫ్' అనే కథ ఆధారంగా) (''హాసం''లో 2002 లో ప్రచురితం)
– ఎమ్బీయస్ ప్రసాద్