పేరు : డి.వి.సదానంద గౌడ
దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘కళంకిత’ తనయలున్న మంత్రుల సంఘంలో సభ్యత్వం.
ముద్దు పేర్లు : ‘పుత్రానంద’ గౌడ
‘విద్యార్హతలు : చదివింది ‘లా’. అందుకే డాటర్ ఇన్ ‘లా’ అంటూ ఎవరు బడితే వారు వస్తే, నా ‘లా’ పరిజ్ఞానాన్ని ప్రయోగించాల్సి వుంటుంది.
హోదాలు :కేంద్ర కేబినెట్‌లో రాజనాథ్ సింగ్ తర్వాత స్థానం. శాఖల వల్లనేమో, అని అనుకుంటున్నారా? కానీ కాదు. ఆయనది ‘ెం’, నాది ‘రైళ్ళు’. ఇద్దరికీ ‘సన్ స్ట్రోక్’ ఒకరికి తర్వాత, మరొకరికి కొట్టింది. ఆయన కొడుకు మీద ‘అవినీతి’ ఆరోపణలు వస్తే, నా కొడుకు మీద ‘అత్యాచార’ ఆరోపణలు వచ్చాయి.
గుర్తింపు చిహ్నాలు :ఒకటి: ఇప్పటిదాకా ‘రైలు’ మంత్రిని, ఇకపై ‘బెయిలు’ మంత్రిని. నా కొడుకు కార్తీక్ గౌడ ను అరెస్టు చేయాలని ప్రయత్నిస్తే, ‘బెయిలు’ సిధ్దం చేయాలి కదా!
రెండు: ప్రజా వాత్సల్యమూ, పుత్రవాత్సల్యమూ రెండూ వున్నాయి. ఒకొక్కసారి రెండవది డామినేట్ చేస్తాయి.
సిధ్ధాంతం : కళలనూ, సంసృ్కతినీ ప్రోత్సహించటం. నా కొడుకుదీ అంతే సిధ్ధాంతం. ఒక నటిని అభిమానించటమంటే, ఆమెలోని కళను ఆరాధించటం. దానిని అపార్థం చేసుకుంటే ఎలా?
వృత్తి : ‘చైన్ పుల్లింగ్’. తప్పుగా అర్థం చేసుకోకండి.(‘చైన్ స్నాచింగ్’ అని నేను అనలేదు.) నేను రైళ్ళ మంత్రిని కదా! ప్రమాదం జరుగుతుందని అనుమానం రాగానే, ‘గొలుసు లాగటం’ అలవాటయింది. అయితే నా కొడుకు వల్ల, కళంకిత పుత్రుడున్న మంత్రి అని ముద్రవేసి, నేను ప్రయాణిస్తున్న రైలును ఆపి వేసి కేబినెట్‌లో నుంచి దించివేస్తారేమోనని, కించెత్తు అనుమానం కూడా లేక పోలేదు.
హాబీలు :1. ఇచ్చింది చదవటం.( ప్రధాని ఏది ఇచ్చి సభలో చదవమంటే అది చదివేస్తాను. సొంతంగా ఒక్క వాక్యమూ చేర్చను. రైల్వే బడ్జెట్ రాసిచ్చారు. చదివేశాను.)
2. చెప్పింది చేయటం.( ప్రధాని ఏది చెప్పితే అది చేస్తాను. ఒక్కటితప్ప. నా కొడుకు కార్తీక్ మీద వచ్చిన ఆరోపణలు చూపి, నన్ను రైల్వే మంత్రిగా రాజీనామా చేయమంటే మాత్రం వెంటనే చెయ్యను. ఆలోచిస్తాను. )
అనుభవం :చాలా వుంది. రెండవ సారి(1999లో) కర్ణాటక శాసన సభకు ఎన్నికయినప్పుడు, ప్రతిపక్షనేతగా వ్యవహరించాను లెండి. అప్పుడు వివిధ కమిటీలలో వున్నాను, మరీ ముఖ్యంగా స్త్రీల మీద జరిగే దాడుల నిరోధక కమిటీ’లో వున్నాను. ( నా కొడుకు కార్తీక ఓ సినీనటిని పెళ్లి చేసుకుని, కాపురానికి తీసుకు వెళ్తాడని చెప్పి, మోసగించాడనే అభియోగాన్ని ఇలా ఎదుర్కోవలసి వస్తుందని అప్పుడు ఊహించను కదా! )
మిత్రులు : పదవుల్లో వుంటూ పుత్రవాత్సల్యం చూపిన నేతలందరూ నా మిత్రులు.వీరు ఒక్క బీజేపీలోనే కాదు, కాంగ్రెస్‌లో కూడా వున్నారు. అయితే నాకు సీనియర్ కాంగ్రెస్ నేత ఎన్.డి.తివారి మాత్రం కాదు. ఎందుకంటే, ‘కొడుకుని తన కొడుకు కాదని’ చాలా కాలం బుకాయించారు. కడకు ఒప్పుకున్నారు లెండి.
శత్రువులు : ‘చేత’ బడి చేసేవారు. మా రాష్ర్టంలో అధికారంలో వున్న కాంగ్రెస్ వారు. నా పతనం కోరి, ఆ పార్టీకి సన్నిహితంగా వుండే నటిచేత నా కొడుకు కార్తీక మీద తప్పుడు ఫిర్యాదు చేసివుంటారన్నది, మా పార్టీలో చాలా మందికి అనుమానం వుంది. ఇంతకు మించి మాకు శత్రువులు ఎవరు వుంటారు?
మిత్రశత్రువులు : నేను ఖాళీ చేస్తే, కేబినెట్ లో నా ‘బెర్త్’ కొట్టివేద్దామని ప్రయత్నించే ఎన్డీయే నేతలే.
వేదాంతం : ‘మేరేజెస్ ఆర్ మేడిన్ హెవెన్’ అంటే పెళ్ళిళ్ళు నిర్ణయయ్యేది స్వర్గంలో కదా, ఏదో ప్రయివేటు రూమ్ లో నా కొడుకు పసుపు తాడు కట్టేశాడూ అని ఏ స్త్రీ అయినా వచ్చి అంటే చెల్లుతుందా?
జీవిత ధ్యేయం : పెద్దగా ఏమీలేదు. ఇచ్చిన కేంద్ర పదవిలో పూర్తి పదవీ కాలం పాటు కొనసాగాలని. ( కర్ణాటక ముఖ్యమంత్రిగా చేసినప్పడు ఏడాది తిరిగే సరికి దిగిపోయాను లెండి.)
-సర్