మంత్రి జోగి రమేశ్‌కు దూకుడు ఎక్కువ. ఆ దూకుడే ఆయనకు మంత్రి పదవి వచ్చేలా చేసిందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తుంటారు. కరకట్టపై నివాసం వుంటున్న చంద్రబాబు ఇంటిపై దాడికి జోగి రమేశ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రత్యర్థులపై జోగి తరచూ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతుంటారు. అధినేత వైఎస్ జగన్ మనసు చూరగొనే విద్య మంత్రి జోగి రమేశ్‌కు అలవడిందని సొంత పార్టీ నేతలు కూడా సెటైర్స్ విసురుతుంటారు.
తాజాగా జనసేనాని పవన్‌కల్యాణ్‌పై మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కృష్ణాయపాలెంలో ఇళ్ల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం వెంకటపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ పవన్‌పై చెలరేగిపోయారు. పవన్‌కల్యాణ్ పెళ్లాలనే కాదు, పార్టీలను కూడా మారుస్తాడంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు ముసలి నక్క, పవన్‌కల్యాణ్ పిచ్చి కుక్క అని ఆయన అవాకులు చెవాకులు పేలారు. మార్చటం, తార్చటం పవన్‌కల్యాణ్‌కు వెన్నతో పెట్టిన విద్యగా తీవ్ర విమర్శలు చేశారు. ఊరపంది తిరిగినట్టు ఒకడు రోడ్లపై తిరుగుతున్నాడని లోకేశ్‌పై చిందులు తొక్కారు.
బహిరంగ సభల్లో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ పవన్ వైవాహిక జీవితం గురించి విమర్శిస్తుండడాన్ని సాకుగా తీసుకుని, అధికార పార్టీ నాయకులు మరింతగా చెలరేగిపోతున్నారు. ఇందుకు తాజా నిదర్శనమే మంత్రి జోగి రమేశ్ అభ్యంతరకర వ్యాఖ్యలు. పవన్‌పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తే, కౌంటర్‌గా సీఎం జగన్‌పై ప్రత్యర్థులు అంతకు మించి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. రాజకీయ కాలుష్యానికి హద్దే లేకుండా పోయింది.
రాజకీయాల్లోకి సంబంధం లేని మహిళలను తీసుకొస్తుండడంపై జనం విసిగిపోయారు. నాయకుల ప్రసంగాలు వినాలంటేనే బెదిరిపోయే పరిస్థితి. ఈ అవాంఛనీయ రాజకీయ వాతావరణానికి ఫుల్‌స్టాప్ పడాల్సిన అవసరం ఎంతైనా వుందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.