''మా దైవం'' అనే 1970ల నాటి సినిమాకు మూలం దానికి 20 ఏళ్ల క్రితం ప్రఖ్యాత దర్శకనిర్మాత వి.శాంతారాం హిందీలో తీసిన ''దో ఆంఖే బారా హాత్'' అనే సినిమా. ఖైదీలను సంస్కరించే ఇతివృత్తంతో తీసిన యీ సినిమా శాంతారాంకు ఎంతో ఖ్యాతిని గడించిపెట్టింది. సినిమా బాగా హిట్ అయింది కూడా. ఈ ఆదర్శప్రాయమైన సినిమాను తెలుగులో తీసినప్పుడు కొన్ని కమ్మర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ప్రజలకు చేరువ కాడానికి ప్రయత్నించారు. ''దో ఆంఖే బారా హాత్'' అంటే 'రెండు కళ్లు-పన్నెండు చేతులు'. ఆ పన్నెండు చేతులు ఆరుగురు ఖైదీలవి. ఆ రెండు కళ్లూ వాళ్లని సంస్కరించ బూనిన జైలర్‌వి. ఈ కథ నిజంగా జరిగిన కథపై ఆధారపడి తీశామని శాంతారాం రాశారు. అంతకు 20 సం||ల క్రితం ఓ సంస్థానంలో ఓ జైలరు యిలాటి ప్రయోగమే చేశాట్ట. అతని అనుభవాలతోనే యీ సినిమా కథ తయారైందట.
సినిమాలో ఆదినాథ్ అనే జైలర్ ఖైదీలు కూడా మనుష్యులేననీ, ఎంతటి ఘోరాలూ నేరాలూ చేసినా అవకాశం యిస్తే వారిలో మానవత్వం బయటకు వస్తుందనీ నమ్మేవాడు. కానీ ఆయన పై అధికారి ఐన సూపర్నెంటుకి యిలాటి ఆదర్శాల మీద చిన్నచూపు. కర్ర పుచ్చుకుంటే తప్ప ఖైదీలు మాట వినరని నమ్మకం. ఓ ఖైదీ తన భార్యాబిడ్డలను చూడాలని అర్జీ పెట్టుకున్నాడు. అనుమతి రావడంలో జాప్యం అవుతోంది. అతను అసహనంతో జైలర్‌ని చంపుదామనుకున్నాడు. కానీ దాన్ని జైలర్ అద్దంలో చూసి, అతన్ని పట్టుకున్నాడు. నిజానికి అప్పటికే జైలర్ అనుమతి తెప్పించివున్నాడు. కానీ ఖైదీకి ఆ విషయం తెలియదు.
తెలుగు వెర్షన్‌కి వచ్చేసరికి హీరో ఎన్టీయార్ మాస్ హీరో కాబట్టి యీ సీనులో అద్దంలో చూడకుండానే ఖైదీని పట్టుకున్నట్టు చూపించారు. సినిమా అంతటా యీ వ్యత్యాసం కనబడుతుంది. మూలకథను ఫాలో అవుతూనే ఎన్టీయార్ యిమేజి భంగం కాకుండా చూశారు. ఆరుగురు కరడు కట్టిన ఖైదీలను తనతో తీసుకెళ్లి స్వేచ్ఛా వాతావరణంలో వారిలో మానవత్వాన్ని మేలుకొలుపుతానని జైలర్ ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన పంపాడు. ఆ స్కీము నడిచే వ్యవహారం కాదని సూపర్నెంటు దృఢవిశ్వాసం. అయినా అనుమతి సంపాదించి, ఒక వూసర క్షేత్రానికి తీసుకెళ్లి వాళ్ల చేత పంటలు పండించే పథకాన్ని అమలు చేయబోయాడు. అతను దొంగల్ని వెంటబెట్టుకుని ఒక వూరు తగులుతుంది. అక్కడి మార్కెట్‌లో వారం వారం సంత జరుగుతుంది. తర్వాత తర్వాత యిక్కడ కొంత కథ నడుస్తుంది. మార్కెట్‌లోంచి వెళుతూండగా కూరగాయల వ్యాపారి కొట్లోంచి ఒక దొంగ కారేజీ దొంగిలిస్తాడు. జైలరు మందలించి యిప్పించేస్తాడు. హిందీ సినిమాలో యింతే వుంది కానీ తెలుగులో మాత్రం యిక్కడ గోవిందస్వామి అనే ఓ కారెక్టరును ప్రవేశపెట్టారు. ఇతను గిరిబాబు వేసిన మెయిన్ విలన్‌కు సహాయకుడు. గిరిబాబు కూరగాయల మార్కెట్ కాంట్రాక్టర్. ఈ గోవిందస్వామి ద్వారా మార్కెట్‌ను కంట్రోలు చేస్తూంటాడు. ఇవి చాలనట్టు స్త్రీలోలుడు. ఊళ్లోకి ఏ స్త్రీ వచ్చినా అనుభవించాలని చూస్తాడు. హీరోయిన్‌పై కూడా అతని కన్ను పడుతుంది. ఈ కారెక్టర్ హిందీలో లేదు. అక్కడ మార్కెట్‌లో దళారి వున్నాడు, మార్కెట్‌ను కంట్రోలు చేస్తాడు కానీ అమ్మాయిల పిచ్చి లేదు.
సరే మన జైలరు విషయానికి వస్తే, అతను ఖైదీలను తీసుకుని ఎస్టేటుకి చేరుకున్నాడు. దానికి ఆజాద్ నగర్ అని పేరు పెట్టాడు. ఇక్కడ అతను రోజూ చేసే ప్రార్థన వినిపిస్తుంది. హిందీలో ('యే మాలిక్ తేరే బందే హమ్') అది చాలా గొప్పపాట. తెలుగు వెర్షన్ పాట ('ఒకే కులం, ఒకే మతం') కూడా హిట్ అయింది. ఈ దొంగలకు పాటలూ అవీ మహా చికాకు. తిండి పడేస్తే చాలు కదాని వాళ్ల యావ. వీళ్ల హడావుడి చూసి వంటవాడు పారిపోయాడు. జైలరే వండి పెట్టాడు ఓ పూట. వీళ్లు చాలా ఫీలయ్యారు. మీరు వండడం ఏమిటి, మేమే వంతులవారీగా వండుతాం అని చెప్పారు. వీళ్లను పనిలో పెడుతూ జైలర్ చేతికి గునపం, పార చేతికిచ్చి నప్పుడు వాటితో గతంలో ఎటువంటి ఘాతుకాలు చేశారో వాళ్లకు గుర్తు వచ్చింది. వీళ్ల మీద నమ్మకంచేత జైలర్ ముళ్ల కంచె కూడా తీసిపారేశాడు. కానీ వాళ్లంతట వాళ్లే ఆ కంచె పట్టుకుని తమను తాము నిగ్రహించుకునే సందర్భం తగిలింది. అదేమిటంటే పక్క వూళ్లో బొమ్మలు అమ్ముకునే చంప అనే పడుచు పిల్లల్ని ఆకర్షించడానికి మట్టి వాయిద్యాలు అమ్ముకుంటూ పాట పాడుతూ వస్తూంటుంది. ఆమెతో యీ మోటు మనుషులు సరసాలాడబోతారు. ఆమె వాళ్లకు తగ్గ జవాబు యిస్తుంది. హిందీలో హీరోయిన్ సంధ్య ఉదాత్తంగా పాటతో సరిపెడితే తెలుగులో జయచిత్రను చిలిపిగా తయారుచేసి డాన్సు చేయించారు.
తెలుగులో హీరో హీరోయిన్లకు యిక్కడ ఓ ఘట్టం పెట్టారు. హీరోయిన్‌ను ఏడిపించడానికి ఒక ఖైదీ పాము విసిరితే హీరోయిన్ బెదిరి నీళ్లలో పడుతుంది. హీరో ఆమెను కాపాడతాడు. దీని తర్వాత ఓ డ్రీమ్ సాంగ్ పెట్టారు. అంటే హీరోయిన్ హీరోను వూహించుకుని పాడుతుంది. హీరో మాత్రం ఆమె మీద మోజు పడినట్టు ఎక్కడా కనబడదు. హిందీలో అయితే వారి మధ్య బంధాన్ని చాలా సటిల్‌గా పెట్టారు. హీరో ఆమె గురించి పట్టించుకున్నట్టే వుండడు. హీరోయిన్ కూడా ఎక్కడా అతని మీద ప్రేమ చూపదు. క్లయిమాక్స్‌లో ఓ చర్య ద్వారా మాత్రమే ఆమె అతన్ని ప్రేమించిందని తెలుస్తుంది. అసలు హిందీలో హీరోయిన్‌తో మాట్లాడడమే అరుదు. ఓ ఘట్టంలో మాత్రం పిలిచి మాట్లాడతాడు. గోపాల్ అనే ఖైదీ భార్య పోయింది. అతని తల్లి చిన్నపిల్లల్ని వెంటబెట్టుకుని వచ్చింది. వాళ్లను చూడడం తన తరం కాదంది. జైలరు జాలిపడి పిల్లలను తమ వద్ద విడిచిపెట్టమని చెప్పాడు. ముసలావిడ తిరిగి వెళ్లిపోతూ వుంటే ఆమెను స్టేషన్ దాకా దిగబెట్టి రమ్మనమని బొమ్మలమ్మాయికి పురమాయించాడు. రోజులు గడుస్తున్నకొద్దీ బొమ్మలమ్మాయికి గోపాల్ పిల్లలతో దోస్తీ కుదిరింది. వాళ్లని అడిస్తోంది. నేను మీకు తల్లిలాటి దాన్ని అంది. అది విని గోపాల్ ఏమోమో వూహించుకునేసుకున్నాడు. ఇది తక్కిన ఖైదీలను మండించింది. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2015)