జీవన పోరాటంలో ప్రతి ఒక్కరికి అనునిత్యం ఉండాల్సింది ముందు చూపు,ఆలోచన,వ్యూహం . జాతకాన్ని బట్టి అదృష్టం వుండాలి. గాల్లో దీపం పెట్టి వెలగమంటే యెంత ముర్ఖత్వమో, ఫైన చెప్పిన లక్షణాలు లేకుంటే ఫైకి రావడం అంతే కష్టం . ఇక దీని బట్టి రాజకీయాలలో ఎంత చురుకుగా ఉండాలో అందునా విలువలు లేని నేటి రాజకీయ చదరంగంలో బ్రతికి బట్ట కట్టడమంటే మామూలు విషయం కాదు. వైయస్సార్ మరణాంతరం పెల్లుబికిన ప్రజాభిమానం మొత్తం జగన్ మోహన్ రెడ్డికి, ఆయన కుటుంబీకులకు ట్రాన్స్ఫర్ ఐనది. అదే ప్రజా భిమానం అనేక సార్లు ఉపఎన్నికల్లో వై.సి.పి కి అనేక విజయాలు చేకూర్చింది.
నేటి సమకాలీన భారత రాజకీయాలను శాసించే యు.పి.ఎ, ఎన్.డి.ఎ ల మద్దతు లేకుండా ప్రజలు అంత అఖండ విజయం వై.సి.పి కి చేకుర్చారంటే అది మామూలు విషయం కాదు, అది వైయస్సార్ మీద వున్నప్రజా అభిమానం. అంతే కాకుండా ఒక కుటుంబాన్ని ఒంటరిని చేసి మహామహులు దాడి చేస్తుంటే ప్రజలు వోటు అనే ఆయుధం తో బుద్ది చెప్పాలని ఎదురు చూసారు 2014 ఎన్నికలకు పూర్వం.
అంతటి వైయస్సార్ ఫై అభిమానం, అంతటి ప్రజా ఆగ్రహాన్ని తట్టుకొని దిక్కు తోచని స్థితి లో టి.డి.పి నిలబడింది. అందరికి తెలుసు టి.డి.పి ని నడిపించే బాబు గారు వ్యూహకర్త అని, సుదీర్గ రాజకీయానుభవం కలిగిన వ్యక్తీ అని, ఆయన వెనుక రాజగురువు లాంటి మహామహులు వున్నారని జగన్ కి ఆయన కోటరీకి తెలియంది కాదు, తీరా ఎన్నికలు వచ్చే నాటికి తప్పు మీద తప్పులతో జగన్, బాబు కి బంగారు పళ్ళెం లో అధికారం అప్పచెప్పారు. వైయస్సార్ మీద వున్నఅంతటి ప్రజాభిమానం ఏమైనట్టు ? ఎందుకు అన్ని వర్గాలు వై.సి.పి కి దూరం ఐనట్టు ? ఇది జగన్ యొక్క పోకడలే వల్లే అనేది అనేక రకాలుగా బయటకు వచ్చింది, అయినా అనుభవ రాహిత్యం తో అలా చేసి ఉంటాడని గమనించి తప్పులు దిద్దుకొని సరైన మార్గం లో పార్టీ ని నడుపుతాడని వైయస్సార్ అభిమానులు ఊహించారు. కాని జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జగన్ పోకడలే అధికార టి.డి.పి కి వరాలుగా మారుతున్నాయి అనేట్టుగా వున్నాయి.
ఎంత ప్రతికూల పరిస్తితులలో కుడా ఎక్కడైనా లాబియింగ్ చెయ్యగలిగే శక్తి ఉన్న చంద్రబాబుని ఎదుర్కోవడానికి చాలా వ్యూహాలతో ముందుకు పోవాల్సింది పోయి, ఎటు పోవాలో తెలియని గందర గోళం లో కొట్టు మిట్టడుతున్నట్టు గా వుంది. చంద్ర బాబు కాపిటల్ గుంటూరు ప్రాంతం లో అని ఆనౌన్సు చేసిన వెంటనే ముందు ఎనుక చూసుకోకుండా, ప్రాంతాల ప్రయోజనాలు ఆలోచించకుండా “ఎస్ మేము సపోర్ట్ చేస్తున్నాము” అని జగన్ మోహన్ రెడ్డి తొందరపడ్డాడు అనే ఉద్దేశ్యం రాజకీయ వర్గాలలో వుంది.
రాయలసీమ వాసి ఐన బాబు ఆలోచనలు ప్రాంతాల కన్నా, కుల ప్రయోజనాలకే పెద్ద పీట వేసారనే అనే విషయం స్పష్టం గా కనపడుతున్నా జగన్ తొందర పాటుగా ఎన్డోర్స్ చేసారనే విషయం రాజకీయ వర్గాలలో వున్ది. ఎవ్వరిని కలుపుకు పోడు , ఎవరి మాటా వినడు అనే అతి పెద్ద విమర్శ జగన్ మీద వుంది .
మనకు ఇష్టం వున్నా లేకున్నా మతాలూ, కులాలు భారత రాజకీయాలలో అతి హేయమైన పాత్ర పోషిస్తున్న ఈ రోజుల్లో నలుగు నడిచే బాటను విడిచి, మా పంధా మాదే, మేము ఎవ్వరు చెప్పినా వినం అని మూర్ఖత్వం తో సామాన్య ప్రజల నుండి దూరం చేసే మతాచారాలను ప్రస్పుటంగా చూపిస్తూ ప్రత్యర్ధి టి.డి.పి కి కావలసినంత ఇంధనాని ఇచ్చారు జగన్ ఆయన కుటుంబీకులు, ఒక ప్రక్క యెల్లో మీడియా డేగ కళ్ళతో చూస్తూ గోరంతను కొండంతగా చూపిస్తున్న ఈ రోజుల్లో, మారిన చంద్ర బాబు పూజలు పునస్కారాలతో సామాన్యులకు దెగ్గర అవుతుంటే, దెగ్గర వున్న వారినే పోగొట్టుకుంటున్నారు జగన్. మనకిష్టమైన ఆచార వ్యవహారాలను పాటించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది, కాని ఆ హక్కుని దుర్వినియోగపరిచి మిగిలిన వారికి ఏహ్య భావం కలిగించి ఉన్న ఓట్లను పోగొట్టుకోమని ఏ ధర్మం జగన్ కి చెప్పిందో వారికే తెలియాలి. వైయస్సార్ ఏనాడైనా పది మంది లో అలా ప్రవర్తిన్చారా ? అనే కనీస ఇంగితం మరచినట్టుగా వుంది. మోడీ గాలి తీవ్రం గా వీస్తున్న రోజుల్లో ఈ విన్యాసాలు చేసే అనేక వోట్లు వై.సి.పి కి పోవడానికి కారణమైన బాధ్యులు ఎవరు ? జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది ఇక్కడే .
నేను సీతయ్య కు తాతయ్యను అని ఎవరి మాట వినను అంటే నష్ట పొయ్యేది జగన్ మరియు ఆయనను నమ్ముకున్న నాయకులు, వైయస్సార్ అభిమానులు. ప్రజలకు రాజకీయం తెలిసినట్టు డివైన్ పవర్ కి తెలియదు.ఆ డివైన్ పవర్ వ్యతిరేకం గా వెళితే జరిగే నష్టానికి మన పెద్ద వాళ్ళు పెట్టిన పేరు “కీడు”. ఒక తిరుమల,ఒక జెరూసలేం, ఒక గోల్డెన్ టెంపుల్, ఒక జామా మసీదు లు పరమ పవిత్ర మైన స్తలాలు. వీటిలో ఎవ్వరు ఎక్కడకు వెళ్ళినా నమ్మకం తో వెళ్ళాలి, లోపల నమ్మకం లేకుండా బయటకు వెళితే జరిగేది నష్టమే. 20వ శతాబ్దంలో అడుగెట్టి అగ్ర రాజ్యాలతో మనం పోటి పడుతున్నాము అని ఎంత చెప్పుకున్నగాని దేవుడు అంటే బయపడే ప్రజలున్న దేశం మన భారతదేశం. 80శాతం ప్రజానీకాన్ని మతం పేరుతో బయపెట్టవచ్చు.జగన్ విషయం లో ఎల్లో మీడియా,టిడిపి అదే చేసింది. దానివల్ల కొన్ని వర్గాలు వై.సి.పి కి దూరం అయ్యాయి అని ఎలక్షన్స్ తరవాత తెలుసుకున్నాక కూడా మారాల్సిన బాధ్యత ఉన్న జగన్ అయన కుటుంబసభ్యులు యెంత మాత్రం ఖాతరుచెయ్యక పోవటాన్ని ఏమనుకోవాలి ? వైయస్సార్ సతీమణి గా విజయమ్మ దాదాపు లక్ష వోట్లతో ఓడిపోవటం వెనుక ముఖ్యమైన కారణం మతానికి సంబంధించింది కాదా? జగన్ ని ఆయన పార్టీ ని నమ్ముకున్నకోట్లాది మంది కోసమైనా పంధా మారకపోతే ఏకాకిగా మిగిలేది జగన్ ఆయన పార్టీ మాత్రమె.
ఈ మధ్య జరిగిన అతి పెద్ద విషయం జగన్ మోహన్ రెడ్డి, రాజగురువు దగ్గరకు వెళ్ళడం. వైయస్సార్ అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేని విషయం, కారణాలు ఏవైనా బయటకు, కాడర్ ను పూర్తిగా కృంగ దీసేదిగా వుంది అనడం లో యెంత మాత్రం అతి సయోక్తి కాదు. సోనియాగాంధీ ని ఎదిరించి పోరాడిన జగనేనా రామోజీ దెగ్గరకు వెళ్ళింది అని వైయస్సార్ అభిమానులు అవాక్క పొయ్యారు. రాజగురువు దెగ్గరకు వెల్లెదానికి ఇన్ని యుద్దాలు, ఇన్ని బాధలు జగన్ ఎందుకు పడినట్టు అని జనం అనుకొంటున్నారు. రాజగురుగు అంటేనే టి.డి.పి. 30 ఏళ్ళు గా ఆ పార్టీ కి పెద్ద దిక్కుగా తన ఆలోచనలతో టి.డి.పి ని దుర్బెధ్యం గా తాయారు చెయ్యడం లో రాజ గురువు పాత్ర ప్రతి తెలుగువారికి విదితమే. వైయస్సార్ కు ఆగర్భ శత్రువు మరియు టి.డి.పి కి, ఆ వర్గానికీ వెన్నెముక వంటి రాజ గురువును కలవడం వల్ల ఏ మేలు జరుగుతుందో సామాన్య ప్రజలకు, కాడర్ కు అర్ధం కాని ప్రశ్న. ఆ కలిసేదేదో ఒక అమిత్ షానో, ఒక అంబానినో , ఒక సొనియానో కలిసినా ఇంత దారుణం గా వుండేది కాదు అని రాజకీయ వర్గాల విశ్లేషణ. “నీళ్ళు పల్లం వైపు పారుతై మెట్లెక్కి పారవు” అనే సామెత యెంత నిజమైనదో రాజగురువు జగన్ కు మేలు చేస్తాడు అనేది అంతే నిజం అనుకునేవాళ్లు కోకొల్లలు . రాజ గురువు కొన్ని వర్గాల ఎదుగుదలకి ససేమిరా అంగీకరించడు అనేది బహిరంగ రహస్యమే. టి.డి.పి ని, తన వర్గాన్ని కాదని జీవిత చమరాంకం లో జగన్ కు రాజగురు సహాయం చేస్తాడనేది కల. తమ వర్గం బాగోగుల కోసం బ్రతికే వెంకయ్య, రాజ గురువు లాంటి వాళ్ళ దెగ్గరకు వెళ్ళడమంటే ఆత్మ హత్య సద్రుస్యమే. ఆ పని చెయ్యడం వల్ల జగన్ కు వున్న పోరాట స్పూర్తి కి తానె తిలోదకాలు ఇచ్చారు.వ్యూహాత్మకంగా పెద్దలను కలిసి లాబీ చెయ్యడం తప్పు కాదు. ఢిల్లీ లో మహామహులను వదిలి రాజగురువు దెగ్గరకి వెళ్ళడం మాత్రం దారుణం అని వైయస్సార్ అభిమానులు వాపోతున్నారు.
ఆంధ్ర కాపిటల్ ప్రారంభోత్సవానికి బాబు పిలుస్తాడో, పిలవడో , పిలిస్తే ఎలా పిలుస్తాడో తెలియక,వేచి చూడక “నేను రాను, నన్ను పిలవొద్దు” అనడం యెంత రాజకీయ విజ్ఞాతో జగన్ గ్రహించాలి. మొన్నటిదాకా కత్తులు దూసిన కే.సి.ఆర్ ని బాబు పిలవడం అతి పెద్ద రాజకీయ వ్యూహం, ఇటువంటి వ్యూహాలు వై.సి.పి లో ఉన్నాయా, వుంటే ఎవరన్నపార్టీ లో పెద్దలు చెబితే జగన్ వింటారా అనేది వారికే తెలియాలి.
టి.డి.పి కి వ్యతిరేకం గా ప్రత్యర్ధి పార్టీలలో ఒక్క గట్టి లీడర్ కుడా లేని పరిస్థితులలో వైయస్సార్ అభిమానులు జగన్ మోహన్ రెడ్డి వెంట వున్నారనేది నిజం.వైయస్సార్ పోకడలను జగన్ లో వెతుకుతున్న జనం అది కనపడక పోగా పరిస్థితులు మారి ఎవరన్నాబాబుని దీటుగా ఎదుర్కొనే లీడర్ ప్రజల కంట బడితే జగన్ కు ప్రజా బలం తగ్గడం తధ్యం. శత్రువు అతి బలవంతుడు అని గుర్తించి అందరిని కలుపుకు పోవాల్సిన బాద్యత జగన్ మీద వున్నది. రామాయణ యుద్ధం లో రావణుడి వంటి మహా బలుడు,శివ భక్తుడిని ఎదుర్కోవడానికి రాములవారి అంతటి హరి వుడుత సహాయం తీసుకున్నాడు. అన్ని వ్యవస్థలను,ప్రజలను మేనేజ్ చెయ్యగలిగే బాబు ని ఎదుర్కోవాలంటే యెంత ముందు చూపు వుండాలి ? నిన్న,మొన్నమోడీ సాక్షి గా బాబు,కెసిఆర్ కలిసిపోవడమే అనుభవ రాజకీయం యెంత ఊహించలేనిదిగా వుంటుందో మనం చూసాము. అనుక్షణం జగన్ ను ఒంటరి చెయ్యడంలో బాబు యెంత మాత్రం వెనుక ఆడాడు. నిస్సందేహం గా జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికి దమ్ము, ధైర్యం వున్ననాయకుడే. కానీ తాను అనుసరిస్తున్న విధానాల వల్ల టి.డి.పి కి అనేక అవకాశాలు ఇస్తున్నారు అనేదే ప్రజలలో బలం గా మొదలైయింది. ఆ అనుమానం పెరిగి 2019 నాటికి మహా వృక్షం గా మారితే జగన్ నే కాకుండా మొత్తం వైయస్సార్ అభిమానులను, వైయస్సార్ ని సమర్దించే వర్గాలను బాబు అండ్ కో నిలువ నీడ లేకుండా చేస్తారు.
ఇప్పటికే బాబు, వైయస్సార్ ను సమర్దించే వర్గాలు వున్న జిల్లాలను పట్టించుకోవడం పూర్తీ గా మానేసాడు. ఏ సి.ఎం చెయ్యని విధంగా బాబు కేవలం తన వర్గం బాగోగులకే పని చేస్తున్నాడు. అది రాబోయే రోజుల్లో తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారి తీస్తుంది. దాన్ని సద్వినియోగంచేసుకోవాల్సిన బాద్యత జగన్ మీద వుంది.జగన్ లో పరిపూర్ణ మైన మార్పు వస్తేనే అది సాధ్యమవుతుంది. తాను మారి తన సైన్యాలను విజయపధం వైపు తీసుకెళ్ళాల్సిన బాధ్యత పార్టీ నాయకుడిగా జగన్ దె. తనను నమ్మిన వారి కోసం, తన భవిషత్తు కోసం, తనతో కలిసి నడిచేవారికోసం జగన్ మారాల్సిందే. తాను మారి ఎవ్వరికో మేలు చేస్తున్నాను అనే భ్రమలో నుండి జగన్ బయటకురావాలి, ఆయన మారకపోతే జనమే మారతారు వేరొకరి వైపు.
చివరిగా చాణక్యుడు అంతటి వాడు “నాయకుడంటే అవసరాన్నిబట్టి కత్తి లా పదునుగా వుండాలి, పువ్వు లా మృదువుగా మారాలి ” అని వందల సంవత్సరాల క్రితం చెప్పారు, ఈ సూత్రాన్ని పాటించి జగన్ ముందుకు వెళతారో, మూర్ఖంగా వెళ్లి రాజకీయ చిత్ర పటం నుండి మాయమవుతారో ఆయనకే తెలియాలి. కాని ఒక్క విషయం జగన్ ఆయన కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సింది “ఇదేనా రాజశేఖర రెడ్డి గారు చూపిన మార్గం? ఇలా వెళితే రాజశేఖర రెడ్డి ఆశయాలు అసలు నేరవేరుతాయా? వై.సి.పి ని ఇంకా నడిపిస్తున్నది వైయస్సార్ అనే పేరు మాత్రమే. ఆ అభిమానం 2014 లో వోట్ల రూపం లో ఆవిరి అయినా 2019 లో జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలు, సత్తా కే అసలు పరీక్షా!
రమణారెడ్డి కంజుల , ఆస్ట్రేలియా