ఈ ఫిబ్రవరి 24 ముళ్లపూడి రమణగారి దశమ వర్ధంతి. ఆ సందర్భంగా ఆయన రాసిన ఓ కథను పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. కేంద్ర సాహిత్య ఎకాడెమీ వారు యితర భాషలలోకి అనువదించడానికి తెలుగు కథలను ఎంపిక చేసే బాధ్యతను పురాణం సుబ్రహ్మణ్య శర్మ, వాకాటి పాండురంగారావు గార్లకు అప్పగించారు. ఆ సంకలనంలో ‘‘కానుక’’ను చేర్చారు వాళ్లు. వాకాటి గారిని తొలిసారి కలిసినపుడు ‘‘ముళ్లపూడి హాస్యానికి పేరుబడిన వారు కదా, ‘కానుక’ను ఎందుకు ఎంచుకున్నారు? అని అడిగాను. ‘‘అది యూనివర్శల్ సబ్జక్ట్. ప్రపంచంలోని ఏ భాషవారినైనా కదిలించగల సబ్జక్ట్.’’ అన్నారాయన. కథ మీలో చాలామంది చదివే వుండవచ్చు. చదవనివారి కోసం క్లుప్తంగా చెప్తాను.
బృందావనంలో కృష్ణుడు చిన్నతనంలో నివసించే రోజుల్లో గోపన్న అనే ఒకతను వుండేవాడు. అతను వేణువులు తయారు చేసి తృప్తిగా వాయించుకునేవాడు. కానీ ఒక స్థాయికి వచ్చాక ఊహ కందే సంగీతం పాటకు అందటం లేదని గ్రహించి వేణువుని కింద పెట్టి సంగీతాన్ని ఊహించబోయాడు. అతను ఊహించిన కొద్దీ సంగీతం భువనమంతా వ్యాపించి ఆ అనుభవం గోపన్న అర్భక దేహానికి దుర్భరమై పోయింది. అందం, ఆనందం దగ్గరగా వస్తే యింత కష్టమని అతను అనుకోలేదు. ఇప్పుడు గ్రహించి కూడా తప్పించుకోలేడు. అతన్ని ఆ స్థితి నుంచి ఐహిక స్థితికి తెచ్చి కాపాడినది – కృష్ణుడి మురళి. అది వినగానే తన ఊహకు అందినదాని కన్న గొప్పది, అనుభవించడానికి సులువైనది యిదేననిపించింది. నాటి నుంచి నిరంతరం అతన్ని అనుసరించసాగాడు.
ఇంత మోహనమైన సంగీతాన్ని కృష్ణుడు ఒక వెదురుముక్కలో ఎలా యిమిడ్చాడో తెలియలేదు. ఒకసారి అతని యింటికి వెళ్లి ఆ మురళిని ఎత్తుకుని వచ్చాడు. ఇంటికి వచ్చాక చూస్తే అది కనబడలేదు. ఆ సాయంత్రం కృష్ణుడు కనబడి ‘గోపన్నా, నా మురళి తీసుకుపోతే పోయావు కానీ యింకొకటి చేసి పెట్టు’ అన్నాడు. దాంతో జాగ్రత్తగా ఒక మురళి తయారుచేసి వాయించి చూస్తే శ్రుతిబద్ధంగా లేదు. పైగా జీర. అది యిస్తే బాగుండదని దాన్ని పడేసి మరొకటి తయారు చేశాడు. అదీ అలాగే వుంది. ఇక అప్పణ్నుంచి వేణునిర్మాణ యజ్జం ప్రారంభించాడు. చేయడం, పారేయడం. అతను పారేసినవాటిని గొల్లపిల్లలు తీసుకుపోయి వాయించుకునేవారు. వాటిల్లో ఏదైనా కృష్ణుడి దగ్గరకు పోతే మర్యాద దక్కదని, వాటిని పాకలో అటక మీద పారేయసాగాడు.
కృష్ణుడు పెద్దవాడయ్యాడు. బృందావనికి రావటం లేదు. పట్నవాసం మనిషై పోయి, రాజకీయాల్లో తిరుగుతున్నాడు. అయినా గోపన్న పట్టుదల వదల్లేదు. కనీసం పై ఏడాది కృష్ణుడి పుట్టినరోజుకైనా ఏ వంకా పెట్టలేని మురళి తయారుచేసి కానుకగా యివ్వాలని, అదే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఇలా పాతికేళ్లు గడిచిపోయాయి. మర్నాడే కృష్ణాష్టమి. కృష్ణుడు బృందావనంలో నందుడి యింటికి వస్తున్నాట్ట. ఏడాదిగా తయారుచేస్తూన్న మురళిని ఏ లోపం లేకుండా తీర్చిదిద్ది అతనికి పంపాలనే దీక్షతో రాత్రి పొద్దుపోయేదాకా పట్టుదలగా కూర్చున్నాడు. అతని కొడుకు చిన్న గోపన్న బువ్వ దిను అని బతిమాలాడు. తండ్రి గోపన్న అతని కేసి జాలిగా చూశాడు. తల్లి లేని, తండ్రి వుండీ లేని బిడ్డ. వాడే రోజూ యింత గంజి కాచి పెడుతున్నాడు. వాడి అచ్చటాముచ్చటా చూసుకుంటున్నాడు. అదీ మంచిదే, నవమి నాటి నుంచి నాయన లేడని బెంగపడడు.
‘బువ్వ దింటాలే కానీ రేపు కిష్టయ్య పుట్టినరోజు. నువ్వు పొద్దున్న నందయ్యగారి లోగిలి కెళ్లి ఎవరూ చూడకుండా కిష్టయ్య కివ్వాలి’ అన్నాడు తండ్రి. ‘నువ్వలాగే అంటావు. పొద్దుటేలేమో యిది బాగు లేదు. ఒద్దులే అంటావు.’ అన్నాడు కొడుకు. ‘అనను. ఈ సారి చేసేది బాగుంటదిలే. అయినా సూడనుగా.’ అన్నాడు తండ్రి. మర్నాడు ఉదయమే గోపన్న కొడుక్కి అలంకారం చేసి చూస్తే, అచ్చు బాలకృష్ణుడిలా తోచాడు. చేతులు జోడించి దణ్ణం పెట్టాడు. మురళి చేతిలో పెడదామని చూస్తే కనబడలేదు. ‘అటక మీదెట్టాను. రాతిరి ఎలకలొస్తే…’ అన్నాడు కొడుకు. గోపన్న అటకెక్కిచూస్తే పనికిరానివని పడేసిన వేణువులు గుట్టలుగా వున్నాయి. వాటిలో యిది కలిసిపోయినట్లుంది. అందులో ఏది కొత్తది? ఒక్కొక్కటి తీసి వూది చూడసాగాడు. ఇది కాదు, ఇది కాదు.. అనుకుంటూ.
మధ్యాహ్న భోజన వేళ వచ్చింది, వెళ్లింది. కాలం తరుగుతోంది. పిల్లవాడూ అలాగే కూర్చున్నాడు. వాడి బొట్టు కరిగిపోయింది, కాటుక చెదిరిపోయింది. పొద్దు వాటారింది. చీకటి చిక్కబడింది. చిన్న గోపన్న దీపం వెలిగించి ‘‘నాయనా, చీకటి పడిపోయింది. పుట్టింరోజు పండగయిపోతుంది.’’ అన్నాడు. గోపన్న చేతిలో రెండు వేణువులు మిగిలాయి. ఒకటి వూది చూశాడు. ఇది కాదు. ఇక చేతిలో మిగిలినది ఒక్కటే. దాన్ని పరీక్షించడానికి గోపన్నకు ధైర్యం చాలలేదు. సత్యం తెలుసుకుని చనిపోగల శక్తి లేదు. మళ్లీ యింకో ప్రయత్నం చేసే ఓపిక లేదు. వ్యవధి లేదు. అది కొడుకు చేతిలో పెట్టి, పరిగెట్టుకుని వెళ్లి యిచ్చేసి రా అన్నాడు. ఊది చూడవా అంటే కిష్టయ్యే చూసుకుంటాడు అన్నాడు. కొడుకు చీకట్లోకి పరిగెత్తాడు.
పాతికేళ్ల గాలివాన వెలిసి, గోపన్న నీరసంగా మేను వాల్చాడు. పూర్వం ఊహాసంగీత ప్రపంచంలోకి తొంగి చూసినపుడు కూడా యిలాటి నిస్త్రాణే కలిగేది. ఇన్ని వేల పరీక్షలు జరిపి, చివరకి పంపిన వేణువును పరీక్షించుకోలేదు. అది కిష్టయ్యకే వదిలేశాడు. శ్రుతి సరిలేకపోతే ఆయన సరి చేసుకుంటాడులే. అయినా శ్రుతిబద్ధంగా వుందో లేదో నిర్ణయించే జ్ఞానం తనకు వుందా.. సరి చేసే శక్తి ఆయనకు లేదని తను అనుకున్నాడా? గోపన్నకు నవ్వు వచ్చింది. ఎంత పొరబాటు. పాతికేళ్ల పొరబాటు.. ఒక జీవితం పొరబాటు. అని నవ్వుకున్నాడు.
అంతలో తన పక్కనున్న వేణువులిచి సన్నటి చక్కటి స్వరం నెమ్మదిగా ఇవతలకి రావడం, వచ్చి తన చెంప నిమరడం గమనించాడు గోపన్న. ఇదేమిటి? తను పనికిరాదనుకున్న మురళి! ఇంకో క్షణానికి ఆ పక్క మురళి, ఉత్తరార్థానికి యిటుపక్క మురళి మేలుకున్నాయి… కాస్సేపటికి అన్నీ మోగసాగాయి. అన్నిటిలోనూ అలనాటి బృందావన కృష్ణుడి మోహనగానమే. అన్నీ శ్రుతిబద్ధంగా వున్నాయి. అసత్యమైన వేణువు లేనే లేదు. భగవంతుడికి ఉపయోగపడని వేణువే లేదు. గోపన్న విభ్రాంతుడై పోయాడు. అంతలో సాక్షాత్తూ బాలకృష్ణుడిలా చిన్న గోపన్న వచ్చాడు. ‘అయ్యా, కిష్టయ్య నీ మురళి వాయించాడే. మరేం.. నీ మురళి వాయించేవాడే. కానీ.. మరే.. ఎంత వాయించినా ఏమీ వినబడలే. అస్సలు పాట రాలేదే.. కానీ కిష్టయ్య మంచోడు.’ అంటున్నాడు……
ఇదీ సూక్ష్మంగా కథ. 8 సంపుటాల ముళ్లపూడి సాహితీసర్వస్వం కూర్చినపుడు దీన్ని కథా రమణీయం – 2లో ‘రసరమణీయం’ విభాగంలో చేర్చాను. సంపాదకుడిగా ముందుమాటలో దీని గురించి నే రాసినది యిది – ‘కథకుడిగా రమశ్రీ ఉత్కృష్ఠస్థానాన్ని అందుకున్న కథ ‘‘కానుక’’. (రచనాకాలం ఆగస్టు 1963). పర్ఫెక్షన్కై తపించే ఒక కళాకారుడి ఆరాటాన్ని వర్ణించిన యీ కథ సృష్టిలో పనికిమాలినది ఏదీ లేదని తెలియజెబుతుంది. కొన్నేళ్లపాటు నిర్విరామంగా సాగిన వేణునిర్మాణం గురించి ఆర్తిగా చెప్పే యీ కథకు వేణుగానలోలుడైన కృష్ణుడిని కేంద్రంగా చేసుకోవడంతో ఒక పౌరాణిక స్థాయిని సంతరించుకుని, కుచేలోపాఖ్యానంతో పాటు పఠించవలసిన ఉపాఖ్యానం అనిపిస్తుంది.
‘అన్నీ కుదిరాయనుకున్న వేణువును పిల్లవాడు అటకమీద తక్కినవాడితో కలిపివేయడం, సమయంతో పోటీపడ రావలసిరావడం కథకు అద్భుతమైన డ్రమటిక్ ఎలిమెంటును సమకూర్చింది. క్లయిమాక్స్ మరీ చిత్రం. కృష్ణుడు వాయిస్తే శబ్దమే రాదు! కథలో భాష, చెప్పిన తీరు గురించి ముచ్చటించబోతే ప్రతి వాక్యం, ప్రతిపదం స్మరణీయం అనడం అతిశయోక్తి కాదు. ‘ఊహ కందే సంగీతంలో పాట కందేది శతసహస్రం ఉండదు.’ అన్న ఒక వాక్యం చాలు. ఇక వర్ణనలు, మాట విరుపులు, చమత్కారాలు (‘ప్రొద్దు వాటారినప్పటి నుంచి మర్రిచెట్లలోంచి ఊడలుఊడలుగా దిగజారుతున్న చీకటి, చలమై చెరువై, చెలరేగిన యుమునై, సముద్రమై భూమినంతా ముంచివేసింది. ఆకాశమెత్తున ముంచేసింది. రాధ కంటి కాటుకలా – కృష్ణుడి వంటి నలుపులా- నందుడి యింట చల్లలా చిక్కబడింది. చితుకుల మంటలు చీకటి చిక్కదనాన్ని, చక్కదనాన్ని ఎలుగెత్తి చాటుతున్నాయి.’ వంటివి కోకొల్లలు) ఎమ్వీయల్ మాటల్లో చెప్పాలంటే – ‘రమణ రాసిన యీ కథ మల్లాది రామకృష్ణశాస్త్రి గారి భాషకే కాక, భావానికే కాక, అనుభూతికే కాక, అనుభవానికే కాక పరిణతికి కూడా సరిపోల్చదగినదనటం అతిశయోక్తి యంత మాత్రం కాదు, స్వభావోక్తే!’ కృష్ణభక్తులైన విఎకె రంగారావు గారికి యీ కథను అంకితమిచ్చి వారిని కూడా ధన్యులను చేశారు రమణ.
ఈ కథను షార్ట్ ఫిల్మ్‌గా తీయాలని బాపు-రమణలను ప్రయత్నించకపోలేదు. నసీరుద్దీన్ షాను గోపన్న పాత్రలో అనుకున్నారు. ఫ్లూటుకై విజయరాఘవ రావుగార్ని అనుకున్నారు, కొన్నాళ్లకు హరిప్రసాద్ చౌరాసియా అనుకున్నారు. మొత్తానికి కార్యరూపం ధరించలేదు. అనుభూతి ప్రధానమైన యీ కథను దృశ్యరూపంగా చూపినప్పుడు, ఎంతమందికి అర్థమయ్యేదో, అంతర్లీనమైన సందేశం ఎంతమందికి అందేదోనన్న సందేహం నాకిప్పటికీ వుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2021)
[email protected]