ప‌వ‌నే గుడ్డెద్దు.. ఆయ‌న‌ను టీడీపీ అనుస‌రించ‌డ‌మా!

గుడ్డెద్దు చేలో ప‌డ్డ‌ట్టుగా ఉంటుంది ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌వ‌హారం. ఒక్క‌సారి త‌ను డిజైన్ చేయించుకున్న వాహ‌నం ఎక్కాడంటే త‌ను ఏం మాట్లాడ‌తాడో త‌న‌కే తెలియ‌దు! నోటికొచ్చిన‌ట్టుగా మాట్లాడుతూ.. ఊపు వ‌చ్చిన‌ట్టుగా ఊగిపోతూ.. దాన్నే రాజ‌కీయం…

గుడ్డెద్దు చేలో ప‌డ్డ‌ట్టుగా ఉంటుంది ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌వ‌హారం. ఒక్క‌సారి త‌ను డిజైన్ చేయించుకున్న వాహ‌నం ఎక్కాడంటే త‌ను ఏం మాట్లాడ‌తాడో త‌న‌కే తెలియ‌దు! నోటికొచ్చిన‌ట్టుగా మాట్లాడుతూ.. ఊపు వ‌చ్చిన‌ట్టుగా ఊగిపోతూ.. దాన్నే రాజ‌కీయం అనే భ్ర‌మ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ కొన‌సాగుతూ ఉన్నాడు. తను మాట్లాడే ప్ర‌తి మాట‌కూ అతిశ‌యోక్తులు జోడిస్తూ, క‌విత్వాలు చెబుతూ.. ప‌క్కా సినిమాటిక్ గా ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న రాజ‌కీయాన్ని కొన‌సాగిస్తూ ఉన్నాడు. 

అయితే ఇదేమీ కొత్త కాదు. ఇప్ప‌టికి దాదాపు ప‌దేళ్ల నుంచి జ‌రుగుతున్న తంతే ఇది. మ‌రి ప‌దేళ్ల నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒకే రీతిన వ్య‌వ‌హ‌రిస్తూ ఉన్నాడు. తేడా ఏమీ లేదు. ఎలాగోలా చంద్ర‌బాబును భుజానికి ఎత్తుకోవ‌డం, చంద్ర‌బాబు ప‌ల్ల‌కి మోయ‌డ‌మే ప‌వ‌న్ క‌ల్యాణ్ పెట్టుకున్న ప‌ర‌మావ‌ధి! వైఎస్ జ‌గ‌న్ పై నిలువెల్ల ద్వేషంతో ర‌గిలిపోతూ ప‌వ‌న్ క‌ల్యాణ్..ఈ ద్వేషంతోనే చంద్ర‌బాబు ప‌ల్ల‌కి మోస్తూ ఉన్నాడు. 

ఈ మ‌ధ్య‌కాలంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చెబుతున్న విష‌యాల‌ను వింటే.. ఇంకా వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డిపై కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ద్వేషం త‌గ్గ‌లేద‌నే విష‌యం స్ప‌ష్టం అవుతోంది. మరి ఈ ద్వేషానికి అస‌లు కార‌ణం ఏమిటో కూడా ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌వ‌న్ క‌ల్యాణ్ సూటిగా చెప్ప‌లేదు. గ‌త 15 యేళ్ల రాజ‌కీయ ప‌రిణామాల‌న్నింటినీ గ‌మ‌నించినా, అంత‌కు ముందు వ్య‌వ‌హారాల‌ను చూసినా.. చిరంజీవి రాజ‌కీయంపై అయితే తెలుగుదేశం వైపు నుంచినే దాడి గ‌ట్టిగా జ‌రిగింది. అయితే ప‌వ‌న్ ద్వేషం మాత్రం వైఎస్, జ‌గ‌న్ ల మీదే ఉంది ఎందుకో!

ఈ క్ర‌మంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇష్టానుస‌రం మాట్లాడ‌టాన్ని కూడా అల‌వ‌రుచుకున్నారు. త‌న మాట‌ల‌కు ఒక హేతుబ‌ద్ధ‌త‌, ఒక స‌త్య‌సంధ‌త‌, ఒక విశ్వ‌స‌నీయ‌త ఉండ‌న‌క్క‌ర్లేద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ భావిస్తున్నాడు. త‌ను ఎప్పుడు, ఏం మాట్లాడినా అక్క‌డిక్క‌డ కేరింత‌లు కొట్టే ఫ్యాన్స్ ఉంటారు, అయితే ఆ కేరింత‌లు కొట్టే బ్యాచ్ ప‌వ‌న్ ఇప్పుడేం చెబుతున్నాడు, నిన్నేం చెబుతున్నాడు.. అనే లాజిక్ ను ఆలోచించ‌క‌పోవ‌చ్చు. 

అయితే సామాన్యుడు మాత్రం ఆలోచిస్తాడ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఇంకా అర్థం కాలేదు. పార్టీ పెట్టిన ప‌దేళ్ల‌లో కాషాయం, ఎరుపు, ప‌సుపు, నీలం అన్ని రంగులూ మార్చేశాడు ప‌వ‌న్ క‌ల్యాణ్. ఇప్ప‌టికే మార్చిన రంగుల్లో ఇప్పుడు ఏదో ఒక దాన్ని అద్దుకోవ‌డం త‌ప్ప ఆయ‌న‌కు ఇంకో ఛాయిస్ కూడా లేదు. 

త‌న రాజ‌కీయ జీవితంలో ఇన్ని స్నేహాలు చేసిన వ్య‌క్తి, ఇన్ని కూట‌ముల‌ను మార్చేసిన వ్య‌క్తి బ‌హుశా చంద్ర‌బాబే అనుకుంటే.. ఆ రికార్డుల‌న్నింటినీ ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ద్ద‌లు చేస్తూ ఉన్నాడు. క‌నీసం చంద్ర‌బాబు నాయుడు ఇన్ని కూట‌ముల‌ను మార్చ‌డానికి ఇర‌వై ముప్పై యేళ్ల స‌మ‌యం ప‌ట్టింది. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం కేవ‌లం ప‌దేళ్ల‌లోనే ఊస‌ర‌వెల్లిలోని రంగుల‌న్నీ మార్చేశాడు. 

రేప‌టి ఎన్నిక‌ల్లో మోడీ ప్ర‌భుత్వం గ‌నుక గ‌ద్దెదిగి కేంద్రంలో కాంగ్రెస్ కూట‌మి గ‌నుక అధికారంలోకి వ‌స్తే.. అప్పుడు గాంధీల కుటుంబానిది దేశ‌భ‌క్తి అని, వారు జాతి కోసం ప్రాణాలు అర్పించారంటూ ప్ర‌శంసించ‌డం ప‌వ‌న్ క‌ల్యాణ్ కు పెద్ద క‌ష్టం కాదు. కాంగ్రెస్ హ‌ఠావో అంటూ గ‌తంలో చెప్పినంత ఇంటెన్సిటీతోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ కాంగ్రెస్ కు జై కొట్ట‌గ‌ల‌డు కూడా!

ఇక వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ మీద అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. త‌న నోటితీట‌తో న‌ష్ట‌మే చేసుకుంటున్నాడు. అదేమంటే వ‌లంటీర్లు రోడ్డెక్కి త‌న దిష్టిబొమ్మ‌ల‌ను చెప్పుతో కొట్టారు కాబ‌ట్టి.. వారు త‌ప్పు చేస్తున్నార‌ని త‌ను చెప్ప‌డం నిజ‌మ‌ట‌! మ‌రి త‌న‌ను ప్యాకేజీ స్టార్ అన్నందుకు చెప్పు చూపించాడు క‌దా ఇదే ప‌వ‌న్ క‌ల్యాణ్. అంటే.. ప్యాకేజీ కూడా నిజ‌మే అని ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌కు తాను ధ్రువీక‌రించ‌డ‌మేనా అది!

అలాగే జ‌న‌సేన కార్య‌క‌ర్త ఒక‌డిని ఎవ‌రో సీఐ చెంప‌దెబ్బ కొట్టింద‌ని కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా ర‌చ్చ చేశారు. మ‌రి నీ సినిమాల్లో పోలిస్ పాత్ర‌ల్లో నువ్వు చేసిందేంటి? పోలిస్ అంటే.. గ‌బ్బ‌ర్ సింగ్, గ‌బ్బ‌ర్ సింగ్ 2, భీమ్లానాయ‌క్.. లో చూపించిన‌దాంట్లో వందో వంతు కూడా ఆ పోలిస్ చేయ‌లేదు క‌దా! మ‌రి త‌నేదో వ‌కీల్ సాబ్ సినిమాలో న‌టించి రోడ్డు మీద‌కు వ‌చ్చిన‌ప్పుడు త‌ను వ‌కీల్ సాబ్ గా ప్ర‌శ్నిస్తున్నానంటూ త‌న సినిమాకు ప్ర‌చారం చేసుకున్నాడు క‌దా ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

ఇంత‌కు మించిన కామెడీ ఏమిటంటే.. ప‌వ‌న్ క‌ల్యాణే గుడ్డెద్దులా ఎటు ప‌డితే అటు పోతుంటే, ఈయ‌న‌ను టీడీపీ అనుస‌రిస్తోంది. ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకునే చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయ ప‌త‌నావ‌స్థ‌కు ఇది కాదా సంకేతం!